30, జనవరి 2011, ఆదివారం

అలంకార భూషణం తెలుగు కావ్య చందన వనమ్. - 1


కావ్యానికైనా, కవితకైనా, పాటకైనా, పద్యానికైనా అలంకారం అలంకారాలే. ఈ సొమ్ములతో గూడిన రచనలను స్రావ్యమైన గొంతుతో గానం చేసినప్పుడు వినే మనిషి తనకు తెలియకుండానే లీనమై పరవశించి పోతాడు. మనిషి పుట్టుకతో అలంకారాలు పుట్టినట్టు భాష పుట్టుకతో పాటే ఈ అలంకారాలు పుట్టాయేమో! నిజమైన ఆవేశంతో మాట్లాడే మనిషిని గమనించండి. అతని మాటల్లో ఎన్ని అలంకారాలు దొర్లుతాయో !. వ్యాకరణ శాస్త్రాలు పుట్టి అలంకారాన్ని రకరకాలు గా విభజించి అలంకార శాస్త్రానిగా ప్రాచుర్యం జరిపారు కానీ నిజానికి వ్యాకరణం వల్ల భాషకానీ అలంకారాలు కానీ పుట్టలేదు. బహుశా పద్యం పుట్టిందేమో !. ఏ వ్యాకరణం తెలియని పల్లె వాసీల భాషలో ఎన్నో అలంకారాలు అలవోకగా దొర్లుతుంటాయి.

ఇక మన వాఙ్మయ చరిత్ర చూసినట్లైతే భరతుడు నాట్యశాస్త్రాన్ని యమకమనే శబ్దాలంకారాన్ని, ఉపమ, దీపక, రూపక ములనెడి అర్థాలంకారాలను చెప్పాడని అంటారు. వివిధ వ్యాకరణ శాస్త్రవేత్తలు ఈ అలంకారాలను వివిధరకాలుగా విభజించినట్లు కనిపిస్తుంది.

దండి - 34 అలంకారాలని చెప్పాడు
మమ్మటుడు - 59 అలంకారాలు
విద్యానాథుడు - 66 అలంకారాలు
చన్ద్రాలోక కర్త - 101 అలంకారాలు
కువలయానందము ( అప్పయ్య దీక్షుతులు ) - 124 అలంకారాలు

ఎవరు ఏరకంగా విభజించినా, ముఖ్యముగా ఇవి రెండు రకాలే. ౧) శబ్దాలంకారములు ౨.) అర్థలంకారములు.

ఇంతకీ ఇవి ఎవరికి పనికొస్తాయి? ఏమో !... ఈ మధ్య నేను ఇండియాకి వెళ్ళినప్పుడు నా పూర్వ గురువు శ్రీ సుబ్బారెడ్డి గారితో ఖాళీ సమయాల్లో జరిగిన చర్చను ఒక క్రమ పద్ధతిలో అక్షరబద్ధం చేసి దాచుకొనే ప్రక్రియ ఇది.

శబ్ద ప్రధానముగా కలవి శబ్దాలంకారములు

అర్థ ప్రధానముగా గలవి అర్థాలంకారములు

ముందుగా కొన్ని శబ్దాలంకారాలను చూద్దాము. ఆ తరువాత ఒక్కో అలంకారాము గురించి బహుళ ఉదాహరణలనూ చూద్దాము. నాకు practice కి పనికి వస్తుంది :)

శబ్దాలంకారములు

౧) అను ప్రాసము
అ) వృత్త్యను ప్రాసము
ఆ) ఛేకాను ప్రాసము
ఇ) లాటాను ప్రాసము
ఈ) అంత్యాను ప్రాసము

౨) యమకము
౩) ముక్తపదగ్రస్తము


అనుప్రాసమంటే ఒక అక్షరం గాని పదము గానీ మళ్ళీ మళ్ళీ రావడం ( ఆవృత్తి ) . ఈ ఆవృత్తి ని మళ్లీ నాలుగు రకాలుగా విభజించారు
అ) వృత్త్యను ప్రాసము
ఆ) ఛేకాను ప్రాసము
ఇ) లాటాను ప్రాసము
ఈ) అంత్యాను ప్రాసము


ఈ రోజు వృత్త్యను ప్రాసను గూర్చి తెలుసుకొని సెలవు తీసుకుందాం.వచ్చేవారం ఛేకానుప్రాసము.


