25, డిసెంబర్ 2014, గురువారం

అమ్మ నాల్గవ వర్ధంతి.

మా అమ్మ పరమపదించి నేటితో నాలుగేళ్ళు నిండుకుంటుంది.2010 డిసెంబరు 25 వ తేదీ శనివారము వైకుంఠ యాత్ర చేసి శివైక్యం చెందారు.వైకుంఠ యాత్ర చేసి శివైక్యం పొందటమేమిటని తర్కపడకండి. శివకేశవులు అభేదులు. గీత లో పరమాత్మ చెప్పినట్టు ఉన్నది ఒక్కటే అది పరమాత్మ స్వరూపం. ఈ సమస్త జగత్తూ ఆత్మచేత నిండి ఈశ్వరునిచే వ్యాపించబడి వుంటుంది.

అంతవంత ఇమేదేహః నిత్యస్యోక్తా శరీరిణః
అనాశినోప్రమేయస్య తస్మాద్యుధ్యస్య భారత

భావము: నిత్యమైనటువంటి, నాశనం లేనటువంటి,సాటిలేనటువంటిది ఆత్మ(శరీరి). ఈ శరీరాలన్నీ నశించి పోయేవే. కనుక ఓ అర్జునా యుద్ధం చెయ్యు.
పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు కదా.అలాంటప్పుడు ఎంతవగచినా ప్రయోజనమేమీ వుండదు కాబట్టి జీవించి వున్నవాళ్ళు ఈ ప్రపంచంలో బ్రతకడానికి ప్రతినిత్యం యుద్ధము చేయక తప్పదు.


నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః
న చైవ న భవిష్యామః సర్వేవయ మతః పరం

భావము: నేను లేని సమయం అంటూ ఎప్పుడూ లేదు.అలాగే నీవుగానీ, ఈ రాజులు గానీ లేని సమయం కూడా ఎప్పుడూ లేదు. ఈ శరీరాలు నశించినప్పటికీ ఇక ముందు కూడా మనందరం లేకపోవుట అనేది లేదు.

5, జూన్ 2014, గురువారం

నా చిరకాల మిత్రుడు, జాన్ జిగిరీ దోస్త్ నాయుడు లక్ష్మీనారాయణ

నా చిరకాల మిత్రుడు, జాన్ జిగిరీ దోస్త్ నాయుడు లక్ష్మీనారాయణ హఠాత్తుగా ఈ రోజు గూగుల్ ఛాట్ లోకి వచ్చి "హెలో ఆనందా" అంటూ పలకరించాడు. ఈ ఆనంద ఎవరూ అని బట్టతలమీదున్న నాలుగు వెంట్రుకలను పీక్కోకండి. ఆయన సంబోధించిన "ఆనంద" వెనకాల ఓ చిన్న కథే వుంది. ఆ "ఆనంద" ను నేనే. వివరాలలోకి వెళ్తే.....

నేను బి.టెక్ ఆంధ్రా యూనివర్సిటీ విశాఖపట్టణంలో కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్న రోజులవి. అప్పట్లో కెమికల్ ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల నివాసానికై రెండు బ్లాకులను( హాష్టల్స్) కేటాయించారు. నాకు కెమికల్ ఇంజనీరింగ్ లో సీటు ఖాయమైన వెంటనే మా నాన్న విశాఖపట్టణం వచ్చి హాష్టల్ ఫీజు, కాలేజీ ఫీజు కట్టి ఇంటికి వచ్చారు. అప్పట్లో ఆ రెండు బ్లాకుల్లో ఒకటి వెజిటేరియన్ బ్లాకు గా మరొకటి నాన్ వెజిటేరియన్ బ్లాక్ గా వుండేది. విద్యార్థులు వీటి రెంటిలో ఏదో ఒకటి కోరుకోవచ్చు. మా నాన్న ఫీజుకట్టేటప్పుడు ఆలోచించి అసలే పిల్లవాడు మరీ సన్నగా వున్నాడని నాన్ వెజ్ బ్లాకైన నాల్గవ బ్లాకులో నాకు రూమ్ కోసం డబ్బుకట్టాడు.

