1, అక్టోబర్ 2015, గురువారం

రాయలకాలం నాటి ప్రజల రసికతా జీవనము

మొన్న digital library of india (http://www.dli.ernet.in/)  లో అలా పుస్తకాల కోసం సంచరిస్తుంటే రాయలనాటి రసికతా జీవనము కనిపించింది. ఈ పుస్తకం చూడటంతోనే ఆనాటి ప్రజల సాంఘిక జీవనము గురించి ఏమైనా వ్రాశారేమోనని చదవడం మొదలు పెట్టాను.ఈ పుస్తకాన్ని సరస్వతీ పుత్ర శ్రీ  పుట్టపర్తి గారు రచించారు.మొదటి ముద్రణ 1955 లో రెండవముద్రణ 1957 లో వెలువడింది. రాయలనాటి కాలంలో రచించిన ఆముక్తమాల్యద,కాళహస్తీశ్వర మహాత్యము,మనుచరిత్ర,పాండురంగ మహాత్యము,కళాపూర్ణోదయము మొదలైన పుస్తకాలలోని పద్యాలను ఆధారంగా చేసుకొని ఆనాటి ప్రజల రసికతా జీవనాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. 

ఇక పుస్తకం చదవడం నాకు కొంచెం కష్టమైంది. ఎన్నెన్నో తెలియని పదాలు ప్రతి పుటలో కనిపించాయి.వాటికి అర్థాలను తెలుగునిఘంటువులో( http://telugunighantuvu.org) శోధించుకుంటూ పుస్తకాన్ని చదవడం పూర్తిచేశాను. ఈ పుస్తకం చదివిన తరువాత ఆముక్తమాల్యద ను కూడా చదవాలని కోరిక కలగడంతో ప్రతిపదార్థ సహిత ఆముక్తమాల్యద పుస్తకాన్ని digital library of india లో వెతికి నా కంప్యూటర్ లో కి దించుకొన్నాను కూడా.

ఇక పుస్తకపాఠం లోనికి వెళ్తే ఆనెగొంది కాపేరెలా వచ్చిందో దానిచుట్టూ వున్న కోటల వర్ణనలతో  మొదలౌతుంది. ఊరికి తూర్పున "దరోజి" ఉత్తరమున "తోరణగల్లు" వాకిళ్ళు. రాజులు జైత్రయాత్రకుపోయి జయశ్రీ మదదిగ్ధులై తిరిగి వచ్చేటప్పుడు తోరణగల్లు దగ్గర విజయతోరణములు కట్టుట వాడుక. విజయనగరంలో కావలివారికి తెలియకుండా ఈగైనా లోనికి రాదు. ఆనాటి శిక్షలు కూడా కఠినమే. గుఱ్ఱములు కోట లోనికి రాకుండా విద్యానగరపు ఏడవకోటకవతల "పంగలరాళ్ళ" ను పాతివుంచారు.అవి సర్పములవలె మెలికలు మెలికలు వుండి మనిషిమాత్రమే లోనికి రావడానికి అవకాశముండేది.  రాచనగరికి దగ్గరిది ఏడవకోట, దూరముది ఒకటవకోటని అర్థం చేసుకోవాలి. అంటే రాచనగరిలోనికి గుఱ్ఱములకు ప్రవేశం లేదు.

పట్టణంలోనికి ప్రవేశించగానే చెఱుకు తోటలు, ఆకు తోటలు,ద్రాక్షతోటలు,గొజ్జంగి వనములు, నారికేళ చెట్లు మొదలైనవి వుండేవని ఊహ. ఈ ఉద్యానవనములు దాటిన పిమ్మట తుంగభద్రానది నీటితో సశ్యశ్యామలమైన వరిచేలు.ఈ ప్రకృతిలక్ష్మి ఒకటవకోటనుండి మూడవ ప్రాకారము వరకు వుండెడిదట.మూడవకోటనుండి ముచ్చటైన ఇండ్లు.ఆ గృహములు విశాలములై ఉన్నతమైనవి.సున్నపు కాంతులతో మెరుస్తూ ఇండ్లపైన కలశములు నిలిపేవారు. వీటిమధ్యకూడా అక్కడక్కడ గుడిసెలు,మట్టిమిద్దెలుండెడివి.

ఏడవకోటలో రాచనగరలు,వారి ఉద్యోగుల గృహములు. రాచనగరమునుండి ముదటికోటకు గలదూరము ఎనిమిది మైళ్ళు.విద్యానగరమునందలి పేటలు విశాలమై నలభై అడుగుల వెడల్పుండెడివట.దారికిరువైపుల చల్లని నీడనిచ్చు చెట్లు తుంగభద్ర నీరు.ప్రతిపేట మొదట్లో చివర్లో హిందూ ముస్లిం సంప్రదాయాల ననుసరించిన కమానులుండేవి.