వృత్త్యానుప్రాసము : ఒకటి గాని అంతకంటే ఎక్కువ గానీ హల్లులు తిరిగి తిరిగి ఒక వాక్యంలో వచ్చినట్లైతే ఆ వాక్యానికి వృత్త్యాను ప్రాస వుంది అంటాము.

ఇక్కడ హల్లు ప్రధానమని గుర్తించండి.


ఉదాహరణ
-----------
1) విష్ణు రోచిష్ణు సహిష్ణు కృష్ణు
2) ఆ జెఱ్ఱి మఱ్ఱి తొఱ్ఱలో బిఱ్ఱ బిగిసి ఉన్నది

నా సొంత క్రియేటివిటీ ఉదాహరణలు :)
------------------
3) అమ్మ దీనెమ్మ వెంకట సుబ్బమ్మ
4) అవ్వకు బువ్వ నివ్వవా మువ్వ గోపాలా?



మరి మీవి? పూర్తి వృత్త్యానుప్రాస కవిత కానీ పాట కానీ , పద్యము కానీ మీకు తెలుసా?

21 కామెంట్‌లు:

  1. అడిగెద నని కడువడి జను
    నడిగిన దను మగడ నుడుగుడని నెడ నుడుగున్
    వెడవెడ చిడిముడి తడబడ
    నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ !!

    రిప్లయితొలగించండి
  2. రేపంటి రూపం కంటి
    పూవంటి తూపుల వంటి
    నీ కంటి చూపుల వెంట నా పరుగంటి
    రేపంటి వెలుగె కంటి
    పూవింటి దొరనే కంటి
    నా కంటి కళలు కలలొ నీ సొమ్మంటి

    నాకైతే ఇది కరెక్టో కాదో తెలీదు కాని, నాకు మాత్రం ఇది గుర్తుకొచ్చింది.

    రిప్లయితొలగించండి
  3. abba! jeevitamlo vyaakaranam joliki velhlhae pani unDadu ani Inter aipoeyaaka tega santoeshinchaanu. idigoe maralaa meeru ilaa gurtu chaesi bhayapeDutunnaaru:-)

    రిప్లయితొలగించండి
  4. అమ్మల గన్న యమ్మ ముదురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ దయాంబు రాసివి గదమ్మ

    రిప్లయితొలగించండి
  5. విష్ణు సహస్రంలో నాకయితే అన్నీ వృత్యానుప్రాసలె అనిపిస్తాయి
    "శుబ్రై రభ్రై రదభ్రై......"
    "సశఙ్ఖచక్రం సకిరీటకుణ్డలం
    సపీతవస్త్రం సరసీరుహేక్షణమ్ |
    సహారవక్షఃస్థలకౌస్తుభశ్రియం....."


    మహిషాసురమర్ధిని స్తోత్రంలో ఒక చోట
    అయి సుమన సుమన సుమన సుమన....అనీ
    శ్రిత రజనీ రజనీ రజనీ రజనీ రజనీ ......అనీ ఉంటుంది.
    అది వృత్యానుప్రాసం కాదు కదండీ?

    అసంధర్భమైనా ఏమనుకోరని ఇక్కడ అడిగేస్తున్నాను
    ఆ "శ్రిత రజనీ రజనీ రజనీ......"అన్న చోట అది రజనీ నీరజ అన్న పదాల మీద fantastic word play అన్నది అర్థమవుతోంది కాని అసలైన అర్థం బోధ పడట్లేదు. చెప్పగలరా?

