8, అక్టోబర్ 2015, గురువారం

పిల్లల్ని కనాలంటే పెళ్ళి చేసుకోవాలా? పెళ్ళి చేసుకోవాలంటే తాళిబొట్టు కట్టాలా ? :-)

80 వ దశకంలో తొలి సంవత్సరాలవి. ఇప్పటిలాగా కాకుండా మాకప్పుడు ఐదు తరగతుల లోపునే తెలుగు చాలా బాగా నేర్పేవారు. అంటే బాలల బొమ్మల రామాయణం, బాలల బొమ్మల భారతం, బాలల బొమ్మల భాగవతం ఇలాంటివి ధారాళంగా చదవ గలగడానికి, చదివి అర్థం చేసుకోవడాని ఎటువంటి ఇబ్బంది కానీ ఎవరి సహాయం కానీ అవసరం లేనంతగా నేర్పించేవారు. అలాంటి ప్రాధమిక పాఠశాలల్లో అంబవరం పాఠశాల ఒకటి. ఈ ఊరికి నాలుగు మైళ్ళ దూరంలో భైరవకోన. ప్రకృతి మధ్యన వెలసిన శైవ క్షేత్రం. ఒక కొండను పూర్తిగా చెక్కి చిన్న చిన్న గుడులుగా మలచి శివాలయలుగా తీర్చి దిద్దారు. ఆ ఆలయాల్లో విగ్రహాలు కూడా విడిగా చెక్కి పెట్టినవి కావు. అన్నీ ఆ కొండలో అంతర్భాగాలే. అంటే ఏకశిలా మందిరాలు. ఇక ఊరికి కొద్ది దూరంలో కొత్తపల్లి, దర్శిగుంట పేట అనే ఊర్లు. ఏఊరికి ఆ ఊరిలో ప్రాధమిక పాఠశాల వున్నా గానీ ఉన్నత పాఠశాల మాత్రం మా ఊర్లోనే. అంటే అంబవరం లో. ఇక ఈ ఊరి నైసర్గిక స్వరూపాన్ని చూస్తే చుట్టూ దట్టమైన అడవులు [ అప్పట్లో, ఇప్పుడు చాలా వరకు హరించుకు పోయాయి ]. ఆ అడవుల్లో బీర కాయలు, ఇవి కూర వండుకునేవి కాదు, రంగులోఎర్రగా రుచికి తియ్యగా, చిన్న విత్తనం కలిగి తిన్నప్పుడు చాలా బాగా వుంటాయి. వీటితో పాటి ఉసిరిక, నెమ్మి, ఏలక, బిక్కి కాయల లాంటివి విస్తారంగా దొరికేవి. అలాంటి ప్రకృతి మధ్యన నివసించే ప్రజలు ఆ ఊరివాళ్ళు. ఊరి పొలాల్లో ఎక్కువగా నిమ్మ, బత్తాయి, పసుపు, ఆముదాలు, నువ్వులు ఇలాంటి పంటలు ఎక్కువగా పండేవి. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే అక్కడ అప్పటికి పట్నపు పోకడలు చాలా చాలా తక్కువ. అలాగే పైవన్నీ ఎక్కువగా దొరకడం మూలానే ఈ టపాలో మాకు పసుపు కానీ, పూజకు ఆముదం కానీ చాలా సులభంగా దొరికాయి. ఊరి రామాలయంలో హరికథా గానాలు, శివరాత్రికి రకరకాల పౌరాణిక పద్య నాటకాలు, అప్పుడప్పుడు తోలుబొమ్మలాటలు. ఇవి ఎనభైల్లో ఆ ఊరికి వినోదమందించే దృశ్య, శ్రవణ మాధ్యమాలు. ఇవన్నీ వంటబట్టించుకున్న మాలాంటి చిన్న పిల్లలకు సహజంగానే పాండవులంటే [ భారతంలో హీరోలు ] అమిత ఆరాధానాభావం. నాకు మరీ ముఖ్యంగా అర్జునుడంటే మహాయిష్టం. ఎంతగా ఇష్టం అంటే అరణ్య/అజ్ఞాత పర్వంలో అర్జునుడు బాణాలు విల్లు తీసుకొని అడవులవెంట తిరుగుతాడుకదా. ఆ సన్నివేశం ప్రతిరోజూ కొన్ని నెలలపాటుగా నాకు కలలో,
నేనే అర్జునుడుగా వెదురుతో చేసిన విల్లు తీసుకొని మా తోటలో పహారా కాసినట్టు కలలొచ్చేవి. అవునండోయ్ మా ఊర్లో వెదురు కూడా బాగానే దొరికేది. పచ్చి వెదురు బొంగును కొడవలి తో రెండుగా చీల్చి నిజంగా నా అంతటి నేనే నాలుగోతరగతిలోనే విల్లు తయారుజేయడం నేర్చుకొని గురిచూసి పిట్టల గొట్టడం నేర్చుకొన్నాను. అప్పట్లో ఇంటో నాకు పిట్టలదొర అని కూడా నామకరణం చేసేసారు :-). వాళ్ళకు నా మనసు అర్థమయి అర్జునా అని పిలిస్తే వినాలని హెంత కోరికగా వుండేదో. అబ్బే ఈ పెద్దోళ్ళున్నారే వాళ్ళకి మన పిల్లకాయల మనసు ఎప్పుడు అర్థమవ్వాలి ;-)