రాయల బలగాన్ని గూర్చి చెప్తూ పన్నెండువేల దాసీలుండేవారని పేర్కొంటారు. అంతఃపురములో రాణులకు కావలసిన సొమ్ములు చేయించే కంసాలులు రెండువేలు.రాజుకు వంట చేయటానికి రెండువందలమంది. ఆనాడు విద్యానగరం లో ప్రజలు ముప్పై లక్షలకు మించి వుండేవారని ఊహ.ఎప్పుడూ ఇరవైవేల పల్లకీలు,వాటిని కాచుకొని రెండులక్షల బోయీలూ వుండేవారు.ఇక విద్యానగరానికి వర్తకమునకై ప్రతిరోజూ వచ్చి వెళ్ళే బండ్లు రెండువేలు.ఇవి చెల్లించెడి సుంకమే లెక్కలేనంత. వచ్చిన ధనమును కొండగుహల్లో భూగృహములు కట్టి దాచేవారని ప్రతీతి. విజయనగరములో శైవ,వైష్ణవ గుడులు నాలుగువేలు.ఉభయ సంధ్యలందచట దేవదాసీల నృత్యం. విద్యానగరములో ఇల్లు ఎలా వుండేవో కూడా వసుచరిత్ర పద్యాన్ని ఆధారంగా చేసుకొని వర్ణిస్తారు.సాయంకాలమందు వీధులలో పుష్పలావికల చతుర సంభాషణాన్ని ఆముక్త మాల్యద పద్యాధారంగా వర్ణిస్తారు.

తుంగభద్రానది వారికొక దైవదత్తము.ఈ నది గూర్చి వర్ణనలూ ఆముక్త మాల్యద నుండి ఉటంకించారు.అక్కడి జనులు పండుగ పబ్బాలందు ఆ నదిలో స్నానము చేస్తే వారి కఠిన స్థనములకు పూసిన కస్తూరి,జవ్వాది పూతల ఘుమఘుమలు ఆ నీళ్ళలో కలిసి ప్రవహించెడివట.
ఆనాడు ఇంటి ఆవరణలలోనే తోటలు దిగుడుబావులుండెడివట.అప్పటి స్త్రీలు స్నానం కోసం దిగుడుబావుల మెట్లక్రింద పసుపు ముద్దలను దాచెడి వారట.రాత్రులు అక్కడ నిద్రించిన హంసల రెక్కలకు ఆ పసుపు అంటుకొని అవి ఆకాశంలో ఎగురుతుంటే ఆ రెక్కలు బంగారు వర్ణ రెక్కలుగా కనిపించేవట. అంటే ఆ రోజుల్లో పసుపు స్నానాదులందు అంత విరివిగా ఉపయోగించెడు వారేమో. తలంటు స్నానాలగురించి చెప్తూ వున్నవారు తలకు గంధామలకంబు పెట్టుకొంటే లేనివారు చమురంటుకొని తలస్నానము చేయుదురట. ఊరిలో దేవరను చూసుటకు వెళ్ళు వారు జలకమాడి కాటుక, సిందూరము,పూలు పెట్టుకొని వెళ్ళేవారట. ఇప్పుడు పసుపు రుద్దుకోవడం,కాటుక దిద్దడం చాలావరకు పోయినట్లే. ఇక బొట్టు,ఫూలు ఎంతకాలముంటాయో.

ఆనాడు జీవించినది సుఖస్వప్నమువంటి ఒక రసికజాతి.జీవితమును వారు ప్రేమించునట్లు ప్రేమించుటకు మనకు సాధ్యముగాని పని.ప్రవృత్తి నివృత్తులందు సంపూర్ణ స్వాతంత్ర్యంవారిది.చతుర్విధ పురుషార్థములలో( ధర్మార్థ కామ మోక్షములు) దేనిని కూడా వారు అనవసరమని త్రోసి వేయలేదు.ధర్మార్థ మోక్షములను సాధించుటకెంత పట్టుదలో జీవితావసరమైన కామాన్ని సాధించటానికి వారి అభిలాష అంతే. 

ఆనాడు తమ ఏలుబడిలో నున్న ఊర్లపేర్లను కూడా సుందరంగా మార్చిరట.ఉదయగిరి పేరు మణినాగపురి గా,పెనుగొండ ను ఘనగిరి,సురగిరి యని బేలూరు వేలాపురి గా పిలిచేవారట.అలాగే నాటి రాజులు కట్టించిన భవనములకు కూడా మలయకూటము,గగనమహాలు,రత్నకూటము మొదలైన అందమైన పేర్లతో పిలిచెడి వారట.

