23, ఫిబ్రవరి 2013, శనివారం

A great song and composition - జయమంగళం నిత్యశుభమంగళం

ఓ వారం క్రితం నా ఐఫోన్ లో ఎప్పుడో రెండేళ్ళ నాడు ఎక్కించిన పాటలను తీసివేసి క్రొత్తగా పాటలను upload చేసాను. Travel లో అలా అన్ని పాటలను వింటూ వుంటే ఓ రోజు ఈ క్రింది పాట వినిపించింది. మొదటిసారి విన్నాను. ఇదేదో బాగుందే అని రెండోసారి, మూడోసారి....వందో సారి వినివుంటాను. సాహిత్యమెంతబాగుందో దానికి పోటీగా వుంది సంగీతం. సరిగమల తొలి పాఠాలు రాని నాకు కూడా పాట పాడిన వారు కూడా అద్భుతంగా పాడినారనిపించింది. తరువాత వివరాలకోసం వెతికాను. "తరిగొండ వెంగమాంబ" సినిమా అని తెలిసింది కానీ, ఈ సినిమాలో యిన్ని మంచిపాటలు పెట్టుకోని ఎందుకు పాపులర్ కాలేదో! ఒకవేళ జనాలందరికి తెలిసినా నాకు తెలియలేదేమో. ఏమైతేనేమి, సాహిత్యానికి తగ్గ సంగీతం కీరవాణి చక్కగా చేసారు.ఈ పాటను ఎవరెవరు పాడినారో నాదగ్గర సమాచారం లేదు. కానీ, గాత్రము కూడా చాలా బాగుంది. కొన్ని చోట్ల అమోఘం.సినిమా చూద్దామనుకుంటే యు-ట్యూబ్ లో దొరకలేదు.

ఈ పాట వింటూ వ్రాసిన పంక్తులివి. పాట కొన్నిచోట్ల అస్పష్టంగా వుండడము వల్లనో లేక  ఇప్పటి రోజులలో ఈ పదాలు వాడుకలో లేకపోవడం వల్లనో సాహిత్యంలో కొన్ని పదాలను నేను ఎప్పుడూ వినకపోవడం చేతనో కొద్ది పదాలకు నాకు అర్థాలు తెలియడం లేదు. అలాంటి పదాలు కొన్ని ఇక్కడ

౧) మరుగవలదీబిరుదు. ఇది మరువవలదీబిరుదు అని అనుకోవాలా?
౨) పరుష నళికించి(??). దీని అర్థమేమైవుంటుందో
౩) అందర కన్న మలయ : దీని అర్థమూ తెలియడం లేదు.
౪)
చి(?)రములైతగు : ఇది స్థిరములై తగు అని పాడారా లేక చిరములైతగు అనే పాడినారా? ఏదైనా అర్థం "చాలాకాలము నుండి" అని అర్థమే కాబట్టి ఇబ్బందేమీ లేదు.
౫)  శరధి సుతకును. ఇది కూడా సరిగా వినిపించడము లేదు. పాదార్థాన్ని బట్టి శరధి అనుకుంటున్నాను.

ఇక కొన్ని క్రొత్త పదాలకు అర్థాలు
౧) పన్నగము= పాము  ౨) అనిశము ( నిలయమందనిశంబు) = ఎల్లప్పుడు ౩) మురువు ( మురువొప్పు ) : సుందరము, శోభాయమానమైన ౪) అహి= పాము ౫) రహినొప్పు = సుందరమైన అని అర్థమా?

తెలియని పదాలు :
౧) వితతులు ౨) ప్రతతులు ౩) పొలుపొందు విశ్వప్రభుత్వ మూలంబునకు 


పాట
శ్రీ పన్నగాద్రివర శిఖరాగ్ర వాసునకు  పాపాన్ధకార ఘన భాస్కరునకు
ఆ పరాత్పరునకు నిత్యాన్నపాయిని యైన  మాపాలి అలమేలు మంగమ్మకు
జయమంగళం నిత్యశుభమంగళం
జయమంగళం నిత్యశుభమంగళం

శరణనన్నదాసులకు వరమిత్తునని బిరుదు ధరియించియున్నపరదైవమునకు
మరుగవలదీబిరుదు నిరతమని పతినీ ఏమరనియ్య నలమేలు మంగమ్మకు
జయమంగళం నిత్యశుభమంగళం
జయమంగళం నిత్యశుభమంగళం

ఆనంద నిలయమందనిశంబు వశియించి దీనులను రక్షించు దేవునకును
కానుకలనొనగూర్చి ఘనముగా విభుని సన్మానించు అలమేలు మంగమ్మకు
జయమంగళం నిత్యశుభమంగళం
జయమంగళం నిత్యశుభమంగళం