కాలేజి మొదలుకావడానికి రోజులు దగ్గరపడతంతో మానాన్న,నేను మా ఊరైన జిల్లెళ్ళపాడు నుంచి విశాఖపట్టణానికి బయలు దేరి వెళ్ళాము.నాకది రెండవ రైలు ప్రయాణం.

మరి విశాఖ చేరినప్పుడు ఎక్కడ వుండాలనే సందేహం వస్తుంది కదా? అప్పటికే మా ఊరి దగ్గర వెలిగండ్ల అనే ఊరునుంచి వైజాగ్ వెళ్ళి స్థిరపడ్డ అప్పిరెడ్డి అనే వాళ్ళింట్లో దిగడానికి నిశ్చయించుకొని తొలుతగా వాళ్ళింటికి వెళ్ళాము. మరుసటి రోజు కాలేజీకి వెళ్ళాలి. ఆరోజు రానేవచ్చింది. అప్పట్లో హాష్టల్స్ లో రూములు కాలేజీ తెరిచిన ఒక నాలుగైదు రోజులకు కానీ కేటాయించేవాళ్ళు కాదు. ఈ నాలుగైదు రోజులూ మేము ఎవరో ఒక సీనియర్ ను పట్టుకొని వాళ్ళ రూముల్లో వుండాల్సిందే. అలాగే నేనూ కాలేజీలో చేరడానికి వెళ్ళినప్పుడు శ్రీరామచంద్రమూర్తి అని అప్పటికే మూడవ సంవత్సరం చదువుతున్న ఆయన రూమ్ లో వున్నాను. ఈయన మీకెలా తెలుసనే సందేహం వచ్చింది కదా? అది ఎలా జరిగిందంటే, EAMCET రేంక్ వచ్చిన తరువాత హైదరాబాదులో కౌన్సిలింగ్ కు వెళ్ళినప్పుడు అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరుగా చదువుతున్న ఒకతను మా నాన్నకు పరిచయమయ్యాడు. నేను ఆంధ్రా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ తీసుకోవడం చూసి "నాకు అక్కడ శ్రీరామచంద్రమూర్తి అని ఒక మిత్రుడున్నాడు", మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ర్యాగింగ్ మరీ ఎక్కువగా జరగకుండా కాపాడటానికి సహాయపడగలడు అని చెప్పి ఆయన దగ్గరకు వెళ్ళమని సలహా ఇచ్చాడు. ఆరకంగా నేను కాలేజీలో చేరడానికి వెళ్ళినప్పుడు శ్రీరామచంద్రమూర్తి రూమ్ కు వెళ్ళాము. అలా ఆరోజు పగలు ఆయనరూమ్ లో వుండి రాత్రి పడుకోవటానికి మళ్ళీ అప్పిరెడ్డి ఇంటికి వచ్చాము.

మానాన్న రెండు రోజులుండి తిరిగి మా ఊరికి బయలుదేరి వెళ్ళాడు.నేను పూర్తిగా శ్రీరామచంద్రమూర్తి రూముకి షిఫ్ట్ అయ్యాను. మేమున్నది వెజిటేరియన్ బ్లాక్ లో. అప్పటికే కొంతమంది సీనియర్స్ నాన్ వెజిటేరియన్ బ్లాక్ లో సరిగా చదివే విద్యార్థులుండరు అని చెప్పడంతో నేను ఐదవ బ్లాకులో రూమ్ తీసుకోవడానికి నిశ్చయమై పోయాను.హాష్టల్ లో రూమ్ అలాట్ చేసే రోజు రానే వచ్చింది. ఒక్కొక్కరి పేరు పిలవడం మిగిలిన రూమ్స్ లో వాళ్ళుకోరుకున్న రూమ్ ను అలాట్ చేయడం జరుగుతుంది. మానాన్న అందరికంటే ముందే వచ్చి డబ్బులు కట్టినా నాపేరు ఎంతకూ పిలవకపోవడంతో శ్రీరామచంద్రమూర్తి గారు విషయమేమిటో కనుక్కొన్నాడు. డబ్బుకట్టింది 4th block కి కాబట్టి నాపేరు 5th block లిష్ట్ లో లేదని చెప్పారు. ఈ విషయం మాకప్పుడే తెలిసింది. ఆరకంగా అందరికీ రూములు అలాట్ చేసిన తరువాత చివరగా ఒక రూమ్ మిగిలితే అందులో నా సహాధ్యాయి శ్రీరామ్ కిషోర్ తో పాటు నాకు కూడా ఆరూమ్ allot చేసారు. ఆ రూమ్ నెంబరు 25.

