
పగలంతా..
భూమత కష్టాన్ని
ఆమె దరిద్రాన్ని
దాశ్యత్వాన్నీ దానవత్వాన్నీ
రాచరిక దాపరికాన్నీ
రాటుదేలిన హృదయాల్నీ
కండలు పిండే కష్టాన్ని
కరుడు గట్టిన కాఠిన్యాన్ని
ఆర్తిగా చూసే అన్నార్తుల్నీ
కన్నీరింకిన పసి మోముల్ని
అంబరాన అశక్తి తో
మూడు కళ్ళు విప్పి మరీ చూస్తున్నాడు
రేయంతా రెండు కనులు మూసినా..
చీకటి బజారులో
భయంలేక తిరిగే రారాజుల్నీ
రక్తపు మడుగుల్లో
అసహాయంగా ఏడ్చే యువరాజుల్నీ
ఆ ఏడుపు జోలపాటగా
నిదురించే రాబందుల్నీ..
కృత్రిమ హరివిల్లు పరదాలక్రింద
నర్తించే నంగనాచి తుంగబుఱ్ఱల్నీ
ముప్పొద్దుల మోసపోయిన మానినిలనూ
మూడోఝామున మూడు నోట్లు లెక్కంచే పడతులనూ
మైకంలో మాయమైన ఆలోచనలతో
మమేకంలో మంటగలిసిన స్నేహబంధాల్నీ
పర్యాలోచన నశించి నిశీధి నీడలో నడిచే భావిపౌరుల్నీ
విరూపాక్షని మూడో కన్ను
మూడు ఝాములా విప్పార చూసింది.
తెల్లవారబోతుండగా సిగలోని అమరాపగ విప్పి
నాలుగు హిమ బిందువులు విదిల్చాడు
గతిలేని భూమాత
అభ్యంగన పునీత యైనది.
మళ్ళీ ఎప్పటి లాగే ...
ఉషోదయాన గాలి పులకింతలు
తన్మయాన తలలూపే తరుణీ లతలు
విరులు విసిరే విరజాజి వీచికలు
కోనేటి రాయుని కీరవాణి రాగాలు.