వరమొసగ నావంతు నరులకని వైకుంఠమరచేత చూపు జగదాత్మునకును
సిరులొసగ తనవంతు సిద్ధమని నాయకుని ఉరముపై కొలువున్న శరధి సుతకు
జయమంగళం నిత్యశుభమంగళం
జయమంగళం నిత్యశుభమంగళం

తెలివితో ముడుపులిటు తెమ్ము తెమ్మని పరుష నళికించి(??) గైకొనెడి అచ్యుతునకు
ఎలమి పాకంబు చేయించి అందర కన్న మలయ కెపుడొసగె మహామాతకు
జయమంగళం నిత్యశుభమంగళం
జయమంగళం నిత్యశుభమంగళం

మరియు చిత్ర విచిత్ర మంటపావళులకును తిరువీధులకు దివ్యతీర్థములకు
పరగ ఘనగోపుర ప్రాకారతతులకును చిరములైతగు కనక శిఖరములకు
తరచైన ధర్మసత్రములకును ఫలపుష్పభరిత శృంగారవన పంక్తులకును

మురువొప్పు ఉగ్రాణములకు బొక్కసములకు సరసంబులగు పాకశాలలకును
అహి వైరి ముఖ్య వాహనములకు గొడుగులకు రహినొప్పు మకర తోరణములకును
బహువిధ ధ్వజములకు పటువాద్య వితతులకు విహిత సత్కల్యాణ వేదికలకు
జయమంగళం నిత్యశుభమంగళం
జయమంగళం నిత్యశుభమంగళం

ధర చక్ర ముఖ్య సాధనములకు మణిమయాభరణ దివ్యాంబర ప్రతతులకును
కరచరణ ముఖ్యాంగ గణ సహితమై శుభాకరమైన దివ్య మంగళమూర్తికి
జయమంగళం నిత్యశుభమంగళం
జయమంగళం నిత్యశుభమంగళం

కలిక సుజ్ఞానాది కల్యాణ గుణములకు బలమొప్పునని తత్ప్రభావమునకు
బలగొనిన సకల పరివార దేవతలకును చెలగి పనులొనరించు సేవకులకు
జయమంగళం నిత్యశుభమంగళం
జయమంగళం నిత్యశుభమంగళం

అలరగా బ్రహ్మోత్సవాదులై సంతతము వలనొప్పు నిత్యోత్సవంబులకును
పొలుపొందు విశ్వప్రభుత్వ మూలంబునకు నలువొందు వర విమానంబులకును
జయమంగళం నిత్యశుభమంగళం
జయమంగళం నిత్యశుభమంగళం

అరయ తరిగొండ నరహరి యగుచు నందరికి వరములొసగె శ్రీనివాసునకును
మురియుచును విశ్వతోముఖునిట్లు భరియించి సిరుల వెలయుచునుండు శేషాద్రికి
జయమంగళం నిత్యశుభమంగళం
జయమంగళం నిత్యశుభమంగళం
జయమంగళం నిత్యశుభమంగళం


13 వ్యాఖ్యలు:

 1. పూజల్లో, పెళ్ళిళ్ళలో, మరి కొన్ని శుభాసందర్భాల్లో మంగళహారతి ఇచ్చే సమయాల్లో పాడే హారతి పాటల్లో ఈ "జయమంగళం నిత్య శుభమంగళం" ట్యూన్ ఇలానే ఉంటుందండీ. కొత్తగా కీరవాణి చేసినది కాదు. హారతి పాడే దేవత/దేవుడు తాలూకూ లిరిక్స్ మారతాయంతే. (నవరాత్రుల్లో అమ్మవారిపై పాడేది ఒకటి నాకు తెలుసు.) చివర్లో "జయమంగళం నిత్య శుభమంగళం" కామన్ అన్నమాట. ఈ సినిమా ఎందుకు ఆడలేదో తెలీదు మరి. ఓసారెప్పుడో టివీలో వేసారు.

  మీరు సాహిత్యం అంతా రాయటం బావుంది. (మేం దాచుకోవటానికి:))Thanks for sharing. మీ సాహిత్యపరమైన మీ సందేహాలు ఎవరైనా తెలుగు పండితులు తీర్చాలి మరి..

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. తృష్ణ గారూ అవునా? ఈ విషయం నాకు తెలియదండి. నేను మొదటిసారి విన్నాను కానీ ట్యూన్ ఎవరు కనిపెట్టారో కానీ సూపర్. అలాగే పాటపాడిన తీరు, సంగీతం కూడా బాగున్నాయి.

