10, జనవరి 2017, మంగళవారం

వలసల జీవితం - ప్రతి వలసకు ఏదో ఒక కారణం.




వివిధ ఆర్థిక,రాజకీయ,సామాజిక కారణాల రీత్యా ప్రజలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వలసలు వెళ్తుతుంటారు.ఒక వ్యక్తిని వలస వెళ్ళిన వ్యక్తిగా గుర్తించటానికి జనాభా గణన వాళ్ళు రెండు ప్రామాణికాలును ఉపయోగిస్తారు.
౧) జన్మస్థలం
౨) ఇంతకు ముందు నివాసం వున్న స్థలం. ఒక వ్యక్తి వలసవచ్చిన వ్యక్తిగా గుర్తించటానికి ఆ వ్యక్తి ఇంతకు ముందు నివాసమున్న ప్రదేశం కాకుండా ఇప్పుడు తానున్న ప్రదేశంలో గత ఆరునెలలకాలం దాటి వున్నట్లైతే వలస వచ్చిన వాడిగా పరిగణిస్తారు

ఈ విధంగా చూసుకుంటే నా జీవతమంతా వలసల మయమే. పుట్టిన ఊరిలో ఐదు సంవత్సరాలు గడిపానో లేదో చదువుకోవటానికని మా చిన్నాన్న పనిచేసే ఊరికి తరిమేశారు.ఒకటవ తరగతి నుండి నాల్గవ తరగతి వరకు అక్కడే వలస వచ్చిన చదువుకొనే విద్యార్థిని. ఐదవతరగతికి మరో చిన్నాన్న పనిచేస్తున్న ఊరు సింగరాయకొండకు తరలించారు. అక్కడ ఒక సంవత్సరం పాటు పరాశర భారతి అనే స్కూల్లో విద్యాభ్యాసం. అక్కడా వలస విద్యార్థినే. ఆరవతరగతిలో ఉండగా కుటుంబం వేరు పడటంతో మళ్ళీ తిరిగి జన్మస్థానానికి వచ్చాను. ఇక అక్కడ నుంచి ఇంటర్మీడియెట్ అయ్యేంతవరకు అనగా దరిదాపు ఏడు సంవత్సరాలు మా ఊళ్ళోనే. ఆరు నుంచి పది వరకు ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో నున్న వెలిగండ్లలో ఇంటర్మీడియెట్ కు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోని కనిగిరిలో విద్యాభ్యాసం సాగింది.

నేను వెలిగండ్లలో చదువుకొనే రోజుల్లోనే మా ఊరినుంచి, ఊరి చుట్టుప్రక్కల గ్రామాలనుంచి ముప్పై నలభై శాతం మంది రైతులు  జిల్లాలోని దర్శి చుట్టుప్రక్కల గ్రామాలకు వలసలు వెళ్ళారు.సాధారణంగా వలసలు గ్రామాల్లో తగినన్ని ఉపాధి అవకాశాలు లేనందువల్ల, ఉన్న ఉపాధిలో తగినంత ఆదాయం రానందువల్ల పల్లెల నుంచి పట్నానికి వలసలు పోతుంటారు. కానీ మా గ్రామ చుట్టుప్రక్కల గ్రామాలనుంచి గ్రామాలకే వలసలు జరిగాయి. దీనికి ప్రధాన కారణం అర్థిక అవసరాలే. కనిగిరి ప్రాంతమంతా మెట్ట ప్రాంతం. వర్షాలు కురిస్తేనే పంటలు. ఒక్క కారు పంట పండటమే గగనం. ఈ పరిస్థితులలో చేతులో డబ్బులు ఆడటం చాలా అరుదు. డబ్బు లేకపోవడంతో కుటుంబ పోషణా భారం, పిల్లల చదువుల భారం, ఆరోగ్యం మొదలైన  అవసరాలకు చాలాకష్టపడవలసి వచ్చేది. నాకు ఊహ తెలిసే టప్పటికే ఊరి చుట్టుప్రక్కల బ్రాహ్మణులందరూ పెట్టే బేడ సర్దేసి వేరే ఊళ్ళకు వెళ్ళి పోయారు. రైతులి తినడానికే తిండి లేకపోతే ఇక బ్రాహ్మణ కుటుంబాల ఫోషణెక్కడ? మాకు ఉండటానికి ముప్పై ఎకరాల పైనే పొలం వుండేది. కానీ వేరు పొయ్యాకా తలా పదెకరాలు వచ్చింది. ఆ పదెకరాల్లో కంది, పెసర,పిల్లి పిసర, జొన్న, సొజ్జ, రాగి, మిరప, టమోటాలు, గెనుసు గడ్డ మొదలైన పంటలు వేసే వాళ్ళం. ఊళ్ళో మోతుబరి రైతులుగా చలామణి అయ్యేవాళ్ళు పై పంటలతో పాటి వేరు శనగ, పొగాకు కూడా వేసేవాళ్ళు. నేను పదవ తరగతిలో వుండగా మా ఊర్లో సెట్టి గారైన ఒకాయనకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక్క మొగపిల్లవాడు.అందరిదీ చదువుకొనే వయసు. ఒక ఎకరా పొలం వుండేదేమో. అందులో పంట సరిగా పండేది కాదు. బాగా బ్రతికిన కుటుంబం కావడంతో వేరే వాళ్ళ పొలం పనులకు వెళ్ళడానికి చిన్నతనం. ఊరిలో చదువుకున్న అతికొద్ది కుటుంబాల్లో మా కుటుంబం ఒకటి కాబట్టి మాయింటికి వచ్చి రోజూ ఏదో ఒక లోకాభిరామాయణ చర్చ పెట్టేవాడు.అంతా అయ్యాక ఆకలికి తాళలేక మేము తినేదే ఆయనకు కొంతపెట్టి ఆ నెలకు కావాలసిన రాగులో,సొజ్జలో,జొన్నలో మూటగట్టి ఇచ్చే వాళ్ళము. ఇలా ఒక ఆరునెలలు గడిచిన పిమ్మట ఒకరోజు వాళ్ళబ్బాయిని బడి మాన్పించి కావలిలో ఒక కొట్లో గుమస్తాగా చేర్చానని కబురు మోసుకొచ్చాడు. ఆకలి బాధలు, ప్రజలవసారాలు పిల్లలను బడికి దూరంచేసి వలసమార్గాన్ని ఎలా పట్టిస్తాయో తెలుపడానికి మచ్చుకు ఈ ఉదాహరణ.కొంత కాలమైనాక కుటుంబమంతా కావలి వలస వెళ్ళారు.

