29, జులై 2009, బుధవారం

ఏవి నా మతగ్రంధాలు. మతమా, ఆధ్యాత్మికతా, వేదాంతమా ? ఏది నా మతం?




వాసవ్య గారి వ్యాఖ్య చూసాక, నాకు ఇంకనూ ధర్మ సందేహములు తీరక ఈ టపా వ్రాయుచుంటిని. వాసవ్య గారు చదివి నాకున్న ధర్మసందేహాలను వారికున్న సాంకేతిక సశాస్త్రీయ ప్రిజ్ఞ్ణానముతో తీర్చెదరేమో నని ఎదురు చూచు చుంటిని.

ముందుగా వారి వ్యాఖ్య...ఈ టపా లో

"భాస్కర రామి రెడ్డి గారూ,

వికీపిడియాలో కావలసినంత వివరములు దొరుకును.
భూమి గురించి: http://en.wikipedia.org/wiki/Earth
భూమి వయసు గురించి: http://en.wikipedia.org/wiki/Age_of_the_Earth

మీకు యింకను, భూమి మీద ధర్మ సందేహములు వుండినను, ఈ లంకెలోని విషయములు చదవండి. http://en.wikipedia.org/wiki/Earth#References

పై విషయాలతో మీరు ఏకభవించకపొతే, భూమి గురించి మీకు తెలిసినది చెప్పగలరు. ఒకవేల మీరు చెప్పేది నిజమని భావించాలంటే, మీవాదమునకు బలముచేకూర్చే మత గ్రంథాల వివరములు తెలియజేయగలరు. ఒక ఛాలెంజ్ చేయగలను. కనీసం 6వ తరగతి సైన్సు పాఠ్యపుస్తకంలో వున్న విధముగానైనా, ఏ మత గ్రంథాలలోనూ సరి చూపించలేరు!

ఊహాగానాలకి/నమ్మకానికి, శాస్త్రీయతకి అసలు సంబంధములేదు. శాస్త్రీయతమీద నమ్మకము లేనియెడల, కేవలం మతగ్రంధాలలో చెపిన విధముగా నమ్మకముతో, శాస్త్రీయతతో పనిలేకుండ బ్రతకండి. అంతేగాని, మతగ్రంధాలే సైన్సుకు మూలాదారము అని మాత్రం దయచేసి వాదించకండి.
"


నిజమా అని అలోచిస్తూ .......


ఏవి నా మత గ్రంధాలు? హిందూ దేశంలో మతానికి, వేదాంతానికి ఆధ్యాత్మికతకు తెర ఎక్కడ? అసలు పురాతన భారతమేది? ఎల్లలు ఎక్కడ? విభిన్న కాలలలో విభిన్న ప్రాంతాలు విభిన్న రాజుల పరిపాలన క్రింద వున్నా సర్వకాల సర్వావస్థలందు నా పూర్వీకులు పాటించిన మతమేది? ఒకరికి వేదాలు మతగ్రంధాలు మరొకరికి రామాయణ భారతాలు మత గ్రంధాలు. మరొకరికి గీత మతగ్రంధం. ఇంకొకరికి సిద్ధాంత గ్రంధాలు మతగ్రంధాలు. భారత దేశంలో మతానికీ, సాంకేతికానికీ, ఆధ్యాత్మికతకు, వేదాంతానికి ఇదమిద్ధమైన గీటురాయి ఎక్కడ? ఒక దానికొకటి మమేకమై మానవజాతి మహోన్నత జాతిగా, వటవృక్షంగా ఎదిగి ఊడలు ప్రపంచమంతా వ్యాప్తిచెంది పాయ పాయలుగా చీలిపోయినా ఇంకా నిలచి ఉండడానికి కారణం పైనున్న వివిధ శాఖలతో నా మతానికున్న స్నేహ సౌభాగ్యాలే. నన్నెవరైనా ఆధ్యాత్మికతకు మతానికి , ఆధ్యాత్మికతకు వేదాంతానికి లేక వేదాంతానికి సాంకేతికానికి ఉన్న పొరను గుర్తించమంటే సాధారణ సాంకేతిక విద్యార్థిగా నేను చేయలేను. మీరు చేయగలరేమో ప్రయత్నించండి.

