23, సెప్టెంబర్ 2010, గురువారం

అభినవ భువనవిజయము - శారద దరహాసము :-)

ఈ మధ్య ఓ రెండు వారాల క్రితం కవి మిత్రులనుంచి "అభినవ భువనవిజయము - అంతర్జాల కవిసమ్మేళనానికి" సాదర ఆహ్వానం అందింది. ఎప్పటిలానే, చాలా మైల్స్ లాగే దాన్ని ఓ మూల పెట్టేసాను. కానీ అందరి ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుతూ మౌనంగా వుంటే మరీ అసెయ్యంగా వుంటుందని ఒక్క లైను కనాకష్టంగా వ్రాసి అందరికీ మైల్ చేసి హమ్మయ్య అని గాఢంగా గట్టిగా గాలి పీల్చుకొని గుండెల బరువు తగ్గిందని మహదానంద పడుతున్న క్షణాలవి.......

కట్ చేస్తే ఓ నాలుగు రోజుల క్రితం ......

మైల్ ఓపెన్ చెయ్యగానే "శారద దరహాసం - ప్రశ్నాపత్రం" అని ఓ పేద్ద మైల్ వుంది. చదవగానే విషయం బోధపడింది. వారిచ్చిన సమస్యా పూరణలతో పాటి మిగిలిన సమస్యలను పద్య రూపంలో పూరించి పంపాలి. అంతవరకూ బానే వుంది. మొన్న శనివారం ఆవేశమొచ్చి question paper చేతిలోకి తీసుకున్నాను. ఏదో డిగ్రీ ఎక్జామ్ అయితే పక్కోడిది చూసి కాపీ కొట్టేసి పంపేవాడిని. కానీ నిర్వాహకులు ముందు జాగ్రత్త చర్యగా ముందుగా పద్య పూరణలను పంపేవారు కృష్ణదేవరాయల గారికే పంపాలని నిబంధన చేయడంతో అలా కాపీకొట్టే భాగ్యాన్ని అతి దారుణాతిదారుణంగా రాజుగారు హరించివేశారు :-)

question paper చూస్తేనేమో పద్యం వ్రాయడం సంగతి ప్రక్కన పెట్టండి, అసలు అది ఏపద్యపాదమో తెలియడం లేదు. ఇంక అన్ని ప్రశ్నలకు గణాలు, ఛందస్సు లెక్కలేసే పనిలో నా దగ్గర అంతర్జాలం నుంచి దిగుమతి చేసుకొన్న ఒక వ్యాకరణ పుస్తంకంలో గురు లఘువులకోసం CTRL F కొట్టండం మొదలెట్టి అతికష్టం మీద ఒక్క పద్యానికి గణాలను కనుక్కోగలిగాను. కానీ ఇలా చేస్తే పుణ్యకాలం కాస్తా అయిపోద్దేమోనని ఒకటే దిగులు పట్టుకుంది.

ఎంతకష్టపడ్డానో ఏమోగానీ చిరాకేసి Answer paper బదులు question paper ఇచ్చేస్తే పోద్దిలే అని కాస్త బయటకెళ్ళి స్వచ్చమైన గాలి పీల్చుకోని ;-) ఇంటికిరాగానే ఎదురుగా డబ్బా కనిపించింది. అదేలేండి నా ప్రియురాలు లేదా లవ్వర్ లేదా మొదటి పెళ్ళాము. సరే డబ్బా వుందికదా వుపయోగించుకొంటే పోలేదా అని ఈ పుణ్యకార్యం చేసాను. దాని ఫలితమే ఇది. హారంలో వ్యాకరణం పేజీలో వుంచాను.

