17, జూన్ 2013, సోమవారం

వహ్వా వహ్వా శ్రీ సీతా రాముల సంవాదం

శ్రీ మద్రామాయణ కల్పవృక్షం చాలారోజులనుంచి చదవాలని కోరిక వున్నా ఎప్పటికప్పుడు వాయిదాలేస్తూ అప్పుడప్పుడూ అక్కడక్కడా చదువుతూ అలా బండిని లాగించేస్తున్నానా....అలాగే మొన్నకరోజు కూడా Random గా పేజీలు తిరగేస్తుంటే ఒక రసవత్తర ఘట్టం మనసులో కలిగించిన ఆనందాన్ని అణిచి వుంచలేక చేతనైన పద్యాలని టైపు చేసి బ్లాగులో పెట్టాలని టైపడం మొదలు పెట్టాను. వహ్వా వహ్వా  కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారు.

 ఈ నాటకీయత భార్యా భర్తల మధ్య మాటల యుద్ధం, దెప్పిపొడుపులు ఎంత సహజ సుందరమో... ...వీలైనప్పుడల్లా ఇంతలా ఈ పద్యాలు ఎందుకు నచ్చాయో నాకు అర్థమైన వివరణ కూడా వ్రాస్తాను. ఈ లోపు మీరూ పద్యాలకు అర్థాన్ని తెలుసుకొని పద్యాలను పాడండి. పద్యాలను చదివితే మనసుకు అంత ఆహ్లాదం కలగక పోవచ్చు కాబట్టి అర్థవంతగా పాడుకోండి.



గీ || తన్ను హరిణంబు గొనితెమ్మటన్న కాంత సగముసగమైన మై రామచంద్రునకును
తన సమస్తకామమున కాస్థానభూమి కనులయెదుటను వచ్చి సాక్షాత్కరించె

ఉ|| ఈయమహేతువై వనులనెల్ల జరించెను దా బికారిగా
నీయమ హేతువై జలధికెంతొ శ్రమంపడి కట్టగట్టె దా
నీయమ హేతువై గెలుచు టెంతొ శ్రమం బయిపోయె లంకలో
నాయమ జూచినంత హృదయంబున బట్టగరానికోపమై

ఆ|| అతడు రాక్షసుండటంచు సౌమిత్రి వచించె సుంత వినదు చెలువ తాను
ననుభవించె దాను ననుభవించితి మేము నాడ దింతసేయుననుచు గలదె?

ఆ|| రావణుండు నప్సరః కాముకుండును
బరమ దుష్టుఁ డుగ్రభావయుతడు
లజ్జలేదు మఱిబలాత్కార కామాంధుఁ
డతివ వత్సరాంత మచటనుండె

ఉ|| ఇట్టు లనిశ్చితంబయిన యీ వ్యవహారమునందు రాఘవుం
డెట్టుల స్వీకరింపగలడీ ధరణీసుత, నయ్యొ ! సూర్యునిం
దొట్టి పవిత్రతేజములు తోగులువారిన యింట శీలముం
బట్టిన సంశయంబయిన భామినింగొంట యయోగ్యమై చనున్

ఉ|| ఎవ్వడొ దుష్టుడౌ దనుజుఁ డెత్తుకపోయె నదేమి కర్మమో
జవ్వని దేమి తప్పనిన జక్కనిమాట యదే వచింతు నా
జవ్వని పూర్వకర్మమని, జవ్వనిభర్తది పూర్వకర్మ, మా
యెవ్వడొ కర్మ దీని రచియించెనొ వానిది దోసమంతయున్

చ|| చెడుస్థలమందు వానకురిసెన్ జలమయ్యది నేను గ్రొమ్మొయిల్
కడుపున నున్న యప్పటి యకల్మషవృత్తిగట్టిదాన ని
ప్పుడు నన, నీవు పడ్డ పొలముంబడి మాఱితి వీవు, గంగలో
బడిన జలంబునం గలుగు స్వచ్ఛత యేగతి నీకు గల్గెడిన్.

గీ || ఇచట దోసము వీనిదం చెవనినైన గాని పూని నిందింపగా రానిచోటు
దోసమిచ్చట గలదంచుఁ దూచి చూచి నిక్కముగ నిశ్చయింప రానిదగుచోటు

శా|| నన్నుం జూడంగఁ గోరినా వనుచుఁ గాంతా! నిన్ను రప్పించితిన్
నన్నుం జూడంగ నేమియున్నయది? యైనన్ స్పష్టమై పోల్చెఁబో
మున్నే భర్తను నీవు భార్యవును, నా పొల్పిప్డు లోపించె, నా
సన్నంబై యొక దైవ మున్నముడి స్రంసంబందగాఁ జేయుచున్

ఉ|| నాగతి యేమికావలయునా నింక నీవు స్వతంత్రురాల వే
భోగము లీవు కోరెదవొ పూరుషు వానినిఁ గూర్పంగల్గెడుం
జేగ గలానిం జూచికొని చెందుము, లక్ష్మణుండో విభీషణుం
డో గణుతింప సూర్యసుతుండో మఱి నీదగు నిష్టమై చనన్

మ|| మఱియున్ నీకొకమాట  చెప్పవ;అయున్ మారీచునిం జంపితిన్
హరిణంబయ్యది కాదు లక్ష్మణుఁడు యాథార్థ్యంబు వాచించె ని
ష్ఠురు లాయిద్దఱుఁ గూడబల్కికొని దక్షుల్వచ్చి రచ్చోటి క
బ్బుర మా బంగరులేడిఁ గోరెదని నీవున్ వార లెట్లెంచిరో?



