6, అక్టోబర్ 2010, బుధవారం

ఇళ్ళలో పెళ్ళాలు పెట్టే శాపనార్థాలు.

"యతి" నియమాల గురించి ఈ మధ్య కొంచెం చదువుతున్నా. ఏదో అర్థమయిందికానీ ఒక చిన్న సందేహం పట్టి పీడిస్తుంది. నేను చదివిన పుస్తకంలో "యతి" కి అర్థం ఈ విధంగా వుంది.

"సంస్కృతమున యతి అనగా విరామము.అనగా కొన్ని పదముల పిమ్మట విరామము అని అర్థము" అన్నారు. అంటే పద్యాల్లో యతి తప్పకుండా క్రొత్త పదంతో మొదలైనప్పుడే కదా విరామము తెలుస్తుంది, వ్రాసే టప్పుడైనా పద్యం పాడేటప్పుడైనా. కానీ తెలుగులో చాలా సందర్భాలలో యతికోసమే సంధులను వాడిన ప్రయోగాలు కనిపిస్తాయి కదా. ఇలా సంధిపదాలతో యతిని ప్రయోగించడం తెలుగులో మాత్రమే జరుగుతుందా లేదా సంస్కృత మరియు ఇతర భాషలలో కూడా జరుగుతుందా? తెలిస్తే వివరించగలరా?

ఇక అసలు విషయానికి వస్తే అందరి మొగుళ్ళ లాగే పెళ్ళాం నిద్ర లేపేదాకా ఏరోజూ మంచం మీదనుండి దిగలేదు. సమయం ప్రొద్దున 7:20. అప్పటికే మా పెద్దపాప స్కూల్ కి వెళ్ళి అరగంట పైనే అయ్యుంటుంది. రెండో పాప స్నానం చేసి అల్పాహారం తినడానికి సిద్ధమౌతుంది. మరి పొద్దున లేచి ఇద్దరు పిల్లల్ని తయారు చేసి బ్రేక్ ఫాస్ట్ క్రింద ఇడ్లీలు చేసి, ముగ్గురికి లంచ్ బాక్స్ లు రెడీ చేసి మధ్య మధ్యలో ముక్కు చీది నానా తంటాలు పడుతూ ఎప్పటిలాగే మొగుడికి శాపనార్థాలు పెడుతుంటే, ఓ చెవితో విని మరో చెవితో అలా వదిలేసి గబా గబా తయారై రైలెక్కాక అనిపించింది. పాపం నిజమేకదా అని, అందుకని నాకు చేతనైనంతలో సహాయం చేద్దామని ఈ చిన్న పద్య ప్రయత్నం.

ఇది సరాదాకోసం నా సతీమణి పేరు వాడుకున్నా సాధారణంగా స్త్రీ మనస్తత్వమిది.మగవాళ్ళు ఎంత సహాయం చేసినా గై గై మని ఒకప్రక్క అరుస్తూనే అసలు కొద్దిగా కూడా దయలేదని శపిస్తూనే వుంటారులెండి. అలా అని సహాయానికి పొయ్యామో మనం చేసే ఒక్కపనీ నచ్చదు మరి. కాబట్టి సహాయనిరాకరణోద్యమమే మేలు కదా ;)

ఈ పద్యం తరలము. గణములు న భ ర స జ జ గ. యతి అక్షరం 12.

నేననుకున్న ట్యూన్

తనన తానన తాన తానన
తాన తానన తాననా

పద్యం
ఇలను ఁజూడగ నెంత బాధ్యత, ఇల్లు మొత్తము ఁ నీదగా
చలన యంత్రము నైతి నెప్పుడొ, సర్దు బాటను పట్టగా
అలసి పోయిన స్త్రీని ఁ జూడగ, ఆకు రాల్చెను కొమ్మలున్
కలను కూడను భర్త గారికి, కళ్ళ రాలవు బిందువుల్

29 కామెంట్‌లు:

  1. "రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా" లాగ అనిపిస్తొంది

    రిప్లయితొలగించండి
  2. హ హ. అందుకే నేనో సులభమయిన చిట్కా కనిపెట్టా. శుబ్బరంగా నా అంతట నేను లేచి, టీ తాగేసి, లంచ్ కట్టుకొని ఆఫీసుకి వెళ్ళిపోతా. మా ఆవిడ లేచి చూస్తే తిట్టడానికి నేను దొరకను. 'సాయంత్రం వస్తావు కదా, అప్పుడు నీ సంగతి చెప్తా' అని పళ్ళు నూరుకుంటుందేమో తెలియదు కానీ అప్పుడప్పుడు ఆఫీసునుండి రాగానే అడ్డంగా దొరికిపోతుంటాను. ఈ మధ్య డాన్ శీను చూసేకదా. మా ఆవిడ శాపనార్ధాలు పెట్టినప్పుడలా బెబ్బే అంటున్నాను అమాయకంగా. ఇవాళ కూడా నేను బెబ్బే అనాల్సివచ్చేట్టుగావుంది.

    రిప్లయితొలగించండి
  3. భాస్కర్ గారు,
    :-) బాగుంది. కే కే గారన్నట్టు,.. రాయినైనా.. లా ఉంది.
    ' ఇల్లు మొత్తము ఁ నీదగా' అర్థం కాలేదు..

    రిప్లయితొలగించండి
  4. మగజాతి సమస్తం ఇంతేనన్నమాట!మళ్ళీ ఎదురు పాటలు కూడా! హ్హు

    రిప్లయితొలగించండి
  5. "సంసార(సాగర)ము నీదఁగా" వంటిది. పాపం! ఆవిడకు ఇల్లే సాగర మయింది. మొత్తానికి పద్యం అలరించింది.
    ఇక యతి విషయం ....

    విశ్రాంతి విరతి విశ్రమ
    విశ్రామ విరామ విరమ విరమణము లనన్
    విశ్రుత మగు యతి కృతి నధి
    కశ్రావ్యంబై బెడంగుగా నిడవలయున్.

    అని సులక్షణ సారంలో యతికి విశ్రాంతి, విరతి, విశ్రమం, విరామం, విరమం, విరమణం అని పర్యాయపదాలు చెప్పాడు. స్థూలంగా చూస్తే యతిస్థానం నుండి కొత్తపదాన్ని ఎత్తుకోవాలనే భావం స్ఫురిస్తుంది. కాని నిజానికి పద్యం నడకలో యతిస్థానం దగ్గరికి వచ్చే సరికి ఒక సున్నితమైన కుదుపు లాంటిది ఉంటుంది. అక్కడి నుండి కొత్తపదం ప్రారంభమైనా, అక్కడ సమాసాంతర్గత పదంలోని ఏ అక్షరమున్నా పద్య పఠనంలో ఆ అక్షరాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ఈ కుదుపు స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని పద్యాలను చదివి (వీలైతే రాగయుక్తంగా పాడుకొని) చూడండి. మీకే తెలుస్తుంది.

    రిప్లయితొలగించండి
  6. సంస్కృత శ్లోకాల్లో, మీరు చెప్పినట్టు యతి స్థానంలో కొత్త పదం మొదలవ్వాలి అన్నదే యతి నియమం. తెలుగులోలా అక్షర సామ్యం ఉండక్కర లేదు. ఉదాహరణకి (యాకుందేందు శ్లోకం నాలుగో పాదం):

    సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా

    ఇది మత్తేభ వృత్తం. పదమూడో అక్షరం యతి. "నిశ్శేష" అని కొత్త పదంతో మొదలయ్యింది. "సా"కి "ని"కి మన తెలుగు యతి (అక్షర సామ్యం) కుదరదు కదా. మన తెలుగు యతి తమిళ ఛందస్సునుండి వచ్చింది. తమిళంలో దాన్ని "వళి" అంటారు. దీనికి కొత్త పదంతో మొదలవ్వాలన్న నియమం లేదు. అక్షర సామ్యం ఉంటే చాలు. అందుకే తెలుగు ఛందస్సులో "యతి"ని "వళి" లేదా "వడి" అనాలని సంపత్కుమారాచార్యగారు అన్నారు. అయితే మీ పద్యంలో వేసినట్టు రెండు రకాల యతులు వేస్తే, తరలంలాంటి పద్యాలకి (ప్రత్యేకమైన నడకున్నవి) మరింత అందం వస్తుంది.

    అవును "రాయినైనా కాకపోతిని..." పాట తరలం ఛందస్సులో లేకపోయినా నడక మాత్రం ఇదే!

    రిప్లయితొలగించండి
  7. శరత్, హహ హా.. అయితే మీరు నాలాగే భార్యా విధేయుడే అన్నమాట ;-). విధేయత చూపిస్తేనే పరిస్థితి ఇలా వుంది. ఇక చూపించకపోతే ఎలా వుంటుందో కదా ! ;-)
    అవును "డాన్ శీను" కు మనము వ్యూహాత్మక మౌనం పాటించడానికి రిలేషనేంటభ్భా? అర్థంకాలేదు. సినిమా కూడా చూడ లేదనుకోండి. మరి నిన్న దొరికారా? ఇంతకీ ఎందుకు దొరికారు? పరిష్కారంగా ఎన్ని శాపాలు లభించాయి? ;)

    రిప్లయితొలగించండి
  8. కృష్ణప్రియగారూ, అబ్బ ఎన్నిరోజులకిటు తొంగిచూసారబ్బా ;-) మా మనసు రాయి చేసుకోకపోతే మీ ఆడవారు దొర్లించే రాళ్ళను భరించడం మహా కష్టం సుమీ :-)

    "ఇల్లు మొత్తము ఁ నీదగా" అంటే.. ఇల్లు మొత్తమున్ ఈదగా అని. అంటే ఇంటి మొత్తము పనిని తనొక్కటే చేయడం. ఆ పాదంలో అది బాగాలేదు అనుకుంటే " ఇంటి చాకిరి చెయ్యగా " అనుకున్నా ఎటువంటి లోపమూ వుండదు.

    రిప్లయితొలగించండి
  9. సిరిసిరిమువ్వ గారూ, మగజాతికి అది " It's a feature. it's not a defect, so you can not fix it :-)"

    అయినా పాట/ పద్యం లో నేను తననే సపోర్టు చేసా కదండీ.

    తన కష్టాన్ని చూసి కొమ్మలైనా ఆకులు రాలుస్తున్నాయే గానీ , ఈ మొగుడికి కనీసం కలలో కూడా కళ్ళమ్మటి నీరు కారదని :(

    రిప్లయితొలగించండి
  10. కంది శంకరయ్య గారూ మీరుదహరించిన యతి పద్యం భలే వుంది. మీ సలహాను తప్పక పాటిస్తానండి.

    పద్య సంస్కృతిని తెలుగు పాఠకులకు
    నతి సులభమగు పద నడతల నుడి
    వెడి గురోత్తమా మీకు నివే నెనరులు
    పద్య విద్య నేర్ప పరులు యేల?

    రిప్లయితొలగించండి
  11. సునీత గారూ, మీరూ మీరూ ఒకటే అందుకే ఈ మూతి విరుపుళ్ళూ సపోర్టులున్నూ :)

    రిప్లయితొలగించండి
  12. డాన్ శ్రీను చూడలేదా. చూడండి, సరదాగా వుంటుంది, ఓ సారి అయినా చూడొచ్చు. అందులో రవితేజ కొద్దిసేపు మూగవాడిగా నటిస్తాడు. మనం బెబ్బే అంటే ఎదుటి అర్ధం కాక ఒహో నువ్వు చెప్పేది ఇదా అని వారే మనకు హింట్లు ఇస్తారు. దేనికోదానికి తలఊపితే చాలు, మన పని అయిపోతుంది. ఏంటోనండి నిన్న ఆలస్యంగా ఇంటికి వచ్చినా నేను బెబ్బే అనాల్సిన అవసరం రాలేదు. మా వాళ్ళు అలాకూడా షాకులిస్తారు.