ఇక వాసవ్య గారి ఛాలెంజ్ కి వస్తే , ఆరవ తరగతి కాదు కదా డాక్టరేట్ లు చేసినా మనలో స్లో పాయిజన్ గా తలకెక్కిన యూరోపియన్ భావజాలాన్ని మార్చడం అంత సులభంకాదు. ఆరవ తరగతిలో "భూమి గుండ్రముగా నుండునని క్రిష్టోఫర్ కొలంబస్ తన సముద్ర ప్రయాణం ద్వ్రారా కనుగొన్నారు" అని ఒకటికి మూడుసార్లు చదివి వంట బట్టించుకుంటాము. సర్ ఐజాక్ న్యూటన్ గతిశాస్త్రాన్ని ఎనిమిదవ తరగతిలో చదివి జీవితాంతం గుర్తుంచుకుంటాము ( నాకు ఐజాక్ న్యూటన్ అంటే అమితమైన ఇష్టం, కారణాలు అనేకం. ఈ వ్యాస పరిధికి ఆ వివరాలు అసందర్భం).ఇంటర్మీడియెట్ లో లెబ్నిజ్ ఈక్వేషన్స్ బట్టీ పెట్టి ( వాటి ఉపయోగమేమిటో ఎప్పుడైనా ఆలోచించామా?) డిగ్రీ / ఇంజనీరింగ్ సీటు తెచ్చుకుంటాము. ఫోరియర్ ట్రాన్స్ ఫర్మేషన్స్ లాగించేసి ఒక ఉద్యోగం సంపాయించి కాలం వెళ్ళబుచ్చుతామేగానీ ... ఎప్పుడైనా ఇవన్నీ యూరోపియన్స్ నుండి ఎందుకు అరువు తెచ్చుకున్నామని ఆలోచించామా? ఒకసారి చరిత్ర తిరగవ్రాద్దామా అని ఆలోచించామా? మీరేమో కానీ నేనెప్పుడూ అలాంటి ప్రయత్నం చేయలేదు.

నా పూర్వీకులైన వరాహమిహిర, ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, చరక , సుశ్రుత,పాణిని, మహావీర, మాధవాచార్య,జేష్ట మొదలైన వారు మనము ప్రొద్దు పొడిచినఫ్ఫటినుండి తెల్లవారేదాకా ఏకరువు పెట్టే కొపర్నికస్, గెలీలియో, న్యూటన్, టేలర్, లెబ్నిట్జ్, గ్రెగొరీ, యూలర్, పైథాగరస్ మున్నగువారికంటే ఏ రకంగా అసమర్థులని ఆలోచించామా? వారు వ్రాసిన సాంకేతిక గ్రందాలను అర్థం చేసుకోలేని స్థితికి తీసుకెళ్ళిన మన పూర్వీకుల వ్యవస్థను తప్పు పడదామా లేక బానిస బ్రతుకులకు అలవాటు చేసిన బ్రిటీష్ రాజ్యాన్ని తలచుకొని రగిలిపోదామా? అతిధులుగా వచ్చి దొంగలుగా మారి దొరలవతారమెత్తి హిందూ మతమంత మూఢనమ్మకాల మతము లేదని తేనపూసిన కత్తితో మన చరిత్రను రచించి, విజ్ఞానాన్ని తస్కరించి నిర్వీర్యం చేసిన వారి పాషాణ సంకెళ్ళ చెరనుండి బయట పడాలంటే ఏది కర్తవ్యం?

మళ్ళీ ఒకసారి.. ఆరవ తరగతిలో "భూమి గుండ్రముగా నుండునని క్రిష్టోఫర్ కొలంబస్ తన సముద్ర ప్రయాణం ద్వ్రారా కనుగొన్నారు". ఇది చదివి ప్రశ్నలేసుకోమి. ఎందుకంటే యూరోపియన్స్ ఆర్ జీనియస్. అదే ఈ క్రిందిది చూడండి

म्रुज्जलषिखिवायुमयॊ भूगॊळः सर्वतॊ व्त्त्ः
Mrujjalashikhivaayumayo Bhoogola: sarvatho vruttha:

" మట్టి, నీరు, అగ్ని, గాలి (వాతావరణం) లతో ఉన్న ఈ భూగోళం ఎటునుండి చూసినా వృత్త ఆకారంలో నుండును" . ఆర్యభట్టీయం లో ఈ శ్లోకం గమనించినట్లైతే , భూమి ఒక గోళం. అంతేకాదు సెక్షనల్ వ్యూ ఆఫ్ ఎర్త్ ఈజ్ ఎ సర్కిల్.

క్రిష్టోఫర్ కొలంబస్ చెప్తే అది కరక్ట్, మనవారు చెపితే అది బోడిగుండికి మోకాలికి ముడి వేసినట్టు.