అలా అలా స్కూల్లో నాలుగోతరగతి వెలగబెట్టే రోజుల్లో నాకు బాబుగాడని ఒక సావసగాడు తగిలాడు. వాళ్ళయ్య హైస్కూల్ లో హెడ్మాస్టర్. వీడు మహా మాయగాడు. ప్రతిదాంతో నాకు పోటీ వచ్చేవాడు. స్కూల్లో మాకు చదువులో కాదు పోటీ... ఎవరు తెలుగు పుస్తంకంలో ఎన్ని పేజూలు చించి వేస్తారో అని :-). కాకపోతే బాపనయ్య అవడంతో వాడికి తెలివి మస్తుగా వుండేది. పోటీ మొదలౌద్దా, ముందుగా వాడు వాడిపుస్తకంలో ఒక పేజీ సగం చింపేపాడు. మరి పోటీలో మనం ఓడిపోకూడదు కదా, అందుకని నేను నా పుస్తకంలో మొత్తం పేజీ చింపేసేవాడిని. అలా ఓరోజు ఓ అశుభ ముహూర్తంలో మొదలైన చింపటం అనే కార్యక్రమ ఫలితం ఓ పదినిమిషాల్లో నాచేతిలో తెలుగు పుస్తకం అట్ట దప్ప ఏమీ మిగల్లేదు. అంతే కాదు వాడు పేజీలను ఏంచక్కగా ఒక క్రమ పద్దతిలో చించాడు. అంటే మళ్ళీ బంక పెట్టి అతికించినా లేదా సూదితో కుట్టుకున్నా పనికొచ్చేటట్టు. మరి నేనో :-) ఏదో సినిమాలో బ్రహ్మానందం పేపరు చింపడం గుర్తు తెచ్చుకోండి :-)

చింపేటప్పుడు మహా ఆనందంగా వున్నది కానీ తరగతి గదిలోకి అయ్యవారు వచ్చి వీపు చీరగానే నేనాలపించిన గీతం మాత్రం నాకు కర్ణకఠోరంగా ప్రక్కనున్న సావాసగళ్ళకు మహా పసందుగా వినిపించింది :-). అంతటితో ఆగిందా నేను మా ఇంటికెళ్ళడానికంటే ముందే ఈ వార్త ఇంట్లో తెలిసింది. నాకంటే ముందు నా సావాసగాళ్ళందరూ ఇంటిముందు గుమిగూడి ఎప్పుడెప్పుడు సంగీతం విందామా అని ఏనుగు చెవులేసుకొని గుంటనక్కల్లా కాచుకోనున్నారు. మరి ఎన్నైనా అయ్యవారు పరాయి వాడుకాబట్టి కొద్దిగా నాలుగు దెబ్బలతో సరిపెట్టాడు కానీ , ఇంట్లో వాళ్ళు సొంత మనుషులు కాబట్టి కొద్దిగా ఎక్కువగానే ముట్టచెప్పారు. దానికి ప్రతిఫలంగా నా శాయశక్తులా నేనూ తిరిగి రాగాలాపన చేసాను :-)

ఇలాంటిది ఒకటేమిటి చెప్పుకుంటా పోతే ఒక రసవత్తరమైన బాల చిత్రం అవుతుంది. అలాంటి సెట్టింగే మరొకటి. అప్పట్లో మాకు కావాల్సిన ఆటవస్తువులను మేమే చేసుకొనేవాళ్ళం. అంటే కారు, బస్సు, రైలు ఇలాంటివి కావాలంటే ఖాళీ అగ్గిపెట్టెలను ఆ ఆకారంలో మార్చుకొని వాటికి మందుసీసాల రబ్బరు మూతలను చక్రాలుగా అమర్చి మాకు కావాల్సిన వాహనాన్ని చేసుకొనేవాళ్ళం. నిజంగా ఎంత తృప్తిగా వుండేదో. ఈ బాబుగాడున్నాడే వాడు నా బాల్య జీవితంలో ఒక విలన్ లాంటోడు. వాళ్ళ నాయన హైస్కూల్ హెడ్మాస్టరే కాదు . R.M.P. వైద్యుడు కూడా. కాబట్టి వాళ్ళింట్లో ఎప్పుడూ ఖాళీ మందు సీసాలకు కొదవుండేది కాదు. ఓరోజు ఇద్దరమూ కలిసి రైలు తయారు చేసుకుందామని గుసగుసలాడుకొని ప్రణాళికా రచనలో పడ్డాము. నేనెలాగు రబ్బరు మూతలు తేలేను కనుక వాడు చెప్పిన ప్రపోజల్ కు సరే అన్నాను. అంటే వాడు రబ్బరు గాన్లు తెచ్చేటట్టు, నేనేమో అవసరమైన అగ్గిపెట్టెలు తెచ్చేటట్టు. ఆ విధంగా పనులు విభజించుకొన్నాక వాడలా ఇంటికెళ్ళి ఓ ఇరవై మంది సీసాలు బుడక్కిన తీసుకొచ్చాడు. మరి నాకు అగ్గిపెట్టెలు ఇప్పుడు కనీసం ఒక ఇరవై కావాలి. అక్కడా ఇక్కడా అడుక్కోని ఒక ఐదో ఆరో సంపాయించాను. ఇక మిగిలినవాటికోసం ఎంత ప్రయత్నించినా వీలుకాలేదు. అదుగో అప్పుడు నాలోని మరో మనిషి నిద్రలేచి ఓ సలహా ఇచ్చింది. వెంటనే ఇంట్లో ఉన్న డజను నిండు అగ్గిపెట్టెలు మాయం. పుల్లలు తీసి ఇంటివెనకాల సందులో పారబోసి రైలు పెట్టెలు తయారు చేసి వాడొకరోజు, నేనొక రోజు హాయిగా ఆడుకొంటూ స్వర్గలోకాల్లో విహరించే ఒకానొక రోజు.....

