29, ఫిబ్రవరి 2020, శనివారం

వసంతాగమన నిరీక్షణ...ముద్దబంతి,తామర,రోజా పూల సందడి

ఈ సారి న్యూజెర్శీ లో వసంతం కొంత ముందుగా వచ్చే సూచనలు కనిపిస్తుండటంతో మా తోటపని మొదలైంది. ఏమేమి పూలమొక్కలు వెయ్యాలా అని  తెగ ఆలోచించి మధ్యే మార్గంగా కొన్ని రకాలను ఎంచుకున్నాము. మొక్కలు కొని వెయ్యాలా లేకపోతే మనమే గింజలనుంచి మొలకెత్తించాలా అన్న సందిగ్ధంలో కొంతకాలం కొట్టుమిట్టాడి, గింజలనుంచే మొలకెత్తించాలని నిర్ణయం తీసుకున్నాము. ఫిబ్రవరి కి చివరిరోజు ఈ రోజు. గింజలనుంచి మొలకెత్తించాలంటే మార్చిలో జెర్మినేషన్ ( అంకురోత్పత్తి) మొదలెట్టాలి కాబట్టి అమెజాన్ లో రకరకాల ముద్దబంతిపూల గింజలు, మూడురకాల రోజాపూల గింజలు, తామరపూల గింజల తోపాటి వాటికి కావాలసిన కుండీలు మొదలైనవి పంపమని అమెజాన్ వాడికి విన్నపం చేసుకున్నాము. అనుకున్నట్టే రెండో రోజుకల్లా అన్నీ వచ్చాయి కానీ రోజాపూల గింజలు కనిపించలేదు.

ఇక వీటిని ఎలా మొలకెత్తించాలా అని యూట్యూబ్ లో వీడియోల మీద వీడియోలు చూసి మొదటి విడతగా గా తామరపూల గింజలను రెండురోజుల క్రితం రెండు గాజు సీసాల్లో వేసి పెట్టాను.అదేంటో వీడియోల్లో అందరికి రెండురూజులకల్లా మొలకలు కనిపిస్తే నాకేమో యింతవరకూ ఉలుకూ పలుకూ లేకుండా వేసినవి వేసినట్టే వున్నాయి. మరో మూడునాలుగు రోజులు చూడాలి.వారాంత షాపింగ్ కోసమని నిన్న శుక్రవారం కాస్ట్కో షాపింగ్ కు వెళితే అక్కడ రకరకాల రోజా పూల మొక్కలు అమ్మకానికి పెట్టి వున్నాడు.మనకెలాగూ రోజా పూల విత్తనాలు అమెజాన్ వాడు పంపలేదు కదా అని ఒక జత రోజా పూల మొక్కలు కొన్నాము.ఎలా నాటాలో అట్టల మీదున్న విధానం చెప్తుంది. దాని ప్రకారం ఈ రోజు గడ్డకట్టే చలిలో మా ఇంటి ముందు తోటలో సుమారు పద్దెనినిమిది అంగుళాల లోతు వెడల్పు తో ( వెడల్పు కొంచెం తక్కువగా వుండవచ్చు) చిన్న గుంత తీసాను. ఇంతకష్ట పడ్డందకు మా ఆవిడ నాకు వంద డాలర్లు బాకీ పడింది. అంటే అది వంద డాలర్ల గుంత :-).
తీసిన గుంతలో మట్టి వేసి (పాటింగ్ మిక్స్) ఒక మొక్కను నాటాను. రేపు బాక్యార్డ్ లో మరో మొక్కను నాటాలి.


ఇక చివరిగా బంతి పూలు. వీటికి ఇంకా ముహూర్తం కుదరలేదు. ఈ వారంలో వాటిని కూడా నాటి అవి మొలకెత్తుతాయో లేదో అని ఎదురు చూడడమే... వసంతం కోసం ఎదురు చూసినట్టు.

15, ఆగస్టు 2019, గురువారం

రారండోయ్ రారండోయ్-- తండూరీ చాయ్ తాగండోయ్....:)

