11, ఆగస్టు 2019, ఆదివారం

కూరలో కరివేపాకు అంటారు కానండి ...

అందరూ కూరలో కరివేపాకు అంటారు కానండి ఇది అమెరికాలో మాత్రం కాదు. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు మన దక్షిణ భారతదేశంలో ఈ కరివేపాకు మితిమీరి దొరుకుతుంది కాబట్టి కూరల్లో కరివేపాకును తీసి పక్కన పెట్టేస్తారు కానీ అలా చేసినోళ్ళని ఒక సంవత్సరం పాటు తెచ్చి అమెరికాలో పడెయ్యాలి.అప్పుడు కానీ దాని విలువతెలిసిరాదు. నవ్వులాటకు చెప్పటంఏదండీ :). ఇక్కడ ఒకేఒక చిన్న కరివేపాకు రెమ్మ ఒక డాలరు పెట్టి కొంటుంటే పర్సులో డబ్బులు ఒత్తి ఒత్తి చూసుకుంటూ కళ్ళమ్మటి నీళ్ళు కార్చాల్సిందే.ఈ దెబ్బకు చాలా రోజులు అవసరమైన కూరల్లో, పచ్చళ్ళలో కరివేపాకు లేకుండానే జీవితాలని లాగించేవాళ్ళు అమెరికా నిండా కనిపిస్తారు. అలా రుచీ పచీ లేని కూరల్ని తింటూ జిహ్వచాపల్యాన్ని చంపుకొని బ్రతకడానికి కడుపు నింపుకొనే రోజుల్లో ఒక దేవత మాపై కరుణించి ఒక చిన్న కరివేపాకు చెట్టునిచ్చింది.అది కొద్దిరోజులు బాగానే గెంతుతూ తుళ్ళుతూ మాతో బాగానే ఆడుకున్నది. అప్పటికి చిన్న పిల్లే కాబట్టి దాని ఫలాలు మాకు అందలేదు. బాగానే వున్నదికదా అని ఒకరోజు ఆడుకుంటానంటే బయట పాటియో లో పెట్టి దాని సంగతి కొద్దిరోజులు మర్చిపోయాము. ఎంతా ఒక పదిరోజులనుకుంటాను. నవంబరు చివరి వారమనుకుంటాను. బయటకు వెళ్ళి చూస్తే అప్పటికే అది మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది :(

అదిగో అప్పటినుంచి మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు. కానీ ఈ మధ్య గత ఆరునెలలుగా బ్రతికేది తిండి తినటంకోసమే కదా . అందరికీ ఏవేవో గోల్స్ వుంటాయి కానీ నాకు మాత్రం బ్రతికినన్ని రోజులు కరివేపాకు వేసుకొని కూరలొండుకోవాలని ఒక్కటే గోల్. ఆ గోల్ తో ఈ మధ్య మళ్ళీ కూరగాయలకు వెళ్ళినప్పటినుంచి కరివేపాకు మాత్రం తప్పక తెచ్చుకుంటున్నాను. ఇలా కాలంసాగిపోతుండగా మళ్ళీ కరివేపాకు దత్తు తెచ్చుకోని పెంచుకోవాలని కోరిక కలిగింది.



పోయిన సారి గుణపాఠంతో ఈ సారి అసలు న్యూ జెర్శీ లో ఏమేమి మొక్కలు పెరుగుతాయోనని రీసెర్చ్ చేస్తే..అబ్బే ఇవన్నీ జోన్ ౭ ఆపైన పంటలని తేల్చేశారు. అమెరికా లో మనసౌలభ్యంకోసం వాతావరణ పరిస్థితులను బట్టి  మొక్కలు నాటడానికి ఏకాలం అనుకూలం, ఏ ఏ పంటలు పండించుకోవచ్చు మొదలైన విషయాలు నాలాంటి వారికి కూడా అర్థం కావడానికి  దేశాన్ని కొన్ని భాగాలుగా విభజించారు. న్యూ జెర్శీ లో మేముండే ప్రాంతం జోన్ 6b క్రిందకు వస్తుంది. ఈ జోన్ 6b లో కరివేపాకు పెరగదు.పెంచాలంటే ICU లో పెట్టి చూసుకోవాల్సిందే. సరే ఏమైతే అదవుతుందని మళ్ళీ ఒక కరివేపాకు మొగ్గని కొన్నాను. ఎండాకాలం దరిదాపు ఐపోవచ్చింది కాబట్టి ఈ సారి కొద్దిగా పెద్ద మొక్కనే కొన్నాను.వేరు నుంచి పైనుండే ఆకు దాకా రెండడుగులంట. అదొచ్చాక చూడాలి ఎంత పొడవు ఎంతా లావుందో! ఈ సారి డబ్బులు పెట్టి కొన్నాము కదా చలికాలంలో నిజంగానే ICU లో పెట్టి చూసుకోవాలి. నిజమే కదా ఊరికే వచ్చిన దానికంటే మనం డబ్బులు పెట్టి కొన్న దానిమీద శ్రద్ధ ఉంటుంది కదా!! జీవిత సత్యమిదేకదా :)