 మా మండలంలోని గ్రామాల్లో కొంతమంది రైతు కుటుంబాలే గ్రామాలనుంచి గ్రామాలకే వలసలు జరిగాయని చెప్పాను కదా. సాధారణంగా గ్రామాలనుంచి పట్టణాలకు వలసలుంటాయి. కానీ ఇక్కడ గ్రామాలకే వలసలు జరిగాయి. దీనికి ప్రధాన కారణం రైతులకు పొలంపనులు తప్ప వేరే పనులు అంతగా తెలియకపోవటమే. మాదంతా మెట్టప్రాంతమనుకున్నాము కదా. దర్శి చుట్టుప్రక్కల నాగార్జునసాగర్ కాలువద్వారా నీటి సౌకర్యముంది. దీనితో సాలుకు రెండు పంటలను పండించవచ్చని అదీకాక వరి పైరు సాగు చేయడానికి అవకాశముందని ఇక్కడి రైతులు దర్శి చుట్టుప్రక్కలనున్న భీడు భూములను కొనటం మొదలు పెట్టారు. ఎనభై దశకం చివర్లో మాదగ్గర ఎకరా పొలం మాహా వుంటే నాలుగైదు వేలుండేది. రైతులు వలసల బాట పట్టడంతో గ్రామాల్లో వున్న మాల,మాదిగ, ముతరాచ మొదలైన కులాల వాళ్ళు రైతుల పొలాలను కొనడం మొదలు పెట్టారు.అప్పటికే మావైపు మాల వాళ్ళు భిలాయ్ లాంటి ఇండష్ట్రియల్ ప్రదేశాలకు వెళ్ళి కొంత ధనాన్ని పోగు చేసుకున్నారు. ఆ డబ్బుతో రైతుల పొలాలను కొన్నారు. ఇక్కడి రైతులు తామమ్ముకున్న పొలం డభ్భులను తీసుకెళ్ళి దర్శి చుట్టుప్రక్కల రెండు మూడెకరాల భీడు భూమిని కొని సాగుచెయ్యడం మొదలు పెట్టారు. ఒకదశలో యువతంతా గ్రామాలను వీడి ఈ బీడు భూములను బాగు చెయ్యటానికి వలసల బాట పట్టగా ఇక ఊర్లలో మిగిలింది ముసలి వారైన తల్లి దండ్రులే. మా ఊర్లో సాధారణంగా పదవతరగతి పాసైతేనే పై చదువులకు పంపించేవాళ్ళు. పది ఫైలైతే ఇక అక్కడితో చదువుకు స్వస్తి చెప్పి పొలం పనులకు వెళ్ళే వాళ్ళు .సాధారణంగా తొంభై శాతం మంది పది తప్పటము అంతటితో చదువాపి పెళ్ళిళ్ళు చేసుకొని క్రొత్త కోడలుతో సహా పొలం పనులకు వెళ్ళటం జరుగుతుండేది. నేను పదిలో వుండగానే మాచిన్నాయనవాళ్ళు ఇలాగే సాగర్ కాలువక్రింద గాంధీ నగర్ లో పదెకరాల బీడు భూమి కొని దాన్ని పంటవేసుకొనే పొలంగా తీర్చిదిద్దడానికి మా మేనత్త వాళ్ళను జిల్లెళ్ళపాటినుంచి గాంధీ నగరం వలసబాట పట్టించారు. మా మేనత్త వాళ్ళు ఈ ఆసరాతో సంసారంతో అక్కడికి వెళ్ళి ఈ పదెకరాలను కౌలుకు చేసుకుంటూ నలుగురాడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసి కొంతమెరుగైన జీవితాన్నే గడిపారు.

