8, ఆగస్టు 2011, సోమవారం

కార్పొరేట్ వరల్డ్ లో గూగుల్ పై అంతర్యుద్ధం మొదలైందా?


ఈ మధ్య జరుగుతున్న ఒక్కొక్క పరిణామాన్ని చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. గూగుల్ ఇప్పటికీ ప్రజాభిమానం చూరగొన్న కంపెనీ అనడంలో ఎటువంటి సందేహమూ లేదు కానీ, ఇంతకు ముందు తన ఆప్త మిత్రులుగా వున్న వారందరి మనోభావాలు గాయపడినట్టే వున్నాయి.గూగుల్ పై మొన్న మొన్నటిదాకా అంతర్లీనంగా వున్న అసంతృప్తి మైక్రోసాఫ్ట్, గూగుల మధ్య జరిగిన వాగ్యుద్ధం మూలంగా ఒక్క సారిగా మిగిలిన కంపెనీలు బయటపడి నోరు విప్పుతున్నాయి. కంపెనీలకు గూగుల్ పై అసంతృప్తి ఒక వారంలోనో, ఒక నెలలోనో ఏర్పడింది కాదు. కొద్ది సంవత్సరాలుగా గూగుల్ అంతర్జాలనికి సంబంధించిన ప్రతిపనిలో కలుగచేసుకోవటంతో మొదలైంది.


వివరాలలోకి వెళితే పోయిన వారం నార్టెల్ పేటెంట్స్ ( 6000 కు పైగా మొబైల్ ఫోన్స్ కు సంబంధించిన పరిశోధనలు) గొడవ దీనికి మూలం. గూగుల్ వారి ఉత్పత్తి ఏండ్రాయిడ్ పోన్లకోసం ఈ పేటెంట్స్ అవసరమయ్యాయి. ఈ సందర్భంలో ఆగష్టు మూడవతేదీ గూగుల్ వారి బ్లాగులో ఓ టపా ప్రత్యక్షమైంది. స్థూలంగా దాని సారాంశం ఇది.

" మైక్రోసాఫ్ట్, ఏపిల్, ఒరకిల్ వారు బోగస్ పేటంట్ల ద్వారా ఏన్డ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను వృద్ధిలోకి రాకుండా చంపేసే ప్రయత్నం చేస్తున్నారనీ, అలాగే కొన్ని పేటెంట్స్ మైక్రోసాఫ్ట్ నోవెల్ వారివద్దనుంచి సంక్రమించాయనీ " ఒక టపా వ్రాసారు. దానికి మైక్రోసాప్ట్ వారు " మేము ఈ పేటెంట్ హక్కులు సంపాదించే ముందు గూగుల్ వారిని కూడా అడిగామని, కానీ వారు ఉమ్మడి హక్కులకు ఒప్పుకోలేదని ఉత్తర ప్రత్యుత్తరాల ఇ-మైల్స్ ను బయటపెట్టారు. ఆ తరువాత ఈ వారంలో చాలా కథనడిచిందనుకోండి. నోవెల్ పేటెంట్స్ తో మొదలైన వివాదం, నోర్టెల్ పేటెంట్స్, ఇంటర్డిజిటల్ పేటెంట్స్ వరకూ సాగింది. సాగుతూ వుంది. ఈ వివాదం ఇప్పట్లో సమసి పోయేటట్టు కూడా కనిపించలేదు.
ఇక అసలు విషయానికొస్తే, అసలు గూగుల్ మిగిలిన కంపెనీల విషయంలో ఎందుకు విలన్ (ప్రతినాయకుని పాత్ర) ఐంది? గూగుల్ మరీ అంత చెడ్డ కంపెనీనా ? నేనైతే అలా అనుకోవడం లేదు. మరి? కారణం, వారు ప్రతిదీ తామే చేయలనుకొనడం వల్ల లేదా ఏదైనా తాము చేయగమనే గర్వం వల్ల చాలా కంపెనీలకు దూరమయ్యారు. వారి ఈ మనస్తత్వం చాలా కంపెనీలకు మింగుడు పడటం లేదు.

కేవలం పైన చెప్పిన కారణం వల్లనే ఒకప్పటి బద్ధ శత్రువులైన, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ అలాగే మైక్రోసాఫ్ట్ ఏపిల్ ఒక్కటై గూగుల్ కు చుక్కలు చూపించడానికి సిద్ధమైనట్లు కనిపిస్తుంది. నోవెల్ పేటెంట్స్ మైక్రోసాఫ్ట్ పరమయ్యాయి ( ఉమ్మడి కంపెనీల భాగస్వామ్యం.. గూగుల్ ఇందులో లేదు ). ఇక గూగుల్ వారి మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఏండ్రాయిడ్ ను దక్కించుకొనడానికి వారికి నోర్టెల్ పేటెంట్స్ అవసరమయ్యాయి. కానీ వాటిపై అధికారాన్ని కూడా గూగుల్ బిడ్డింగ్ లో దక్కించుకొనలేకపోయింది.అవి ఏపిల్ వారి పరమయ్యాయు. ఇక మిగిలిన ఒకేఒక మార్గం ఇంటర్ డిజిటల్ పేటెంట్స్. ఇవి ఎవరి పరమైతాయో ఈ మధ్యలో కథ ఎంత రసపట్టుగా సాగుతుందో చూసి ఆనందించాల్సిందే. ఏపిల్ తప్పకుండా ఈ ఇంటర్ డిజిటల్ పేటెంట్స్ సంపాదించడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నంలో మైక్రోసాఫ్ట్ వారి ఆశీర్వాదాలు పుష్కలంగా వున్నా ఆశ్చర్యపోనవసరంలేదు.


కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గూగుల్, మరియు యాపిల్ రెండు కంపెనీలూ ఎంత సన్నిహితంగా వుండేవో మార్కెట్ పై ఏకొద్ది అవగాహన కలిగిన వారికైనా తెలిసిన విషయం. అప్పట్లో ఈ రెండు కంపెనీల ఉమ్మడి గమ్యం ఒక్కటే !!! మైక్రోసాఫ్ట్ ఆధిపత్యానికి తెరదించాలని !!!!! ఎంతటి సాన్నిహిత్యమంటే అప్పటి గూగుల్ సి.ఈ.ఓ ఎరిక్ స్క్మిడ్ యాపిల్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ గా కూడా బాధ్యతలను నిర్వర్తించాడు. అలాగే మొదటి దశ ఐ-ఫోన్ లో గూగుల్ పటాలు, యు-ట్యూబ్ వీడియోల అప్లికేషన్ లను అభివృద్ధి పరచడంలో గూగుల్ సహాయ పడింది. అప్పటి చిత్రం ఒక్కసారి మననం చేసుకుంటే ఈ రెండు కంపెనీలు మిగిలిన అన్ని మొబైల్ కంపెనీలను మూతపడేట్టు చేస్తాయేమో అన్నంత భయం కూడా చాలా మందిలో కలిగిందనడానికి సందేహపడ నవసరం లేదు.

కానీ, ఎప్పుడైతే యాండ్రాయిడ్ ఫోను మార్కెట్ లో ప్రవేసించిందో ఆనాటినుంచి సమీకరణాలు మారడం మొదలైనాయి. యాండ్రాయిడ్ మరియి ఐఫోన్ ల మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. అప్పటిదాకా మొబైల్ పరిశ్రమ ఆపరేటింగ్ సిస్టమ్ లో మైక్రోసాఫ్ట్ , యాపిల్ పెద్ద ఆటగాళ్ళగా వుండేవారు.కానీ ఈయుద్ధలోకి గూగుల్ ప్రవేసిండం ఈ రెండు కంపెనీలకు నచ్చలేదు. కానీ ఇక్కడో ధర్మసూక్షం కూడా వుంది. ఈ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ రీసెర్చ్ మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కంపెనీల పేటెంట్లను సునాయాశంగా వారొక్కరే వాటిపై సర్వ హక్కులను సంపాదించాలనుకోవడం గూగుల్ వారు చేయవలసి ఉండవలసింది కాదేమో. ఉమ్మడి విఙ్జానానికి ఒప్పుకొను ఉండవలసింది.

గూగుల్ ఎంత పెద్దదో బహుశా అంతకంటే పెద్దకంపెనీ ఒరకిల్. చిత్రంగా వీటి రెంటిమధ్యా ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. గూగుల్ పై యాపిల్, మైక్రోసాఫ్ట్ లు వేసిన లా సూట్స్ బహుశా యాండ్రాయిడ్ ను ఖరీదైన ప్లాట్ ఫాంగా మార్చడం చేస్తుందేమో కానీ ఒరాకిల్ వేసిన లా సూట్ మాత్రం దాన్ని యాండ్రాయిడ్ ఫోను ను పూర్తిగా చంపేస్తుంది. కారణం ఒరకిల్ వారి జావా ( ఒకప్పటి సన్ మైక్రోసిస్టమ్స్ వారి ఉత్పత్తి) ను ఈ యాండ్రాయిడ్ ఫోన్ లో లైసెన్సు లేకుండా వాడారని వీరి అభియోగం.

2005 లో యాండ్రాయిడ్ ఛీప్ గా వున్న యాండీ రూబిన్ సన్ మైక్రో సిస్టమ్స్ వారికి పంపిన మైల్ ఒకటి బయటపడింది. ఇది వారి గర్వానికి పరాకాష్ట అని సిలికాన్ వేలీ వర్గాల ఉవాచ. దాని సారాశం

సన్ మాతో కలసి పని చేయకపోయినట్లైతే , మాకు రెండు మార్గాలున్నాయి ౧) ఇప్పటిదాకా చేసిన పనిని ( యాండ్రాయిడ్ ) వదిలేసి MSFT CLR VM మరియు C# లాంగ్వేజ్ ను వాడడం ౨) జావా నే వాడి మా పద్ధతిని సమర్ధించుకొనడం, బహుశా వైరి వర్గమౌతుందేమో.

గూగుల్ రెండవ మార్గాన్నే ఎంచుకుంది, కానీ ఇప్పుడు సన్ మైక్రోసిస్టమ్స్ లేదు.ఒరకిల్ లో విలీనమయ్యాక జావా కాపీరైట్స్ ను ఒరకిల్ నియంత్రిస్తుంది. గూగుల్ వారు ఊహించిన విధంగానే ఒక పెద్ద శత్రువునే తయారు చేసుకున్నారు.

ఇక ఫేస్ బుక్ వర్సెస్ గూగుల్, అమెజాన్ వర్సెస్ గూగుల్ యుద్ధాలు రేపు చూద్దాం.

2 కామెంట్‌లు:

Comment Form