13, నవంబర్ 2012, మంగళవారం

దీపావళి ఢాం...డాం..... టప్.. తుస్ ... టపాకాయలు - హారం.

అసలు ఈ రోజు దీపావళికి ఏదైనా కవిత వ్రాయాలని కూర్చున్నా...

దీపావళీ
గాలిడోలికలయందు అనురాగ వీచికలయందు
తరళమై సరళమై మమతానురాగములై వర్థిల్లు దీపావళీ!!

ఇలా ఏవో నాలుగైదు లైన్లు వ్రాసి చివరిగా

కాంతియే శాంతియై, శాంతియే చైతన్యమై... వినువీధుల వెలుగు తారలై .

.అంటూ ఏదో వ్రాసుకుంటూ పోతున్నానా ఇంతలో  ఎవరి దగ్గరినుంచో హారం ఫీడ్ బ్యాక్ ద్వారా ఓ "లక్ష్మీ" బాంబ్ పేలింది. ఇలాంటి టపాసులు రోజూ సాధారణమే ఐనా ఈ రోజు అసలే దీపావళీ కనుక దీని ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ టపాకాయ :))

ఈ పండుగ ఉపయోగం, పరమార్థం ఎంతమందికి తెలుసో అని నాకెప్పుడూ అనుమానమే!! ఇలాంటి మైల్స్ ఇచ్చేవాళ్ళ ను చూస్తే మరీ ఎక్కువ అనుమానం వస్తుంది.హారం ద్వారా ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు ఆ ఇబ్బందులను హారం దృష్టికి తీసుకురావడానికి ఓ feedabck పేజీని పాఠకుల సౌకర్యార్థం వుంచడమైనది. అదుగో ఆ పేజీనుండి ఇలాంటి టపాకాయలు వేస్తుంటారు. ఇప్పటికి ఈ సంవత్సరానికి గాను 4994 మైల్స్ వచ్చాయి. ఇవి కేవలం feedabck  ద్వారా వచ్చిన మైల్స్ మాత్రమే ( బ్లాగ్ ను కలుపమని వచ్చే మైల్స్ కాదు )

అందులో మూడొంతులు టపాకాయలే. కొన్ని చిచ్చుబుడ్లు, భూచక్రాలు, కాకరొత్తులు, ఇంకొన్ని థౌజన్ద్ వాలాలు వుండవచ్చు. చిచ్చుబుడ్లు సాధారణంగా పేలకుండా కాంతినిస్తాయి. అంటే హారం ను ఏవిధంగా ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావచ్చో ఈ చిచ్చుబుడ్ల ద్వారా తెలుస్తుంది. :)). సాధారణంగా వీరికి ప్రత్యుత్తరము తప్పక ఇస్తాను.

ఇక భూచక్రాలేమో భూమి గుండ్రముగా వుండును అన్నట్లు వీరినుంచి సహజంగా ఒకే రకమైన ఫీడ్బ్యాక్ వుంటుంది. నా టపా కనిపించడం లేదని. ఈ టపా కనిపించకపోవడానికి సవాలక్ష కారణాలు. ఒక్కోసారి బ్లాగు దొరికిందే సందుగా టపాలను కుమ్మేస్తుంటారు. అది వారిష్టం కానీ నిర్ణీత గడువులో నిర్ణీత టపాలకంటే ఎక్కువ వస్తే ఆ బ్లాగు ఓ రోజు పాటు స్పాం లో వుంటుంది. అలాగే మరికొన్ని నియమాలూ వున్నాయి. ఇవి కాక శాండీ లాంటి దెబ్బలు తగిలి మనుషులకే దిక్కులేకపోతే ఇక హారం ఎక్కడ? ఇలాంటి కారణాలు బోలెడు. సాధారణంగా ఈ భూచక్రాలకు మొదటి మైల్ కు రిప్లై ఇవ్వను. రెండవసారి కూడా మైల్ ఇస్తే అప్పుడు తప్పక సమాధానముంటుంది. కారణం అన్ని మైల్స్ కు సమాధానాలివ్వడం ఇప్పట్లో నాకు కుదరని పని.

ఇక కాకరొత్తులు చాలా తక్కువన్నమాట :)). వీళ్ళు రంగురంగుల కలలతో హారం కు వెలిగిస్తామని వస్తారు. నేనూ " ఆహా ఏమి నాభాగ్యము!! ఎంతకాలానికి మా మా మానసముల్లాతోత్సవ
డోలికలూగుచూ  దీపావళి జరుపుకొనుచున్నదని సజ్జ నిండుగా కనులకింపుగా ఇష్టమృష్టాన్నములైన విందునంతా కూర్చి" తిరిగి మైల్ పంపుదునా.... హతవిధీ ఏమీ ఈ వైపరీత్యమూ ఒక్కరో ఒక్కరూ... ఒక్కరైననున్... అని దీపావళి కి  అమావాస్య పాట పాడుకోవటమే :)

ఇక Thousand waalaa లు. వీరు తమకు తెలిసిన Technology ని అంతా హారం పైన చూపిస్తుంటారు. :-). అంటే మీకిప్పటికే అర్థమయి వుంటుందనుకుంటా. చూసి నవ్వేసుకోవడమే :)).  అంటే వీళ్ళు తమ బ్లాగుని Add చేయమని పదే పదే మైల్స్, ఫీడ్ బ్యాంక్ లు చేస్తుంటారు. వీరికి మైల్ రిప్లై ఇచ్చినా ఉపయోగం వుండదు కనుక Thousand waalaa లకు సహజంగా సమాధానముండదు. వీళ్ళు టప్ టప్ టప్ మని బుద్ధిపుట్టినప్పుడల్లా పేలుతుంటారు :))