ఈ చిన్న ఉపకరణి పద్యపాదాన్ని ఇస్తే అది ఏపద్యమో చెపుతుంది. ఇది వ్రాసిన తరువాత నేనైతే నాకు నోటికొచ్చిన వాక్యం వ్రాయడం ఓహో ఇది పద్యం కాదా అని మూతివిరవడం. ఇదే పని :-)

కానీ దీన్ని Develop చేస్తుంటే పద్యం వ్రాయడమేమో గానీ పలు ఆసక్తి కర విషయాలు అమితాశ్చర్యాన్ని కలిగించాయి. ముఖ్యంగా ఉపజాతి పద్యాలు. అందులోనూ కంద పద్యము. ఈ పద్యంలో రెండు / నాలుగు పాదాలనయితే 320 విభిన్న రకాలుగా కూర్చవచ్చని తెలిసి నోట మాట రాలేదన్న మాట !!!!!!!!!!!!!!!!! . ఇలాగే మొదటి/ మూడవ పాదాన్ని 80 రకాలుగా వివిధ గణాల ద్వారా కూర్చవచ్చు.

ఇలాగే తేటగీతి పద్యమయితే 288 విభిన్నరకాలుగా వ్రాయొచ్చొని తేలింది.

ఆటవెలది విషయానికి వస్తే ఒకటవ/ మూడవ పాదాలను 288 రకాలుగా రెండవ/ నాల్గవ పాదాలను 32 రకాలుగా వ్రాయవచ్చు.

ఇకపోతే ఈ ఉపకరణి చెయ్యడానికైతే రెండు రోజులు పట్టింది కానీ, దీని ప్రామాణికత ఎంతో చెప్పాలంటే మీ అందరి సహాయ సహకారాలు తప్పక అవసరం అవుతుందనే ఉద్దేశ్యంతో హారం వ్యాకరణ పేజీలో దీన్ని పరీక్ష కోసం వుంచాను. url is http://www.haaram.com/Vyakaranam.aspx

ఇందులో ఉన్న లిమిటేషన్స్

1) ఈ ఉపకరణి సమాస పదాలను గుర్తించలేదు. ఈ కారణంగా ద్విత్వాక్షర, సంయుక్తాక్షరములు కలిగివున్న సమాసాలు ఒకటే పదంగా వ్రాయాలి. అంటే మధ్యలో space ఇవ్వకూడదు.

ఉదా : "నఖక్షతము" ను నఖ క్షతము గా వ్రాస్తే ఈ ఉపకరణి క్షతము కు ముందున్న ఖ ను గురువు గా గుర్తించలేదు.

2)పాద విరుపుల సమాసాల ద్వారా ముందు పాదాల్లో అయ్యే గురువు ( U ) ను గుర్తించలేదు. ఉదాహరణ గా ఈ క్రింది మత్తేభ పద్యపాదాలను తీసుకుంటే

ఇది కర్ణాటధరాధృతిస్థిర భుజాహేవాకలబ్దేభరా
డుదయోర్వీధర తత్పితృవ్యకృత నవ్యోపాయనోష్ణీష ర
త్నదృగంచత్పద కృష్ణరాయవసుధాధ్యక్షోదితాముక్తమా
ల్యద నాశ్వాసము హృద్యపద్యముల నాద్యంబై మహింబొల్పగున్..

ఇందులో రెండవపాదంలో చివరనున్న "ర" తరువాత పాదంలో నున్న సంయుక్తాక్షరం "త్న" ద్వారా గురువుగా మారుతుంది. కారణం "రత్నదృగంచత్పద" ఒకటే సమాసం. ఇలాంటి ప్రయోగాలను ఈ ఉపకరణి గుర్తించలేదు.

3) యతి/ప్రాస లను గుర్తించలేదు.

సమయా భావం వల్ల application సరిగా Test చేయలేదు.