ఇక నాటి స్త్రీ,పురుషులిరువురు పూలనిన అమిత ఆసక్తిని కనబడిచెడి వారట. తాంబూల సేవనము అమితంగా ఇష్టపడేవారట.ఏదైనా బహుమానము యిచ్చేటప్పుడు కూడా ఈ తాంబూలము తప్పని సరి. రాజులిచ్చెడి మర్యాదలలో కర్పూర తాంబూలము లేని బంగారు ఆభరణాలపైన కూడా నాటి వారికి మనసు వుండెడిదికాదట. ఈ ఆచారము మనకు ఇప్పటికి  కనిపిస్తూనే వుంటుంది,

నాటి ఋతువుల గూర్చి ముచ్చటిస్తూ వసంతకాలమొచ్చినదట.శిశిరంలో మానిన ముత్యాల పేరులను తిరిగి వేసుకుంటారట.అలాగే మంచాల క్రింద పెట్టుకొనే కుంపట్లను తీసివేసేవారట. వసంతంలో  ఇప్పలు  పూస్తాయట.ఈ ఇప్పలంటే యేమి చెట్టు పూలో మరి.ఆ పూలమీదనుంచి వీచే గాలులతో వనమంతా మత్తెక్కిపోతుందట.ఆ మత్తుకు కామినులు రవికలను సడలించి క్రిక్కిరిసిన గుబ్బలతో ప్రాణవల్లభులను హత్తుకొనిదెరట.మధుపానములతో ప్రొద్దే తెలియదట.ఈ కాలంలో ఆడవారు వీణలపై హిందోళ,వసంత రాగములను పాడెదరట. వసంతరాగం గూర్చి చెప్తూ నాటికాలంలో వసంతరాగం సంపూర్ణరాగమేమో అని కూడా చెప్తారు.

ఎండాకాలంలో గ్రామాల్లో చలి పందిళ్ళు వేసేవారట.ఆ చలిపందిళ్ళలో ( నేటి చలివేంద్రాలవలె ) వనితలు మల్లె పూలు పెట్టుకొని బాటసారులకు నీరుపోసే వారట.నాటి చలి పందిళ్ళలో మగవారు వుండేవారు కాదు.చలిపందిళ్ళలో బాటసారులకు ప్రపాలిక( చలివేంద్రము లో నీరు పోసెడి ఆడ మనిషి)  ల మధ్య సరసాన్ని కూడా వర్ణిస్తారు. వేడి తగ్గడానికి గంధపు పూత పూసుకొనెడి వారట.వేసవిలో వంటల గురించి చెప్తూ అన్నము,బెల్లం చారు,పల్చని పులుసులు,చెఱుకు రసం,కొబ్బరి నీళ్ళు,తీపి భక్ష్యములు,పండ్లు,వాసనగల చల్లని నీరు,వేసివి వడను పోగొట్టడానికి ఊరవేసిన మామిడి పిందెలు,నీళ్ళు ఎక్కువగా కలిపిన మజ్జిగ మ్కొదలైనవి వాడేవారట.

ఇంతలో వర్షాకాలమొచ్చేస్తుంది.కడిమి చిగురించును.మొగలిపూలు వికసిస్తాయి.ఏనుగులు భూమిని మూచూస్తాయి. కాపులు అంబలి మోసుకొని పొలములలో కాపలా వున్న భర్తలదగ్గరకు వెళ్ళెదరు.పొలాల్లో వర్షానికి  రక్షణగా  గుడిసెలు వేసేవారు. వర్షాకాలంలో రెడ్లు ఆకుకూరలు చింతచిగురుతో కలిపి నూనెతో వేయించి ఆవిర్లు క్రక్కుతుండగా ఆరుగబియ్యపు టన్నాన్ని తిని గొడ్డూ గోదా పొలాలకు తోలి కుంపటి పెట్టుకొని చావళ్ళలో దూడలు తమ శరీరాన్ని నాకుతూ వుండగా నిద్రపోతారు.

ఇలాగే శరదృతువు గూర్చి కూడా వర్ణిస్తారు.