అలాగే ఇంకోటి గతి సిద్ధాంతం.


Bhakthe vilomavivare gathiyogenaanulomavivare dvow
Gathyantharena labdow dviyogakaalaavatheethaishyow

“If two objects are traveling in opposite directions, the time required for them to meet is equal to the distance between them divided by the sum of their speeds. If they travel in the same direction the time that has elapsed equals the distance between them divided by the difference in their speeds”


"సూర్యసిద్ధాంత" గ్రంధాన్ని ఎప్పుడైనా విన్నామా? సిద్ధాంత గ్రధం విన్నా దీని రచయిత ఎవరో తెలుసా? ఎంత దౌర్బాగ్యం? సుమారుగా ౧౦౦౦ బి.సి లో వ్రాసిన ఈ గ్రంధంలో ఆష్ట్రనామికల్ గణాంకాలు ఎన్నో వున్నాయట. ఆర్యభట్ట విరచించిన ఆర్యభట్టీయం లో సూర్యసిద్ధాంత రిఫరెన్స్లు ఎన్నో వున్నాయట.తను స్వయంగా ఆష్ట్రానమీ గణించడానికి తయారు చేసినవిలువైన పరికరాలు చక్రయంత్ర, గోళయంత్ర, ఛాయా యంత్రాలు.

సూర్యసిద్ధాంత సూత్రం గా చెప్పుకుంటున్న ఒక శ్లోకం చూడండి ( సుమారు 1000 B.C )

पारदाराम्बुसूत्राणिसुल्बतैलजलानिच
बीजानिपंसबस्तॆषुयॊगास्तॊपिदुर्लभः सूर्यसिद्धांन्त -११

Paradara, ambu, sutrani, shulbataila jalanicha. Bijani, pasava, asteshu prayoga,
stepi durlabha.

గమనించారా పాదరస ట్యూబ్ లాంటి పరికరన్ని, అప్పట్లో ఇలాంటి పరికరాలు దొరకడం/ చేయించడం ఎంత కష్టమో? దేనికి వాడతారు ఈ పాదరస భారమితి ని?

మరోటి

वंशस्य मूलं प्रविलॊक्य चाग्रं तत्सवन्तरं तत्स्य समुछ्चयं च
यॊ वॆत्ति यस्टॆयव करस्थ्यसौ धीयन्त्रवेदी किं न वॆत्ति

సిద్ధాంత సిరోమణి - భాస్క్రరాచార్య ( 1072 A.D)

వెదురు చెట్టు పైభాగాన్ని (చిటారు కొమ్మన్ని) క్రింద భాగాన్ని చూసి దాని దూరాన్ని, ఎత్తును అంచనా వేయవచ్చు. ఎవరైతే ఇది కర్ర తో సాదించగలరో వారు మిగిలిన ఏదూరాలైనా చెప్పగలరు. అంటే ఏ పరికరాన్ని వాడి వుంటారు? ఓ రెండు వెదురు చెట్ట్లో లేక కొమ్మలో ...ఇది త్రికోణమితి కాదా? లంబకోణ త్రిభుజాలు , పైథాగరస్ థీరీలు ఇందులో మనకు కనబడవు. ఇదీ బోడుగుండుకీ మోకాలుకూ ముడివేయుట అని అందురేమో...

చాలా వరకు పూర్వీకులు వాడిన భాష అర్థం కాక , వానికి పరిష్కార గ్రంధాలు లభింపక, ఉన్న గ్రంధాలు కాలిపోయినవి కాలిపోగా, తస్కరించినవి తరలి పోగా మనకు ఇప్పుడు మిగిలింది ...

24, జులై 2009, శుక్రవారం

అందుకే ఇలా !

నువ్వు పరిచిన దారిన అడుగు పడేలోపు
పాదం కందకుండా పూలపాన్పు నింపుతావు

జరుగుబాటు పాట్లు రోజుల్ని మింగేస్తుంటే
పెనవేసుకున్న బంధం ముడివేసుకొంటుంది

యాంత్రిక మంత్రం జపిస్తూ జీవితం ఏకాంతాన
ప్రాతః కాల ప్రభాతాన్ని జారిపోకుండా దాచుకుంది

అరచేతి గీతల్లో అన్ని భాగ్యరేఖలున్నా
నీ ప్రేమ గీతక ముందు అభాగ్యగీతలే

లయతప్పని హృదయాన రణగొణధ్వనులే
సంసార జీవితాన ప్రణయ నాదాలు

ఇందుకు అని ఏ ఒక్కరైనా వివరించరా?
ప్రేమ ఔన్నత్యం అని నాతో అంగీకరించారా?