ఇంట్లో వాళ్ళకి కొత్త అగ్గిపెట్టె అవసరం పడి చూస్తే ... ఇంకెక్కడి అగ్గిపెట్టెలు... కట్ చేస్తే షరా మామూలే.. ఇంట్లో సినిమా... ఇంటిబయట ప్రేక్షకులు :-)

అలా ఆ అమాయకత్వం అంతటితో ఆగిందా..అబ్బే ఆరోతరగతికి వచ్చేటప్పటికి బాలల పురాణ పుస్తకాలు చదవడంతో అందులో హీరోలు ఎవరైతే వారుగా మమ్మల్ని ఊహించుకోవడం బాగా తలకెక్కేసింది. ఊర్లో అంతకుముందు కొన్ని రోజులక్రితమే శ్రీరామనవమికి లవకుశ నాటకమేసారు. అప్పుడు మొదటిసారిగా "రామనీల మేఘశ్యామా..కోదండరామా" అనే పాట విన్నాను. చాలా బాగా నచ్చింది. ఇంకేముంది అప్పటినుండి రాముని అవతారంగా పరకాయప్రవేశం చేసేసాను. అదుగో అప్పుడూ ఈ బాబుగాడు నాకు పోటీనే..రేయ్ నీకంటే నేను పెద్దోడ్ని నేనే రాముణ్ణి , నువ్వు లక్ష్మణుడివని. కానీ ఈసారి కుదరదంటే కుదరదని వాడ్ని లక్షణుడిగా సెటిల్ చేసేసి నేనే రాముడి నయ్యాను. ఇంతవరకూ బాగానే వుంది. మరి సీత?

అక్కడన్నమాట మా హీరోయిన్ రంగ ప్రవేశం. ఊర్లో అంతా సూర్యవంశ రాజులు, గొల్లవారు ఎక్కువ. కాబట్టి బడికి అమ్మాయిలను పెద్దగా పంపేవారు కాదు. మరి వచ్చిన వాళ్ళల్లో కొద్దిగా మాకు నచ్చిన పిల్ల నాగేశ్వరి [ పేరు మార్చాను ]. ఆ పిల్లకు కాస్త చింతపండు,జీలకర్ర కలిపి ముద్దగా చేసి ఓ చీపురు పుల్లకు గ్రుచ్చి లంచంగా ఇచ్చి మచ్చిక చేసుకున్నాము. ఇంతకీ ఇదేమి బాగుంటుందనుకొనేరు. కొత్త చింతపండు, జిలకర,ఉప్పు కలిపి ముద్దచేసి తిని చూడండి. సూపర్ గా వుంటుంది. ఇలా నాగేశ్వరిని సీతగా మార్చేసాము. నేను రాముడిని కదా..కొంచెం నీలి రంగులో వుండాలికదా. అందుకని ప్రతిరోజు స్కూల్ కి వచ్చేటప్పుడు మొఖానికి అరచేతి నిండా పాండ్స్ పౌడరు దట్టంగా దట్టించి స్కూల్ కి వచ్చేవాడిని. బాబుగాడు, నాగేశ్వరీ కూడా వచ్చాక ముగ్గురం కలిసి ఒక బావి దగ్గర చేరేవాళ్ళం. ఎందుకంటే అంతకుముందే అప్పటికే అక్కడ ఇటుకలతో ఒక చిన్న గుడిని, ఒక దీపకుందీని, ఆముదపు డబ్బాని తయారుగా పెట్టుకొని వున్నాము.

పెళ్ళి పత్రికల్లో ఆరోజుల్లో కచ్చితంగా రాముడు సీత ఇద్దర్నీ ప్రింట్ చేసేవాళ్ళు. అలాంటి పెళ్ళి పత్రికను ఒకటి మేము ఇటుకలతో కట్టిన ఆ గుడిలో పెట్టి దేవునిగా చేసి దీపారాధన చేసి, ఎవరూ చూడకుండా దానికి ఒక పెద్ద అట్టముక్కను వాకిలిగా పెట్టి మళ్ళీ స్కూల్ కి చేరుకొనేవాళ్ళం. ఒంటేలు గంట కొట్టగానే ముగ్గరం కలిసి మళ్ళీ మా గుడి దగ్గరకు పోయి పూజ చేసేవాళ్ళం. మరి అప్పటికి రాముడి మేకప్ పోయుంటుందికదా! సీత మేకప్ వేస్తుంటే హాయిగా వేపించుకొనేవాడిని. లక్ష్మణుడు మేము దీపారాధన చెసేటప్పుడు చుట్టుప్రక్కల జనసంచారమైతే మాకు సమాచారం ఇవ్వడానికి కాపలాగా వుండేవాడు. అలా కొన్ని రోజులు గడిచాకా ఈ ఆట బాబుగాడికి మహా బోర్ కొట్టేసింది. ఎందుకంటే వాడెంత సేపున్నా దీపారాధన చెయ్యలేడు,పౌడరు పూపించుకోలేడు :-). సరే అని వేరే ఆట ఆడాలని ముగ్గురం డిసైడ్ అయ్యాం. ఈసారి మహాభారతంలో ద్రౌపదీ స్వయంవరం మా ఆటకు మూల వస్తువు.