1993 వ సంవత్సరం.B.Tech ఐపోయి M.Tech లో చేరమని ఆహ్వానం రావడంతో గుంటూరు జిల్లా వినుకొండ తాలూకా గాంధీనగరం గ్రామం నుంచి ఖరగ్ పూర్ కు బయలు దేరాను. బస్సులో విజయవాడదాకా వచ్చి హౌరా ఎక్స్ప్రెస్ కు రిజర్వేషన్ కోసం ప్రయత్నిస్తే దొరకలేదు. యువరక్తం. జనరల్ టికెట్ కొనుక్కొని టి.సి. కి డబ్బులిచ్చి ఏదో ఒక బెర్త్ రిజర్వ్ చేసుకోవచ్చులెమ్మని ధైర్యంతో కూడిన అనుభవం. విశాఖపట్టణంలో  B.Tech  చేసేటప్పుడు ఏదో ఒక ట్రైన్ పట్టుకొని రిజర్వేషన్ బోగీలో ఎక్కడం టికెట్ కలక్టర్ కరుణిస్తే అంతో ఇంతో డబ్బులిచ్చి ఆ పెట్టలోనే వుండండం లేదంటే దిగి జనరల్ బోగీలోకి మారడం బాగానే అనుభవముంది. అసలు అప్పట్లో నేను బొకారో ఎక్స్ప్రెస్ కు ఎక్కువగా ఇంటికి వస్తుండేవాడిని. ఎంతలా అంటే దానిపేరును మాఫ్రెండ్స్ భాస్కర్ బొకారా అని పిలుచుకునేటంతగా. B.Tech చదివిని మొదటి మూడేండ్లు మేము ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా జిల్లెళ్ళపాడు గ్రామంలో వుండేవాళ్ళము. ఈ ఊరికి పోవాలంటే అదొక పెద్ద ప్రహసనం. కారణం ఒంగోలులో దిగినాక, కనిగిరి బస్సు పట్టుకొని మొదట కనిగిరి చేరుకోవాలి. అక్కడనుంచి బస్సుకోసం నిరీక్షణ. కనిగిరి లో బస్సుదొరొకిన తరువాత ( కనిగిరి=వెదుళ్ళ చెరువు లేదా కనిగిరి-రంగన్నపల్లి ) ఓ గంట ప్రయాణం తరువాత తాడిచెట్ల దగ్గర దిగి ఓ రెండుకిలోమీటర్లు నడిచి జిల్లెళ్ళపాడు చేరుకోవాలి. విశాఖలో వున్న రోజుల్లో మొదటిసంవత్సరంలో మాఊరికి ఏ సమయంలో బయలుదేరితే త్వరగా చేరుకోవచ్చో ప్రయోగాలు చేసి చివరికి బొకారో రైలు ఎక్కితే అతి తక్కువ సమయంలో బస్సులకోసం ఎక్కువ నిరీక్షించకుండా ఇల్లు చేరుకోవచ్చని కనిపెట్టాను. :) అతితక్కువ సమయమంటే మరీ తక్కువ అనుకోకండి. కనీసం పదహారు/పదిహేడు గంటలు పట్టేది. అసలు బొకారో మొదటి ప్రయాణం నాకు బహు బాగా గుర్తు. ఆ మొదటి ప్రయాణంలోనే నేనెంతో ఇష్టపడి జీవితంలో మొదటిసారి కొనుక్కున్న  Vaction boots ఎవరో కొట్టేశారు. దాని గురించి మరో సారి.

ఇలా హౌరా ఎక్స్ప్రెస్ కు టికెట్ కొనుక్కొని విజయా డైరీ వాళ్ళ మజ్జిగ రెండు మూడు పేకెట్లు లాగించి స్వాతి,ఆంధ్రభూమి వార పత్రికలు కొనుక్కొని ఒక రిజర్వేషన్ బోగీలో ఎక్కాను. అనుకున్నట్లే రైలు లో ఖాళీ లేదు. ఎక్కిన భోగీలో ఎవరైనా కుఱ్ఱ పిల్లలు ఉన్నారేమో నని ఒక సింహావలోకనం చేశాను కానీ అంత ఆసక్తి గొలిపే మొఖాలెక్కడా కనపడలేదు :). రైలు ప్రయాణం మొదలైంది. కొద్దిదూరం పోయాక T.C వచ్చాడు. నా పరిస్థితి వివరించాను. ఏమనుకున్నాడో ఏమో విశాఖ దాకా ఖాళీల్లేవు అక్కడ ఏమైనా ఖాళీ వస్తే తప్పక ఇస్తానని మాట యిచ్చి అక్కడి వరకూ ఎక్కడో ఒక చోట సర్దుకొని కూర్చోమని చెప్పి వెళ్ళిపోయాడు. వైజాగ్ దాకా ప్రయాణం కొట్టిన పిండి కాబట్టి సరదాగా గడిపేశాను. విశాఖ రాగానే T.C ని కలిసి బెర్త్ రిజర్వ్ చేసుకొని మిగతా ప్రయాణాన్ని సుఖాసీనుడనై
 ప్రయాణించి ఉదయం పది/పదిన్నర ప్రాంతానికి ఖరగ్పూర్ చేరుకున్నాను.

బెంగాలీ రాదు నాకు. హిందీ కొద్దికొద్దిగా వచ్చేది. దిగిన తరువాత వచ్చిన హిందీలో IIT కి వెళ్ళాలని అడిగితే ఎక్కడనుంచని అడిగాడు. ఆంధ్రా అని చెప్పా. అంతే స్వచ్చమైన తెలుగులో సంభాషణ మొదలెట్టాడు. అప్పటిదాకా ఖరగ్ పూర్ లో తెలుగువాళ్ళెక్కువని తెలియదు నాకు. అలా ఆజాద్ హాల్ చేరుకొని మరుసటిరోజు అడ్మిషన్ పూర్తిచేసుకున్నాను.

ఇంతకీ మట్టికుండలో టీ కి నేను చెప్పేదానికి సంబధమేమిటా అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. అక్కడున్నరోజుల్లో తరచూ గోల్ బజార్ అనే మార్కెట్ కు కొత్తగా వచ్చిన తెలుగు పాటల కోసమో లేదా కావాల్సిన పుస్తకాలు కొనుక్కోవటానికో లేదా ఎదో సినిమా చూడడానికో వెళ్ళేవాళ్ళము.అదిగో అక్కడ రుచి చూశాను తండూరీ చాయ్ ని మట్టి ముంతలో! ఆ రుచి నాకిప్పటికీ గుర్తే. ఆ మట్టి వాసన ఆ టీ రుచీ మర్చిపోవాలన్నా మరపురాదు.అది మొదలు ప్రతివారం లేదా ఖాళీ దొరికినప్పుడల్లా సైకిల్స్ మీద గోల్ బజార్ కు వెళ్ళి టీ త్రాగడం అలవాటైపోయింది అక్కడున్న సంవత్సరమున్నర రోజులూ!!