మరువం ఉషగారి కవితకు వ్యతిరేక స్పందన.

22, జులై 2009, బుధవారం

గృహమే కదా స్వర్గసీమ.. టాగ్ లైన్.. వీడో పిల్లి సంసారి.



ఆ మధ్య హడావిడి అంతా ఇంతా కాదు. అమ్రికా కు వచ్చినప్పటినుంచి సొంతయింటి లాగా ఆ ఇంట్లో రాజభోగాలనుభవించాము. ఒకానొక దుర్మూహార్తాన మా కాలనీ అయ్యవారు ఒక ఉత్తరం ముక్క ఇంటి గొళ్ళానికి తగిలించి వెళ్ళారు. తెరిచి చూద్దుముకదా వచ్చే సంవత్సరం మీరు మాకాలనీ ఇళ్ళలో వుండాలంటే మాకు నెలకో వంద డాలర్లు ఎక్కువ అద్దె చచ్చినట్టు కట్టాల్సిందే అని హుకుం జారీ చేసారు.

ఇల్లు మారడమా? లేక జేబుకు మరో వంద చిల్లు పెట్టుకోవటమా ? అప్పటిదాకా అందంగా ఆకర్షణీయంగా కనిపించిన ఇంట్లో అన్నీ లోపాలు కనిపించడం మొదలెట్టాయి. ఇంతలేసి బోడి ఇంటికి అద్దె 1500 డాలర్లా? చలికాలంలో ఎంత చచ్చిపోయాం ఈ ఇంట్లో .. ఈ హీటర్ దెబ్బకు బ్యాంక్ బాలన్స్ ప్రతినెల మూడొందల డాలర్లు మాడి మసై పోయాయి కదా? అయినా ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఎలా వున్నామే అని మా ఆవిడనడిగితే.. "ఏమైంది ఇల్లు బాగానే వుంది కదా " ఇక్కడే వుందామంది. పిల్లలు కూడా వంతపాడారు. హతవిధీ.. ఏమిటీ విపత్కాలం.. ఇంట్లో ఒక్కరికీ నా మనసులో మాట తెలియదా?అధ్యక్షునికే ఇంత అవమానమా?

చూస్తే కార్పెట్ మీద అక్కడక్కడ పసుపు కుంకుమ మరకలు . వాడిచ్చినప్పుడు బాగానే వుంది, " ఓం.. హ్రీం.. హ్రాం ధనార్జన ప్రాప్తిరస్తు" అనడంలో అప్పుడప్పుడు ఏవో చిన్నమరకలు. మరి మడిసన్నాక డబ్బుకోసమన్నా పూజలు చేయాలా వద్దా? అంతేనా వీకెండ్ పార్టీ లో అతిధులు గట్రా వస్తారు గదటండీ... మరి పార్టీ జరిగిన గుర్తుగా ఎవో చిన్న చిన్న గుర్తులు కూడా ఉండాలా వద్దా?

ఇదంతా చదివి మా ఆవిడ ఇల్లు శుభ్రంగా వుంచదేమో అని అనుమానమొచ్చిందా? అయ్యో అలాంటిదేమిలేదండి. చూడాలంటే మీరొక్కసారి మాయింటికి రావాల్సిందే.మీరు వెళ్ళగానే సోఫాలు , కుర్చీలు నీళ్ళుపెట్టి కడిగే రకం.పొరపాటున కడగకముందే మేము మీరు కూర్చున్న కుర్చీలో కూర్చున్నామా..... పెళ్ళైన మొగుళ్ళకు చెప్పాలంటారా? కుర్రకుంకలు మాత్రం పెళ్ళి చేసుకుంటే కానీ తెలియదు.

మూడువోట్లు ఇప్పుడున్న ఇంటికే పడినా.. అధ్యక్ష కుర్చీ నాదే ! అసలే ప్రజాస్వామ్య దేశంలో పుట్టా కాబట్టి , ఓట్లు ఎలా రాబట్టుకోవాలో స్కెచ్ గీయడం మొదలెట్టాను.

ఏమే.. గౌరీ వాళ్ళ ఇల్లు ఇక్కడికి దూరం కదా... అసలే నీకున్న ఒక్కగానొక్క అదీ ఇదీ అయిపోయె.... వాళ్ళింటి దగ్గరకి మారదామా?