ప్రస్తుతానికి ఈ ఉపకరణి ఈ క్రింది పద్యపాదాలను గుర్తించగలదు. అక్కడక్కడా తప్పుడు సమాచారాన్ని ఇవ్వనూ వచ్చు ;-). అలా జరిగితే పై రెండు limitations ని ముందుగా సరిచూడండి. చాలా సందర్భాలలో పాద విరుపల వల్లనో లేదా సమాసాన్ని కలిపి కాకుండా విడిగా వ్రాయడం వల్లనో తప్పు చెప్పినట్టు అనిపించవచ్చు. అప్పటికీ సరిగా గుర్తించలేకపోతే మీ పద్యపాదాన్ని admin@haaram.com కి మైల్ చేయండి.

గుర్తించగలిగే వృత్త పద్యాలు
_________

భ ర న భ భ ర వ - ఉత్పలమాల
న జ భ జ జ జ ర - చంపకమాల
మ స జ స త త గ - శార్దూలము
స భ ర న మ య వ - మత్తేభము
ర స జ జ భ ర - మత్తకోకిల
న భ ర స జ జ గ - తరలము
మ ర భ న య య య - స్రగ్ధర
స త త న స ర ర గ - మహా స్రగ్ధర
య య య య - భుజంగ ప్రయాతము
జ ర జ ర జ గ - పంచ చామరము
త భ జ జ గగ - వసంత తిలకము
ర ర ర ర - స్రగ్విణి
స స స స - తోటకము
న న మ య య - మాలిని
భ భ భ భ భ భ భ భ - మానిని
భ జ స న భ జ స న భ య - లయగ్రాహి
ర న భ గ గ - స్వాగత వృత్తము
మ భ న త త గగ - మందాక్రాంతము

ఉపజాతులు
----------------------
తేటగీతి
ఆటవెలది
కందము



ఇక ఆలస్యమెందుకు, హారం మీద ఈ పేజీలో దాడి మొదలెట్టండి. ఈ ఉపకరణి హారంలో వ్యాకరణం విభాగంలో వుంది. లేదా నేరుగా వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి. తప్పొప్పులను దయచేసి admin@haaram.com కి పంపండి.

38 కామెంట్‌లు:

  1. "విశ్వదాభిరామవినురవేమ" పనిచేసింది. అలాగే రెండు మూడు తేటగీతులు గూడా. కొంచెము మార్పు చేసి పద్యపాదము ఇస్తే, "సరిగా చూసుకోబే" అని కూడా తిట్టింది :-).

    మీ ప్రయత్నము సూపర్.

    రిప్లయితొలగించండి
  2. తెలుగుయాంకీ గారు application Test చేసి మరీ వ్యాఖ్య వ్రాసినందుకు ధన్యవాదాలు.
    "సరిగా చూసుకోబే" అని కూడా తిట్టింది :-) ;)
    ఇక అసలు విషయానికి వస్తే, ఆహ్వానం పంపడం ద్వారా రానారె, ప్రశ్నాపత్రం కష్టంగా పంపడం ద్వారా మన రాయల వారు [ భైరవభట్ల కామేశ్వరరావు ] ఈ అలోచన కలింగించారు.వారికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగుందండి. నేను
    ఉప్పుకప్పురంబు నొక్కపోలికనుండు
    సాలప్రాంశు నిజోజ్వలత్కవచు శశ్వత్కుండలోభాసితున్

    ఇవిరెండూ సరిచూసాను. మీ ప్రయత్నం అభినందనీయం

    రిప్లయితొలగించండి
  4. భా.రా.రె. మీ కృషికి అభినందనలు. దీనిద్వారా నేనూ పద్యాలు రాస్తానేమో ;-)

    రిప్లయితొలగించండి
  5. భ.రా.రె. మీరు అదగగొట్టేస్తున్నారు..

    యన్.యల్.పి.లో క్రొత్త ఒరవడా? మీ ఆలోచనలకే మతిపోతున్నది..
    ఐతే హారంలో క్రొత్త పేజీ మీద దాడి మొదలెడతా.. తెలుగు నేర్చుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతాయి ఇవి.(కొద్ది చేర్పులు సూచించొచ్చా?)