ఆ తరువాత మళ్ళీ మట్టిపాత్రల్లో టీ త్రాగిన జ్ఞాపకాలు లేవు. ఈ మధ్య అమెజాన్ లో ఏదో కొందామని వెతుకుతుంటే ఇవిగో ఇవి నాకంట పడ్డాయి. ఎగిరి గంతేసి ఆర్డర్ చేసి మళ్ళీ ఈ రోజు ఇంచుమించు అదే రుచితో టీ త్రాగుతున్నా...

తండూరీ చాయ్ కావాలా!!! ఆలస్యమెందుకు...మాయింటికి రండి :)

11, ఆగస్టు 2019, ఆదివారం

కూరలో కరివేపాకు అంటారు కానండి ...

అందరూ కూరలో కరివేపాకు అంటారు కానండి ఇది అమెరికాలో మాత్రం కాదు. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు మన దక్షిణ భారతదేశంలో ఈ కరివేపాకు మితిమీరి దొరుకుతుంది కాబట్టి కూరల్లో కరివేపాకును తీసి పక్కన పెట్టేస్తారు కానీ అలా చేసినోళ్ళని ఒక సంవత్సరం పాటు తెచ్చి అమెరికాలో పడెయ్యాలి.అప్పుడు కానీ దాని విలువతెలిసిరాదు. నవ్వులాటకు చెప్పటంఏదండీ :). ఇక్కడ ఒకేఒక చిన్న కరివేపాకు రెమ్మ ఒక డాలరు పెట్టి కొంటుంటే పర్సులో డబ్బులు ఒత్తి ఒత్తి చూసుకుంటూ కళ్ళమ్మటి నీళ్ళు కార్చాల్సిందే.ఈ దెబ్బకు చాలా రోజులు అవసరమైన కూరల్లో, పచ్చళ్ళలో కరివేపాకు లేకుండానే జీవితాలని లాగించేవాళ్ళు అమెరికా నిండా కనిపిస్తారు. అలా రుచీ పచీ లేని కూరల్ని తింటూ జిహ్వచాపల్యాన్ని చంపుకొని బ్రతకడానికి కడుపు నింపుకొనే రోజుల్లో ఒక దేవత మాపై కరుణించి ఒక చిన్న కరివేపాకు చెట్టునిచ్చింది.అది కొద్దిరోజులు బాగానే గెంతుతూ తుళ్ళుతూ మాతో బాగానే ఆడుకున్నది. అప్పటికి చిన్న పిల్లే కాబట్టి దాని ఫలాలు మాకు అందలేదు. బాగానే వున్నదికదా అని ఒకరోజు ఆడుకుంటానంటే బయట పాటియో లో పెట్టి దాని సంగతి కొద్దిరోజులు మర్చిపోయాము. ఎంతా ఒక పదిరోజులనుకుంటాను. నవంబరు చివరి వారమనుకుంటాను. బయటకు వెళ్ళి చూస్తే అప్పటికే అది మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది :(

అదిగో అప్పటినుంచి మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు. కానీ ఈ మధ్య గత ఆరునెలలుగా బ్రతికేది తిండి తినటంకోసమే కదా . అందరికీ ఏవేవో గోల్స్ వుంటాయి కానీ నాకు మాత్రం బ్రతికినన్ని రోజులు కరివేపాకు వేసుకొని కూరలొండుకోవాలని ఒక్కటే గోల్. ఆ గోల్ తో ఈ మధ్య మళ్ళీ కూరగాయలకు వెళ్ళినప్పటినుంచి కరివేపాకు మాత్రం తప్పక తెచ్చుకుంటున్నాను. ఇలా కాలంసాగిపోతుండగా మళ్ళీ కరివేపాకు దత్తు తెచ్చుకోని పెంచుకోవాలని కోరిక కలిగింది.పోయిన సారి గుణపాఠంతో ఈ సారి అసలు న్యూ జెర్శీ లో ఏమేమి మొక్కలు పెరుగుతాయోనని రీసెర్చ్ చేస్తే..అబ్బే ఇవన్నీ జోన్ ౭ ఆపైన పంటలని తేల్చేశారు. అమెరికా లో మనసౌలభ్యంకోసం వాతావరణ పరిస్థితులను బట్టి  మొక్కలు నాటడానికి ఏకాలం అనుకూలం, ఏ ఏ పంటలు పండించుకోవచ్చు మొదలైన విషయాలు నాలాంటి వారికి కూడా అర్థం కావడానికి  దేశాన్ని కొన్ని భాగాలుగా విభజించారు. న్యూ జెర్శీ లో మేముండే ప్రాంతం జోన్ 6b క్రిందకు వస్తుంది. ఈ జోన్ 6b లో కరివేపాకు పెరగదు.పెంచాలంటే ICU లో పెట్టి చూసుకోవాల్సిందే. సరే ఏమైతే అదవుతుందని మళ్ళీ ఒక కరివేపాకు మొగ్గని కొన్నాను. ఎండాకాలం దరిదాపు ఐపోవచ్చింది కాబట్టి ఈ సారి కొద్దిగా పెద్ద మొక్కనే కొన్నాను.వేరు నుంచి పైనుండే ఆకు దాకా రెండడుగులంట. అదొచ్చాక చూడాలి ఎంత పొడవు ఎంతా లావుందో! ఈ సారి డబ్బులు పెట్టి కొన్నాము కదా చలికాలంలో నిజంగానే ICU లో పెట్టి చూసుకోవాలి. నిజమే కదా ఊరికే వచ్చిన దానికంటే మనం డబ్బులు పెట్టి కొన్న దానిమీద శ్రద్ధ ఉంటుంది కదా!! జీవిత సత్యమిదేకదా :)