నేను పది పాసవ్వడంతో బ్రతికి పోయి ఇంజనీరింగ్ లో సీటు తెచ్చుకొని విశాఖ పట్టణం లో చదువు తుండగా మా నాన్న కూడా ఊరిలో వున్నపొలమమ్మేసి ఒక మూడెకరాల పొలాన్ని గాంధీనగరంలో కొన్నాడు. ఊర్లో పనికొచ్చేపొలం లేకపోవడంతో సంసారం జిల్లెళ్ళపాటినుంచి వెలిగండ్లకు మార్చారు. దీనికి ప్రధానకారణం మా నాన్న పనిచేసే ఎలిమెంటరీ స్కూల్ వెలిగండ్లకు దగ్గరగా వుండటమే. ఈ మార్పు మాత్రం నాకు చాలా ఆనందాన్నే ఇచ్చింది. కారణం విశాఖ పట్టణం నుంచి ఎప్పుడైనా సెలవులకు ఊరికి వెళ్ళాలంటే తాటిచెట్ల దగ్గర బస్సు దిగి రెండు కిలోమీటర్లు బరువైన సూట్కేసుతో నడవాల్సి వచ్చేది. సంసారం వెలిగండ్లకు మారడంతో నాకు నడిచే పని తప్పింది. కానీ ఈ ఆనందం ఎక్కువ రోజులు నిలువలేదు. నేను B.Tech 3rd year లో వుండగా మా నాన్న రిటైరయ్యాడు. ఇప్పుడు వెలిగండ్లలో ఇంకే పనని సంసారాన్ని గాంధీ నగర్ మార్చాడు. అలా మారడంతో మళ్ళీ రోడ్డున దిగి ఊరు చేరాలంటే రెండు కిలో మీటర్లు నడవాల్సిందే. ఇలా పుట్టిపెరిగిన ఊరినొదిలి గాంధీనగర్ వలస వచ్చాము.

