28, అక్టోబర్ 2012, ఆదివారం

జానపదుల పెరటి గుమ్మంముందు గుభాళించిన మల్లెల సువాసన


జానపదుల పెరటి గుమ్మంముందు గుభాళించే మల్లెల సువాసనలకు ఓ ఉదాహరణ మాత్రమే యిది. ప్రాచీన సంస్కృత కవుల వర్ణనలకు ఏమాత్రమూ తీసిపోని పల్లెటూరి వాడి విరహవేదన.

మంచి వెన్నెల సమయం. మల్లెపూల పందిరి. పరిశరప్రాంతమంతా మల్లెల సువాసన. ఆ ఆహ్లాదకర వాతావరణంలో ప్రియుడు వెండికట్ల వీణ చేతపట్టి ప్రియురాలిని పిలుస్తున్నాడు. ఒకవేళ ప్రియురాలు వచ్చినా గలగలా నవ్వుల సరసములతోనే తెల్లవారి పోతుందట.  విరహవేదనలో తన ప్రియురాలి పెదవులను కొండగోగులు, కొండనిమ్మలతో పోలుస్తున్నాడు. గూగుపూలు
లేత పసుపు, నిమ్మకాయల రంగు లేత పసుపు. ఈ కొండగోగులు పూయడం వల్లనో , లేత నిమ్మ  కాయడం వలనో నీ పెదవులు దొండపండు రంగులో వుంటాయి. ఓ వయ్యారీ నువ్వు రానట్లైతే నా మనసును ఎవరి పాలు చెయ్యాలి?

మల్లెలు ఆహ్లాదానికి, మథురమైన ఆలోచనలు కలగడానికి ఉత్ప్రేరకాలుగా వుపయోగపడుతాయి. మల్లెలు తెలుపు. తెలుపు  స్వచ్ఛతకు గుర్తు. అలాగే ముట్టుకుంటే కందిపోయే గుణం, సున్నితత్త్వం కూడా దీని సొంతం .  ఇంతటి విశిష్ట గుణాలున్న మల్లెలతో ప్రియురాలిని పోలుస్తున్నాడు.

నాయిక మాటలాడుతుంటే మల్లెలంత మధురంగా వుందట. మనసు మల్లెపూవు వంటిదట. అంటే అంత స్వచ్ఛమూ సున్నితమూనూ! ఇంతటి అందమైన గుణగణాలున్న నా ప్రేయసి రాకపోతే ఈ మల్లెపందిరినుండి రాలే మల్లెలెవరికివ్వాలి నేను?

మనకు ఈ కాలువల సౌకర్యం తక్కువగా వున్నప్పుడు ప్రజలు సాధారణంగా మెట్ట పైరులే వేసేవాళ్ళు. మెట్టప్రాంతాల్లో మినుములు, కందులు ప్రధానం. ఈ రెండూ కూడా వేసవికాలపు పంటలు.అంటే మార్చి నుండి జూన్ వరకూ పండించే పంటలు. ఈ కాలంలో పశువులకు పచ్చిక దొరకదు. పచ్చిక బదులు పశువులు ఈ కందిపైరు కొసలు మేస్తాయి. ఇప్పుడు నాయకుడేమంటున్నాడంటే నందీ పూసింది, కందీ కాసిందీ ఆ కంది కొసలను ఎద్దు కూడా తినడం అయింది అంటున్నాడు. అంటే ఎండాకాలమైపోయి వర్షాకాలం మొదలైంది. ఈ కాలంలో కూడా నా శరీరం విరహతాపంతో చల్లబడటంలేదు. కాబట్టి కొంచెం గంధమైనా పంపమని వేడుకుంటున్నాడు. ఇక్కడ మరో విశేషము కూడా వుంది.  ఎంతమంది ఎద్దులు నడిచేటప్పుడు  చూసి వుంటారో లేదో గానీ, మంచి బలమైన ఒంగోలు జాతి ఎద్దులు నడుస్తుంటే స్పష్టమైన ఠీవి కనిపిస్తుంది. అలాంటి ఠీవిగల మంచి నడకతో రావా ప్రియురాలా అని వేడుకుంటూ, రాలేని పక్షంలో గంధమైన పంపమని అభ్యర్థిస్తున్నాడు. గంధము శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.


చూశారు కదా!   అలంకారాన్ని నెమరువేస్తూ వ్రాసే కావ్యాలు ఈ చిన్న పాట పొలిమేరలచెంతకైనా రాగలవా? ఇప్పుడు ఆ పాట చదవండి


వేళజూడ వెన్నెలాయె వెండికట్ల కిన్నెరాయె
మల్లెపూల పందిరాయె, వయ్యారీ రావే - నవ్వులోనె తెల్లవారును

కొండగోగులు పూసెనేమొ కొండనిమ్మలు కాసెనేమొ
దొండ పండులాంటి పెదిమె, వయ్యారీ రావే - మనసు ఎవరిపాలు చేతును

మల్లెపూలు పూసినట్లు మళ్ళి మళ్ళి మాటలాడు
మల్లెపూలవంటి మనసు, వయ్యారీ రావే - పూవులెవరి పాలు జేతును

నందిపూసె కందిగాసె కందికొనలు నందిమేసె
అందమైన మేలినడల వయ్యారీ రావే - గంధమైన పంపబోతివి

23, అక్టోబర్ 2012, మంగళవారం

ఆహా ఏమి ఫలితాలు..ఓహో ఏమి ఫలితాలు... అద్భుతమైన ఫలితాలు బా.....బూఊఊఊఊఊఊఊఊఊఊ...