ఇంతకీ ఆటఏమిటంటే ఒక ఐదుమందిమి కలిసి ద్రౌపతి ని పెళ్ళి చేసుకోవడం. కానీ ఇక్కడ మాకొక చిక్కు వచ్చింది. మేము ముగ్గరం ఇప్పటికే ఎవరికీ తెలియకుండా రామ,లక్ష్మణ, సీత అవతారాలెత్తాము. ఇప్పుడు మరో ముగ్గురు అంటే ఎక్కడ గొడవలౌతాయో అని భయం కూడా వేసింది. అందుకని మేమిద్దరమే పాండవులం. నాగేశ్వరి ద్రౌపతి అన్నమాట. ఇక పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించేసుకున్నాం. ఇంతకీ పెళ్ళి చేసుకోవాలనుకున్నాం కానీ మా ముగ్గురికీ ఒకటే భయం. పెళ్ళయితే పిల్లలు పుడతారాని :-)


కానీ పెళ్ళి చేసుకోవాలని ఆలోచన ఒకసారి వచ్చాక ఇక మనసూరుకుంటుందా? హబ్బే రాత్రులు నిద్రపట్టేది కాదు. ఎలా? ఎలా? ఎలా?... ఏదైతే అది అవుతుందని ముగ్గురం ధైర్యం చేసాము. మా స్కూలు వెనకాల ఒక పెద్ద ఇసుక గ్రౌండ్ వుండేది. ఇప్పటికీ వుంది కానీ ఇసుక మాత్రం చాలా తక్కువగా వుంది. ఒక రోజు, అపర సంధ్యవేళ, చుట్టు ప్రక్కల ఆడుకొనే పిల్లలు అందరూ ఇంటికెళ్ళాక ఎవరూ లేని సమయం చూసి ముగ్గురం సమావేశమయ్యాము. పెళ్ళి చేసుకుంటే పిల్లలు పుడతారనే భయం ఒకప్రక్క తొలుస్తూనే వున్నా మిగతా కార్యాచరణకు మంతనాలు సాగించాం. ఈ సారి నా వంతు తాళిబొట్టు తయారు చేయడం. బాబుగాడి వంతు పసుపు త్రాడు సంపాయించడం. అప్పటికి మాకు పెళ్ళిలో బెల్లం జీలకర్ర నెత్తిన పెడతారని తెలియదు. తాళి కట్టేస్తే ఇక పెళ్ళయిపోయి పిల్లలు పుట్టేస్తారని మాత్రమే తెలుసు :-)

ఇలా ముచ్చటించుకోని మంచి ముహూర్తం కోసం నేను, బాబుగాడు ఊర్లో రామాలయంలో హరికథలు చెప్తున్న హరిదాసు గారిని కలిసి, " మేము బాగా చదవుకోవాలనుకుంటున్నాము ఏరోజు మొదలు పెడితే ఫస్టు మార్కులు వస్తాయో " చెప్పమని కోరాము. ఇక్కడ మరో విషయం ఈ హరికథా దాసు గారితో మాకు అప్పటికే కొంచెం చనువు ఎక్కువ. వారి పేరు గుర్తు లేదుకానీ వారు చెప్పే రుక్మిణీ కల్యాణం హరికథకు రోజూ వెళ్ళి ముందు వరుసలో కూర్చొని గడ్డం క్రింద చెయ్యి పెట్టుకొని శ్రద్ధగా వినేవాళ్ళం. అలాగే మాకు నచ్చిన పద్యాలను ఆయనచేత ఒక తెల్లకాగితం మీద వ్రాయించుకొని ఊరు బయటుండే పెద్ద రావిచెట్టు మీదెక్కి వచ్చేదాకా రాగాలు తీసేవాళ్ళం :-)

ఈ చనువుతో పాపం ఆయన నిజమేననుకొని ఒక మంచిరోజు చెప్పారు :-). ఇక నేను తాళి ఎలా సంపాయించాలి? బంగారం అంటే దొంగతనం చేయ్యాలి కదా ! హబ్బే అప్పటికి ఎదో ఇంట్లో అగ్గిపెట్టెలు తప్ప ఇలా విలువైనవి కాజేసేటంత సీనులేదు. అదీకాక మనం ఏపని చేసినా ఎలా కనిపెట్టేస్తారో గానీ ఇంట్లో వెంటనే తెలిసిపోయేది. అప్పుడే డిసైడ్ అయిపొయ్యా..నేను పెద్దాయ్యాక నా పిల్లోల్లకు ఏది అడిగితే అది కొనిచ్చేయాలని :-)

అద్దో అలా చించి చించి, ఒక చిల్లపెంకు తో తాళి తయారు చెయ్యడానికి నిర్ణయించుకొన్నాను. ఒక మోస్తారు చిల్లపెంకు సంపాయించి. ముందుగా ఒక చీలతో దానికి అతి జాగ్రత్తగా రెండు రంధ్రాలు పెట్టి చుట్టూ బాగా అరగదిద్ది గుండ్రంగా తయారు చేసి ఒక కాగితంలో చుట్టి ఇక పెళ్ళిరోజుకోసం వైటింగ్....