గ్రిల్ పొయ్యి మీద వంటలకు తయారు. ఇక గ్రిల్లింగే గ్రిల్లింగ్

గ్రిల్ మీద బార్బెక్యు చికెన్, మొక్కజొన్న కండెలు, బర్గర్స్, బంగాళా దుంప వేపుళ్ళు, అరటికాయ డెసర్ట్ ఇలాంటి వంటలు చేసుకుందామని ఎండాకాలం వచ్చినప్పటి నుంచి అనుకుంటూనే వున్నాను.కానీ దాన్ని సుభ్రం చేసి గ్రిల్లింగ్ కి అనుకూలంగా తయారు చేద్దామని అనుకుంటూనే ఎండాకాలం కాస్తా ఐపోవచ్చింది.మధ్యలో భారతదేశ ప్రయాణంతో ఒకనెల హరీమన్నది. చప్పబడిన నోటికి తెలుగు వంటలరుచి చూసి వచ్చేటప్పటికి ఎలాగైనా ఈ సారి గ్రిల్ మీద వంటలొండాలని నిర్ణయం తీసుకొని ఈ రోజు ఇదిగో ఇలాగన్నమాట. ఇక రేపటినుంచి గ్రిల్లింగే గ్రిల్లింగ్ :)


30, జులై 2018, సోమవారం

వీరమాచినేని రామకృష్ణ డైట్ - మొదటి ఆరురోజుల పరిశీలన

నా ఆహారంలో పుట్టినప్పటి నుంచి పద్దెనిమిదేళ్ళు వచ్చేదాకా రాగులు,సొజ్జలు,జొన్నలతో చేసిన సంగటి,అన్నము ప్రధానంగా వుండేది. వాటితో కలిపి తోటలో పండిన కూరగాయలూ. పద్దెనిమిదవ యేట ఇంటర్మీడియట్ చదవడానికి దగ్గరలోని పట్టణానికి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటివరకూ బియ్యపు అన్నము ప్రధాన ఆహారం. కొన్ని సంవత్సరాలుగా పొట్ట పెరిగి బాగానే కనిపించే స్థాయికి చేరింది. రెండేళ్ళ నాడు డాక్టరు దగ్గరకెళితే అన్నీ బాగున్నాయి కానీ సుగర్ లెవల్స్ కొంచెం ఎక్కువున్నాయని చెప్పాడు ( 111 ). చెప్పిన కొన్ని రోజులు కొంచెంజాగ్రత్తగా వున్నా మళ్ళీ మామూలే. ఈ సంవత్సరం మార్చిలో వెళితే సుగర్ లెవల్స్ 101 వున్నాయని చెప్పాడు. నేను ప్రత్యేకంగా యేమీ జాగ్రత్తలు తీసుకోలేదు కానీ ప్రతి మీల్ లో నెయ్యి తప్పకుండా వేసుకొని తినేవాడిని. దీనితో కొలస్ట్రాల్ లెవల్ కొంచెం పెరిగింది. 2017లో 194 వున్నది  2018 లో 208 కి వచ్చింది. బహుశా ఈ తేడా నెయ్యి తినడంతో వచ్చిందో లేక రిపోర్ట్ లలో తేడాలో తెలియదుకానీ నా డైట్ లో నిన్నటి వరకూ ఎలాంటి తేడా లేదు. బరువు వుండవలసిన దానికంటే పదిహేను పౌండ్లు ఎక్కువున్నాను.

ఈ మధ్య యూ ట్యూబ్ ఛానల్స్ లో రకరకాల వీడియో లు చూడటం అంతకు ముందే వీరమాచినేని డైట్ అని ఫేస్ బుక్ లలో చూడటం వల్ల ఇదొక రకమైన డైట్ ప్లాన్ అని సూచాయగా తెలుసు కానీ ఆయన వీడియోలు నేనెప్పుడూ వినలేదు. ఓ నాలుగు రోజుల ముందు ఈయన అసలేమి చెప్తున్నాడో విందామని ఒక పూర్తి నిడివి వీడియో విన్నాను.ఇదేదో బాగుందనిపించి చేద్దామనిపించింది. చేసే ముందు ఎందుకు చేస్తున్నానో కొన్ని గోల్స్ సెట్ చేసుకోవాలి కదా. ఇది చేయడానికి ప్రధాన కారణాలు రెండు.

౧) బరువు పదిహేను పౌండ్లు తగ్గడం ద్వారా పొట్ట యేమైనా తగ్గుతుందేమో చూడటం.
౨) సుగర్ లెవల్స్ ను 80-90 మధ్యకు తీసుకురావడం
౩) కొలొస్ట్రాల్ లెవల్ ఎంత పెరుగుతుందో చూడటం.

సరే పైమూడు మనసులో వుంచుకొని ఈ డైట్ చేయడానికి పూనుకొని కాస్ట్కో కు వెళ్ళి ఈ క్రిందివి కొనుక్కొని వచ్చి నిన్నటి నుంచి చేయ్డం మొదలు పెట్టాను.

Before starting this diet I completely scanned my physical test results that I have for this year and my Kidney and Liver function is normal. It is highly advisable to check your reports before starting this diet.