    రిప్లయితొలగించండి
  6. @జ్యోతీ మంచి పద్యాన్నే గుర్తు చేసారు. ఈ పద్య స్ఫూర్తితో ( పోతన పద్య స్ఫూర్తితో) ఉత్తర రామాయణ రచయిత వ్రాసిన మరొక పద్యం

    గడగడ వడకుచు నుడువులు
    తడబడ సిగ్గడర నెడఁద దడదడ మనఁగా
    జడుపుం జెమ్మట నొడటం
    దడియ దశాస్యుఁగని రంభ తడయక పలికెన్

    రిప్లయితొలగించండి
  7. @జయ, ఏంపాట పట్టారండీ..excellent song. ఈ పాట ఎన్ని సార్లు విని వుంటానో..ట్యూన్ కూడా బాగా నచ్చిన పాటల్లో ఇదొకటి

    రిప్లయితొలగించండి
  8. సునీతా.. ఏమి పరవాలేదు బలవంతంగానైనా నా పోస్టులు చదివించి మళ్ళీ ఇంటర్మీడియేట్ రోజులు గుర్తు చేస్తాను కదా :)

    రిప్లయితొలగించండి
  9. రావు గారూ మంచి పద్యము గుర్తుచేసారు.

    రిప్లయితొలగించండి
  10. పెద్దన మనుచరిత్ర నుండి ఒక వచనం ....
    జటిలుండు గిటకిటం బండ్లు గొఱికి హుమ్మని కటమ్ము లదుర ముకుపుటమ్ములు నటింపఁ "గటకటా! కుటిలాత్మా! యటమటమ్మున విద్య గొనుటయుం గాక గుటగుటలు గురువుతోనా?" యని కటకటం బడి ....

    రిప్లయితొలగించండి
  11. భావకుడన్ గారూ

    అయి సుమన సుమన సుమన సుమన....అనీ
    శ్రిత రజనీ రజనీ రజనీ రజనీ రజనీ

    ఇది వృత్యానుప్రాసం కాదండి. రాబోయేవారం లో మిగిలిన శబ్దాలంకారాల గురించి (యమకము) వ్రాసినప్పుడు చూద్దాము.

    ఇకపొతే మీరూ నన్ను అమ్మవారి స్తోత్రానికి అర్థం చెప్పమని ఎంత సాహసం చేసారండి :-) జోక్స్ పక్కన పెడితే నాకు ఆ స్తొత్రార్థము చెప్పేటంత పరిజ్ఞానము లేదు. మన బ్లాగుల్లో వున్న పండిత వర్యులు ఏమైనా సహాయం చేస్తే మీతో పాటి నేనూ తెలుసుకుంటాను.

    రిప్లయితొలగించండి
  12. ధన్యవాదాలు శంకరయ్యగారూ..నేను వ్యాఖ్య వ్రాసేలోపు మీరు వ్యాఖ్య వ్రాసారు. అలాగే పైన భావకుడన్ గారడిగిన శ్లోకానికి పరిష్కారమేమైనా చెప్తారా?

    రిప్లయితొలగించండి
  13. మరి ఇది...

    "మొక్కుబడికి బుక్కులెన్ని చదివినా బక్కచిక్కిన కుక్కగొడుగు మొక్కలా చెదలు కొట్టేసిన చెక్క ముక్కలా కుక్క పీకేసిన పిచ్చి మొక్కలా బిక్కమొహం వేసుకొని వక్క నోట్లో కుక్కుతూ బొక్కుతూ బెక్కుతూ చుక్కలు లెక్క పెడుతూ ఇక్కడే గుక్క పెట్టి ఏడుస్తూ ఈ చుక్కల చొక్కా వేసుకొని డొక్కు వెధవలా గోళ్ళు చెక్కుకుంటూ నక్కపీనుగులా చెక్కిలాలు తింటూ అరిటి తొక్కలా ముంగిట్లో తుక్కులా చిక్కు జుట్టేసుకుని ముక్కుపొడి పీలుస్తూ కోపం కక్కుతూ పెళ్ళాన్ని రక్కుతూ పెక్కు దిక్కుమాలిన పనులు చేస్తూ రెక్కలు తెగిన అక్కుపక్షిలా నక్కి నక్కి ఈ చెక్కబల్ల మీద పక్కచుట్టలా పడుకోకపోతే, ఏ పక్కకో ఓ పక్కకెళ్ళి పిక్కబలం కొద్దీ తిరిగి నీ డొక్కశుద్దితో వాళ్ళను ఢక్కామొక్కీలు తినిపించి నీ లక్కు పరీక్షించుకొని ఒక్క చక్కటి ఉద్యోగం చేజిక్కించుకుని ఒక్క చిక్కటి అడ్వాన్సు చెక్కు చెక్కుచెదరకుండా పుచ్చుకుని తీసుకురావచ్చు కదరా తిక్క సన్నాసీ. ఇందులో యాభయ్యారు కాలున్నాయి తెలుసా"