    రిప్లయితొలగించండి
  6. భాస్కరరామిరెడ్డిగారు - సూపర్.
    For your efforts alone, you deserve Sahitya Academy Award.
    W/Regards-Saikiran

    రిప్లయితొలగించండి
  7. భాస్కర్ గారూ, i second sai kiran and this is not a small work.

    నేను పెట్టిన కంద పద్య శల్య పరీక్షలో మీ ఉపకరణి నెగ్గటమే కాదు, తప్పు చేసిన నన్ను కూడా పని చూసుకో బే అని తిట్టినది కూడా!!

    రిప్లయితొలగించండి
  8. అద్భుతమైన ఉపకరిణి.
    ఉత్పలమాల,చంపకమాల,శార్దూలం,మత్తేభం, కంద, తేటగీతి పద్యాలను సరి చూసాను.
    అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. భ.రా.రే
    మీరు సూపరండీ. చాలా అద్భుతంగా ఉంది. అదరగొట్టేసారంతే. ముఖ్యంగా పద్యపాదంల కాన్సెప్టు. ఇప్పటినుండీ చక్కగా ఇంకా బాగా తెలుగు చందస్సు నేర్చుకోవచ్చు. మీకు వెయ్యి వేల కూడోస్, జోహార్లు.


    అందులో ప్రయత్నిస్తూ ఉంటే గొప్ప విస్మయం కలుగుతోంది. ఏదో నేపాళ మాంత్రికుడు మంత్రం వేసినట్టు, అల్లాఉద్దిన్ అద్భుతదీపం మాయాజాలం చేసినట్టు అలా అలా వచ్చేస్తున్నాయి జవాబులు...భలే ఉందండీ.

    రిప్లయితొలగించండి
  10. భాస్కర రామి రెడ్డి గారు, మీరు పెద్ద 'ఘనాపాఠి'. ఉద్ధండ పండితుడవ్వాల్సిన మీరు ఎలా ఇంజనీర్ అయ్యారబ్బా? స్కూల్ లెవెల్ తెలుగు విజ్ఞానం దీనికి సరిపోదు. చాలా స్వయంకృషి చేసిఉండాలి. మీకు నా హృదయపూర్వక అభినందనలు. You can achieve it. All the best.

    రిప్లయితొలగించండి
  11. అద్భుతమైన ఆలోచన. అభినందనలు.

    మేరిలాండ్ లో నివాసముండే డా. జె. మోహనరావుగారు కంప్యూటార్లో ఇటువంటు సరణులు (patterns) ని గురితించడం గురించి చాలా పరిశోధనలు చేశారు. ఈ మాట పత్రికలో వారి వ్యాసాలు ఉండాలి ఈ విషయమ్మీద.

    రిప్లయితొలగించండి
  12. నేను కూడా ప్రయత్నించాను. బావుంది తప్పులేమీ చూపలేదు.కాని ఈ పద్యం నాకు తెలీదు పో అంది.
    ఆ నిష్ఠానిధి గేహసీమ నడురే యాలించిన న్ర్మోయు నెం

    రిప్లయితొలగించండి
  13. ఉదయ రాఘవ్ గారు వ్యాఖ్యకు ధన్యవాదలండి.

    విమలా ;)ఇక ఆలస్యమెందుకు కానివ్వండి

    రిప్లయితొలగించండి
  14. తారా N.L.P లో ప్రయోగమే అనుకోండి ;)ఇక పోతే మీరు సలహాలిస్తానంటే తప్పకుండా ఆనందంగా స్వీకరిస్తాను.కానివ్వండి మరి దాడి మొదలు పెట్టండి :-)

    రిప్లయితొలగించండి
  15. సాయి కిరణ్ గారూ, Sahitya Academy Award కంటే మీవ్యాఖ్య నిజంగా కొండంత బలాన్ని ఇచ్చింది. ఆప్యాయపూరిత వ్యాఖ్య కు ధన్యవాదలు.