"ఎందుకూ వీకెండ్, ఆ డబ్బాముందు పడి సొల్లు కబుర్లు రాసుకోకపోతే మమ్మల్ని వాళ్ళింటికి తీసుకెళ్ళొచ్చుగా. అదీగాక ఇక్కడుంటే ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ దగ్గర. వార వారం తాజా కూరగాయలు తెచ్చుకోవచ్చు"

నాకు రైల్వ్య్ స్టేషన్ దగ్గర కదా...

"నాకు లెక్కలు రాకపోయినంత మాత్రాన చెవిలో క్యాబేజీనా? అక్కడికి పోతే రైల్వ్య్ స్టేషన్ దగ్గరైనా, ఆఫీసు ఇంకా దూరం. ట్రైనేమన్నా మీ మామదనుకున్నావా టికెట్ డబ్బులు తగ్గించడానికి?"

ఇంక ఇలా లాభంలేదనుకొని.. పిల్లలవైపు తిరిగా...

హే కిడ్స్, యు వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ఓల్డ్ డర్టీ హౌజ్?

" హే..హే...హే ( అరుపులు ), యస్"

మధ్యలో పానకంలో పుడకలాగా " మరి స్కూలో " అని మాఆవిడ అందుకుందో లేదో ...వాళ్ళకి డౌట్ వచ్చేసింది.

"అయితే మాఫ్రెండ్స్?"

ఇలా లాగి లాగి మొత్తానికి నోటీస్ ఇచ్చే టైం దగ్గర పడింది.

సరే ఎలాగూ మారుతున్నాము కదా అని ఓసారి అపార్ట్మెంట్ ఆఫీస్ లో బేరసారాలాడదామని వెళ్ళాను. అప్పుడుగానీ నాకు అమ్రికా వాళ్ళ తిక్క తలకెక్కలేదు. ఇంతకీ విషయం ఏంటంటే, కొత్తగా వచ్చేవాళ్ళకి రెసిషన్ ప్యాకేజీ అని ఇల్లు ఒక నెల అద్దెలేకుండా ఇస్తారంట.

అంటే పన్నెండు నెలల లీజ్ తీసుకుంటే పదకొండు నెలల అద్దెకడితే సరిపోతుంది.
అంటే వాళ్ళు నెలకి కట్టేది 1375.. అదే ఎప్పటినుంచో వున్నోళ్ళకి 1500.. హేమి లెక్కో ఇది నాకిప్పటికీ అర్థమవలేదు అర్థమవలేదు.. మళ్ళీ లెక్కల్లో నేను ఫష్ట్.. ఎలాగూ ఇంతకాలం వున్నోళ్ళు ఏమి మారతారులే అని ధైర్యమా? మన ఇండియా వాడి సంగతి వీళ్ళకింకా తెలియలేదా?

అంతే ఇంటికి వెళ్ళి కమ్యూనిష్ట్ నయిపోయి అధ్యక్ష హోదాలో అందరి ఓట్లు నేనే రిగ్గింగ్ చేసి "మనము మారుతున్నాం అని కచ్చితంగా చెప్పేసాను". ఆవేసం పట్టలేక అప్పటికప్పుడు నేననుకున్న కమ్యూనిటీ కెళ్ళి ఒక ఇల్లు చూసి లీజ్ పేపర్స్ తీసుకొని ఇంటికి వచ్చా.

ఇంక మారక తప్పదనుకుందో ఏమో.." మా ఆయన బంగారం " అని కప్పునిండా ఒక మాంచి కాఫీ అడగకుండానే ఇచ్చింది. మనసులో ఏదో మూల అలజడి. ఏంటబ్బాఈ ప్రేమ అని!

ఒక సిప్ తాగాను..

"ఇల్లు బాగుందా?"
చూస్తావుగా తొందరెందుకు?

"ఎన్ని బెడ్ రూములు?"
రెండు

"బాత్ రూములెన్ని?"
రెండు

మరో గుక్క కాఫీ చేదుగా దిగింది

"గౌరీ వాళ్ళింటికెంతదూరం ? "
....

"శ్రీ లక్ష్మి" వాళ్ళింటికెంత దూరం ( నా ఫ్రెండ్)
....

"రైల్వే స్టేషన్ కెంతదూరం?"
.....

"పిల్లల స్కూల్స్ ఎవో కనుక్కున్నావా?"
....

