7, అక్టోబర్ 2015, బుధవారం

మా ఊరి వార్త - కొన్ని జ్ఞాపకాలు

మా ఊరి వార్త మంచిదో చెడ్డదో  రెండు పేపర్లలో కనిపించేటప్పటికి నాకు ఎక్కడలేని ఆనందమేసింది :-). నేను ఎప్పటినుంచో మా ఊరి పేరు ఒక్కసారన్నా పత్రికల్లో వస్తే చూడాలని కళ్ళు కాయలు కాచేటట్లు ఎదురు చూస్తున్నాను. ఇంతకు ముందెప్పుడన్నా వచ్చేయామో నాకు తెలియదు కానీ, నేను అసెంబ్లీ నియోజకవర్గ పేపర్లు చదవడం మొదలు పెట్టిన తరువాత మా ఊరి పేరు వార్తాపత్రికల్లో ఒక వార్తగా  చూడడం ఇదే ప్రధమం. సెప్టంబరు 28,2015 నాడు సాక్షి, ఈ నాడు లోని వార్త యిది. ఈనాడులో ఊరి పేరుని తప్పుగా జిల్లెలపాడు అని వ్రాశారు.కానీ మా ఊరి పేరు జెల్లెళ్ళపాడు.ఆంధ్రజ్యోతి కి వెలిగండ్ల మండలానికి విలేకరి లేనట్లున్నాడు కాబట్టి మా మండల వార్తలు ఆంధ్రజ్యోతిలో  బహు అరుదుగా కనిపిస్తాయి.

ఈనాడు వార్త



సాక్షి వార్త




రెండు ఊర్లగా ఉండే పాతూరు,కొత్తూరు లను కలిపి జిల్లెళ్ళపాడు అని పిలుస్తారు. పాతూరు కు కొత్తూరు కు మధ్యలో కొంత పొలమడ్డు. రెండు ఊర్లలో కలిపి దరిదాపు ఓ నూటాయాభై ఇళ్ళుండేవి. మాల,మాదిగ కాలనీలను కూడా కలుపుకుంటే ఓ రెండొందలపాతిక ఇళ్ళుండేవి. జిల్లెళ్ళపాడు మండలకేంద్రమైన వెలిగండ్ల కు 2.5 కి.మీ దూరంలో వుంటుంది. ఊరికి బస్సు సౌకర్యం లేదు. కరెంటు వున్నా కానీ తొంభై శాతం ఇండ్లకు కరెంటు సౌకర్యం లేదు.కిరోసిన్ బుడ్లనే వుపయోగించేవాళ్ళు. కిరోసిన్,బియ్యము,చక్కెర ఊరికి రెండుకిలోమీటర్ల దూరంలో నున్న గోకులం  రేషన్ షాపునుంచి తెచ్చుకొనే వాళ్ళము. మంచినీళ్ళూ కావాలంటే ఊరికి ఆనుకొని ప్రవహించే వాగు ఒడ్డున చెలములు తీసుకొని ఆ చెలముల్లో ఊరిన నీటిని తోడుకొని తీసుకొని వచ్చేవాళ్ళం. ఊర్లో ప్రాధమిక పాఠశాల మేడం నాగిరెడ్డి వాళ్ళింట్లో వరండా లో వుండేది. తరువాత 1980 దశకం చివర్లో ప్రాధమిక పాఠశాల కు విడిగా ఒక గది కల్గిన బడిని కట్టించారు. పిల్లలు ఐదవతరగతి వరకు ఇక్కడ చదివి ఆరునుండి పది వరకు చదవడానికి మధ్యాహ్న భోజన కేరియర్ లు తీసుకొని మండలకేంద్రమైన వెలిగండ్లకు నడిచి వెళ్ళేవారు. నా విద్యాభ్యాసం ఐదవతరగతి వరకు మా చిన్నాయన వాళ్ళ దగ్గర గడిచినా ఆరునుండి పది వరకు వెలిగండ్లలోనే జరిగింది.వెలిగండ్ల హైస్కూల్ లో చదువులు అంతంత మాత్రమే వుండేవి.చదువుకొనే పిల్లలలో ఎక్కువ శాతం వ్యవసాయ దారుల, వ్యవసాయ కూలీల పిల్లలే. హైస్కూల్లో ఆరవతరగతి నుండి పదవ తరగతి వరకు నేను చదివిన రోజుల్లో ఓ 180-200 మధ్య వుండేవారు.స్కూలు కు ఆరేడు కిలోమీటర్ల దూరం నుంచి కూడా నడిచి వచ్చేవాళ్ళు.బడిలో చెప్పిన పాఠాలే తప్ప హోమ్ వర్క్ లతోటి విసిగింపూ వుండేది కాదు.బడినుంచి ఇంటికి నడిచి వెళ్తూ దారిలో వున్న పొలాల్లో దోసకాయలు,అలసందలు మొదలైనవి తింటూ సంక్రాతి నెల వచ్చిందంటే చెలకలలోని రేగి పండ్లు తింటూ హాయిగా ఇల్లుచేరేవాళ్ళము. నేను పదో తరగతిలో వున్నప్పుడు మా ఊరి బడి పిల్లలకు నేనే నాయకుణ్ణి.అంటే వాళ్ళు తినడానికి పొలాల్లో కోసుకున్న ప్రతి దాంట్లో నాకు భాగమియ్యాలన్న మాట :-)

