26, జూన్ 2013, బుధవారం

Daddy .... you should thank your teachers.... నిజమే కదా !!!


Daddy do you know Absolute value functions?

"No"

do you know Quadratic functions?

"No"

Daddy, atleast do you know Complex numbers?

"No... " చాలా ఏండ్లయింది కదమ్మా...మర్చిపోయాను.

 Then suddenly she jumped to chemistry and asked me ... Do you know even  basics of Chemistry?

 హ్మ్...ఏమి సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తుండగానే !!! " Ohh...you failed in chemistry  and you claim you are a chemical engineer !!!"   I can't believe it daddy..... by the way who gave you the seat in chemical engineering looking at your marks?


 దానికి వాళ్ళమ్మ కూడా వంత పాట ....:-) ఇంకేముంది ఊరుకున్నంత వుత్తమం లేదని అర్థమయిపోయింది. అసలే పదో తరగతి, ఇంటర్మీడియేట్ లో మనకన్నా ఎక్కువమార్కులు వచ్చాయి. అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో దానికి నాకెమిష్ట్రీ పరీక్ష గూర్చి పొరపాటున చెప్పాను. అది పట్టుకోని పిల్లలకు కూడా ఈ రోజు దాకా కథలు కథలుగా చెప్పి నన్ను ఆడేసుకోవడం బాగా అలవాటైపోయింది వీళ్ళకు :))

మళ్ళీ కాసేపేయ్యాక  daddy .... you don't know any thing and you asked me to skip Honors Algebra2 in the summer. what should I do now?

హ్మ్... హమ్మయ్యా... విషయం ఇప్పటికి అర్థమయింది. మొత్తానికి ఏవో లెక్కలు రాక ఎక్కడ మొదలు పెట్టాలో తెలియక ఈ తంటాలన్నమాట.  న్యూజెర్సీ లో మా పిల్లల పాఠశాలలకు ఈ నెల 21 వ తేదీనుంచి ఎండాకాలం శెలవులను ప్రకటించారు. మళ్ళీ స్కూల్స్ తెరిచేలోపు ఆగష్టు లో వీళ్ళకు ఈ పరీక్ష పెట్టి అందులో ఉత్తీర్ణత సాధించినట్లైతే వెళ్ళబోయే తరగతిలో Honors Pre Calculus తీసుకొనే అవకాశం వుంటుంది.

 టీ త్రాగడం పూర్తయింది.ఓ ఐదు నిమిషాలయ్యాక, ఓ చిత్తు కాగితంపైన నాలుగు లెక్కలేసుకోని డాడీ ... డాడీ అంటూ చల్లగా పిల్లిలాగా దగ్గర చేరింది.
"నీకు తెలియకపోతే నేను చెప్తా చూడమంటూ "  ఓ లెక్క చేయడం మొదలు పెట్టింది. కుస్తీ పట్టి మొత్తానికి చేసింది. చూస్తున్న నాకు కడుపులో వికారం మొదలైంది.

మరోలెక్క... ఈ సారి Complex numbers మీద .... ఇదికూడా అంతే... ఈ సారి వికారం మరీ ఎక్కువైంది. Answers ఐతే వస్తున్నాయి కానీ ఆ చేసే విధానం నాకస్సలు నచ్చడం లేదు.

"ఎవరు చెప్పారమ్మా నీకు ఈ లెక్కలు ఇలా చెయ్యాలని" అని అడిగాను. వస్తున్న ఉత్సాహాన్ని ఆగపట్టుకుంటూ " ఏదో స్కూల్ వాళ్ళ టీచర్స్ You tube లో పెడితే అవి చూసి నాకై నేనే నేర్చుకున్నానని" గర్వంగా చెప్పింది. ఆ ఉత్సాహంపైన నాకు నీళ్ళు చల్లబుద్ధి కాక " Excellent " అని మెచ్చుకోక తప్పింది కాదు. నిజమే ఆ వయసులో ఈ Complex numbers  concept అర్థమవడం కొంచెం కష్టమే. లెక్క చేసే టప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏమిటంటే ఈ complex numbers కు కూడా ప్రాధమిక Algebra సూత్రాలు వర్తిస్తాయని తెలియక తికమక పడుతుంది.

ఇంట్లో వున్న white board తీసుకురమ్మని  కొద్దిసేపు ప్రాధమిక ఫార్ములాలపై లెక్కలు చేపించాక ఇంతకు ముందు లెక్క చెప్పడం మొదలు పెట్టాను. 



