26, ఫిబ్రవరి 2013, మంగళవారం

నేను.... నా ప్రేమ.......మొదటిభాగం :)

ఉదయం గంట ఎనిమిదిదాటి యాభై నిమిషాలైంది. భాషా వచ్చి టంగ్ టంగ్ టంగ్ టంగ్.......టంగ్ మని మొదటి బెల్లు కొట్టిండు. పిల్లకాయలంతా బిలబిలమంటూ వచ్చి అసెంబ్లీ సమావేశ స్థలంలో ఏ తరగతికాతరగతి గా విడిపోయి వరుసల్లో నిలబడ్డారు. ఆరు నుంచి పదో తరగతి దాకా మొత్తం ఓ రెండొందల మంది వుంటారేమో. ఆరోజు బడికి ఎగ్గొట్టినోళ్ళు ఎగ్గొట్టగా నూటాయాభై మంది దాకా సమావేశమైనారు. దీర్ఘ చతురస్రాకార స్థలంలో మూడుప్రక్కల క్లాసుల పిల్లకాయలు నిలబడగా నాలుగో వైపు మధ్యలో జెండాకఱ్ఱ దానికి కుడి ఎడమలగా ఖాళీ ప్రదేశము.

మరో ఐదునిమిషాలకు టంగ్ టంగ్ టంగ్ టంగ్.......టంగ్.... టంగ్ మని రెండో బెల్లు కొట్టగానే ఆలస్యంగా వచ్చిన పిల్లలు నక్కి నక్కి వచ్చి వారి వారి క్లాసుల పిల్లల గుంపులో కలిసిపోతున్నారు.మరోవైపు మా హెడ్మాష్టర్, మిగిలిన అయవార్లు వచ్చి నిలబడగానే SPL రోజు వారీ చేసినట్లే విధిగా వందన సమర్పణలు ఆ తరువాత ప్రేయరు యథావిధిగా జరిగిపోయాయి.

గంట తొమ్మిది కొట్టగానే మూడో గంట మోగడం తరగతి గదిలోకి అయవారు రావడం పాఠాల్లో లీనమైపోవడం. రోజూ ఇదే తంతైనా ఏరోజుకారోజు క్రొత్తగా వుండేది. స్కూల్స్ తెరిచి ఓ నెలో రెండు నెలలో అయి వుంటుందేమో. ఓ రోజు ప్యూన్ వచ్చి " సారూ రాంరెడ్డి ని హెడ్ మాష్టర్ సార్ పిలుస్తున్నాడన్న" మాట నా చెవుల పడగానే చెడ్డీలో ఎదో చల్లగా తగిలిన అనుభూతి.

 " ఏ దొంగనాయలో ముండనాయలో నామీద చాడీలు చెప్పుంటడు. ఇప్పుడీన పిల్చిండు. ఈరోజు నాపని గోవిందా.... ఆ కిట్టిగాడే అనుకుంటా పొద్దున్నే వంకలో పడేసి కొట్టినా కదా !!! వాడే వాడే చెప్పుంటడు. ఐనా చాక్లేటు కొనిస్తా అని చెప్పినా గదా వాడికి? ఇంటికి పొయ్యేటప్పుడు చెప్తా వాడిపని "  అనుకుంటూ మా క్లాసు రూము నుంచి హెడ్మాస్టర్ గది వరకూ ఓ రెండు గంటలు నడుద్దామని డిసైడయి పొయ్యా. క్లాసునుండి బయటకొచ్చి నాలుగడుగులు వేసానో లేదో కంచుకంఠం వినపడింది.
" ఏంట్రా ఆ పెళ్ళినడక...నడువు తొందరగా" అని గర్జించగానే ఊడిపోతున్న చల్లాడాన్ని ఓ చేత్తో పట్టుకోని  ఐదారు సెకన్లలో హెడ్మాస్టర్ ముందు ప్రత్యక్షం :)