    రిప్లయితొలగించండి
  14. హ హా జ్యోతీ... ఆడువారు మీకు మగ వారు అలంకారాల గురించి చెప్పాలా? అలంకారమంటే అలంకరించుకొన్నాక ప్రియంగా వుండాలి మరి.

    ఇలా తిట్లదండకం ఎత్తుకుంటే ఎలాగండీ :)

    రిప్లయితొలగించండి
  15. ఒక అవధాన సభ ప్రారంభం కాబోతోంది . హాస్యభారతి శ్రీ ఆమళ్ళదిన్నె గోపీనాధ్ గారు అన్నారట అవధాని గారితో. శ్రోతలలో ఉత్తేజం నింపటానికి ‘టీ’ లేమన్నా పంచమంటారా అని. అవశ్యం అన్నారట అవధాని గారు. గోపీనాధ్ గారు ఇలా అందుకున్నారట,

    నిను సేవించిన గల్గు మానవులకున్ వీటీ వధూటీ ఘటీ
    ఘనకోటీ శకటీ కటీ తటి పటీ గంధే భవానీ పటీ రనటీ
    హరి పటీ సువర్ణ మకుటీ ప్రఛ్ఛోటికా పేటికల్
    కనదామ్నాయ మహాతురంగ శివలింగా నీల కంఠేశ్వరా

    (శ్రీ యస్.వి.యస్.యమ్. శాస్త్రి గారి వ్యాసం ‘కవితా రమణీయం’ నించి కాపీ కొట్టీశాను. స్నేహ సమాఖ్య , సౌత్ ఎండ్ పార్క్, ఎల్.బి. నగర్, హైదరాబాద్, వారి వార్షిక సంచిక ‘లిఖిత 2007’ లో ప్రచురించబడినది.)
    (అవునూ ఈ ఉదాహరణ సరైనదేనా)

    రిప్లయితొలగించండి
  16. మరి ఇది ఓకేనా??

    ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే తుల్లు
    ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొల్లు
    వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
    వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
    ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళు

    రిప్లయితొలగించండి
  17. సుబ్రహ్మణ్యం గారూ, కవితారమణీయంనుంచి రమణీయమైన పద్యాన్ని అందించారు కదా... సూపర్ నచ్చేసిందండి. అర్థం కూడా చెప్తే మాలాంటి మట్టి బుఱ్ఱ ఘనాపాటీ లకు బాగుంటుంది కదా.

    రిప్లయితొలగించండి
  18. జ్యోతీ ఈ పాట ఓకేనా అంటారా? దీని మీద నేనప్పుడెప్పుడో ఒక పోస్టే వ్రాసిన గుర్తు..ఇప్పుడు వుందో తొలిగించానో మరి గుర్తులేదు కానీ చాలానే చర్చ జరిగింది అప్పట్లో :-). ఇందులో మరో అలంకారం కూడా వుంది. గుర్తించారా?

    రిప్లయితొలగించండి
  19. క్షమించాలి. నా కామెంటు కి మీ జవాబు ఆలస్యం గా చూడడం జరిగింది. నేను పండిత పుత్రుడిని. అందుచేత అర్ధం సవివరం గా చెప్పలేను. కవితా రమణీయం వ్రాసిన, అర్ధం చెప్పగలిగిన ఇంకొక మిత్రులు, ప్రస్తుతం తెలుగు మహాసభలకు వెళ్లారు. వారు వచ్చిన తరువాత వారిని అడిగి చెప్పటానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. సుబ్రహ్మణ్యం గారూ, తెలుసుకుందామని అడిగాను .వీలున్నప్పుడే చెప్పండి.

    రిప్లయితొలగించండి

Comment Form