అందులో ఒక problem ఇది

Simplify 1/ i to the power of 13.

దీన్ని టీచరు ఈ రకంగా చెప్పిందట. ముందుగా i యొక్క విలువలను ఓ ప్రక్కగా ఈ రకంగా వ్రాసిందట

i=sqrt of -1
i2=-1
i3=-i
i4=1

తరువాత టీచరు ఏమి చెప్పిందో కానీ ఈ అమ్మాయి మటుకు ప్రతి power ను గణించడం మొదలు పెట్టింది. అంటే i  to the power of 5 నుండి i to the power of 13 వరకూ.... ఇలా చెయ్యడం చూస్తే నాకేమిటీ ఏమాత్రం బీజగణితం తెలిసిన వారికైనా వాంతులవ్వాల్సిందే మరి :))

మొత్తానికి నేను పాఠం చెప్పాక.... చెపుతున్న మధ్యలో మా పిల్ల నన్ను మెచ్చుకోవడం మానేసి " Daddy you should thank your teachers" అంటూ గబా గబా లెక్కలు చేసుకుంటూ ఇంత సులభమా అంటూ అప్పుడప్పుడూ ఓస్..ఇంతేనా అనుకుంటూ లెక్కలు చేసుకుంటూ నిద్రలోకి జారిపోయింది. రేపటి నుండి నెలలోపు Algebra and Trigonometry చెప్పకపోతే ఏమౌంతుదో తెలుసు కాబట్టి మిగిలిన కథలన్నీ కంచికీ నేనేమో ట్యూషన్ మాష్టారి అవతారం....

అన్నట్లు నిజమే కదా!!  I should thank my maths teachers కీర్తిశేషులు శ్రీ బంగారు రెడ్డి గారూ మరియూ  శ్రీ చిన్న కోటయ్య  గారు. వీరిరువురి దయవల్లే నాలాగా చాలా మంది ఉజ్జ్వలంగా బ్రతుకు బండిని లాగిస్తున్నారు.

23, జూన్ 2013, ఆదివారం

పౌరులకు, ప్రజాప్రతినిధులకు మధ్య చిరు వంతెన చిరుస్పందన ద్వారా...



దరిదాపు ఓ నెల క్రితం భారత ప్రజా ప్రతినిధులు.. మన కష్టాలు. Linking people with politicians అని ఓ పోస్టు వ్రాశాను. చూసే వుంటారు కదా? దానికి పొడిగింపుగా ఈ Article.

పురిటి నొప్పులు తట్టుకోని మొత్తానికి pre-matured బేబీ ని ప్రసవించేశాను. pre-matured బేబీ కాబట్టి ఇంకా సరిగ్గా కళ్ళు కూడా తెరిచి చూడలేదు.నిర్మాణం ఇంకా పూర్తికాలేదు కానీ మన రాజకీయనాయకులు వచ్చి రిబ్బన్ కటింగ్ చేసేదాకా  ఊరుకొనే ఓపిక నాకు లేదు కాబట్టి ఐనంత వరకు ముందుగా తెలుగు బ్లాగులోకానికి అంకితమిచ్చేస్తే ఓ పని ఐపోతుంది కదా? పనిలో పనిగా ఒకరిద్దరైనా మనసుపెట్టి Test చేసి నిర్మాణాత్మకమైన సూచనలు కూడా చేసే అవకాశం కూడా వుంటుంది.
url : bharathvoice.com 


ప్రస్తుతానికి ఇది తెలుగు బ్లాగులోకానికి మాత్రమే Testing కోసం ఇస్తున్న  సైట్...

ఇక సైట్ యొక్క వివరాలలోకి వెళితే ఈ సైట్ లో భారత దేశములో గల రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామాలను చేర్చడం జరిగింది. మన రాష్ట్రానికి ఎన్నికలు దగ్గరలో వున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ వరకూ అన్ని అసెంబ్లీ స్థానాలనూ, వాటికి పోటీ చేసిన అభ్యర్థులను వారికొచ్చిన ఓట్ల వివరాలనూ 1978 వ సంవత్సరం మొదలుకొని 2009 వరకూ చేర్చడం జరిగింది.  అన్నీ బాగున్నాయయ్యా ఐతే ఏంటంట అంటే.... విషయం ఇది.