ఆ రోజు రానే వచ్చింది. బాబుగాడు ఇంట్లో ఒక దారపు వుండ కాజేసి , ఒక పొట్లంలో దంపుడు పసుపు తెచ్చాడు. వాడికి అప్పటికి దారాన్ని తొడల మీద పెట్టి ఎలా నెయ్యాలో రాదు. కాబట్టి ఆ పనీ నేనే చేసి ఆ దారానికి "చిల్లపెంకు తాళి బొట్టు" దూర్చి సిద్ధం చేసాము. ఇంతకుముందు మేము రాముడికి గుడికట్టిన బావి దగ్గర నుంచి కొద్దిగా నీళ్ళుతెచ్చి "పసుపు" ఆ నీళ్ళలో వేసి పేనిన దారానికి దట్టంగా పసుపు పట్టించాము. అలా మేము ఈ పనులన్నీ చేసుకొని గ్రౌండ్ చేరేటప్పటికి మా ద్రౌపతి మాకోసం ఎదురు చూస్తూ వుంది.:-)

అంతా బాగానే వుంది కానీ మళ్ళీ మాకొక సమస్య :-) ముందు ఎవరు ఈ చిల్లపెంకు తాళిని కట్టాలని.. చూసి చూసి మా ద్రౌపతి నేనుపోతానని బెదిరించింది. ఇలా లాభం లేదనుకోని ఇద్దరం ఒకేసారి మెళ్ళో వేసేసాము.

వెయ్యడమైతే వేసాం కానీ ఇంక అప్పుడు చూడాలి మా పరిస్థితి. గుండెల్లో ఒకటే దడ. పిల్లో పిల్లోడు పుడితే ఓరిదేవుడా :-౦ ... ఆ భయానికి ముగ్గరం మూడు ప్రక్కలకు ఒకటే పరుగు. ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు. రెండో రోజు స్కూల్ కి భయం భయంగా వెళ్ళాను. బాబు గాడు ఆబ్సెంట్. ఆ పిల్ల మాత్రం ఏమీ ఎరుగనట్టు చూస్తుంది. నాకు ఒకటే దడ. కాసేపాగి కడుపు వైపు చూడండం, హమ్మయ్య అనుకోవడం.:-) ఆ రోజునుండి ద్రౌపతి తో మాట్లాడాలంటే భయం. ఆ పిల్ల కడుపుమీద చెయ్యేసుకుంటే భయం. అబ్బా మా బాధలు ఒకటని ఏంచెప్పేదిలే. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే బాబు గాడి నాన్నకి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయి నన్నొంటరిని చేసేసాడు.

అప్పుడు తట్టింది నాకొక ఐడియా! నేను కూడా మా బాబాయికి ఇలాగే ట్రాన్స్ఫర్ అవ్వాలని ఒక్కడినే మేము ముగ్గురము కట్టిన గుడికి వెళ్ళి దీపారాధన చేసి దండం పెట్టుకోని వచ్చాను. మరి ఆ రాముడికి ఏమి అర్థమయిందో ఏమో కానీ ఒక నెలలోపే ట్రాన్స్ఫర్ రావడం మా సొంత ఊరికి వెళ్ళిపోవడం జరిగిపోయింది. వెళ్ళానే కానీ మళ్ళీ పిల్లో పిల్లోడో పుట్టాక ద్రౌపతి అమ్మా నాన్నవాళ్ళు వచ్చి ఎక్కడ మాయింట్లో చెప్తారో అని భయం వెన్నాడుతూనే వుందేది. కానీ ఏడో తరగతిలో నాగభూషణం గాడు "ఆ టైపు" పుస్తకం నాచేత చదివించినా కూడా పిల్లలు ఎలా పుడతారో తెలియనేలేదు. :-). పదవ తరగతి సామాన్య శాస్త్రం లో పునరుత్పత్తి వ్యవస్థ చదివాక హమ్మయ్య అని గాలి పీల్చుకోగలిగాను :-)

అదండీ పెళ్ళి పిల్లలు, తాళి సినిమా... ఓ నాలుగు సంవత్సరాల క్రితం ఇండియా వెళ్ళినప్పుడు భైరవకోన చూడాలని అదే పనిగా వెళ్ళి వస్తూ అంబవరంలో ఆగి స్కూల్ ఫోటోస్ ను, ఆ గ్రౌండ్ ను, మేము గుడి కట్టిన బావిని తనివితీరా చూసుకొని ఫొటోస్ తీసుకొని వచ్చాను. కానీ నాగేశ్వరి ఎక్కడవుందో తెలియలేదు. అలాగే బాబుగాడు కూడా ఇప్పటిదాకా మళ్ళీ తారస పడలేదు. :(

38 కామెంట్‌లు:

  1. చిన్నప్పటి పల్లెటూరు లో దాదాపు మనందరి స్మృతులను చక్కగా చెప్పారు. చిన్నప్పుడు వేసవిలో కాలవ లో వండృమట్టి తీసుకువచ్చి బొంగరాల నుండీ బొమ్మల దాకా చేసేవాళ్ళం. ఒకరి చొక్కా ఒకరు పుచ్చుకుని రైలాట. బాదం కాయలు కొట్టుకు తినటం. గోలీలు బచ్చాలు ఆడటం. మధుర స్మృతులు. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

    రిప్లయితొలగించండి
  2. chala ante chaala baaga raasaru. Chinnappati sangatulu bhale vuntayi.