12 కామెంట్‌లు:

  1. // "ఊరికే వచ్చిన దానికంటే మనం డబ్బులు పెట్టి కొన్న దానిమీద శ్రద్ధ ఉంటుంది కదా!!" //

    హ్హ హ్హ అవును. ముళ్ళపూడి వెంకట రమణ గారి జోక్ ఒకటుంది. కట్టుడు పళ్ళు అమర్చిన తరవాత డాక్టర్ జాగ్రత్తగా చూసుకోవాలండి అంటాడు పేషెంట్ తో. ఆయ్యో, కాదుటండీ మరి, అవంటే ఊరికే వచ్చినవి, ఇవి బోలెడంత డబ్బు పోసి కొనుక్కున్నవి, జాగ్రత్త దానంతటదే వస్తుంది .. అంటాడు పేషెంట్ 🙂.

    రిప్లయితొలగించండి
  2. భలే! అచ్చు ఇలాగే ప్రవాస జీవనపు వంటింటి-కల్పభూజం గురించి నేనూ రాసుకున్నా కొన్ని కబుర్లు...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండి లలిత గారు... కరివేపాకు కష్టాలు ఇంతింత గాదయా అన్నట్టుంది మా పరిస్థితి :)

      తొలగించండి


  3. మా వూళ్ళో కరివేపాకు ఫ్రీగా యిస్తారండీ :)

    వచ్చేయండి :)


    దండిగా దండు కొని వెళ్ళొచ్చు :)




    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీఊళ్ళో కరివేపాకు వ్యాపారం మొదలెట్టొచ్చండి.
      ఫ్రీ గా ఇస్తున్నారా....ఐతే ఇదిగో రెక్కలు కట్టుకొని వచ్చేస్తున్నా :)

      తొలగించండి
  4. దానికి ఇష్టా ఇష్టాలు ఉన్నాయి అనుకుంటాను.అది కొందరిళ్ళల్లోనే పెరుగుతుందని నా నమ్మకం. చికాగో వెదర్ లో కొందరి ఇళ్ళల్లో వృక్షము మహావృక్షము అయ్యింది మా(మీ) లాంటి ఇళ్ళల్లో పెరగలేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమేలాగుందండి లక్కరాజు గారూ...ఈ సారి పోతే నేనూ మీ సిద్ధాంతానికి ప్రచారకర్తనౌతాను :)

      తొలగించండి


  5. కరివే పాకుకు కలదోయ్
    మరి యిష్టాయిష్టముల్ తమకు నచ్చినచో
    సరి విచ్చును వృక్షముగా
    మరి ఊపందుకొనవింక మదిలేకున్నన్ :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ
      ఇవ్వాళ మీ పద్యంలో ప్రతి పాదం అర్ధమయ్యింది. కరివేపాకు మహత్యం!

      తొలగించండి
    2. ఈ పద్యమ్ము చదివి వేపాకు నమిలినట్లుండె.

      తొలగించండి


    3. వేపాకు నమిలి నట్లుం
      డే పద్యముచదివి డోకుడే వచ్చె జిలే
      బీ పాసగూల ! యేలా
      మా పాడెను గట్ట వ్రాయ మరి వచ్చితివో :)

      తొలగించండి

Comment Form