రాష్ట్రంలో ఎన్ని పత్రికలున్నా ఎవరి అవసరాలు వారివి. ఎవరి అభిప్రాయాలు వారివి. వార్తలకూ, విశ్లేషణలకు, వారి అభిప్రాయాలకూ తేడా తెలియకుండా వార్తలు రావడం మనం రోజూ చూస్తూనే వుంటాము. నాలాంటి కామన్ మేన్ కు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి. అందుకోసం ఈ ఇ-జర్నలిజమ్ ప్రజలచేతుల్లో.

ప్రతిరోజూ మన చుట్టూ ఎన్ని అవకతవకలు జరుగుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఎన్ని అవినీతి కార్యక్రమాలు, ఎంత మంది లంచగొండులు ఎన్ని కష్టాలు..ఎంతనష్టం?? వీటినన్నింటినీ మనమేదో ఒక్కరోజులో మారుస్తామని కాదు. అసలు మారకపోవచ్చు కూడా!! కానీ మీకు కడుపు మండినప్పుడు మీ ఘోష ను ప్రక్కవాడితో ఎలా చెప్పుకుంటారో అలాగే ఇక్కడకూడా ఓ ముక్క వ్రాసి పడేయండి. దీనివల్ల పెద్ద అద్భుతాలు జరగకపోవచ్చు కానీ ఓ ఎలక్ట్రానిక్ రికార్డు మాత్రం భద్రమైపోతుంది. ఆ తరువాత ఏం జరుగుతుందనేది కాలం నిర్ణయిస్తుంది. ఏమీ చేతకానట్టు కూర్చోవడం కన్నా ఇది నయం కదా?

అలాగే మీరు మెచ్చిన నాయకుడి గూర్చి వ్రాసి పది మందికి తెలిసే టట్లు చేయండి. కారణమేమిటంటే ఈ డాటా ను ప్రాసెస్ చేస్తుంటే నాకు మనరాష్ట్రంలో నున్న అసెంబ్లీ స్థానాలే 30 శాతం దాకా తెలియలేదు. ఇక అభ్యర్థుల సంగతి చెప్పాలా? ఇందులో ఎంతో మంది ఎన్నో సామాజిక ప్రయోజన పనులను చేసే వారుండవచ్చు. వారిగూర్చి పదిమందికి తెలిపే వేదిక ఇది.

ఇందులో మీరు మీకిష్టమైన అభ్యర్థి వివరాలను వ్రాయాలన్నా, Issue వ్రాయాలన్నా, Vote వేయాలన్నా రిజిష్ట్రేషన్ తప్పని సరి. Register అయ్యేటప్పుడు పని చేసే e-mail Id ఇవ్వడం మరువకండి. కారణం email authentication లేనిది మీ రిజిష్ట్రేషన్ చెల్లదు.

ఇలా మరెన్నో .... నేను వ్రాయడం కంటే మీరే వెళ్ళి చూసి మీ అభిప్రాయాలను తప్పక వ్యాఖ్య రూపంలో వ్రాయండి. ఈ వెబ్ సైట్ మరో సంవత్సరం పాటు ఇలా అభిప్రాయసేకరణలను చేస్తూ వాటిని వెబ్ సైట్ లో చేరుస్తూనే వుంటుంది. 

Feel free to write your views without any hesitation.

Too much work..tired too much.. c u later.

17, జూన్ 2013, సోమవారం

వహ్వా వహ్వా శ్రీ సీతా రాముల సంవాదం

శ్రీ మద్రామాయణ కల్పవృక్షం చాలారోజులనుంచి చదవాలని కోరిక వున్నా ఎప్పటికప్పుడు వాయిదాలేస్తూ అప్పుడప్పుడూ అక్కడక్కడా చదువుతూ అలా బండిని లాగించేస్తున్నానా....అలాగే మొన్నకరోజు కూడా Random గా పేజీలు తిరగేస్తుంటే ఒక రసవత్తర ఘట్టం మనసులో కలిగించిన ఆనందాన్ని అణిచి వుంచలేక చేతనైన పద్యాలని టైపు చేసి బ్లాగులో పెట్టాలని టైపడం మొదలు పెట్టాను. వహ్వా వహ్వా  కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారు.