సీత

శా || అంధోబంధము ప్రాణ మున్నపుడు పై నంత్యక్రియల్ సేయు సం
బంధం బుండును మానవావలికి, నీవైనావు నాకిప్డు కా
మాంధ న్నన్నుం బరిత్యజించెగద నీ యగ్రేసరుం డిట్లు నే
నుం ధాయ్యాదిక మాచరింపు మని నిన్నుంగోర లేదెప్పుడున్

శా|| నాకుం బిడ్డలు లేరు, బిడ్డవలె నున్నా వీవు నిన్నాళ్ళు, నా
కై కొంచెమ్మయినట్టి సాయమును జేయంజూడవే నీవు ల
చ్చీ! కాష్ఠంబులు తెచ్చి నాకయి చితిం జేర్పించు, నే నీ దరి
ద్రాకారంబునఁ జచ్చియుం బ్రతికి యౌరా! యొక్క రీతిం దగున్

మ|| తెరు విమ్మన్న నొసంగు నాజనని ధాత్రీదేవి, సత్ప్రేమభా
సుర, పుట్టింటికి బోవనేటికిఁ ద్రపాశూన్యల్ పతిత్యక్తలై
తరుణుల్, వహ్నినిఁ జొత్తు నే, ననలుఁ డంతర్వీధి నన్నూనఁగా
బరువం చెంచునె? సర్వలోకనిబిడజ్వాలా మహామూర్తియై.

క|| మీయన్న నీవు నెఱుఁగుదు వాయన మది నెంత తలచు నంతయు, సందే
హాయత్తచిత్త మఱి నీ వాయత్తము చేయు మగ్ని నని యాడంగన్

చితి లక్ష్మణుడు అంటించిన తరువాత.... శ్రీ జానకీ దేవి రామునితో నిట్లనియె

శా|| నేనొక్కించుకసేపులోనన మహాగ్నిం జొచ్చుచున్నాను స్వా
మీ! నీయాజ్ఞ వచింతు గొంచెము సమున్నీలద్యశోధామ! దై
వానన్ వచ్చిన దోస మంతయును నావంకన్ నిరూపింతు, నీ
వైనన్ దైవమ వండ్రు, నీకుఁ గృపలే దందున్ మఱట్లైనచో.

ఉ|| మచ్చికఁ జెట్ట యర్థముల మాటల నంటివి నన్ను నీవనన్
వచ్చును నేను నైఁన బడవచ్చును, బంగరులేడిఁ జూఁడగా
విచ్చిన కంటితో నెడఁద విచ్చెను, విచ్చినగుండెలోపలన్
జొచ్చిన వయ్య రామ! రిపుసూదన! సర్వఋషీంద్రవాంఛలున్

చ|| నలినదళాయతాక్షి హఇణంబును గోరెను, గోరినందునన్
జలనిధి దాటినా వసుర జంపితి వింతటి కీర్తి వచ్చె, ను
జ్జ్వలతరపౌరుషంబునకుఁ బట్టయినాఁడవు, నీవు గుండెలోఁ
గలఁకను మాని చూడు ముపకారము కాదటవే జగత్ప్రభూ!

ఉ|| ఏ ఋషిభావనామహిమ యేర్పడ నాయెదలోనఁ జొచ్చి నన్
గోరఁగ జేసె లేడి, నది కోమలనీలపయోద దేహ! నా
కోరిక యిట్టులుండు ననుకొంటకు దానవులోన స్ఫూర్తిగా
నేరను వచ్చు, నీవిదియు నేరవె సర్వఋషీంద్రహృత్స్థితా!

చ|| ఒకపని మంచిచెడ్డలు సముద్భవమౌ ఫలదృష్టి నిర్ణయం
బు కలుగఁ జూతురు తమోహరణా! దయ జూచితేని కో
రికయును నాది నీకు నురరీకృత కీర్తిరమాఫలప్రదం
బకలుషగుప్త శౌర్యబహిరాగతి దివ్యఫలంబు రాఘవా!

ఉ|| ఆఁడది యింతసేయు ననుటన్నది యున్నదెయంచు నన్ను మా
టాడితి, కైక కోరక మహా ప్రభు! నీవని రాకలేదు, నీ
యాడది సీత కోరక మహాసురసంహరణంబు లేద, యా
యాడది లేక లేద జగమంచు, నిదంతయు నేన చేసితిన్.

ఉ|| ఈ పదునాల్గువత్సరము లీవు వనంబులయందు నుండి సీ
తాపతి! నీవు మారవుగదయ్య కిరాతుడొ బ్రాహ్మణుండొ కా
నీ పది రెండు మాసముల నేనును మారను లేద, రాఘవ
శ్రీ పదచిం తనామృత వశీకృత చిత్తనమర్త్యబుద్ధినై.

చ|| మిగిలిన వేమొ లోకమును మీరఘువంశపు గౌరవంబు, న
త్యగణిత విశ్లథీకృత నిరంతర భిన్న విచిత్ర చేతన
త్వగుణ కణానుగం బయి కృతాకృతమైన జగత్తు, తమ్మిపూ
మొగడపు విచ్చి వచ్చిన ప్రభుండు విరించియు జాల డిచ్చటన్

2 కామెంట్‌లు:

  1. చాలా చాలా రోజుల తర్వాత పద్యాలను చదివాను. తాత్పర్యం కూడా ఇస్తే నాకు ఇంకా బాగా అర్థం అయ్యేవి.(తిట్టుకోకండి) మరి మీ ఇష్టం. మేమూ మీలా ఆనందించాలికదా చదివి అర్థం చేసుకొని.

    రిప్లయితొలగించండి

Comment Form