పల్లెటూళ్ళు కాబట్టి వైద్య సౌకర్యాలుండేవి కావు. మండల కేంద్రమైన వెలిగండ్ల లో కూడా ఒక RMP డాక్టరు మాత్రమే వుండేవాడు.ఆ డాక్టరు అసలు పేరేమిటో తెలియదుకానీ అందరూ పిచ్చి డాక్టరనేవారు. నా చిన్నప్పుడు కండ్లకలకతోటి నాకన్నులు మూసుకొని పోతే ఆ డాక్టరే నయం చేశాడు.తరువాత కొద్ది రోజులకు పిచ్చి డాక్టరుకూడా ఊరు విడిచి వెళ్ళిపోయారు.అప్పుడు జనాలకు దిక్కు తాలూకా కేంద్రమైన కనిగిరి నే.ఐనా అదేమి కాలమో కానీ అలా వాగులోనుంచి తెచ్చుకున్న నీరు తాగినా అంత త్వరగా జబ్బున పడేవాళ్ళము కాదు.

ఇక నా చదువు విషయానికొస్తే మొట్టమొదటి సారిగా ఏడవతరగతి త్రైమాసిక పరీక్షలలో తెలుగు పరీక్షకు కాపీ పెట్టాను.అదికూడా తిరుమల-తిరుపతి అనే పాఠ్యానికనుకుంటా. దీనికి ప్రేరణ నా సీనియర్స్, పదవతరగతి చదువుతున్న మా ఊరి విద్యార్థులు. వాళ్ళను చూసి చెడ్డీ కి క్రిందభాగంలో అంచుగా కుట్టిన కుట్లు విప్పి మరీ కాపీదాచాను. ఆ ప్రశ్న పరీక్షలో రాలేదు కానీ నాకు చాలా భయమేసింది.ఒకవేళ పట్టుకుంటే స్కూల్లో పరువేమైపోతుందని. ఆ తరువాత మళ్ళీ హైస్కూల్లో ఎప్పుడూ కాపీ పెట్టలేదు. ఏడవతరగతిలో మాకు సోషల్, లెక్కలకు సుబ్బారావు అనే అయ్యవారు వచ్చేవారు. చదువు పెద్దగా చెప్పకపోయినా క్లాస్ రూమ్ లో హరిశ్చంద్ర నాటకంలోని పద్యాలు బాగా పాడేవాడు. ఆ రకంగా ఆయన గుర్తువున్నాడు. ఇంగ్లీషుకు మస్తాన్ అయ్యవారు ,హిందీ కి సరళాబాయి  టీచరు వచ్చేవారు. తెలుగు, సైన్స్ ఎవరు చెప్పారో ఏమిచెప్పారో కూడా సరిగా గుర్తు లేదు. 