చివరిగా కొంతమంది అసలు సిసలైన బాంబులేస్తుంటారు. వీళ్ళు కనీసం ఓ రోజు కూడా ఆగలేని బాపతులన్నమాట. అసలు మైల్ ఇవ్వడివడమే నేను కత్తిని, నాపేరు బాకు ఏమనుకున్నావో తెలుసా...నువ్వు గనక నా బ్లాగును వెంటనే నీ సైట్ నుండి తీసెయ్యక పోతే నీమీద DMCA complaint  ఇస్తాం. జాగ్రత్త ఏమనుకున్నావో.. మాకు గూగుల్ తెలుసు..నీకు తెలుసా..గూగులోడికి కూడా complaint  చేస్తాం....ఇది నీకు వార్నింగ్... ఇలా పేలుతుంటాయి.

సహజంగా ఇలాంటి మైల్స్ కు నా reply వుండదు. కారణం వీళ్ళు హారం ను అసలు చూడరు. మరికొంతమందికి నా మీద అప్పుడప్పుడూ ఎక్కడో కాలుతుంది :)). అలాంటప్పుడు ఇలాంటి మైల్స్ వస్తుంటాయి. ఓ రకంగా చెప్పాలంటే హారం ఆయా  సైట్లకు ఓ చిన్నపాటి compitator అని వాళ్ళు ఫీల్ అయిపోయి ఇలా ఫట్ మని లక్ష్మీ బాంబులేస్తుంటారు.

ఇలాంటి వాటికి నా reply వుండదు. ఒక్కోసారి నిజంగానే జనాల పౌరుషాన్ని(? కాదు అమాయకత్వం) చూసినప్పుడు నవ్వు వస్తుంది. మరోసారి ఏముందబ్బా ఆ బ్లాగులో అని చూసి అబ్బబ్బా ఈ ఆడ/మాడా/మగాడిదొక బ్లాగు వీడివొక వ్రాతలు దానికొక కాపీరైట్ అని ఫీల్ అయిన రోజులూ వున్నాయు. కారణం అయ్యగారు బ్లాగునిండా ఇంటర్నెట్ లోనుంచి కాపీకొట్టిన ఫొటోలో లేదా వికీపీడియా కాపీనో లేదా Microsoft MSDN నుంచో మక్కీకి మక్కీ దించేసి వుంటారన్న మాట :))

ఇలా ముందు ఢాం ఢాం అని పేలుతారు. కాస్త గట్టిగా webhosting వాళ్ళ దగ్గరా పేలుతుంటారు. గూగుల్ దగ్గరా పేలుతుంటారు. హ్మ్..ఎంత పేలినా హారం ఎక్కడికీ పోదు. పేలి పేలి తుస్ మనడం తప్పించి ఇలాంటి మైల్స్ వల్ల ఉపయోగమూ వుండదు. కానీ ఇలాంటి మైల్స్ సహజంగా Americans నుంచి రావు. వాళ్ళ మైల్స్ polite గా వుంటాయి. నిజమే కదా అమెరికా వాళ్ళకు దీపావళి లేదాయె టపాకాయలు పేలుద్దామంటే :)).

ఇంతకీ దీపావళి కి కవిత వ్రాద్దామని కూర్చుంటే ఓ ఆడామె లక్ష్మీబాంబేసింది. అందుకోసం ఈ టపా వ్రాయాల్సి వచ్చింది. టపాసుల్లో రకాలు వేరయా అన్నట్టు ఈ టపాసు మొదటి మైలే మహా ఘాటుగా వేసింది. చదవాలని వుందా???

అబ్బా ఆశ దోశ అప్పడం ఆవడ :))))
ఇలాంటి వారికి దీపావళి ప్రాశస్త్యం తెలిసి మనసు తిమిరం తొలగితే నిజంగా దీపావళే ఆరోజు.

అదీ నా ఈ నాటి దీపావళి కవితన్నమాట:))

చివరిగా పాఠకులందరికీ దీపావళి శుభాకాంక్షలు.

2 కామెంట్‌లు:

  1. హలో అండీ !!

    ''తెలుగు వారి బ్లాగులు'' తరుఫున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు !!

    వెలుగు జిలుగుల దీపావళి నాడు ఆ లక్ష్మీ మాత కటాక్షం
    ఈ యావత్ భారతావనిలో ప్రతి ఒక్కరికీ కలగాలని ఆశిస్తూ ...
    ఒక చిన్న విన్నపము ....!!

    రాబోయే నెల డిసెంబర్ 2 వ ఆది వారము (తెలుగు బ్లాగుల దినోత్సవం) లోపల ఒక వెయ్యి తెలుగు బ్లాగులను ఒకదరికి చేర్చాలని సంకల్పించటమైనది

    మీరు అనుమతించి నట్లైతే మీ బ్లాగును కూడా తెలుగు వారి బ్లాగుల సముదాయం లో జతపరిచేదము.
    మీ అంగీకారము తెలుపగలరు

    http://teluguvariblogs.blogspot.in/

    రిప్లయితొలగించండి

Comment Form