    రిప్లయితొలగించండి
  13. కామేశ్వర రావు గారూ, చాలా వివరణగా చెప్పారు. మీరు చెప్పేదాకా నాకు తమిళంలో పద్యాలుంటాయని తెలియదు. అయితే సంస్కృతమొస్తే మన తెలుగు పద్యాలకంటే సంస్కృత పద్యాలు వ్రాయడమే సులభమేమో కదా? ఏంచక్కా ప్రాస, యతి లేకుండా గణాల వరకూ చూసుకుంటూ వ్రాసుకోవడమే కదా. అయితే హిందీలో కూడా పద్యాలుంటాయా?

    ఆర్యా భైరవ భట్లా
    చార్యా పలుయతి గతులను సరళము నుడువన్
    చౌర్యము ఁజేసితి రయ్యా
    పర్యాయముగ నిదె, కంద పద్యము నార్యా!

    రిప్లయితొలగించండి
  14. కామేశ్వర రావు గారూ,
    పైన పద్యంలో మదిని చౌర్యం చేసారు అని వ్రాయాలనుకునా కానీ ఆ పదాన్ని ఎక్కడ పెట్టాలో తెలియలెదు :(

    రిప్లయితొలగించండి
  15. హ హా శరత్..ఈ ట్రిక్ ఏదో బాగుంది. ఇక నేనూ ట్రై చేస్తా :-)

    రిప్లయితొలగించండి
  16. ఏమైనా అంటే అన్నానని ఇంకో పద్యం రాస్తారు ఎందుకు చెప్పండి అందుకే గప్ చుప్:)

    రిప్లయితొలగించండి
  17. శంకరయ్య గారూ పైన గురూత్తమ బదులు గురోత్తమ అని దోషంగా పడింది.క్షమించగలరు. అసలు గురూత్తమ అని వాడవచ్చా?

    రిప్లయితొలగించండి
  18. పద్మార్పితా.. :) ( ఒక చిరునవ్వు అన్నమాట )

    రిప్లయితొలగించండి
  19. భాస్కర్ గారూ,

    తొంగి చూస్తూనే ఉంటాను కానీ,.. పద్యాలని విశ్లేషించేంత పరిజ్ఞానం ఉండదు నాకు.. :-( కంది శంకరయ్య గారిదీ, మీదీ, రెగ్యులర్ గానే చూస్తాను.

    'ఇల్లు నీదగా' కన్నా.. ఇంటి చాకిరీ చేయగా.. నచ్చింది నాకు.

    రిప్లయితొలగించండి
  20. కేకే, నిజమేనండోయ్ మీవ్యాఖ్య చూసే దాకా స్ఫురణకే రాలేదు నాకు. కొంచెం జాగ్రత్తగా చూసినట్లైతే

    "రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా" లో " రాయినైనా " ప్రక్కన పెడితే మిగతా గణాలు కూడా సరిపోతాయి. ఇక రాయినైనా చేర్చి మాత్రలు చూస్తే

    రాయినైనా = UIUU= 7 మాత్రలు (ఒక గురువు రెండు మాత్రలు)

    నాపద్య పాదాల్లో మొదటి రెండు పదాలు

    ఇలను ఁజూడగ = IIIUII= 7 మాత్రలు
    చలన యంత్రము= IIIUII= 7 మాత్రలు
    అలసి పోయిన = IIIUII= 7 మాత్రలు
    కలను కూడను = IIIUII= 7 మాత్రలు


    మంచి పాటను గుర్తు చేసారు. నెనరులు.