   తొలగించు
 2. శ్రీ రామి రెడ్డి గారికి నమస్కారములు

  మీ అనుమానములకు నా జవాబు
  మరువగల అను నది మరువ వలదు
  అళికించు=కోపగించు
  స్థిరము=స్థిరముగా
  శరధి సుత=లక్ష్మీ దేవి
  పన్నగాద్రి =
  శేషా చలము

  మురియు =సంతో షిం చు
  నిరతము -ఎల్లప్పుడు
  తతులు == సమూ హము
  పొలుపు =అంద

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ప్రత్యుత్తరాలు
  1. సుబ్బారావు గారూ నమస్కారములు. మీరు సూచించిన అర్థాలు బాగున్నాయి.
   "పొలుపొందు విశ్వప్రభుత్వ మూలంబునకు నలువొందు వర విమానంబులకును"

   దీని అర్థాన్ని విపులంగా చెప్పగలరా?

   తొలగించు
 4. 21.Muthyala Haarathi - Geetha Madhuri,S.Sahithi,Sri Soumya,B.Ramya

  This is waht i got from a website

  ప్రత్యుత్తరంతొలగించు
 5. శశి, ఈ పాటలో నాలుగు గొంతులున్నాయా? Thanks for the information.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. తృష్ణ గారన్నట్టు జయమంగళం నిత్య శుభమంగళం అన్ని రకాల గౌరీ పూజల్లోనూ గౌరి కి మంగళ హారతి ఇచ్చేటప్పుడు పాడతారు. సాధారణంగా పూజల చివర్లో దేవిని స్తుతి చేస్తూ ఇదే బాణీలో జయమంగళం నిత్య శుభమంగళం అని వచ్చేవి ఒక్కరికే అనికాదు . బహుశా మొదట్లో ఇవి ఎక్కువ మంది దేవుళ్ళకు ఉండేవేమో.
  మీరు ఇచ్చిన పాట కూడా బాగుంది.
  నిత్యాన్న పాయిని అని ఉండాల
  పాపాంధకార హర అని లేకుండా ఘన అని వాళ్ళు పాడియున్నారు. ఎందుకోమరి.
  ఎలమి పాకంబు చేయించి అందర కన్న మలయకెపుడొసగె మహా మాతకు
  రుచికరమైన వంటలు చేయించి అందర్నీ కన్న మలయప్ప(వేంకటేశ్వరుడు)కే ఎప్పుడూ పెట్టగలిగే మహామాత(వకుళాదేవి)కి
  తతులు, వితతులు, ప్రతతులకు సమూహములని అర్థాలున్నాయి.
  పొలుపొందు విశ్వప్రభుత్వ మూలంబునకు నలువొందు వర విమానంబులకు
  సుందర జగదీశునకు , యొప్పియున్న విమానమునకు ( బంగారు గోపురములో ఒక వెండి విమానానికి ప్రత్యేకంగా నమస్కరిస్తాము కదా, ఆ విమానాన్ని చెపుతున్నారేమో)
  నాకు తెలిసినట్లు చెప్పినాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. లక్ష్మీదేవి గారూ, మంచి సమాచారాన్ని అందించారు. "మలయప్ప" అంటే వేంకటేశ్వరుడు అని అర్థం తెలిసాక "ఎలమి పాకంబు చేయించి అందర కన్న మలయకెపుడొసగె మహా మాతకు" పాదము అర్థ సహితంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ కూడా పాట పాడటంలో ఏదో అక్షరం లోపించినట్లే అనిపిస్తుంది.

  ఇక "పొలుపొందు విశ్వప్రభుత్వ మూలంబునకు నలువొందు వర విమానంబులకు" ఇది తప్పకుండా గోపురములోనిదో లేదా గుడిలోని విశేషమో అయి వుండాలి. వేరే వ్యాఖ్యానమేమైనా ఎక్కడైనా కనిపిస్తుందేమో వెతకాలి.

  "నిత్యాన్న పానిని" నిత్యాన్న పాయిని గా మార్చాను.
  అలాగే "కళ్యాణ గుణములకు" అని అచ్చుతప్పును కల్యాణ గుణములకు గా మార్చాను.

  వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. మలయప్ప అంటే వేంకటేశ్వరుడు అనే అర్థమున్నా , ఈ సందర్భములో ఆ అర్థము సమసించదేమోనని అనిపిస్తున్నది .