నా ఇంజనీరింగ్ పూర్తవడం తో ఉద్యోగ వేట మొదలైంది. ఇక అక్కడనుండి క్రొత్తరకం వలసలు. మొదటగా ముంబయి. తరువాత పెళ్ళి పిల్లలు.  హైదరాబాదులో ఇక స్థిరపడినట్లేనని అనుకుంటున్న సమయంలో బుఱ్ఱలో పురుగు తొలవడం మొదలు పెట్టింది. అప్పటికే నాలుగుసార్లు బిజినెస్ వీసా మీద అమెరికా కు వచ్చి పోతుండంటంతో ఇక్కడి సమాజం పట్ల, చదువుల పట్ల ఆకర్షితుడనయ్యాను.ఇంగ్లీషు వస్తే ప్రపంచంలో ఎక్కడైనా నెగ్గుకు రాగలరని అలాగే పిల్లలకు ఇక్కడున్న రిసోర్సెస్ భారతదేశంలో దొరకడం దుర్లభమనిపించింది.ఇక్కడి సౌకర్యాలకు, పని ప్రదేశంలో పనిచేసే గంటల వేళలకు కూడా ఆక₨హితుడనయ్యాను. ఇప్పుడెలా వుందో కానీ నేను భారతదేశంలో పనిచేసే రోజుల్లో ఆఫీసుకు ఉదయమొస్తే ఇంటికి వెళ్ళే టప్పటికి ఏ అర్థరాత్రో అయ్యేది. ఈ సౌకర్యాల అంతర్మధనం మరో వలసకు దారి తీసింది. కానీ గాంధీనగర్ లో నివాసముంటున్న అమ్మనాన్నలను ఏంచేయాలి? ఆ ఊరికి బస్ సౌకర్యము కూడా లేదు. అప్పట్లో ఫోను సౌకర్యం కూడా లేదు. సెల్ ఫోన్లు వచ్చినా ఊరికి సిగ్నల్ అందేది కాదు. ఎప్పుడైనా మాట్లాడాలన్నా వీలుపడదు. హైదరాబాదులో వున్నప్పుడు రెండు మూడు నెలలకొక్కసారైనా ఊరికి వెళ్ళి వస్తుండేవాళ్ళము. మా అమ్మనాన్నలకు తీరుబాటైనప్పుడు వాళ్ళు హైదరాబాదు వస్తుండేవాళ్ళు. అమెరికా కు వెళ్ళడం తథ్యమని తేలడంతో అమ్మనాన్నలుండడానికి హైదరాబాదులో ఒక ఇల్లు కొన్నాను. గాంధీనగరంలో కొంత పొలము, ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బుతో మా అక్కయ్యలిద్దరికి చెరో లక్షన్నరకు బంగారం చేపించి అమ్మనాన్నలను హైదరాబాదుకు తీసుకొచ్చాను. ఇది మరో వలస. పుట్టిన ఊరితో సంబంధాలు తెగి పదేళ్ళు దాటింది. ఈ పదేళ్ళలో ఉన్న ఊరు గాంధీనగర్ ను కూడా వదిలేసి హైదరాబాదు రావాల్సి వచ్చింది.

2007 లో అమెరికా వచ్చేటప్పుడు మొదట ఒక్కడినే వచ్చాను. ఒక నెలకు స్థిరపడ్డాను అనుకొన్న తరువాత అంటే ఉద్యోగం, ఇల్లు చూసుకొన్న తరువాత పెళ్ళాం పిల్లలను అమెరికా తీసుకు వచ్చాను. వచ్చిన మూడు నాలుగేళ్ళు జీవితం సుందరమయంగా గడిచిపోయినా ఈ పది సంవత్సరాలుగా ఇక్కడి యాంత్రిక జీవనానికి అలవాటు పడి జీవితం బోరు కొట్టేస్తుంది. కానీ ఇక్కడ నుంచి వలస వెళ్ళడానికి ఇక దారి లేదు :-). పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడి వాళ్ళూ ఒక ఇంటి వారయ్యాక బహుశా తిరిగి హైదరాబాదుకు వెళ్ళవచ్చేమో. దానికి మరో పదేళ్ళ సమయం. అప్పటిదాకా మరో వలస లేనట్లే :-)

18 కామెంట్‌లు:

  1. నేనెప్పుడూ ఇలా ఆలోచించలేదు కానీ నిజంగా చూసుకుంటే అందరిజీవితాలూ వలసల మయమే. కొందరు ఊళ్ళు మారుతారు కొందరు దేశాలు మారుతారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామకృష్ణారావు గారు, అవునండీ, గ్లోబలైజేషన్ అయ్యాక ఈ వలసలు మరీ ఎక్కువయ్యాయి.చాలా వరకు గ్రామాలనుండి వలసలు వచ్చి నగరాలలో స్థిరపడుతున్నారు.

      తొలగించండి


  2. ట్రంపు మళ్ళీ వలస పంపించడంటారా ? :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హహ్హ..జిలేబి గారూ, నిజానికి నా టపా "అప్పటిదాకా మరో వలస లేనట్లే ట్రంప్ పంపించకపోతే" అని సమాప్తం చేశాను. కానీ ఈ విషయం వ్యాఖ్యలలో ఎవరోఒకరు వ్రాయకపోతారా, మనమే ఎందుకు వ్రాయ్డం అని తీసివేశాను. దాన్ని మీరు పూరించారు.

      కానీ ట్రంప్ ఎఫెక్ట్ బహుశా హెచ్1.బి లకే పరిమితము కావచ్చు.

      తొలగించండి
  3. హిమబిందు గారూ, ఎన్నాళ్ళకెన్నాళ్ళకు కనిపించారు? ఏమైపోయారండి ఇన్ని రోజులు? అంతా క్షేమమనే తలుస్తాను.

    మీ వ్యాఖ్యతో బ్లాగులు సస్యశ్యామలంగా వెలుగుతున్న రోజులు గుర్తొచ్చాయి.