    రిప్లయితొలగించండి
  21. కృష్ణప్రియ గారూ Articles చదువుతున్నందుకు ధన్యవాదాలండి. మొదట్లో పద్యాలంటే నాకూ భయంగానే వుండేదండి. కానీ నిజానికి మనకు పద్య గణాలు బాగా గుర్తుంటే ఇదే సులభమేమో అనిపిస్తుంది. వృత్తాలకైతే ప్రాసలు అవి ఇవీ కావాలకానీ గీత పద్యాలకైతే ఏంచక్కా ఎన్ని గణాలో. మనకిష్టమైన పదాలను వాడుకోవచ్చు కూడా. అందుకని యతి కూడా పెద్ద కష్టం కాదేమో. మీరే ప్రయత్నించి చూడండొకసారి.

    రిప్లయితొలగించండి
  22. మీరు శంకరయ్యగారికి వ్రాసిన పద్యము ఏపద్యమండీ :)

    రిప్లయితొలగించండి
  23. విమల గారూ అడిగారూ :-), అది ఏ పద్యమూ కాదండి. వారు చేస్తున్న ఆట వెలది / తేటగీతి పద్యాల కృషిని దృష్టిలో పెట్టుకొని 1,3 పాదాలు తేటగీతిలో 2,4 పాదాలు ఆటవెలదిలో వ్రాసిన మాటలవి.పద్యము కాదు.

    రిప్లయితొలగించండి
  24. మీ కందం చదివి మొదట ఖంగారు పడ్డాను! :-) "చౌర్యము జేసిరి నా మది" అంటే సరిపోతుంది కదా :-)
    అవును, సంస్కృతం వస్తే అందులో పద్యాలు రాయడం సులువే. హిందీలో వృత్త పద్యాల్లాంటివి లేవనుకుంటా. మన ద్విపదల్లాగా దోహేలున్నాయి. ఇంకా అలాంటి మాత్రా ఛందస్సులే ఉన్నాయనుకుంటా.

    రిప్లయితొలగించండి
  25. ప్చ్..అందుకేనండీ కామేశ్వర రావు గారూ మిమ్మల్ని ఆచార్యా అన్నది. అది అసలు నాకు తట్టనే లేదు :)

    రిప్లయితొలగించండి
  26. పద్య సవరణకు ధన్యవాదాలండి. అలాగే వివరణకు కూడా.

    సవరించిన పద్యంతో వ్యాఖ్యను పునః ప్రచురిస్తున్నాను. చదివే వాళ్ళు నన్ను తిట్టుకోకుండా జాగ్రత్త అన్నమాట :)

    -----------------------------
    "కామేశ్వర రావు గారూ, చాలా వివరణగా చెప్పారు. మీరు చెప్పేదాకా నాకు తమిళంలో పద్యాలుంటాయని తెలియదు. అయితే సంస్కృతమొస్తే మన తెలుగు పద్యాలకంటే సంస్కృత పద్యాలు వ్రాయడమే సులభమేమో కదా? ఏంచక్కా ప్రాస, యతి లేకుండా గణాల వరకూ చూసుకుంటూ వ్రాసుకోవడమే కదా. అయితే హిందీలో కూడా పద్యాలుంటాయా?

    ఆర్యా భైరవ భట్లా
    చార్యా పలుయతి గతులను సరళము నుడువన్
    చౌర్యము ఁజేసిరి నామది
    పర్యాయముగ నిదె, కంద పద్యము నార్యా!

    రిప్లయితొలగించండి
  27. ఓహో ఇలా పద్యాల తో కూడా నాటకాలాడతారన్నమాట ఊమ్హూ !

    రిప్లయితొలగించండి
  28. మాలాకుమార్ గారూ, ఈ మాత్రమన్నా నాటకాలాడకపోతే ఇంట్లో అస్సలు మాకు సపర్యలే జరగడం లేదు మరి :)

    రిప్లయితొలగించండి

Comment Form