  ఇది ఒకానొక మాత్రాచ్ఛందస్సులో యతి నియమాన్ని చక్కగా పాటిస్తూ చేసిన రచన .ఆ దృష్టితో చూస్తే " మలయకెపుడొసగె మహా మాతకు " అన్నప్పుడు మలయప్ప అనే అర్థము తీసుకుంటే ' మ ' కు - ' హా మాతకు ' లోని ' హా ' కు యతి కుదరదు . కాబట్టి అక్కడ "మలయ" అనే పదము కాదు అని తేలుతుంది , మరైతే ఇంకేముండాలి ?

  పై వాక్యముతో సమన్వయమేమైనా కుదురుతుందా అని ఆలోచిద్దాం - "ఎలమి పాకంబు చేయించి అందర కన్న మలయకెపుడొసగె మహా మాతకు" ఎలమి = సంతోషముతో , పాకంబు = వివిధములైన వంటకములను చేయించి ,అలయక = విసుగుకొనక అందరకు + అన్నము = ( చరాచర జీవకోటికి ) ఒసగే మహా మాతకు అని టీక చెప్పుకొంటే సరిపోతుంది . " అలయకెపుడొసగే మహా మాతకు " అన్నప్పుడు అలయక లో ఉన్న ' అ ' కారానికి , మహా మాతకు లో ఉన్న ' హా ' కారానికి యతి పాటింపబడి దోషముండదు .

  ఒసగె అని ' గె ' అనే అక్షరాన్ని హ్రస్వముగా పాడే కన్నా ' అలయకెపు-డొసగే మ- హా మాత కూ ' అనే పద విభజన ప్రకారమాలపిస్తే 'ఏదో అక్షరము తక్కువైందన్న ' భావన కూడా రాదు .

  నలువు = అంటే సుందరమైన , చక్కనైన అని నలువొందు అంటే కూడా చక్కగా ఒప్పిదమైన అని .

  ఈ విశ్వపాలకుడు ఆ వేంకటేశ్వరుడే అనుకుంటే ఆ ప్రభుత్వము నడిచేది ఆ వేంకటాద్రి దాని మూలస్థానము ఆ గర్భగుడి - అదే ఆ ' విశ్వప్రభుత్వ మూలము ' , దానికి మంగళమూ , ఇక విమానము అంటే గోపురము ( ఇప్పటి ఆకాశములో సంచరించే లోహసాధనమని కాదిక్కడ , విమాన వేంకటేశ్వరుడు కూడా ఇలా వచ్చినవాడే గోపురము మీద నెలకొన్న వేంకటేశ్వరుడనే అర్థం లో ) , ఆ గర్భ గుడిపైనా , ఇంకా ఇతరేతర దేవస్థానాలపైనా అందముగా ఒప్పిదమై యున్న ' గోపురాలకు ' కూడా మంగళాశాసనములు పలుకుతున్న స్వస్తి వచనాలివి .

  స్వస్తి !

  ప్రత్యుత్తరంతొలగించు
 9. మరొక్క విషయం - " అందర కన్న " అనే పదానికి " అందరినీ కన్న " అనే అర్థము చెప్పుకోవలసి వస్తే అది అందరన్ + కన్న = అందర గన్న , అని ఉంటుంది , ' అందర కన్న ' అని అనకూడదు . ఈ సందర్భంలో ఇంత పదస్వరూపం , వ్యాకరణాదుల మీద చర్చ అవసరం లేకుండానే సులువు గా తేలిపోయింది కానీ ఈ విషయం ' అకడెమిక్ ఇంటెరెస్ట్ ' కోసం మాత్రమే !

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. విష్ణునందన్ గారూ, మంచి సమాచారాన్నిచ్చారు. పాటపాడేటప్పుడు వాళ్ళు "ఎలమి పాకంబు చేయించి అందరగన్నమలయ కెపుడొసగె మహామాతకు" అనే పాడినట్లున్నారు. నాకు సరిగ్గా అర్థమవలేదు. కారణం అది "కనడమా" (ప్రసవించు) లేక సంధిరూపంలో వున్న "అందరకు అన్నము అలయ కెపుడొసగె" అన్నదా అన్న సంశయం. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు

   తొలగించు
 10. విష్ణునందన్ గారు,
  అందరకన్నమొసగే అన్వయం బాగా కుదిరింది. మీకు ధన్యవాదాలు తెలియజేసినందుకు.
  విశ్వప్రభుత్వమూలము అనేది వివరించ నవసరం లేకుండానే తెలుస్తున్నందుకే సుందర జగదీశుడని ఊరుకున్నాను. విమాన వేంకటేశ్వరుడినే చెపుతూ విమానంబులకు అన్నారనుకున్నాను పాటలో . విమానము అంటే గోపురము అని కూడా అర్థమున్నదని ఇపుడు తెలిసింది.

  ప్రత్యుత్తరంతొలగించు

Comment Form