    రిప్లయితొలగించండి
  16. ప్రవీణ్ గారూ ఇది ఇంకా శల్యపరిక్షలకు తట్టుకోలేదేమో. జ్యోతి అప్పుడే ఒక బగ్ కనిపెట్టేసారు. అయినా కంద పద్య పాదాలను పరీక్షించినందుకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  17. రమణ, మీసమయాన్ని వెచ్చించి పద్యపాదాలను పరీక్షించినందుకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  18. ఆ సౌమ్య చెప్పండి వింటున్నాను ;) JK.

    నేపాళ మాంత్రికుడు మంత్రం వేసినట్టు, అల్లాఉద్దిన్ అద్భుతదీపం మాయాజాలం :-). ఎవరికైనా ఉపయోగపడితే అంతకంటే కావాల్సింది ఏముంది? వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. జయగారూ నేను ఘనా పాటి పండితుడనైతే అసలు ఇలాంటి పనులు చెయ్యకుండా అలా అలా పద్యాలల్లి భువన విజయ సభలో ఆశువుగా సమర్పించుకొని వుండేవాడిని. :-). లేదండీ ఇంటర్మీడియెట్ వరకు చదివిన తెలుగే నా తెలుగు. ఆ తరువాత తెలుగు పుస్తకాల పఠనాసక్తి కూడా తగ్గింది :(

    రిప్లయితొలగించండి
  20. అయ్యా మీదాన్ని పరీక్షించాలన్నా నాకున్న బాషా జ్ఞానం సరిపోదు, ఇంక సలహా ఎక్కడ ఇచ్చేది చేప్పండి, అందులోనూ యన్.యల్.పి.లో నాకు ఏమీ రాదు.. జస్ట్ ఒక సబ్జెక్ట్ మాత్రమే, నేను చెప్పగలిగిన చేర్పులు జి.యు.ఐ.మీద మాత్రమే..
    త్వరలో ఉత్తరం పంపుతాను.

    రిప్లయితొలగించండి
  21. నాగార్జునా మనం మనం కూడోస్ అనుకోకూడదు :-)

    కొత్తపాళీ గారూ ఆ వ్యాసాల లింకులేమైనా తెలిస్తే ఇవ్వగలరా? ఇక pattern matching ఏమీ problem అవ్వలేదండి, గణ విభజనే ఇబ్బంది పెట్టింది. చూసారా జ్యోతి చేసిన నిర్వాకం :-) అప్పుడే తప్పు పట్టేసింది. ఇంకా కొన్ని గణాలు సరిగా గుర్తిస్తున్నట్టు లేదు

    రిప్లయితొలగించండి
  22. బలద్విడ్వినిర్దిష్ట పాథోధరోరూ

    ఈ పద్యపాదం గురించి అడిగితే భుజంగ ప్రయాతము అంటుంది. దీనిగురించి పెద్దలైవరైనా వివరించగలరా??

    రిప్లయితొలగించండి
  23. జ్యోతీ అసలు మిమ్మల్ని ఎవరు టెస్టు చేయమన్నారు? చేసితిరిపో.. ఈ పద్యాన్నే ఏల టెస్టు చేయవలె? చేసితిరిపో.. ఆ గణవిభజన ఏల తప్పుగా రావలె.... హతవిధీ ..JK

    మీరు App testing ద్వారా పట్టిన బగ్ అసలు నేను ఊహించను కూడా ఊహించలేదు. ఈ పద్యం తప్పుగా రావడానికి గల కారణం దీర్ఘ అచ్చు అయిన "ఆ" గణము లఘువు గా రావడమే. త్వరలో అంటే రేపే సరిచేస్తాను. మరిన్ని పద్యాల టెస్ట్ చేయాలని నా అభిలాష.