ఈ డైట్ చెయ్యటం వల్ల తప్పకుండా గ్లూకొజ్ లెవల్స్ తగ్గుతాయి.అలాగే డీ హైడ్రేషన్ కూడా జరుగుతుంది. వీటి రెంటిని కోల్పోవడం వల్ల మొదలుపెట్టిన తొలిరోజుల్లో చాలా ఎక్కువగా బరువు తగ్గుతాము.నేనైతే అంతా సవ్యంగా వుంటే ఒక రెండు వారాలు చేద్దామనుకొంటున్నాను.


వంటింటి స్కేల్ ( వైయింగ్ మిషెన్) మీద మొదటగా డెబ్బై గ్రాముల కొబ్బరి నూనె తూస్తే చిన్న టీ కప్ లో మూడొంతులు వచ్చింది. అది చూసి కళ్ళు తిరిగి పడిపోయాను. ఏంటి రోజూ ఇంత నూనె నా వొక్కడికీ వాడాలా అని? సరే నిండా మునిగాక చలెందుకులెమ్మని బ్లాక్ టీ లో రెండు స్పూన్ల కొబ్బరి నూనె కలుపుకొని అతికష్టం మీద తాగాను. ఇలా కాదని మిగిలిన నూనె మొత్తాన్ని చికెన్ లో వేసి ఫ్రై చేశాను. ప్రొద్దుట పూట అల్పాహారం వీకెండ్స్ తప్పితే సాధారణంగా తినే అలవాటు లేదు కాబట్టి మధ్యాహ్నం దాకా ఆకలి వెయ్యలేదు. మధ్యాహ్నం ఒక రెండువందల గ్రాముల చికెన్ ఫ్రై బౌల్ లో వేసుకొని తిన బోతే వెఘతు వేసింది. కొంత తిని మిగిలింది పక్కన పెట్టాను. నిమ్మకాయలు ఎలాగూ మూడు వాడమన్నారు కాబట్టి నీళ్ళలో అప్పుడప్పుడు కలుపుకొని త్రాగాను. దీని వల్ల వుపయోగమేమిటంటే కొబ్బరినూనె తినడం,త్రాగడం వల్ల వాంతి ఫీలింగ్ నుంచి బయటపడవచ్చు.

అన్నము దండిగా తింటున్న శరీరము ఊరుకోదు కదా మళ్ళీ మూడు గంటలకాకలేసింది. మిగిలిన చికెన్ ఫ్రై తినేశాను. సాయంకాలం ఏడు కాగానే మళ్ళీ ఆకలి. కొనుక్కొని వచ్చిన చికెన్ స్టాక్ లో బెల్ పెప్పర్,మష్రూమ్స్ వేసి సూప్ తాగాను. పది గంటలకు మళ్ళీ ఆకలి. రెండు ఆమ్లెట్స్ వేసుకొని తిన్నాను. మధ్య మధ్యలో వాల్ నట్స్, బాదం పప్పు తిన్నాను.

నాకు విటమిన్ డెఫిషియన్సీ   లేదు కాబట్టి విటమిన్ టేబ్లెట్ వాడలేదు. బహుశా ఈ డైట్ వల్ల రావచ్చేమో కాబట్టి ఈ శనివారం నుంచి మొదలు పెడతాను.

ఈ ప్రక్రియలో కల్లా అతి కష్టమైంది కొబ్బరినూనె సేవనం. ఈ డైట్ పాటించే వాళ్ళందరూ దాన్ని వేడినీళ్ళలో ఒక్కసారే వేసుకొని త్రాగడం చేస్తున్నారు కానీ నాకది కష్టంగా వుండటం వల్ల. ఒక ఇరవై నుంచి ముప్పై గ్రాములు బ్లాక్ టీ లో వేసుకొని త్రాగడం ద్వారా మిగిలింది కూరల్లో వాడటం ద్వారా చేద్దామని నిర్ణయించుకున్నాను.

Benefits of using coconut oil


ఈ డైట్ ని స్థూలంగా అధ్యయనం చేస్తే ఇది కీటో డైట్ కు దగ్గర పోలికలున్న డైట్. మనము కార్బోహైడ్రేట్స్ వాడకం తగ్గించి ప్రొటీన్, ఫాట్ వాడకం పెంచుతున్నాము. రోజూ చికెన్ నేను తినలేను కాబట్టి కూరగాయలేమేమి కీటో డైట్ లోకి వస్తాయో గూగుల్ చేశాను.

https://www.ruled.me/best-low-carb-vegetables-ketogenic-diet/

ఈ రోజు రెండవరోజు. మొదటి రోజు కొంచెం తలనొప్పి అనిపించింది. రెండవరోజు వాంతికొస్తున్న ఫీలింగ్ వల్ల నిమ్మకాయ నీళ్ళు త్రాగడంతో సర్దుకుంది.

మొదటి రోజు వున్న బరువుకన్నా ఈ రోజు సుమారు ఒక పౌండ్ తక్కువున్నాను.

మొదటి రోజు బరువు - 151.8
రెండవ రోజు బరువు -  151 ( varieing between 150 and 151)

ఇక ఏ కూరగాయలు వాడొచ్చు ఏవి వాడకూడదన్న దానికి ఒక ఛార్ట్. స్తూలంగా మరీ ఎక్కువ కార్బ్స్ వున్న కూరగాయలను వాడకూడదు.