ఏడవ తరగతినుండి ఎనిమిదవ తరగతికి వచ్చినప్పుడు చలమారెడ్డి అని లెక్కల టీచర్ ను ట్రాన్స్ఫర్ చేస్తే 8,9,10 తరగతి పిల్లలమందరమూ పంచాయితీ ఆఫీసు వరకు టీచర్ ను ట్రాన్స్ఫర్ చెయ్యవద్దని స్లోగన్స్ తో వెళ్ళి వచ్చాము. 9,10 తరగతి పిల్లలకు ఆయన లెక్కలు బాగా చెప్తాడని పేరుండేది. కానీ ఆయన ట్రాన్స్ఫరైపోయిన ఒక్క నెలలోపే చిన్నకోటయ్య అనే లెక్కల అయ్యవారు వెలిగండ్లకొచ్చారు.ఈ టీచర్ ఆయనకంటే బాగా చెప్పేవాడు.దానితో నాకు లెక్కలపై ఆసక్తి పెరిగింది. 8,9,10 తరగతులలో తెలుగు కు మా చిన్నాయన మెడం సుబ్బారెడ్డి, హిందీ కి సరళాబాయి,సైన్స్ కు ఆవులనారాయణ రెడ్డి, ఇంగ్లీష్,సోషల్ కు రవీంద్రనాథ్,లెక్కలకు చిన్నకోటయ్య అయ్యవార్లు చెప్పేవారు. నేను తొమ్మిదిలో వుండగా హిందీ టీచర్ సరళాబాయి ట్రాన్స్ఫరై వెళ్ళిపోవడంతో పిడుగు పాపిరెడ్డి టీచర్ వచ్చాడు. ఈయన ఆమె కంటే బాగా చెప్పేవాడు. పదవతరగతి ఇంగ్లీషు చెప్పడానికి  మా హెడ్మాష్టర్ గాలిరెడ్డి గారొచ్చేవారు. 

వెలిగండ్లలో శాఖాగ్రంధాలయముండేది. ఇప్పుడు పని చేస్తుందో లేదో తెలియదు కానీ, ఆరోజుల్లో ప్రతిరోజు తీసి వుంచేవాళ్ళు. నా సహాధ్యాయి చిలకల నాగిరెడ్డి ఎనిమిదవతరగతిలో వుండగా  గ్రంధాలయానికి వెళ్ళి శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం పుస్తకం తీసుకొని వచ్చాడు.వాడి దగ్గర ఆ పుస్తకం తీసుకొని సగం చదవగానే నా పుస్తకం నాకిమ్మని లాక్కున్నాడు. బోడి నువ్వేందోయ్ నాకిచ్చేదని నేను లైబ్రరీకెళ్ళి అక్కడి లైబ్రేరియన్ ను పుస్తకాలు ఇంటికి తీసుకొని వెళ్ళి చదువుకుంటానంటే ఓ చూపు చూసి ఇక్కడే కూర్చొని చదువుకో అని చెప్పేసింది. వారంలో ఒక రోజు అలా వెళ్ళి ఓ పదినిమిషాలు కూర్చుని చదువుకొని వస్తుండేవాడిని. కానీ మాయదారి బుద్ధి ఊరుకోదుకదా. ఓ రోజు ఎలాగైనా ఒక పుస్తకాన్ని ఇంటికి తీసుకొని పోయి చదవాలని నిర్ణయించుకొన్నాను. అడిగితే ఇవ్వలేదు. సరే ఇలాగుందా నీపనని ఆ పుస్తకాన్ని చల్లగా లైబ్రేరియన్ చూడకుండా నా పుస్తకాల సంచిలో సర్దేసి కాసేపు వేరే ఏదో పుస్తకాన్ని తీసుకొని చదివినట్లు నటించి బయటకు వస్తుంటే నా సంచీ చూడాలని ఆపింది :-). ఇంకే ముంది దొంగ దొరికి పొయ్యాడు :). ఆనాటినుంచి నేను మళ్ళీ వెలిగండ్ల లైబ్రరీ గడప తొక్కితే ఒట్టు :-). 

మా ఊరిపేరు వార్తాపత్రికల్లో చూడగానే గతమంతా రీళ్ళు రీళ్ళు మదిలో మెదిలింది. పుట్టి పెరిగిన ఊరిని 1990 లో వదిలేసి వచ్చేశాము. చివరి సారిగా 2008 లో ఆ ఊరికి వెళ్ళి వచ్చాను. మరికొన్ని విశేషాలు మరొకసారి.

2 కామెంట్‌లు:

  1. Reddy garu
    i read your blog regularly
    I live in NY now
    in 94-95 i worked in Veligandla PHC as medical officer
    i had been to all the villages around, some places by jeep and some by bicycle
    Enjoyed my 8 months working there
    used to live in kanigiri and take RTC bus outside govt hospital everyday
    i still vividly remember those days, especially rainy days
    it was an effort to make it on muddy roads
    SB

    రిప్లయితొలగించండి
  2. Anon (SB) , I am Glad to hear that some one who actually heard and worked in our villages read my post from our neighboring state ( I live in NJ ) and remembered those days.It is really worth noting there is one another blogger who knows the geography of Veligandla mandal. You must have hated our villages for those muddy roads,but that is the reality,I guess even today, for the people who lives there.

    రిప్లయితొలగించండి

Comment Form