12, జూన్ 2013, బుధవారం

పూరిగుడిసెలో ముసలివాడు

హై హై... ఈ రోజు నా ఇ-పుస్తకాల భోషాణాన్ని వెతుకుతుంటే  నేను ఐదోతరగతిలో వున్నప్పుడు చదువుకున్న తెలుగు పాఠం ఒకటి కనిపించింది. మళ్ళీ ఈ సముద్రంలో ఈ...ఇ పాఠం కలిసిపోతే దొరికే పనేనా?  మా పుస్తకంలో బొమ్మకూడా పాత చందమామ లో వుండే బొమ్మలాగా వుండెది కానీ ఈ ఇపుస్తకంలో బొమ్మలెదు :(


అడవిదాపల నొకపూరిగుడిసెయందు
కాఁపురం బుండె ముదుసలి కాఁపువాడు
అతఁడొకనాఁడు భూమిలో పాతుచుండె
చిన్న మామిడి టెంకల కొన్ని తెచ్చి.

వేఁటలాడఁగ నాదారివెంటఁ జనుచు
తనదు పరివారజనులతో ననియె రాజు
"కాంచితిరె మీర లీమూడుకాళ్ళ ముసలి
చేయుచున్నట్టి చిత్రంపుచేఁత లౌర?

"వృద్ధుఁడక్కట! ఎంతటి వెఱ్ఱివాఁడు?
విత్తుచున్నాఁడు మామిడివిత్తనముల
చెట్లఫలముల తాను భక్షింపఁదలఁచి
ఎంతకాలము జీవింప నెంచినాఁడొ?

కాటి కొకకాలు సాఁచియు కాపువాఁడు
ఉట్టికట్టుక కలకాల మూఁగులాడ
నెంచెఁ గాఁబోలు, లేకున్న నిట్టిపనికిఁ
బూని కాలంబు రిత్తగాఁ బుచ్చనేల!

నృపునిమాటల నాలించి వృద్ధుఁడనియె
"చెట్లఫలముల తిన నపేక్షించి కాదు
మున్ను మనపెద్ద లందఱు చన్నరీతి
ఆచరించితి నంతియె అవని నాథ!

వారు నాఁటిన వృక్షముల్ ఫలములీన,
అనుభవించుట లేదొకో మనము నేఁడు!
అట్లె, మన మిప్డు నాఁటిన చెట్లఫలము
లనుభవింతురు గద ! మనతనయు లవల

అంత నారాజు ముసలివాఁడాడినట్టి
పలుకులకు నాత్మ నెంతయు ప్రమద మంది,
గౌరవము మీఱ నాతని గారవించె
ఏడుబంగారు కాసుల నెలమి నొసఁగి.

అంత నవ్వుచు నావృద్ధుఁ డనియె "ఱేఁడ!
రిత్త కాలేదు నేఁడు నా విత్తనములు
అహహ! నాఁటిన తొలినాఁడె అక్కజముగ
ఏడుబంగారు ఫలముల నీనెఁ గాన


ఎంత మంచి పాఠమో...ఆరోజుల్లో అని రీల్ ను వెనక్కితిప్పితే..అప్పట్లో నేర్చుకున్న కఠిన పదాలు, జాతీయాలు కూడా కొద్దిగా గుర్తు ...

ఱేడు
ప్రమదము
రిత్త

"ఉట్టికట్టుక కలకాల మూఁగులాడు"
"కాటి కొకకాలు సాచి"

4 కామెంట్‌లు:

  1. ముందుగా మీ జ్ఞాపక శక్తికి నా జోహార్లు. ఇలాంటి చిన్న చిన్నవే ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. బావుంది, చక్కగా గుర్తుపెట్టుకున్నారు.

    రిప్లయితొలగించండి
  2. అప్పుడు అతని మాటలకి సంతసించి రాజుగారు కానుకలనిచ్చారు....మరిప్పుడు అప్పుడు ఆ ముసలివాడు నాటిన చెట్ల పళ్ళనితిన్న ఎంతమంది చెట్లని నాటున్నారో!!!!??? నేనైతే నాటానండోయ్:-)

    రిప్లయితొలగించండి
  3. అనూ,నేను అల్పసంతోషిని.నాకిలాంటి చిన్న చిన్న విషయాలే ఆనందాన్నిస్తాయి కాబట్టి మిగిలిన వాటికన్నా నాకివే ఎక్కువగా గుర్తుంటాయి.

    Padmarpita గారు, మీరు చెట్లునాటినందుకు సంతోషం.

    రిప్లయితొలగించండి
  4. Great! అదృష్టవంతులు.

    రిప్లయితొలగించండి

Comment Form