ఇంతవరకూ బాగానే వుంది కానీ మరి ఈ నాయుడు లక్ష్మీ నారాయణ ఎలా పరిచయమయ్యాడు, నాకు ఈ ఆనంద పేరు ఎలా వచ్చింది అనే విషయాలు తెలుసుకోవాలంటే తరువాతి టపాదాకా ఆగాల్సిందే :)

16, మే 2014, శుక్రవారం

Exit polls ( ఎక్జిట్ పోల్స్ )

మరికాసేపట్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోతుండటంతో మనలో వున్న ఉత్కంఠతకు కూడా తెరపడనుంది.ఈ లోపు మీ ఎక్జిట్ పోల్స్ ఫలితాలను కామెంట్ల రూపంలో వ్రాసుకోండి :-)

7, మే 2014, బుధవారం

ఇక అన్ని పత్రికలూ ఒక్కసారిగా అమాయకంగా మారిపోతాయి చూడండి.

ఎలక్షన్లు అయిపోయాయి. ఇక రాజకీయనాయకులకూ ఇన్ని రోజుల శ్రమనుంచి కాస్త విరామం. ఎండనకా వాననకా రేయింబవళ్ళు ప్రచారం చేసిన అభ్యర్థులకు విరామంతోపాటు టెన్షన్లు కూడా. ఈ ఎలక్షన్ల సందర్భంగా పట్టుపడ్డ కోట్ల రూపాయల ధనాన్ని ఎవరికి అప్పగిస్తారో ఏమిచేస్తారో? అలాగే వేల లీటర్లమధ్యము వుండనే వుంది. నిన్నటిదాకా రెచ్చిపోయిన ఈనాడు పత్రిక కూడా ఒక్కసారిగా అమాయకంగా తనకేమీ తెలియదన్నట్లు మారిపోతుంది.ప్రజలు మాత్రం తాము చెయ్యవలసిందంతా చేసేసి ఎలక్షన్ల రిజల్ట్స్ కోసం ఎదురుచూడడం మొదలు పెడతారు.సర్వే సంస్థలన్నీ తమ సర్వేలు ఎంతవరకూ నిజమో తెలుసుకోవడానికి ఎదురుచూపులు చూస్తుంటాయి. జ్యోతిష్య శాస్త్రవేత్తలు మాత్రం పంచాంగాన్ని ముందుపెట్టుకొని నేను ముందే చెప్పానుగా అనటానికి సిద్ధపడుతుంటారు.ఒకవేళ తము చెప్పింది జరగకపోతే ఏ రాహువో కేతువో ఎలాగూ వుండనే వుంటాడు. ఎలక్షన్ కమిషనర్స్ పుణ్యమా అని ఎక్జిట్ పోల్సపై నిషేదాన్ని విధించారు కాబట్టి ప్రతి ఓటరూ ఎవరికి తోచిన సర్వే వాళ్ళు చెప్పుకుంటుంటారు. ముఖ్యమంత్రి అభ్యర్థులు మాత్రం థూ దీనెమ్మ బ్రతుకు ఏమి ఎండలబ్బా అని తిట్టుకుంటూ ఏ.సీ. రూములకు పరిమితమై పదహారవ తేదీకోసం నిరీక్షిస్తుంటారు. రైతులు ఇప్పటికే పంటకోతకోసి అమ్మేయడం కూడా జరిగిపోయుంటుంది కాబట్టి ఇంటి పట్టునో లేదా రచ్చబండ దగ్గరో కూర్చోని మీసాలు మెలేస్తూ బెట్టింగ్ లకు సిద్ధమైపోయుంటారు.అమ్మలక్కలు పిట్టగోడ దగ్గర చేరి ప్రపంచాన్నంతా ఔపోసన పడుతుంటారు. బ్లాగర్లు ఎప్పటిలాగే బ్లాగులు రాసుకుంటూ కామెంట్లకోసం ఎదురు చూస్తూ వుంటారు. నేను మాత్రం ఈ పోస్టు రాసి ప్రక్కనోడి టపా చదవటానికి పోతా.