వారిజీవన విధానం గూర్చి చెప్తూ చక్కని రసికత కంటే కొంత లాలసత ఎక్కువైనట్లభిప్రాయపడతూ నాటి జనులు స్త్రీలను భోగ్యవస్తువులుగనే చూశారని అభిప్రాయ పడతారు.వారు హైందవమహమ్మదీయ నాగరికత అల్లిబిల్లిగా పెనవేసుకొన్న కాలమందు జీవించుటచే ఈ లాలసగుణము కొంత అంటుకొన్నదని కూడా అభిప్రాయపడతారు.ఇది ఆనాటి ప్రజలకే కాకుండా కావ్య నాయకా నాయికలకూ వర్తిస్తుందని మనుచరిత్రనుదహరిస్తారు. నాటి అంతఃపుర స్త్రీలలో ప్రేమపై పోటీలుండెడివట.రాజులప్రేమను చూరగొనలేని భార్యలు విషపానము గూడా చేసేవారు.స్త్రీ,పురుషులిరువురూ పరస్పర వశీకరణకై మంత్ర తంత్రములతోపాటు మందూ మాకులను వాడేవారు.ఇన్ని దురాచారములన్ననూ శ్రృంగార విషయములో స్త్రీలకే పట్టాభిషేకం.

 సంగీతాన్ని గూర్చి వివరిస్తూ అళియరాముడు తల్లికోట యుద్ధానికి ప్రయాణమైనప్పుడు అతని వెంట వెళ్ళిన బలగాలతోపాటి 4876 మంది విద్వాంసులు,5687 మంది కవులు, 569 ఖడ్డీతాళాలవారు,479 మంది కేవలము తాళగాండ్రు వున్నారట.బండారం లక్ష్మీనారాయణ,లొల్ల లక్ష్మీధరుడు నాటి ప్రసిద్ధ సంగీత శాస్త్రకర్తలని చెప్తారు.

ఈ పుస్తకము చదవడానికి నాకు మామూలు పుస్తకముకంటే పదిరెట్ల సమయం ఎక్కువగానే పట్టింది. ఆనాటి సాంఘిక జీవనవిధానానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేనప్పుడు ఇలా ప్రబంధాలలోని పద్యాలను ఆసరాగా చేసుకొని ఇలాంటి ఒక పుస్తకాన్ని రచియించడం ఎంతైనా మెచ్చుకోదగ్గది. కానీ నాటి సామాన్య మానవుని జీవితం ఎలా వుండేదో తెలుసుకోలేకపోతున్నామే నన్న లోపం ఈ పుస్తకం చదివిన తరువాత కూడా వెంటాడుతుంది.

ఆసక్తి కలవారు ఈ పుస్తకాన్ని PDF రూపంలో ఇక్కడనుంచి Download చేసుకోవచ్చు రాయలనాటి రసికతా జీవనము

5 కామెంట్‌లు:

  1. digital library of india నుండి తెలుగు పుస్తకములు pdf format లో download చేసుకొనువిధము తెలుపగలరు.

    -సత్తిబాబు.

    రిప్లయితొలగించండి
  2. >ఈ ఇప్పలంటే యేమి చెట్టు పూలో మరి
    ఇప్పపూలను గురించి భద్రాచలం వెడితే బాగా తెలుస్తుంది. వీటి పూల సువాసన మత్తెక్కించగలదని అనిపిస్తుంది. ఇప్పపూలతో సారాయం కాస్తారు కూడా.

    రిప్లయితొలగించండి
  3. సత్తిబాబు గారూ, digital library of india నుండి PDF format లో ఫైల్స్ Download చేసుకోవడానికి సౌకర్యంలేదు. ముందుగా మనము అక్కడనుండి .TIF ఫార్మాట్ లో ఫైల్స్ అన్ని ఒక folder లోకి download చేసుకొని ఆ తరువాత వాటినన్నింటిని ఒక క్రమంలో కుట్టి PDF format లోకి మార్చుకోవాల్సిందే. బ్లాగుల్లో active గా వుండి పుస్తకాలు బాగా చదువుతున్న రోజుల్లో దీనికొక application తయారుచేసుకున్నాను. ఆ అప్లికేషన్ కు మనము download చేసుకోవాలసిన పుస్తక లింకునిస్తే అది .TIF పేజీలన్నింటిని download చేసి PDF పుస్తకరూపంలో మనకిస్తుంది. ఆ రకంగా download చేసిన పుస్తకమే నేను నా టపా లో ఇచ్చిన లింకు.

    రిప్లయితొలగించండి
  4. శ్యామలీయం గారూ ఇప్పపూల గురించి వివరించినందుకు ధన్యవాదాలు.
    ఆ పుస్తకంలో కూడా ఈ పూల వాసన మత్తెక్కిస్తున్నట్లే వ్రాశారు.

    రిప్లయితొలగించండి

Comment Form