    రిప్లయితొలగించండి
  3. ఎంత పొడవు రాసేరేంటండీ. ఇంకా చదవలేదు కానీ కామెంట్లని బట్టి విషయం కొద్దిగా అర్ధం అయ్యింది. నా చిన్నప్పుడు నాకూ, నా బంధువుల అమ్మయికి కలిపి ఒక అమ్మాయి (బొమ్మల?) పెళ్ళి చేసింది. మీ టపాకీ దీనికి సంబంధం లేకపోతే ఇది తీసెయ్యండి :))

    రిప్లయితొలగించండి
  4. బాగుంది ఒక్క కామెంట్ అంటే టికెట్ రేట్ చాల తక్కువే , పెంచేయండి :) రాముడంటే బ్లూ గా ఉండాలంటే పాండ్స్ పౌడర్ రాసుకున్నారా నేను ఏదో రంగు తయారుచేసుంటారు అనుకున్నా .

    రిప్లయితొలగించండి
  5. భారారే,

    బాగా రాశారు ...నిజమే ఆ వయసు లో ఆ ఆమాయకత్వం ఎంత బావుంటుందో...ఈ తెలివి తేటలు, ఈ విజ్నానమ్, ఈ పెద్దరికం కన్నా ఆ రోజులే బావుంటాయి.

    దీనికి ముందు పోస్ట్ చదివి, ప్రవీణ్ సినిమా కి డబ్బులు కూడా పెడతానంటే ఇటు రాకుండా పారిపోయాను. ఈ కామెంట్లు చూసి ధైర్యం చేసి చదివాను.అమ్మాయ్య...సినిమాల్లాంటి కొత్త అవుడియాలు ఇవ్వకండి బాబు...మీకు దణ్ణం పెడతాము.

    రిప్లయితొలగించండి
  6. బాగా రాశారండీ. ప్రతి పేరాతరవాత స్మైలీలు చెబుతున్నాయి, మీరు ఎంత ఆస్వాదిస్తూ రాశారో.

    అగ్గిపెట్టెలు, రబ్బరు సీసామూతలు (బాటిల్‌‌‌క్యాప్ అనకుండ చక్కగా తెలుగులో ఆహా) - నాకు కొన్ని జ్ఞాపకాలు కదిలించాయి. అన్నయా, నేనూ చేసేవాళ్ళం. మూతలు దొరక్కపోతే, పాత చొక్కా-లాగూల గుండీలు ఊడబీకి, సూదిని కొవ్వత్తిపైన ఎర్రగా కాల్చి, గుండీ మధ్యలో రంధ్రంచేసి - దానికి కుంచెచీపురుపుల్లలు గుచ్చి మరీ చక్రాలు చేసేవాళ్ళం.

    రిప్లయితొలగించండి
  7. టైటిల్ చూసి నేను ఏదో అనుకున్నాను. పెళ్లికి ముందు గర్భవతి అయిన అమ్మాయిని పెళ్లి చేసుకునే హీరో గురించి అనుకున్నాను. మీరు స్కూల్లో చదువుకునే రోజులలో ప్రేమించిన అమ్మాయి గురించా?

    రిప్లయితొలగించండి
  8. చిన్నప్పుడు నేను ఇంకోలా అనుకున్నాను. పాతికేళ్లు దాటిన ఆడవాళ్లకి ఆటోమేటిక్ గా పిల్లలు పుడతారని. డాక్టర్ స్వయం ప్రకాశ్ గారి రచనలు చదివిన తరువాత అసలు విషయం తెలిసింది. స్త్రీ-పురుష సంగమమే బూతు అనుకునే సమాజంలో టెంత్ క్లాస్ పిల్లలకి ఈ విషయాలు తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదు.

    రిప్లయితొలగించండి
  9. హ్హ..హ్హ..హ్హ బాగుంది. ముందుగా టికెట్ బుక్ చెయ్యకుండా సినిమా చూసేసాను పైరసీ గొడవలేమీ రావుకదా.

    రిప్లయితొలగించండి
  10. టికెట్ బుక్ చేసుకోకపోయినా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూపించారు. థాంక్సులూ!

    ప్రవీణ్ గారూ, హీరోలంతా మీ అంత ఉదాత్తులు అయి ఉండాలంటే ఎలా చెప్పండి?

    రిప్లయితొలగించండి
  11. రెడ్డి రాజు గారూ

    మీరు ముందు యమర్జెంటుగా ఈ పైనున్న మాయాబజార్ శర్మగారికి ఓ వందెకరాల ఎడారీ, అలా కుదరదు అనుకుంటే మీకున్న మాన్యాల్లోంచి ఓ వెయ్యెకరాల బీడు భూములిచ్చి అవి సస్యశ్యామలం (మలం కాదండోయి!) చేసేంతవరకూ మళ్ళీ ఇటు రాకుండా ఓ యాభై మంది సిపాయిల్ని కాపలా పెట్టి రండి...

    ఆ పని చెయ్యండి మహప్రభో...మీర్రాసిన టపాలోని ఆనందమంతా ఆవిరైపోయింది ఆల్రెడీ ఇక్కడ.....

    ఆ పని చెయ్యలేనంటే చెప్పండి...మళ్ళీ మీ రాజ్యంలోకి అడుగు పెట్టనని ఢక్క బద్దలుకొట్టి మరీ చెప్పటమైనది...