రెండవ రోజు మధ్యాహ్న భోజనంగా కాలిఫ్లవర్, వంకాయ కలిపి చేసిన కూరా నాలుగొందల గ్రాములు తీసుకున్నాను. ఈ డైట్ మీరు పాటించాలకుంటున్నా, ఒకవేళ పాటించినా మీ అనుభవాలను వ్యాఖ్య ద్వారా పంచుకోంటారని ఆశిస్తున్నాను.20, జనవరి 2018, శనివారం

ఆకాశవాణి వారి సమస్యకు నా పూరణ ( కర్టెసీ : సమస్య శంకరాభరణం బ్లాగునుండి గ్రహింప బడింది )

ఆకాశవాణి వారి సమస్యకు నా పూరణ ( కర్టెసీ :  సమస్య శంకరాభరణం బ్లాగునుండి గ్రహింప బడింది )


సమస్య : సమరము శాంతిఁ గూర్చు ఘనసంపద లిచ్చును నిశ్చయంబుగా 

పూరణ: 

సముచితబుద్ధి తోడ కడు సాహస వీరులు రామధర్మజ
ప్రముఖులు సంధిగోర వినిరా? కడుదుర్మతులైన వారి చి
త్తము సడలింప సాధ్యమె విధాతకునైన, చరిత్ర చూడగన్
సమరము శాంతిఁ గూర్చు ఘనసంపద లిచ్చును నిశ్చయంబుగా

14, జనవరి 2018, ఆదివారం

సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి శుభాకాంక్షలు

సీ|| సంక్రాంతి యింటింట సకల సౌభాగ్యములందించ వచ్చె, పొలముల పంట
క్రాంతియై నట్టింట కళకళ లాడె, నవవధూవరుల తొలి పండగయ్యె
తిగ్మాంశు గతిమారి దీర్చె గృహస్థుల కోర్కెలెల్ల ఁగరము కూర్మితోన
శుభదినమిదె మనసు కలతబాసి యానంద పరవశమ్మున మునిగినది

తే.గీ|| భాగ్యమందితి కోర్కెలు బాపుకొందు
కాంత కోర్కెయు బిడ్డల కష్టములను
క్షయము నందించి మమ్ముల గాచిన జను
లు ఫలమొందగ జేసి నే సఫలుడౌదు

1, జనవరి 2018, సోమవారం

నూతన సంవత్సర శుభాకాంక్ష - పద్యము

నూతనవత్సరంబవని నొక్కటి జేసి ప్రజాళి పాపకా
ర్యాతిక్రమార్హులై సకల రాజ్యము లొర్ధిలు గాక రేబవల్
ఖ్యాతిన, శాంతిసౌఖ్యము సుగంధ నభోగజమై సకాల వ
ర్షాతిశయంబునన్ ప్రణయ రాగము వర్షిలు గాక పృధ్వినన్

24, డిసెంబర్ 2017, ఆదివారం

మహా భారతకాలం నాటి పెండ్లీ కట్టుబాట్లు


భారతంలో కుంతీ,పాండురాజుల సంవాదం వలన మనకు ఆనాటి అనగా భారతకాలం నాటి సమాజ వ్యవస్థ, పెండ్లి అనే కట్టుబాటు, మాతృస్వామ్య వ్యవస్థ అప్పటి ప్రజల్లో వీటిపైన నెలకొన్న భావాలు స్థూలంగా అర్థమవుతాయి. పాండురాజు యుద్ధాలతో కురురాజ్యానికి దగ్గర దగ్గర రాజ్యాలన్నింటిని జయించి సామంతరాజులుగా చేసుకొని కప్పం కట్టించుకుంటూ ఇద్దరు భార్యలతో సంసారం చేసినప్పటికీ పిల్లలు కలుగరు. బహుశా ఆబాధతో వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి వుంటాడు. ఇక్కడ మనకు పాండురాజుకు మునిరూపంలో సంగమిస్తున్న జింకలను చంపటం వల్ల శాపగ్రస్థుడై వానప్రస్థానికి వెళ్ళాడని కథ ద్వారా తెలుస్తున్నా బహుశా పాండురాజు దగ్గర విషయం లేకపోవటం  వల్ల అతనికి పిల్లలు పుట్టకపోవడంవల్లనే దుఃఖంతో వానప్రస్థానికి వెళ్ళి వుంటాడు. నాటి సమాజంలో కొడుకును కనకపోతే అతనికి పితృ ఋణం తీర్చుకొనే అవకాశం లేనట్లు చెప్పబడింది. సంతానానికి అధిక ప్రాధాన్యతనీయబడింది.
భారతకాలం బహుశా మాతృస్వామ్య వ్యవస్థకు, పితృ స్వామ్య వ్యవస్థకు సంధికాలమై వుండవచ్చు. అనగా అంతకు పూర్వం పూర్తిగా మాతృస్వామ్య వ్యవస్థ నడచి దానిలోని లోపాల వలన సమాజం క్రమంగా పితృస్వామ్య వ్యవస్థవైపు మళ్ళింది. స్త్రీలు ఋతుమతులైన తరువాత పురుషునితో సంగమానికి కట్టుబాట్లు లేని కాలం. యధేచ్ఛగా వారిష్టమొచ్చిన వారితో గడిపిన కాలం. పురుషులు కూడా తమకు కొడుకులు కావాలనుకొన్నప్పుడు  స్త్రీ తో సంగమించడం కొడుకో కూతురో కలిగిన తరువాత యెవరి దారి వారు చూసుకుంటున్న కాలం. 