అన్నీ చెప్పావు నీ విశ్లేషణేమిటి అనుకునే వాళ్ళకు: నేనూ అందరిలాగే ఓటు వేయకుండా విశ్లేషణలు వ్రాసుకొనే జీవుల ఖాతాలో వుంటాను. నాకు అనిపిస్తున్నదేమిటంటే ఈ ఎన్నికలు ఇరుపార్టీలకూ జీవన్మరణ సమస్య ఐనా ఏదో ఒకపార్టీ గెలవక తప్పని పరిస్థితి. పోటీ హోరాహోరీ జరిగినట్లే అనిపిస్తున్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడంకెల నంబరు ను చేరుకొని ప్రభుత్వాన్ని ఏర్పరచవచ్చు.

5, మే 2014, సోమవారం

ఐసరబజ్జా... సాక్షి vs ఈనాడు

ఇలా కొట్టుకుంటుంటే జనాలకు అసలైన విషయాలు తెలుస్తాయి :-).

 

ఈనాడు పై సాక్షి కథనం


 
జగన్ పై ఈనాడు కథనం
 
 

3, మే 2014, శనివారం

ఇంతకీ మీ ఓటు ఎవరికి?

2014 మే 7 వ తేదీ దగ్గరపడుతుంది. ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవడం కోసం ఎప్పటికన్నా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారనిపిస్తుంది. దానికి తోడు మనకు తెలుగులో వున్న న్యూస్ పేపర్లు అన్నీ సిగ్గూ,ఎగ్గూలను వదిలేసి పూర్తిగా పార్టీ లతో సంధానమైపోయినట్టు ప్రచారాస్త్రాలను ప్రజలమీదకు ప్రయోగిస్తున్నారు. ఈ మధ్య నేను తరుచూ ఈనాడూ, సాక్షీ పేపర్లను అనుసరిస్తున్నాను. సాక్షి వైయస్సార్ సీపీ కి ప్రచారాన్ని చేసుకుంటుంటే ఈనాడు మాత్రము రెచ్చిపోయి వైయస్సార్ సీపీ కి వ్యతిరేకంగా ప్రచారపాఠాలను గుప్పిస్తుంది. వీటివల్ల ప్రజలలో ఏమాత్రం మార్పు వస్తుందనేది ప్రక్కన పెడితే ఈ రెండు పేపర్లవల్ల తెలుగుదేశం, వైయస్సార్ సీపీలలో లొసుగులు మాత్రం బాగా బయటకు కనిపించేటట్టు చేయడంలో ఈ పత్రికలు సఫలమయ్యాయని చెప్పవచ్చు. ఈనాడైతే మరీ ఒక నెలరోజులనుంచీ వైయస్సార్ సీపీ కి వ్యతిరేకంగా రోజూ ఒక కథనాన్ని వండి వారుస్తుంది. చిత్రమేమిటంటే ఈ పత్రిక తెలుగుదేశానికి అనుకూలంగా కథనాలను ప్రచురించడానికి బదులు ysrcp కి వ్యతిరేకంగా negetive ప్రచారానికి తెరలేపింది. అంటే టి.డి.పి తరపున ప్రచారం చెయ్యడానికి ఏమీ విషయంలేక ysrcp మీద పడిందో లేక పోటీ రెండు పార్టీలమధ్యనే కాబట్టి ఒకదానికి వ్యతిరేకంగా ప్రచారం చేయటం ద్వారా ఓటర్లను ప్రభావితం చేసి టి.డి.పి కి ఓట్లు మళ్ళించడంలో అంతర్భాగంగా వేసిన ఎత్తుగడో తెలియదు కానీ ఈనాడు పేపరు ప్రధాన వార్తలన్నీ ysrcp కి వ్యతిరేకంగా ప్రచురిస్తున్నారు.