    రిప్లయితొలగించండి
  12. నా చిన్నప్పటి రోజులు కూడా గుర్తు తెచ్చారు భాస్కర్ గారు. పాతికేళ్లు దాటితే ఆటోమేటిక్ గా పిల్లలు పుడతారు అని చిన్నప్పుడు అనుకున్న నేను ఒక్కడినే అమాయకుడినని అనుకున్నాను. మీరు చదివింది పల్లెటూరి దుంపల బడి, నేను చదివినది ఇంగ్లిష్ మీడియం స్కూల్. అయినా మన ఇద్దరి చిన్నప్పటి అజ్ఞానానికి మధ్య పెద్ద తేడా లేదు.

    రిప్లయితొలగించండి
  13. పాతికేళ్లు దాటితే ఆటోమేటిక్ గా పిల్లలు పుడతారు
    ______________________________________

    అంటే, ఇరవయ్యైదో పుట్టిన్రొజు నిద్దర లెవగానే స్టొమక్కు వచ్చుంటదా?
    నిన్న టీవీ9 లో సూపించారు, ఆడెవడికో మొగాడికి కడుపంట!

    రిప్లయితొలగించండి
  14. చాలా రోజుల తర్వాత ఒక మంచి పోస్ట్ చదివే అవకాశం కలిగించారు భా.రా.రె ధన్యవాదాలు.చిన్ననాటి మధురస్మృతులు చక్కగా కళ్ళకు కట్టినట్టు చూపించారు టిక్కట్టు కొని ఇక్కట్టుల పాలవకుండా.

    రిప్లయితొలగించండి
  15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  16. అర్జునా..ఫల్గుణా...పోస్ట్ అదరః

    రిప్లయితొలగించండి
  17. ఒక్క సారి మా చిన్నప్పటి జ్ఞ్యాపకాల్లోకి..అలా అల్లా వెళ్లి వచ్చాను మీ కధనం పుణ్యమా అని...!
    చింతపండు లాలిపాప్ లా భలే ఉన్నాయ్ లెండి...

    రిప్లయితొలగించండి
  18. @Rao S Lakkaraju గారు, నిజమేనండి మేమైతే బంకమట్టితో రకరకాల వస్తువులు తయారు చేసేవాళ్ళం. అలాగే కొద్దిగా పెద్ద పెద్ద రాళ్ళను గుండ్రంగా మలచుకొని గోలీలాట [ సీసం గీళీ కంటే ఇవి పరిమాణంలో ౨౦ రెట్లు వుంటాయి ], గుడ్డలతో బంతిని ఇలా రకరకాలు చేసుకొనేవాళ్ళ>

    @వంశీ గారూ మొదటి వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఇక రెండోవ్యాఖ్య :-) మీరేమంటా వ్యాఖ్యానించారో గానీ టపా చదివి అర్థం చేసుకొని కామెంట్ పెట్టారు చూసారా ;-)

    రిప్లయితొలగించండి
  19. @రవి, థ్యాంక్స్

    @శరత్.. మరందుకే ఇంటర్వల్స్ లేవన్నది. మీ వ్యాఖ్య టపాకు సంబంధించిందేలండి.

    @శ్రావ్యా..అలాగే మరి మీరు ఒకకామెంట్ తోనే సరిపెట్టేసార్ఏమి :-)

    @జగ్గంపేట , ధన్యవాదాలు

    @కల్పనా... నిజమండి. ఆ అమాయక రోజులను ఇప్పుడు తలుచుకుంటే ఎంత నవ్వు వస్తుందో. కానీ ఇప్పుడు పిల్లలు ఇలా లేరులెండి :).
    ఇక సినిమా ఐడియా , నేనివ్వటమేమిటండీ :))

    రిప్లయితొలగించండి
  20. @జేబీ గారూ, అవును అలా చేయడంలో ఎంతో తృప్తి. దానితో పాటి ఏ వస్తువులనైనా పరీక్షగా చూసే అలవాటు దానంతట అదే అబ్బేదండి.

    @ప్రవీణ్, మొదటి రెండు కామెంట్లు చూసి బాబోయ్ ప్రవీణ్ కు ఇలా అర్థమయిందా, ఆ అమ్మాయి నేను స్కూల్లో చదువుకునే రోజులలో ప్రేమించిన అమ్మాయిగా అర్థమయిందా అని ఎంత ఆశ్చర్యపడ్డానో !!!. కానీ మూడో కామెంట్ చూసి..హమ్మయ్య టపా చదివాడన్న మాట అని మాత్రం అర్థమయింది.

    @3g, పైరసీ కేసు పెట్టెస్తా మీమీద

    @సుజాత టపా చదివినందుకు థ్యాంక్స్, ప్రవీణ్ కు రిప్లై ఇచ్చినందుకు డబుల్ థ్యాంక్స్

    వంశీ గారూ, మాకున్న భూముల్లో శ్యామలమా ;-). నిజంగా అలాగే అర్థమయినా ఆశ్చర్యం ఏమీ లేదులెండి. కానీ మీ వ్యాఖ్య పవర్ చూసారా..మొదటిసారి రిలేటెడ్ కామెంట్

    @ప్రవీణ్, దుంపల బడా? అంటే? మా భడిలో అలా దుంపలేమీ పండించలేదే :)

    రిప్లయితొలగించండి
  21. @ఎనానిమస్సు, మీకామెంట్ కంటే మీ ముసుగు మాత్రం సూపర్ :-)

    @సునీతా నేను మీకంటే గట్టిగా నవ్వుకుంటూ వ్రాసా

    @శ్రీనివాస్ చిన్ననాటి జ్ఞాపకాల మహాత్మ్యమది. ధన్యవాదాలు.