 అలాగే భారతకాలనికి పూర్వం, భారతకాలంలో  కన్యగా వుండి అనగా పెళ్ళి కాకుండా పిల్లలను కనడం కూడా దోషము కాలేదు. పెండ్లి అనే వ్యవస్థ పూర్తిగా స్థిరపడని కాలమది.క్రమంగా పితృస్వామ్యవ్యవస్థవైపు అడుగులేస్తున్నకాలం. పెండ్లిల్లు జరుగుతున్నప్పటికి పెండ్లికి ముందే కొడుకో కూతురో వున్నప్పటికీ భార్యగా చేసుకోవడంలో ఆనాటి సమాజానికి పెద్దగా పట్టింపులు లేవు. కానీ ఆ వ్యవస్థ భారతకాలంలో అంత్యదశలో వున్నదనుకోవచ్చు. అందుకే సత్యవతికి, కుంతీకి పెళ్ళికి ముందే పిల్లలు కలిగినప్పటికి  రాజులు పెళ్ళి చేసుకొన్నారు. నాటికాలంలో ఇప్పుడు మనము భారతదేశంగా పిలుచుకుంటున్న పేరు అస్తిత్వంలో లేదు.నాడు, నేడు మనం భారతదేశంగా పిలుచుకుంటున్న దేశం అనేక చిన్న చిన్న రాజ్యాల సమూహం. అందులో కురు దేశం ఒకటి. కురుదేశానికి ఉత్తర భాగంలో భారతకాలం నాటికి కూడా మాతృస్వామ్య వ్యవస్థే నడుస్తుండేది. కామమనేది జీవుల్లో సహజమైనప్పటికీ పిల్లలను కనటమనేది వాళ్ళొక పవిత్రమైన కార్యంగా భావించారు. బహుశా ఇలాంటి మాతృస్వామ్య వ్యవస్థ కురుదేశానికుత్తరంగా వుండటం మూలానే కావచ్చు పాండు రాజు భార్యలతో సహా వానప్రస్థాశ్రమం లో తిరుగుతూ అక్కడ స్థిరపడ్డాడు.

కథలో మనకు కుంతీ,పాండురాజులు పడిన అంతర్మధనం కనిపిస్తుంది. పిల్లలను కనటానికి సంగమమే మార్గమైనా ఆ సంగమానికి రకరకాలైన పద్ధతులనవలింభించారు. సమాజ పరిస్థితులను బట్టి ఆయా పద్ధతులు నాడు సమాజంలో వుండి వుండవచ్చు. కవిత్రయ భారతంలో మనకు పన్నెండు రకాలుగా పిల్లలను స్వీకరించవచ్చని చెప్పారు. ఈ పన్నెండు మంది

౧) వివిహం చేసుకొన్న భార్యయందు తనకు పుట్టిన వాడు ( ఔరసుడు)
౨) నియోగం చేత తనభార్య యందు ఇతరులకు పుట్టినవాడు ( క్షేత్రజడు)
౩) తనకు కుమారుడుగా ఇవ్వబడిన యితరుల కుమారుడు( దత్తకడు)
౪) అభిమానంతో కుమారునిగా పెంచుకొనబడినవాడు (కృత్రిమడు)
౫) తనభార్యయందు తనకు తెలియకుండా యితరుల వలన జన్మించినవాడు(గూఢడు)
౬) తల్లిదండ్రులచేత విడిచిపెట్టబడి తనదగ్గర చేరినవాడు (అపవిద్ధుడు)

పైన చెప్పబడిన ఆరుగురు పుత్త్రులు బంధువులే కాక, తమ ఆస్తిలో భాగానికి కూడా అర్హులు

౧) పెళ్ళికాకముందు తనభార్య కన్యగా వున్నప్పుడు పుట్టిన వాడు ( కానీనుడు)
౨) వివాహసమయానికే గర్భిణిగా వున్న తనభార్యకు వివాహం తరువాత పుట్టినవాడు ( సహోఢడు)
౩) తల్లిదండ్రులకు ధనమిచ్చి కొనబడినవాడు ( క్రీత )
౪) భర్తచే విడువబడిన స్త్రీకి లేదా విధవకు తనవలన కలిగిన కుమారుడు ( పౌనర్భవ)
౫) నీకు పుత్రుడనవుతానని తనంత తానొచ్చినవాడు ( స్వయందత్త)
౬) తనగోత్రం వాడు 

పైన చెప్పబడిన ఆరుగురు బంధువులౌతారు కానీ ఆస్తిలో వాటాకు అనర్హులు

అనగా నాటికాలంలో అంతకు కొంచెం పూర్వం పైన చెప్పిన పన్నెండు రకాలుగా కొడుకులు  లేని వారు కొడుకులగా స్వీకరిస్తుండవచ్చు.

ఇక పాండురాజు కుంతీల విషయానికొస్తే వాళ్ళ అంతర్మధన సంభాషణలలో కొడుకులను ఎన్ని రకాలుగా పొందవచ్చో అది అధర్మమెలా కాదో విపులంగా చర్చించుకుంటారు. యే ముని శాపం వల్ల స్త్రీలకు రతీ నియమాలు కట్టుబాట్లు వచ్చాయో చెప్పుకుంటారు. ఇక్కడ ముని శాపం అనుకొనే కంటే సమాజం పరిణామస్థితి చెంది కొన్నిచోట్ల అలా మరికొన్ని చోట్ల యింకా స్త్రీ యే మగవానితోనైనా సంగమించవచ్చనే నియమాలున్నట్లు కనపడుతాయి. తుదకు పాండు రాజు కుంతీకి చేతులెత్తి  భర్తచేత నియోగింపబడిన వాని (పరపురుషుని సంగమం) ద్వారా పుత్రులను కనమని నమస్కరిస్తాడు.