    రిప్లయితొలగించండి
  24. టెస్ట్ చేయమంటే చేస్తాను. నాకేంటి? ఆహా! నాకేంటి అంట??

    రిప్లయితొలగించండి
  25. తారా NLP అనేకాదు You are always welcome to give any constructive suggestions.

    జ్యోతీ, మనకు భుజంగ ప్రయాతము గురించి చెప్పేటం సీను లేదు. ఏదో వ్యాకరణ పుస్తకంలో కనిపిస్తే దాన్నీ ఇక్కడ చేర్చాను. ఇక టెస్టు చేస్తే నీకేంటా? చెప్పాలా................................... పులిహోర కలిపిస్తాను :-)

    రిప్లయితొలగించండి
  26. ఈ పొద్దున్నే, మీ పోస్టు చూడకముందే చూసాను! ఇదెప్పుడు పెట్టారబ్బా అనుకున్నాను. నేను జ్యోతిగారంత మంచి టెస్టర్ ని కాదు కాబట్టి నాకు తప్పులేం కనిపించ లేదు :-) మీ లాజిక్లో ఆటవెలది కన్నా తేటగీతిని ముందు చెక్ చేస్తున్నారని మాత్రం తెలిసింది :-)

    "బలద్విడ్వినిర్దిష్ట..." భుజంగప్రయాతమే. మనకి బాగా తెలిసిన శివుడి శ్లోకాలు భుజంగప్రయాతంలోనే ఉన్నాయి, ఏంటో చెప్పుకోండి చూద్దాం!

    ప్రశ్నపత్రం కష్టమని తప్పించుకుంటే ఒప్పుకొనేది లేదు. కనీసం ఒక్క పద్యమైనా రాయాల్సిందే!

    రిప్లయితొలగించండి
  27. ఆగండాగండి రాయలవారూ [ కామేశ్వర రావు గారు ] :-)

    >> మీ లాజిక్లో ఆటవెలది కన్నా తేటగీతిని ముందు చెక్ చేస్తున్నారని మాత్రం తెలిసింది :-)

    ఇక్కడ నాకు ఏదో hint ఇస్తున్నారు. ఈ రెండు పద్యాలకు common pattern ఏవైనా వున్నాయేమో! అవి చూడలేదు. ఇలా common pattern వున్నవి కూడా check చేసి అప్పుడు అన్ని పద్యాల పేర్లు చెప్పమనట్టు అర్థమయింది నాకు :). మంచి hint ఇచ్చారు.

    ఇక మీరు question paper కష్టంగా ఇచ్చినన్ను పరీక్ష లో ఫైల్ చేయాలని చూసినందుకన్నా సరే, తప్పకుండా ఒకటో/రెండో వ్రాసి పంపుతాను.

    భుజంగత్రయగము

    నమో భూతనాథా నమో దేవదేవా
    నమో భక్తపాలా నమో దివ్యతేజా
    భవా వేదసారా సదా నీర్వికారా
    జగాలెల్ల బ్రోవా ప్రభూ నీవె గావా
    నమో పార్వతీవల్లభా నీలకంఠా


    వ్యాఖ్యకు ధన్యవాదాలు కామేశ్వర రావు గారూ.

    రిప్లయితొలగించండి
  28. పైన భుజంగ త్ర యగము బదులు భుజంగప్రయాతము అని చదువుకోగలరు.

    రిప్లయితొలగించండి
  29. జ్యోతి గారూ, మీరు కనిపెట్టిన తప్పు ను సరిచేసాను. ఇప్పుడు చూడండి " ఆ నిష్ఠానిధి గేహసీమ నడురే యాలించినన్ర్మోయు నెం " ఈ పద్యము శార్దూలము గా వస్తుంది. మీరు ఇలాగే తప్పులు చెప్తే సంతోషిస్తాను.