ఇక ఓటర్ల విషయానికొస్తే వాళ్ళమనసుల్లో ఓటు ఎవరికి వెయ్యాలో ఇప్పటికే నిర్ణయమైపోయినట్టు కనిపిస్తుంది.నేను తిరిగిన ప్రదేశాలలో ఐతే మాత్రం జనాలు ఈసారికి ysrcp వైపే మొగ్గు చూపిస్తున్నారు. నాకెలాగూ ఓటువేసే సౌకర్యం లేదు కాబట్టి ఇలాంటి పేపర్లు చదువుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నాను. వార్తాపత్రికలల్లో వచ్చే వార్తలను సేకరించి ఇక్కడ వ్రాద్దామని ఒక సంకల్పం చేసుకున్నా కానీ పేపరు నిండా ఇవే వార్తలను చూసి వాటిని మళ్ళీ ఎత్తివ్రాయలేక ఆ సంకల్పాన్ని విరమించుకున్నాను. ఇంతకీ మీ ఓటు ఎవరికి?

4, ఏప్రిల్ 2014, శుక్రవారం

విషయమేమీ లేకుండా కూడా టపా వ్రాయవచ్చు :)



ఈ మధ్య చాలారోజుల తరువాత మళ్ళీ నాబ్లాగు రమ్మని పిలిచింది. ఇంతకాలం ఏదో ఇరగదీసే పనులున్నాయనుకుంటే అది పొరపాటే. గూగుల్ ప్లస్,ఫేస్ బుక్ లకు జనాలు వలస పోయిన తరువాత బ్లాగులు రాసేవాళ్ళూ తగ్గిపోయారు కదా! పాతనీరు పోయి క్రొత్తనీరు బ్లాగుల్లో ఏమన్నా ప్రసరిస్తుందేమో కానీ నా విషయానికొస్తే వ్రాయాలన్న ఉత్సాహం తగ్గిపోవడమే. అటు ఆంధ్రదేశమంతా రాజకీయ మాయగాళ్ళతోటి అట్టుడికి పోతుంది. ఆవేడికి వసంతకాలంలోనే ఎండలు బాగా ముదిరిపోయాయని వార్తలు వస్తున్నాయి.ఆ వేడీ ఈ వేడీ కలిసి జనాలకు ఉక్కపోత మరీ ఎక్కువైందట. ఇన్ని బాధలను ఎలా భరిస్తున్నారో ఏమో చూద్దామని నేనూ ఈ ఏప్రిల్ మాసంలో తెలంగాణా/ఆంధ్ర ప్రాంతాలను దర్శించుకోవాలని బయలుదేరుతున్నాను.రెండు రాష్ట్రాలుగా విభజన జరగడానికి ఇప్పుడు ఏమీ అడ్డంకులు లేవు. తెలంగాణా ఈ నెలరోజుల్లోనే బాగా అభివృద్ధిచెంది ఉరకలేస్తుందేమో నన్న కోరిక బలంగా కూడా వుంది :-) .అసలే ఇప్పుడు మేము తెలంగాణా వాసులమయ్యేము.ఇంక ఆంధ్రప్రాంతంలో వున్నవాళ్ళంతా మాకు చుట్టాలే. వాళ్ళ రాష్ట్రం వేరు మా రాష్ట్రం వేరు :)

ఎలాగూ ఎలక్షన్ల టైం కాబట్టి ఎవరైనా నాక్కూడా ఫ్రీ ఆఫర్లు తలుపుతట్టి ఎమన్నా ఇస్తారేమో చూడాలి. ఒకవేళ అలాంటి ఆఫర్లతో ఫ్రీగా ఇస్తామని మీదగ్గరకు ఎవరన్నా వచ్చినా మాయింటికి కూడా పంపించండి. ఊరకే ఇస్తామంటే ఎవరన్నా వద్దంటారా ఏమిటి?

