జిల్లెళ్ళపాడెళ్ళి వేడి వేడి అన్నంలో చింతకాయపచ్చడి అప్పుడే నిప్పులమీద కరగబెట్టిన నెయ్యి వేసుకోని తినాలి. పొలాల్లోకి బొయ్యి రేగ్గాయలు కోసుకోని ఉప్పేసి దంచుకోని తినాలి. దోసకాయలు,అలసందకాయలు కూడా..వీలైతే సుబ్బమ్మ కొట్టు కాడ సోల రాగులుపోసి నూగుజీడీలు తినాలి ;)
ఇంగామాయిన భైరవకోనకుఁబొయ్యి కోటి లింగాల దర్శనంతోపాటు సెలయేట్లో తడవాలి. అక్కడే వె(ఎ)లక్కాయలూ,బీరకాయలు,బిక్కికాయలూ అన్నీ తినాలి. వీలైతే బత్తాకాయల దొంగతనమూ చెయ్యాలి :). అక్కడనుండి నెల్లూరెళ్ళి ఎండుచేపల కూర తినాలి. ఇంగామైన ఆదార్నటే పెత్తిరుపతికి పొయ్యి ఎంకన్న దర్శనమయ్యాక నాలుగు లడ్లు గుటక్కిన మింగి చిన్తిరుపతొచ్చి..... ఒంగూలు పొయ్యి బస్టాండు దగ్గర ఇడ్లీ, మైసూరుపాకు లాగించాలి. ఆడ్నే మద్దేన్నానికి మా అక్క/చెల్లళ్ళింటికి అట్టాపొయ్యి నాటుకోడి కూర కుమ్మెయ్యాలి. దర్శిలో నేమో పప్పుచారు, కాలవదగ్గర జగన్మాత పీఠం ( ఇక్కడ తిండిగోల లేదులెండి. గురువు గారు కొడతారు) , గాంధీనగరంలోనేమో సొరకాయ కూర తిన్నాక ఇనకొండ మీదుగా నర్శింగపాడు బొయ్యి పచ్చిమిరపకాయ పచ్చడి గడ్డపెరుగుతో పెద్దపళ్ళాన్ని నాకెయ్యాలి :)
సందెగాల గుంటూరుఁబొయ్యి సకుటుంబసపరివారసమేతంగా నాజ్ సెంటర్లో ఫష్ట్ షో చూసుకోని విందుభోజనాలారగించి అప్పుడు ..... ఇశాకపట్నం, ఇజీనగరంబోవాల. ఇజీనగరంలో ఏమేమి స్పెసలో చూస్కోని అయ్యన్ని తిన్నాక హైదరాబాదు కుపోవాలి. అదికూడా ఏడికిరా నువ్వొచ్చేది ఆంధ్రావోడా అనకపోతేనేలెండి :-) హైదరాబాద్ కు పొయ్యాక ఇంక జూస్కో నా సామిరంగా మస్తు మస్తు ఎంజాయ్ చెయ్యాలి.
ఆమాయిన ఒక్కొక్కరోజు కలల్లో బొంబాయి జుహూబీచి కెళ్ళాలి. తోడుగా కనీసం Lover ను అన్నా తీసుకెళ్ళాలి. కుదరకపోతే నారిమన్ పాయింట్ అయితే పక్కా. అలా అరేబియా అందాలు చూసి మర్సరోజు మీరారోడ్డు , బోరివలి, అంధేరి,మాతుంగ, దాదర్, మహాలక్ష్మి, సెంట్రల్, గ్రాంట్ రోడ్, ఛర్నీరోడ్డు, మెరైన్ లైన్స్ చూసుకొని గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర పావురాళ్ళ ఫొటో తీసుకొని ఎలిఫెంటా కేవ్స్ కు వెళ్ళోచ్చాక అలసి పొయ్యుంటాము కదా... అప్పుడు తాజ్ లో ఒక చాయ్ కొట్టాలి. వీలైతే నా ఫేవరేట్ లాడ్జింగ్ ప్లేస్ ఆంధ్రమహాసభ లోనే వుండాలి :)
మరొకరోజు కలకత్తా నుంచి ముంబాయి కి పట్టపగలు Gitanjali Express లో తలుపు తీసుకొని కూర్చొని భారతదేశ అందాలన్నీ చూడాలి. ఖరగ్ పూర్ లో మట్టి చిప్పలో టీ తాగాలి.
ఇంకోరోజు ఆగ్రా, మధుర, ఫతేఫూర్ సిక్రీలు చూసేస్తాను. మధుర లో పొద్దుపొద్దున్నే పాలల్లో జిలేబీలద్దుకోని తినాలి :)
నిద్రరాకపోతే ఢిల్లీలో గల్లీ గల్లీ తిరుగుతాను. నీబొంద కల అని చెప్తూ నిద్ర అంటావేంటటే..అదంతే.. ఇది పగటికల ;)
ప్చ్...ఇంతచేసినా సగం భారతం కూడా చూడలేకపోతున్నా.