 ఈ నాటకీయత భార్యా భర్తల మధ్య మాటల యుద్ధం, దెప్పిపొడుపులు ఎంత సహజ సుందరమో... ...వీలైనప్పుడల్లా ఇంతలా ఈ పద్యాలు ఎందుకు నచ్చాయో నాకు అర్థమైన వివరణ కూడా వ్రాస్తాను. ఈ లోపు మీరూ పద్యాలకు అర్థాన్ని తెలుసుకొని పద్యాలను పాడండి. పద్యాలను చదివితే మనసుకు అంత ఆహ్లాదం కలగక పోవచ్చు కాబట్టి అర్థవంతగా పాడుకోండి.



గీ || తన్ను హరిణంబు గొనితెమ్మటన్న కాంత సగముసగమైన మై రామచంద్రునకును
తన సమస్తకామమున కాస్థానభూమి కనులయెదుటను వచ్చి సాక్షాత్కరించె

ఉ|| ఈయమహేతువై వనులనెల్ల జరించెను దా బికారిగా
నీయమ హేతువై జలధికెంతొ శ్రమంపడి కట్టగట్టె దా
నీయమ హేతువై గెలుచు టెంతొ శ్రమం బయిపోయె లంకలో
నాయమ జూచినంత హృదయంబున బట్టగరానికోపమై

ఆ|| అతడు రాక్షసుండటంచు సౌమిత్రి వచించె సుంత వినదు చెలువ తాను
ననుభవించె దాను ననుభవించితి మేము నాడ దింతసేయుననుచు గలదె?

ఆ|| రావణుండు నప్సరః కాముకుండును
బరమ దుష్టుఁ డుగ్రభావయుతడు
లజ్జలేదు మఱిబలాత్కార కామాంధుఁ
డతివ వత్సరాంత మచటనుండె

ఉ|| ఇట్టు లనిశ్చితంబయిన యీ వ్యవహారమునందు రాఘవుం
డెట్టుల స్వీకరింపగలడీ ధరణీసుత, నయ్యొ ! సూర్యునిం
దొట్టి పవిత్రతేజములు తోగులువారిన యింట శీలముం
బట్టిన సంశయంబయిన భామినింగొంట యయోగ్యమై చనున్

ఉ|| ఎవ్వడొ దుష్టుడౌ దనుజుఁ డెత్తుకపోయె నదేమి కర్మమో
జవ్వని దేమి తప్పనిన జక్కనిమాట యదే వచింతు నా
జవ్వని పూర్వకర్మమని, జవ్వనిభర్తది పూర్వకర్మ, మా
యెవ్వడొ కర్మ దీని రచియించెనొ వానిది దోసమంతయున్

చ|| చెడుస్థలమందు వానకురిసెన్ జలమయ్యది నేను గ్రొమ్మొయిల్
కడుపున నున్న యప్పటి యకల్మషవృత్తిగట్టిదాన ని
ప్పుడు నన, నీవు పడ్డ పొలముంబడి మాఱితి వీవు, గంగలో
బడిన జలంబునం గలుగు స్వచ్ఛత యేగతి నీకు గల్గెడిన్.

గీ || ఇచట దోసము వీనిదం చెవనినైన గాని పూని నిందింపగా రానిచోటు
దోసమిచ్చట గలదంచుఁ దూచి చూచి నిక్కముగ నిశ్చయింప రానిదగుచోటు

శా|| నన్నుం జూడంగఁ గోరినా వనుచుఁ గాంతా! నిన్ను రప్పించితిన్
నన్నుం జూడంగ నేమియున్నయది? యైనన్ స్పష్టమై పోల్చెఁబో
మున్నే భర్తను నీవు భార్యవును, నా పొల్పిప్డు లోపించె, నా
సన్నంబై యొక దైవ మున్నముడి స్రంసంబందగాఁ జేయుచున్

ఉ|| నాగతి యేమికావలయునా నింక నీవు స్వతంత్రురాల వే
భోగము లీవు కోరెదవొ పూరుషు వానినిఁ గూర్పంగల్గెడుం
జేగ గలానిం జూచికొని చెందుము, లక్ష్మణుండో విభీషణుం
డో గణుతింప సూర్యసుతుండో మఱి నీదగు నిష్టమై చనన్

మ|| మఱియున్ నీకొకమాట  చెప్పవ;అయున్ మారీచునిం జంపితిన్
హరిణంబయ్యది కాదు లక్ష్మణుఁడు యాథార్థ్యంబు వాచించె ని
ష్ఠురు లాయిద్దఱుఁ గూడబల్కికొని దక్షుల్వచ్చి రచ్చోటి క
బ్బుర మా బంగరులేడిఁ గోరెదని నీవున్ వార లెట్లెంచిరో?