23, డిసెంబర్ 2017, శనివారం

గిరిక, సత్యవతుల అందాల వర్ణన. పరాశరుని గోకుడు :)

సందర్భం: చేది దేశ రాజైన ఉపరిచరమహారాజుకు ( వసువు )  శుక్తిమతీ నది కోలాహలం అనే పర్వతం వల్ల కలిగిన కొడుకూ,కూతురినీ యిస్తుంది.కూతురు పేరు గిరిక, కొడుకు పేరు వసుపదుడు. గిరికను ఉపరిచరమహారాజు పెండ్లి చేసుకొని వసుపదుని తనసేనాపతిగా చేసుకుంటాడు.కొంతకాలానికి గిరిక సమర్త అవుతుంది. అప్పుడామెకు మృగ మాంసం తెచ్చిపెట్టమని తల్లిదండ్రులు చెప్పటం వల్ల వసురాజు అడవికి వెళ్తాడు. ఈ సందర్భంలో గిరికను మనసులో తలచుకొనే సన్నివేశంలో సాగిన శృంగార వర్ణన యిది.

బహుశా ఆకాలంలో ఇలా రాజులకు భార్యలయ్యే వారి విషయంలో రాజుల విషయంలో వారి జన్మలకు యేవో ఇలాంటి అద్భుతాలనాపాదించారనుకోవాలి. ఇక్కడ గిరిక విషయంలోనూ, మత్స్యగంధి/యోజనగంధి ( సత్యవతి )  విషయంలోనూ యిలాంటి కథలే కనిపిస్తాయి. 

యిక ఈ పద్యాన్నాశ్వాదించండి. మూలనున్న ముసలోడు కూడా లేచి కూర్చుంటాడు :)

సీ||పలుకులముద్దును, గలికిక్రాల్గన్నుల తెలివును, వలుఁదచన్నుల బెడంగు
నలఘకాంచీపదస్థలములయొప్పును, లలితాననేందుమండలము రుచియు
నళినీలకుటిలకుంతలములకాంతియు, నెలజవ్వనంబున విలసనమును
నలసభావంబునఁ బొలుపును, మెలుపును, గలుగు నగ్గిరికను దలఁచి తలచి

ఆ.వె||ముదితయందుఁ దనదు హృదయంబు నిలుపుటఁ
జేసి రాగ మడర భాసురముగ
రమణతో వనాంతరమున రేతస్స్కంద
మయ్యె నవనిపతికి నెయ్య మొనర

తాత్పర్యం: ఆ గిరికముద్దుపలుకులను, మనోజ్ఞంగా చలించే కన్నులను, స్థూలమైన చన్నుల సోయగాన్ని, పిఱ్ఱల ఒప్పును, మృదువైన ముఖ చంద్రబింబ కాంతిని,తుమ్మెదలవలె నల్లగా రింగులు తిరిగిన శిరోజాల వన్నెనూ, లేతయౌవనంలో ప్రకాశాన్ని, అలస విలాసాల అందచందాలను  తలచుకొని తలచుకొని గిరికాలగ్నమనస్కుడై ఆ వనము మధ్యలో రేతస్ఖలన మైంది.


ఇలాంటి దే మరో పద్యం. కాకపోతే ఇది పరాశరుడు మత్స్యగంధిని గోకడానికి తయారయ్యే సందర్భంలోది. వ్యాసుని జననానికి కారణమైన పద్యము.

సీ|| చపలాక్షిచూపులచాడ్పున కెడ మెచ్చుఁ, జిక్కనిచనుగవఁ జీఱఁ గోరు
నన్నువకౌఁదీగ యందంబు మది నిల్పు, జఘనచక్రంబుపైఁ జలుపు దృష్టి
యభిలాష మేర్పడ నట్లుండగాఁ బల్కు, వేడ్కతో మఱుమాట వినగఁ దివురు
నతిఘనలజ్జావనత యగు నక్కన్య పైఁ బడి లజ్జయుఁ బాపఁ గడుఁగు

ఆ.వె|| నెంతశాంతు లయ్యు, నెంత జితేంద్రియు
లయ్యు గడువివక్త మయినచోట
సతులగోష్ఠిఁ జిత్తచలన మొందుదురెండుఁ 
గాము శక్తి నోర్వఁగలరె జనులు

తాత్పర్యం: పరాశరుడు మత్స్యగంధినేత్ర సౌందర్యాన్ని చూచి మనసులో మెచ్చుకున్నాడు. ఆమె చన్నులను గోళ్ళతో రక్కాలనుకొన్నాడు.ఆమె సన్నటి నడుము సొగసును మనస్సులో నిలుపుకున్నాడు. ఆమె జఘనప్రదేశమందే దృష్టి నిలుపుకొన్నాడు.తనకోరిక వెల్లడి అయ్యేటట్లుగా మాట్లాడాడు.ఆమె ప్రత్యుత్తరాన్ని వినేందుకు ఉవ్విళ్ళూరాడు. అతి సిగ్గుతో నున్న ఆ కన్యమీదపడి ఆమె సిగ్గును పోగొట్టడానికి ప్రయత్నించాడు.
ఎంతశాంతులైనా.ఎంతజితేంద్రియులైనా, ఏకాంతస్థలంలో స్త్రీలకూటమి తటస్థిస్తే చిత్తచాంచల్యానికి లోనవుతారు.మన్మథుని బలాన్ని ఓర్వగల జనులున్నారా?

అదన్నమాట నన్నయ గంటంనుంచి జాలువారిన శృంగార వర్ణన. చివరి ఆటవెలది పద్యంలో మన్మథ తాపాన్ని తట్టుకోవడం అంత ఈజీ కాదని కూడా తేల్చేసాడు.