ఇకపోతే హైదరాబాదులో డ్రైవరు లేకుండా కార్లు అద్దెకిచ్చే పద్ధతి ఏమన్నా వుందా లేకపోతే కారు కావాలంటే డ్రైవరూ మనతోటి వుంటాడా?అమెరికా లో లాగా కార్లు రెంట్ కు ఇస్తే ఏంచక్కా ఆ ఊరూ ఈవూరూ తిరిగిరావచ్చు.లేదంటే ఈ ఎండల్లో బస్సుల్లో పడి తిరగాలంటే సగం జీవితం అక్కడే ఖర్చయిపోతుంది.

ఇదే విషయమేమీ లేకుండా టపా కట్టడమంటే. అక్కడనుంచి వచ్చాక మళ్ళీ బోలెడన్ని కబుర్లతో మీముందుంటాను. అంతదాకా ఎండాకాలానికి భయపడుతూ ప్రయాణానికి సన్నద్ధమౌతా...

17, ఫిబ్రవరి 2014, సోమవారం

తెలుగు తరిగిపోయి తెరచాటున దాక్కుంది

ఆలోచనలు అరిగిపోయి సన్నమై ఆవిరైపోతున్నాయ్

తెలుగు తరిగిపోయి తెరచాటున దాక్కుంది

వ్రాయాలన్న తపనపోయి రాళ్ళమధ్య యిరుక్కుంది

చదవాలన్న కోరిక చెట్టెక్కి కూర్చుంది

ఇవేమీ లేని జీవితం నిస్సారమై తోస్తుంది.

అసలు వ్రాయాలన్న కోరిక లేకపోతే వ్రాయలేము కదా. వ్రాయకపోతే వున్న భాషకాస్తా మాసిపోయి వెలుగు కోల్పోతుంది.అలా కొద్దినెలలు మూలన పెట్టెస్తే అసలు ఏమీ వ్రాయకుండానే, ఏమి వ్రాద్దామన్నా బద్ధకంతో కాలం గడిచిపోతుంది. దీని బారినుంచి బయటపడాలంటే ఎదో ఒకటి, వచ్చిన ఆలోచనను ఇక్కడ పడేయడమే ఉత్తమమైన మార్గం.

25, జనవరి 2014, శనివారం

మా ఇంటి ముంగిట్లో మరుమల్లె చెట్టు...

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విడుదలైనప్పుడు సినిమా హాల్లొ చూస్తే అంతగా నచ్చలేదు కానీ ఈ రోజు ఇంట్లో టి.వి లో చూస్తే బాగానే నచ్చింది. కారణమేమై వుంటుందబ్బా? తొమ్మిదేళ్ళ క్రితం మా ఇంట్లో తీసిన వీడియో చూసిన తరువాత ఈ రోజు ఈ సినిమా చూడ్డంతో నచ్చిందేమో లేదా మా ఇంట్లో మల్లెపూల చెట్టు విశేషమో.

Over all I am home sick today!!


 