    రిప్లయితొలగించండి
  4. వలస కారణాలు బ్రతుకు తెరవు లేమి
    నీటి వసతి కలిగి నేలతల్లి
    పంటలిచ్చిన కడుపార తిని యొకరి
    కింత బెట్టు పల్లె కేది దిక్కు ?

    రిప్లయితొలగించండి
  5. రాజారావు గారూ పల్లెలలోని రైతులపై చక్కని పద్యం వ్రాశారు. వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. మీ వరస-వలసల-కబుర్లు బావున్నాయి.
    ~లలిత

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లలితగారు, వలస కబుర్లు నచ్చి వ్యాఖ్య వ్రాసినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  7. బ్లాగుల్లో ఉన్నవాళ్ళు చాలామంది వలసపక్షులే. బహుశా అందుకేనేమో, స్థానిక బంధు మిత్రులు లేక ఇలా నెట్ మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటున్నారు.
    నేను ఆంధ్రప్రదేశ్ వదిలి ఇరవైమూడేళ్ళు అయ్యింది. దేశమంతా తిరిగి, తిరిగి ఎప్పటికి గూటికి చేరతానో తెలియదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బోనగిరి గారు, అవునండి ఇలా వలస పక్షులమైన తరువాత మాటా మంచి కలుపుకోవాలన్నా దగ్గరలో మనకు తెలిసిన వాళ్ళు కానీ చుట్టాలు కానీ వుండరు కదా! కనీసము ఏ శుభకార్యాలకు వెళ్ళాలన్నా లక్షలతో కూడుకున్న ఖర్చు. మీరన్నట్లు ఒంటరి తనాన్ని కొంత వరకు ఈ బ్లాగులు తీరుస్తున్నాయి.

      తొలగించండి
  8. భా రా రె గారు నేను ఇక్కడే వున్నాను ...మూసిన బ్లాగు లోగిళ్ళలో తచ్చాడుతూ తెరచిన బ్లాగుల్లో తొంగి చూస్తూ సమయం చిక్కినపుడు నాలుగు అక్షరాలూ చల్లి ఇలా వున్నామండీ అంతా క్షేమమే అమ్మమ్మ ప్రమోషన్ కూడా తీసుకుని మరింత బిజీ అయ్యాము .... గడచినా రోజులు ఎప్పుడు మధురమే ...బ్లాగులు నిస్తేజంగా వున్నాయి ...ఎన్ని గొడవలు గోలలు సరదాలు ..లైవ్లీ గా ఉండేవి ...వాటి స్థానం ముఖపుస్తకం వాట్సాప్ తీసేసుకున్నట్లు ....కదా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిన్నీ ప్రత్యుత్తరానికి సంతోషమండి. అమ్మమ్మగా ప్రమోషన్ వచ్చినందుకు శుభాకాంక్షలు :)

      అవునండి, బ్లాగువ్రాసే వారి సంఖ్య, వ్రాసినా చదివే వారి సంఖ్య చాలా వరకు తగ్గి పోయినట్లే వుంది. పాత బ్లాగుల్లో ఎక్కడో ఒకటో అరా తప్పించి మిగిలినవన్ని స్తబ్దుగా వున్నాయి. ముఖపుస్తకం,వాట్సప్ లు వచ్చాక వీటి ప్రాబల్యం బాగా తగ్గినట్టే వుంది.కానీ ముఖపుస్తకం,వాట్సప్ లు ఎందుకో నాకు బ్లాగు నచ్చినంత బాగా నచ్చలేదు. ఇది నా అభిప్రాయం మాత్రమే.

      తొలగించండి


    2. భారారె గారు,

      మళ్ళీ మీ హారాన్ని తెచ్చి తెలుగు బ్లాగ్కళామ తల్లి మెడలో వేసి చూడండి మళ్ళీ బ్లాగు లోకానికి సవ్వడులు వెల్లి విరుస్తాయి !

      చేస్తారని ఆశిస్తో

      చీర్స్
      జిలేబి

      తొలగించండి
    3. జిలేబి గారూ, ఇప్పట్లో తెలుగు బ్లాగులకు మరో యాగ్రిగేటర్ అవసరముందంటరా? వున్న 30-40 మంది బ్లాగర్లకు జల్లెడ,మాలిక,శోధిని యాగ్రగేటర్లు సరిపోవా?

      తొలగించండి

    4. పోవండి

      హారం హారమే !

      One and the only one

      So when coming back ?

      జిలేబి

      తొలగించండి

Comment Form