"ఇంటి దగ్గర నిలబడితే స్కూల్ బస్ స్టాప్ కనిపిస్తుందా"
....

"రెంట్ ఎంత?"
1450

"ఎన్ని సెల్ఫ్ లు వున్నాయి?"
....

"వాకింగ్ క్లాజెట్ వుందా?"
....

"స్టౌ గ్యాసా.. ఎలక్ట్రిసిటీనా?"
....

" 1st ఫ్లోరా లేక 2nd ఫ్లోరా ?"
2nd ( In US, ground floor is 1st floor)

"కార్పెటా లేక వుడెన్ ఫ్లోరా?"
కార్పెట్

ఇంకా ఎక్కువసేపు కాఫీ తాగితే ఏమేమి వినాల్సి వస్తుందో నని చేతిలో కాఫీ పక్కనబడేసి ఏదో అర్జెంట్ పనివున్నట్టు బయటకు వెళ్ళాను. గుప్ గుప్ మనిపించడానికి...అప్పుడు కానీ ఇల్లు ఎలా రెంట్ కు తీసుకోవాలో అర్థం కాలేదు.

అంతే మళ్ళీ మా ఆవిడతో కలిసి ఇల్లుచూడ్డానికి పరిగెత్తాను.. ఇప్పుడు కొత్త ఇల్లు మాకు పర్ణశాల లాగా వుంది. రెంట్ ఇంతకు ముందుకేమాత్రం తగ్గలేదనుకోండి. అయితే కొంచెం పెద్ద ఇల్లు. మంచి స్కూల్స్...

మళ్ళీ రెండేళ్ళకి ఇవన్నీ ఎలాగూ అబద్ధాలవుతాయనుకోండి...అప్పటిదాకా గృహమే కదా స్వర్గసీమ.

15, జులై 2009, బుధవారం

నా ప్రేమతో నీకో రూపమిచ్చాను

ఆత్రేయ గారి "నా ప్రేమతో నీకో నీకో రూపమిచ్చాను" కవిత కు సెటైర్ :) .... అత్రేయగారు నొచ్చుకోకుండా ముందే క్షమాపణలతో.............



అసలు పోష్ట్...
http://aatreya-kavitalu.blogspot.com/2009/07/blog-post_4310.html

నా ప్రేమతో నీకో రూపమిచ్చాను

పిలిచి పిలిచి నోరు నొప్పిపుట్టినా
చూసి చూసి కళ్ళు కాయలు కాసినా
నడిచి నడిచి కాళ్ళు పుండ్లు పడ్డా
నా పిలుపు నిన్ను చేరలేదు

మెదడులో గుర్తుల గుంటలు పూడ్చి
త్యాగమని బోర్డు పెట్టి
మురికి నీళ్ళలో విషము కలిపి
నా ప్రాణాన్ని నేను తీసుకోలేను.

ప్రేమపేరుతో మందు తాగేకంటే
యాసిడ్ చల్లి గెలవడమే
నా కిష్టం
మొండి ప్రేమలో
ఆత్మహత్య చేసుకోలేను.

నీవు లేకనే ....నేను బ్రతుక గలనా అన్న ప్రశ్న
మరోసారి నిన్ను నువ్వు చూసుకో..
వస్తావా.. ఛస్తావా...

11, జులై 2009, శనివారం

ఊసుపోక పిల్ల గాలి తెమ్మెర


ముంగురులలికిడికి మెల్లన కదిలి
కాటుక కన్నులందము దోచి
సిగ్గు బుగ్గల సింగారము గని
ధరహాస అధరాన నాట్యము లాడి
అల్లన మెల్లన మెల్లగ జారి
చెంగుచాటందము జూసి
సన్నని దారుల సంచారియై
చిన్నదాని వలపులు జూడ
మదిలో కురిసెను వలపుల వాన

వన్నె చిన్నెల గాలిని జూచి
చెలిని తాకిన అణువును జూచి
మురిసి మెరిసే పరమాణువు జూచి
మదిలో రగిలెను మన్మధ తాపం.


చెలియ పంపిన చిలిపి పలుకులె
చిరుగాలి మోసిన మధుర స్పర్శ్యలె
చెలి ఊసులై, శృతి లయ లవగ
నా మది పాడెను వసంత గీతిక.

వలపు వాన హోరులే విరహాగ్ని ధారలై
విరజాజి తలపులే మదినంత తడుపగా
తనువణువణువూ బంధనాలు వీడి
తలపుల వనాన వసంత విహారి యయ్యె.