    కామేశ్వర రావు గారూ తేటగీతి, ఆటవెలది లకు common patterns కూడా కలిపాను. ఇలాంటివి మిగిలిన పద్యాలలో ఏమైనా ఉంటే చెప్తారా? ఆ పద్యాలను కలిపినప్పుడు వాటి common patterns కూడా add చేస్తాను.

    రిప్లయితొలగించండి
  30. నీలమేఘముడాలు డీలు సేయఁగఁ జాలు
    ఖ నట త్పయోబ్ధి వీక్ష్య రసాతలాన్యోన్య పిండీకృతాంగ భీతాండజములు
    పాద పంకజములకు పారాణి యద్దేటి సరిగంచు నిగనిగల చక్కదనము

    సీసపద్యం తెలీదంటుందేంటి??

    ఎన్నిను గూర్తునన్న విను మే మును దాల్చిన మాల్య మిచ్చున
    ఈ పద్యం కూడా నాకు తెలీదు అంటుంది ఈ ఉపకరణి. ఏం చేద్దామంటావ్ భాస్కర్ ???

    రిప్లయితొలగించండి
  31. జ్యోతీ ;-)

    మీ ప్రొయాక్టివ్ టెస్టింగ్ కి నిజంగా అభినందనలు. కానీ ఎంత పొద్దు పొద్దున్నయితే మాత్రం ఇలా లేనివాటిమీద దాడిచేస్తారా అయ్య్ ...

    సీస పద్యము ఇంకా చేర్చలేదు... ఇక పోతే ---> ఎన్నిను గూర్తునన్న విను మే మును దాల్చిన మాల్య మిచ్చున పద్యంలో చివరి అక్షరం "న" గురువు కావాలి. అంటే ఈ పాదం కొనసాగింపుగా రెండవపాదంలో సంయుక్తాక్షరం వుంటుందేమో చూడండి. ఇది కూడా టూల్ లిమిటేషన్ లో వుంది చూడు జ్యోతక్కా :) టపా సరిగ్గా చదవరూ, అర్థం చేసుకోరూ :P JK jyothy.

    రిప్లయితొలగించండి
  32. టపాకి సంబంధంలేని వ్యాఖ్య రాస్తున్నందుకు క్షమించండి. నా బ్లాగు విషయమై కొద్దిరోజుల క్రితం ramireddy@haaram.com ఐ.డికి రెండు మెయిల్స్ పంపాను. చూడగలరు.

    రిప్లయితొలగించండి
  33. శిశిర గారూ మీ మైల్ నాకు అందలేదండి. మరో సారి విషయాన్ని తెలియచేస్తారా?

    ramireddy.mvb@gmail.com

    రిప్లయితొలగించండి
  34. స్పందించినందుకు ధన్యవాదాలండి. నా మెయిల్ ను మీరిచ్చిన ఐ.డి కి పంపించాను. చూడగలరు.

    రిప్లయితొలగించండి
  35. క్రింది లింకు ఏమైనా ఉపయోగపడుతుందేమో చూడండి.

    http://sanskrit.sai.uni-heidelberg.de/Chanda/HTML/

    Regards,
    SeshatalpaSayee Vadapalli.

    రిప్లయితొలగించండి
  36. శేషతల్పసాయి గారూ, లింకు చూసాను కానీ అది ఏమి చేస్తుందో సరిగా గ్రహించలేకున్నాను. పద్యం మొత్తమిస్తే అది ఏపద్యమో చెపుతుందా లేక ఆంగ్ల లిపి లో వ్రాసిన దాన్ని సంస్కృత లిపిలో చూపుతుందా?

    ఏదైనా ప్రయత్నం హర్షనీయం.

    రిప్లయితొలగించండి
  37. అలాగే అక్కడ Complete list of meters అని వున్నాయి. అవి సంస్కృత పద్యాల్లో రకాలా? తెలిస్తే వివరించగలరా?

    రిప్లయితొలగించండి

Comment Form