సీత

శా || అంధోబంధము ప్రాణ మున్నపుడు పై నంత్యక్రియల్ సేయు సం
బంధం బుండును మానవావలికి, నీవైనావు నాకిప్డు కా
మాంధ న్నన్నుం బరిత్యజించెగద నీ యగ్రేసరుం డిట్లు నే
నుం ధాయ్యాదిక మాచరింపు మని నిన్నుంగోర లేదెప్పుడున్

శా|| నాకుం బిడ్డలు లేరు, బిడ్డవలె నున్నా వీవు నిన్నాళ్ళు, నా
కై కొంచెమ్మయినట్టి సాయమును జేయంజూడవే నీవు ల
చ్చీ! కాష్ఠంబులు తెచ్చి నాకయి చితిం జేర్పించు, నే నీ దరి
ద్రాకారంబునఁ జచ్చియుం బ్రతికి యౌరా! యొక్క రీతిం దగున్

మ|| తెరు విమ్మన్న నొసంగు నాజనని ధాత్రీదేవి, సత్ప్రేమభా
సుర, పుట్టింటికి బోవనేటికిఁ ద్రపాశూన్యల్ పతిత్యక్తలై
తరుణుల్, వహ్నినిఁ జొత్తు నే, ననలుఁ డంతర్వీధి నన్నూనఁగా
బరువం చెంచునె? సర్వలోకనిబిడజ్వాలా మహామూర్తియై.

క|| మీయన్న నీవు నెఱుఁగుదు వాయన మది నెంత తలచు నంతయు, సందే
హాయత్తచిత్త మఱి నీ వాయత్తము చేయు మగ్ని నని యాడంగన్

చితి లక్ష్మణుడు అంటించిన తరువాత.... శ్రీ జానకీ దేవి రామునితో నిట్లనియె

శా|| నేనొక్కించుకసేపులోనన మహాగ్నిం జొచ్చుచున్నాను స్వా
మీ! నీయాజ్ఞ వచింతు గొంచెము సమున్నీలద్యశోధామ! దై
వానన్ వచ్చిన దోస మంతయును నావంకన్ నిరూపింతు, నీ
వైనన్ దైవమ వండ్రు, నీకుఁ గృపలే దందున్ మఱట్లైనచో.

ఉ|| మచ్చికఁ జెట్ట యర్థముల మాటల నంటివి నన్ను నీవనన్
వచ్చును నేను నైఁన బడవచ్చును, బంగరులేడిఁ జూఁడగా
విచ్చిన కంటితో నెడఁద విచ్చెను, విచ్చినగుండెలోపలన్
జొచ్చిన వయ్య రామ! రిపుసూదన! సర్వఋషీంద్రవాంఛలున్

చ|| నలినదళాయతాక్షి హఇణంబును గోరెను, గోరినందునన్
జలనిధి దాటినా వసుర జంపితి వింతటి కీర్తి వచ్చె, ను
జ్జ్వలతరపౌరుషంబునకుఁ బట్టయినాఁడవు, నీవు గుండెలోఁ
గలఁకను మాని చూడు ముపకారము కాదటవే జగత్ప్రభూ!

ఉ|| ఏ ఋషిభావనామహిమ యేర్పడ నాయెదలోనఁ జొచ్చి నన్
గోరఁగ జేసె లేడి, నది కోమలనీలపయోద దేహ! నా
కోరిక యిట్టులుండు ననుకొంటకు దానవులోన స్ఫూర్తిగా
నేరను వచ్చు, నీవిదియు నేరవె సర్వఋషీంద్రహృత్స్థితా!

చ|| ఒకపని మంచిచెడ్డలు సముద్భవమౌ ఫలదృష్టి నిర్ణయం
బు కలుగఁ జూతురు తమోహరణా! దయ జూచితేని కో
రికయును నాది నీకు నురరీకృత కీర్తిరమాఫలప్రదం
బకలుషగుప్త శౌర్యబహిరాగతి దివ్యఫలంబు రాఘవా!

ఉ|| ఆఁడది యింతసేయు ననుటన్నది యున్నదెయంచు నన్ను మా
టాడితి, కైక కోరక మహా ప్రభు! నీవని రాకలేదు, నీ
యాడది సీత కోరక మహాసురసంహరణంబు లేద, యా
యాడది లేక లేద జగమంచు, నిదంతయు నేన చేసితిన్.