నాకు ఈ స్కూల్ కు వెళ్ళినప్పటినుంచి ఒక కోరిక బలంగా వుండేది. అసలు హెడ్మాస్టర్ రూములో ఏముంటదో చూడాలని. స్కూల్ లో అయవార్లుగూడా పొద్దున సంతకం చేసేటప్పుడే ఆ రూములోకి పోతారు. లేకుంటే ఎప్పుడైనా  హెడ్మాస్టర్ పిలిస్తేనే. మిగిలిన కాలమంతా క్లాసురూముల్లోనో లేకుంటే స్టాఫ్ రూములోనో పాఠాలు చెప్పుకుంటూనో లేదా లోకాభిరామాయణం మాట్లాడుకుంటూనో  కాలక్షేపం చేస్తుండేవారు. అలాంటి పకడ్బందీ వున్న హెడ్మాస్టర్ గదిలో ఏముంటుందో నని హైస్కూల్ లో చేరిన మొదటి రోజునుండి పురుగు తెగ తొలిచేసేదంటే నమ్మండీ.

హెడ్మాస్టర్ ముందు నిలబడడమైతే నిలబడ్డాగానీ ఇప్పుడీన  గదిలోపలికి తీసుకు పోకుండా బయట్నే వీపు విమానం మోత మోగిస్తాడేమోనని ఒకటే భయం. మొగుడు కొట్టినందుకు కాదు గానీ తోడికోడలు నవ్వినందుకన్నట్టు, బయట కొడితే నేను ప్రేమించే అమ్మాయి చూసిందనుకో!!! అప్పుడు నా పరిస్థితేంది? అసలే సంవత్సరంరోజులు ట్రై చేసి చేసి నిన్న గాక మొన్న " నీ నోడ్సిస్తావా " అని ధైర్యం చేసి అడిగా.   అలాంటిది ఇప్పుడు ఈ తన్నులు తినడం చూసి కిసుక్కున నవ్వితే నాపరిస్థితేమి గాను? నన్నుగేన కొడితే రేప్పొద్దున ఈన వాగు వైపు పొయ్యేటప్పుడు కాచుకూర్చోని రాయితీసుకోని గురీగా కొట్టి పారిపోవాలి అని గట్టిగా నిర్ణయానికొచ్చేసినాను.

"రారా లోపలికి పోదాం" అన్న పిలుపుతో హమ్మయ్య అని బుజ్జి గుండెనిండుగా గాలిపీల్చుకోని హెడ్మాష్టర్ వెంట భయం భయంగా నడిచాను. 


గుండె కొట్టుకోవడం క్షణం పాటు ఆగిపోయింది. నా కళ్ళను నేనే నమ్మలేని స్థితి. ఒకటికి బదులు ఇంకేదో అయిపోతున్న ఫీలింగ్...చూద్దునా లోపల నేను ప్రేమించిన అమ్మాయి. పై ప్రాణం పైనే పోయింది.....

మిగిలింది రేపు :-)

3 వ్యాఖ్యలు:

  1. భాస్కర్ గారి హృదయస్పందనల సవ్వడి మళ్ళీ మొదలైందన్నమాట....భలే భలే:-)

    ప్రత్యుత్తరంతొలగించు
  2. భల్లే భల్లే పద్మార్పిత గారూ , మీకు ప్రేమ స్పందనలు తప్ప మిగిలినవి వినపడవేమో కదా :). ఐనా అసలు ఈ post అర్థమయిందా మీకు :P

    ప్రత్యుత్తరంతొలగించు
  3. ఆ రేపు ఐపోయింది ఇంకా క్రొత్త పోస్టు రాలేదేమిటా అని ఎదురు చూడకండి. రేపంటే ఒక్కరోజని అర్థమా ఏంటి? అలాగే "రేపు" అంటే ఆ రేపూ కాదూ... రేపంటే వారాములోగా అనేసుకోండి :)

    ప్రత్యుత్తరంతొలగించు

Comment Form