    @స్పూర్తీ :-) అబ్బా ఈ పిలుపు ఎంత హాయిగా వుందో. మొదటి సారి వింటున్నా చెవులకింపుగా :-)

    @కన్నాజీ..అవును లాలిపాప్ సూపర్ గా వుంటుంది. ట్రై చేసి చూడండి.

    రిప్లయితొలగించండి
  22. మాల్గుడి కధలాగా ఉంది....

    చింతపండు-ఉప్పు-జీలకర్ర తెలిదుగాని చిన్నప్పుడు జామాకుల్లో చింతపండు ఉప్పు వేసుకొని తినేవాళ్ళం అదైతే సూపరు...

    రిప్లయితొలగించండి
  23. చాల చాల బాగుంది ,రెండు మూడు సార్లు చదివాను ..బాగా రాసారు .అన్నట్లుమేము కూడా కొత్త చింతపండు కొద్ది జీలకర్ర ,ఉప్పు కొంచెం పంచదార కలిపి తెగ తినేవాళ్ళం ,ఇక వేరే ఫుడ్ తినాలి అంటే నోరు మండిపోయేది తినలేక పోయేవాళ్ళం ..మావి అటువంటి అమాయకపురోజులే :-)

    రిప్లయితొలగించండి
  24. అదరగొట్టేశారు భారారె. చాలా బాగుంది. చింతపండు లాలిపాప్ నాకు కూడా పరిచయమేనండోయ్ :-)

    రిప్లయితొలగించండి
  25. ఆర్య,
    సందర్భము లేని వాఖ్యను ప్రచురిస్తున్నందుకు క్షమించగలరు.ఈ తెలుగు బ్లాగు లోకములో మేము కూడా ఒక చర్చా వేదికను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ని రాజకీయాలు ఉన్నాయో,తెలుగు బ్లాగు లోకములో కూడా అన్ని రాజకీయాలు ఉన్నాయని మేము భావిస్తున్నాము.మీరు ఎప్పుడన్నా ఈ తెలుగు బ్లాగు లోకములో చర్చా వేదిక కావాలంటే మా బ్లాగు ఉపయోగించుకోవచ్చు. మా దగ్గర స్వేచ్చ బాగా ఎక్కువ. మేము చాలా లిబరల్.మీరు ఎప్పుడన్నా,ఎవడితో అయినా కెలుకుడు(వాదన) మొదలు పెట్టాలి అనుకుంటే మా బ్లాగుని ఉపయోగించుకోగలరు. మేము కావాల్సిన ఫ్యూయల్ అందించగలము.
    మా బ్లాగు http://appi-boppi.blogspot.com/

    ఇట్లు,
    సదా మీ సేవలో, మీ
    అప్పి-బొప్పి

    రిప్లయితొలగించండి
  26. నాకైతే అమృతం సీరియల్ లోని అమృతరావు చిన్నప్పటి జ్ఞాపకంలా అనిపించింది.

    రిప్లయితొలగించండి
  27. భాస్కర్ గారు. దుంపల బడి అంటే మా ఉత్తర కోస్తా బాషలో తెలుగు మీడియం స్కూల్. మధ్య కోస్తాలోని రాజమండ్రిలో కూడా తెలుగు మీడియం స్కూళ్లని దుంపల బడులనే అంటారు. చిన్నప్పుడు చింత పండు కాదు కానీ చింత ఆకులు కడుక్కుని తినేవాళ్లం.

    రిప్లయితొలగించండి
  28. టికెట్ ముందే బుక్ చేసుకున్నా మొదటి ఆటకి రాలేకపోయినా....బొమ్మ బాగుంది. చిన్నప్పటి ఙ్ఞాపకాలన్నీ నిద్ర లేచాయి.

    రిప్లయితొలగించండి
  29. BRILLIANT!!
    దీనికి ట్రెయిలర్ టపా చదివి, ఇంత బిల్డప్పెందుకో అనుకున్నా గానీ - It was worth it.

    రిప్లయితొలగించండి
  30. ద్రౌపదీ స్వయంవరం ; చిల్ల పెంకు తాళి బొట్టు, దూర్వాసుని శాపం - గురించి, ఆ చిన్న వయసులో మీకు తెలుసునా?
    అహ్హహ్హాఆఆ!!!!!!!!!!!!!!
    :->) :->) :->) :->) :->)

    రిప్లయితొలగించండి
  31. ప్రవీణ్ మీకలా అనిపించినందుకు ధన్యవాదాలు

    సౌమ్యా, ఎప్పుడు చూస్తే ఏముంది కానీ బొమ్మ హిట్టా ఫట్టా అన్నదే కావాలి :)

    కొత్తపాళీ గారూ, ధన్యవాదాలు

    కోణమానిని గారూ, అప్పుడే కాదు , ఇప్పటికీ ఈ దుర్వాసుని కథకు ద్రౌపదీ స్వయంవరానికి లింకేమిటే తెలియదండి. మీకు నవ్వులు పంచినందుకు ఆనందంగా వుంది

    రిప్లయితొలగించండి
  32. చాలా బావుంది సర్. మీ ఇమెయిల్ ఇవ్వగలరా.

    రిప్లయితొలగించండి

Comment Form