ఉ|| ఈ పదునాల్గువత్సరము లీవు వనంబులయందు నుండి సీ
తాపతి! నీవు మారవుగదయ్య కిరాతుడొ బ్రాహ్మణుండొ కా
నీ పది రెండు మాసముల నేనును మారను లేద, రాఘవ
శ్రీ పదచిం తనామృత వశీకృత చిత్తనమర్త్యబుద్ధినై.

చ|| మిగిలిన వేమొ లోకమును మీరఘువంశపు గౌరవంబు, న
త్యగణిత విశ్లథీకృత నిరంతర భిన్న విచిత్ర చేతన
త్వగుణ కణానుగం బయి కృతాకృతమైన జగత్తు, తమ్మిపూ
మొగడపు విచ్చి వచ్చిన ప్రభుండు విరించియు జాల డిచ్చటన్

12, జూన్ 2013, బుధవారం

పూరిగుడిసెలో ముసలివాడు

హై హై... ఈ రోజు నా ఇ-పుస్తకాల భోషాణాన్ని వెతుకుతుంటే  నేను ఐదోతరగతిలో వున్నప్పుడు చదువుకున్న తెలుగు పాఠం ఒకటి కనిపించింది. మళ్ళీ ఈ సముద్రంలో ఈ...ఇ పాఠం కలిసిపోతే దొరికే పనేనా?  మా పుస్తకంలో బొమ్మకూడా పాత చందమామ లో వుండే బొమ్మలాగా వుండెది కానీ ఈ ఇపుస్తకంలో బొమ్మలెదు :(


అడవిదాపల నొకపూరిగుడిసెయందు
కాఁపురం బుండె ముదుసలి కాఁపువాడు
అతఁడొకనాఁడు భూమిలో పాతుచుండె
చిన్న మామిడి టెంకల కొన్ని తెచ్చి.

వేఁటలాడఁగ నాదారివెంటఁ జనుచు
తనదు పరివారజనులతో ననియె రాజు
"కాంచితిరె మీర లీమూడుకాళ్ళ ముసలి
చేయుచున్నట్టి చిత్రంపుచేఁత లౌర?

"వృద్ధుఁడక్కట! ఎంతటి వెఱ్ఱివాఁడు?
విత్తుచున్నాఁడు మామిడివిత్తనముల
చెట్లఫలముల తాను భక్షింపఁదలఁచి
ఎంతకాలము జీవింప నెంచినాఁడొ?

కాటి కొకకాలు సాఁచియు కాపువాఁడు
ఉట్టికట్టుక కలకాల మూఁగులాడ
నెంచెఁ గాఁబోలు, లేకున్న నిట్టిపనికిఁ
బూని కాలంబు రిత్తగాఁ బుచ్చనేల!

నృపునిమాటల నాలించి వృద్ధుఁడనియె
"చెట్లఫలముల తిన నపేక్షించి కాదు
మున్ను మనపెద్ద లందఱు చన్నరీతి
ఆచరించితి నంతియె అవని నాథ!

వారు నాఁటిన వృక్షముల్ ఫలములీన,
అనుభవించుట లేదొకో మనము నేఁడు!
అట్లె, మన మిప్డు నాఁటిన చెట్లఫలము
లనుభవింతురు గద ! మనతనయు లవల

అంత నారాజు ముసలివాఁడాడినట్టి
పలుకులకు నాత్మ నెంతయు ప్రమద మంది,
గౌరవము మీఱ నాతని గారవించె
ఏడుబంగారు కాసుల నెలమి నొసఁగి.

అంత నవ్వుచు నావృద్ధుఁ డనియె "ఱేఁడ!
రిత్త కాలేదు నేఁడు నా విత్తనములు
అహహ! నాఁటిన తొలినాఁడె అక్కజముగ
ఏడుబంగారు ఫలముల నీనెఁ గాన


ఎంత మంచి పాఠమో...ఆరోజుల్లో అని రీల్ ను వెనక్కితిప్పితే..అప్పట్లో నేర్చుకున్న కఠిన పదాలు, జాతీయాలు కూడా కొద్దిగా గుర్తు ...

ఱేడు
ప్రమదము
రిత్త

"ఉట్టికట్టుక కలకాల మూఁగులాడు"
"కాటి కొకకాలు సాచి"