19, జనవరి 2014, ఆదివారం

ఆకాశవాణి విజయవాడ కేంద్రం....,,,,,,,,,

ఆకాశవాణి విజయవాడ కేంద్రం.... ఇప్పుడు సంస్కృత పరిచయం కార్యక్రమం అంటూ నా చిన్నప్పుడు ఉదయపువేళల్లో సంస్కృతం చదువుకొనే విద్యార్థుల కోసం విజయవాడ కేంద్రం వారు ఒక ధారావాహికను ప్రసారంచేస్తుండేవారు. ప్రసారకార్యక్రమానికి ముందుగా సంగీతంతో కలిపి ఓ శ్లోకాన్ని రోజూ ప్రసారం చేసేవారు. అప్పట్లో రేడియో అంటే వుండే ఇష్టంతో ఈ కార్యక్రమంతో పాటు మిగిలిన చిన్నపిల్లల కార్యక్రమాలను వినడం కూడా ఓ పరిపాటిగా అలవాటైపోయింది. 
మిగిలిన కార్యక్రమాలు ఎలా వున్నా ఆ సంస్కృత పాఠానికి ముందుగా సంగీతపు మేళవింపుతో వచ్చే శ్లోకం మాత్రం అమితంగా ఆకర్షించేది కానీ పూర్తి శ్లోకాన్ని మాత్రం ప్రసారం ప్రసారం చేసేవాళ్ళు కాదు.అప్పట్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో అది ఎందులో శ్లోకమో ఎక్కడ దొరుకుతుందో కూడా తెలిసే అవకాశం చాలా తక్కువగా వుండటంతో దాని వివరాలు నాకు తెలియలేదు. 
రిం...గ్ ........రిం.....గ్....... రిం..............గ్
అంటే కాలం గిఱ్ఱు గిఱ్ఱున తిరిగి కాలంతో ఆ ఒడ్డు ఈ ఒడ్డూ కొట్టుకోని ఆధారం దొరికిన దగ్గర కాసేపు ఒడ్డున సేదతీరుతూ లేనిదగ్గర కాలప్రవాహంలో కొట్టుకు పోతూ ఈరోజు అప్పుడెప్పుడో కొన్న రోజుకో శ్లోకం అనే పుస్తకం తెరిస్తే ఆనాటి ఙ్ఞాపకాలు మళ్ళీ మస్తక పుటలపై నాట్యమాడటంతో ఆ ఙ్ఞాపకాలను అక్షరబద్ధం చేస్తూ ఈ వ్యాసంతో ఇక్కడ ఇలా...
ఇంతకీ ఆశ్లోకం భర్త్రుహరి రచించిన నీతి శతకం లోనిది.

కేయూరాణి న భూషయన్తి పురుషం హరాః న చంద్రోజ్వలాః
నస్నానం న విలేపనం న కుసుమం నాలంకృతాః మూర్థజాః |
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయన్తే ఖలు భూషణాని, సతతం వాగ్భూషణం భూషణమ్ ||

అంటే భుజకీర్తులూ,చంద్రుడిలా ప్రకాశించే హారాలు,స్నానాలూ, లేపనాలూ, కుసుమమూ, బాగా అలంకరించుకున్న కేశాలూ పురుషుడికి అలంకార ప్రాయాలు కాదు.అంటే అంతఃసౌదర్యాన్ని ఇవ్వవు. పురుషుడికి ఆంత:సౌందర్యాన్ని ఇవ్వగలిగేది మంచి వాక్కు మాత్రమే అని అర్థం. 





నేను రేడియోలొ విన్న శ్లోకమే నచ్చినదనుకుంటే యూట్యూబ్ లో ఈ శ్లోకం ఈ చిన్నారుల గాత్రం తో విన్నతరువాత ఆనాడు రేడియోలో విన్న దానికంటే ఇదే మెరుగ్గా వున్నదనిపించింది. ఇలాంటి అత్యున్నతమైన కళలు ప్రభుత్వ ఉన్నతపాఠశాల విద్యార్థుల వద్ద వున్నా వెలుగు చూడనివెన్నో.... ఈ పిల్లలు కూడా పైన చెప్పిన శ్లోకానికి సరిగ్గా సరిపోతారు కదా! వారి గాత్రమే నాచేత ఈ వ్యాసాన్ని వ్రాపించింది. ఆ

చిన్నారులకు కూడా వారి వాగ్భూషణమే భూషణము

పై శ్లోకాన్ని  ఏనుగు లక్ష్మణ కవి తెలుగులోకి  అంతే సుందరంగా అనువదించాడు చూడండి

భూషలుగావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్
భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధజలాభిషేకముల్
భూషలు గావు,పురుషుని భూషితు జేయుఁ బవిత్రవాణి, వా
గ్భూషణమే సుభూషణము భూషణముల్ నశియుంచు నన్నియున్

13, జనవరి 2014, సోమవారం

పులుంగు టెకిమీడవురా గిజిగాడా

ఎంతో చక్కగా శ్రవణానందకరంగా ఆలపించి పదిమందితో  యు ట్యూబ్ ద్వారా ఈ ఆడియో వీడియో ను పంచుకున్న రూపకర్తలకు ధన్యవాదాలతో

పులుంగు టెకిమీడవురా గిజిగాడా..