గూగుల్ వాడ్ని అడిగితేనేమో బోలెడు డాక్యుమెంట్లు చూపించి దీనిమీద జనాలు ఆడేసుకున్నారంటాడు. జనాలేమో పేపర్లమీద పేపర్లు ముద్రించి మేము 90-99% కచ్చితంగా గుర్తించామని గ్రాఫులు గీసి మరీ చూపిస్తారు. ఇంకొంతమందేమో ఇది under graduate project క్రిందనే మేము రఫ్ఫాడించామంటారు. ఏంటో అంతుచిక్కని ప్రశ్నలు....

ఇంతమంది 90% అబౌవ్ ఇంత కచ్చితంగా  గుర్తించగలిగాము అంటున్నారు ఎలా? నేను ఒత్తులను ప్రక్కనుంచి మిగిలిన అచ్చులు,హల్లులు, నకారాలు, గుణింతాలు అన్నీ కలిపి 541 అక్షరాలను (గౌతమి ఫాంట్ సైజ్ 18, 26 )   ట్రైన్ చేసి అదే అక్షరాలను ఇస్తే అబ్బో నా ప్రోగ్రామ్ కూడా 100 శాతం ఫలితాలను సాధిస్తుంది. కానీ దీనివల్ల ఉపయోగమేందయ్యా అంటే అచ్చనగాయలాడుకోవడమే ! మనకు కావలసినదదికాదు కదా? ఒక్కసారి ట్రైన్ చేసాక ఏ పుస్తకంలోని పేజీని ఇచ్చినా ఇద్దోబాబు నీకోసం కష్టపడి ఇవి గుర్తించాను, నువ్వు టైపు చేసే పనిని కూడా నీకు తగ్గిస్తున్నాను కాబట్టి నామేలు మర్చిపోకయ్యా అని చెప్పాలికదా ఈ OCR లు ? అలా చెప్పలేనప్పుడు ఇదెందుకంటా? అలా కాదు నీకు కావాల్సిన పుస్తకంలో కొన్ని అక్షరాలను తీసుకొని నాకు నేర్పిస్తే ఏదో మిగిలినవి గుర్తిస్తాను మరీ అంత తీసిపారేస్తున్నావేంటని కోప్పడిందనుకోండి. అలాచేస్తే ఫలితాలు బాగానే వుంటాయి. పేపరు ముందే లీకవుతుందికదా మరి. కానీ జనాలకిదేపని బాబు, ఓ రెండు పుస్తకాలను OCR ద్వారా కాపీ చేసుకోవాలంటే ఓ రెండునెలలు కావాలా? ఇంతకీ ఇదంతా ఎవడికోసమంటా? దాన్ని అలా మార్చేబదులు మంచంమీద బోర్లా పడుకొని ఎంచక్కా కలలు కంటూ నిద్రపోతే ఎంత సుఖమో కదా?

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే మిగిలిన వాళ్ళకొచ్చిన 90% ఫలితాలు అంతకంటే ఎక్కువ నాకు అదే అక్షరాలను వాడినప్పుడుమాత్రమే వచ్చింది. మిగిలిన సందర్భాలలో అంటే Digital library వాళ్ళ స్కాన్డ్ ఇమేజెస్ వాడితే నాఫలితాలు ... ఎందుకులే బాబు కిక్కిక్కి అని నవ్వుకుంటారు....వద్దులే.....బాబూ...

చివరిగా .... ఇంతకీ అసలు తెలుగులో commercial గా నైనా ఈ OCR లు వున్నాయా?

16, అక్టోబర్ 2012, మంగళవారం

సటైర్స్ - చిచ్చుబుడ్లు - సీమ టపాకాయలు

జానడంత లేవు నీకు సెక్సుపుస్తకాలెందుకు?
నేను కాదు నా తమ్ముడు చదివేటందుకు

మన ప్రేమ స్థిరంగా ఉండాలంటే మార్గమేమిటి ప్రియా?
పెళ్ళిమాని ఎల్లకాలం యిలాగే వుండాలి చెలియా

ఎవరయ్యా ఆ లారీక్రిందపడ్డ వ్యక్తి?
"రోడ్డు ప్రమాదాలు - జాగ్రత్తలు" గ్రంధం వ్రాసిన వ్యక్తి

కొత్తకథ వ్రాసుకొచ్చాను చదువుతావా డైరక్టరూ?
తీసేది తెలుగు సినిమా కథెందుకు కవిగారూ!

పదేళ్ళుగా అమ్మాయి వయసు పదహారే అంటున్నారు?
ఒకేమాటపై నిలబడమని వకీలు సలహా యిచ్చారు

ఆడది గడపదాటితే అనర్థమంటారెందుకని?
ఇల్లేకాదు వీధికూడా రణరంగమౌతుందని.

డా|| ఉండేల మాలకొండారెడ్డి గూర్చి బ్లాగులోకంలో ఎక్కువమందికి తెలిసి వుండకపోవచ్చు కానీ, CBIT లో చదివిన విద్యార్థులకు  తప్పక తెలిసే వుండవచ్చు. మరి నువ్వు CBIT లో చదివలేదు కదా నీకెలా తెలుసని గొప్ప గొప్ప ప్రశ్నలను అడగమాకండి. వీరిది మా ఊరుకు దగ్గర. అలాగే ఈ కాలేజీలొ నాకు తెలిసిన కొద్ది మంది ప్రొఫెసర్లూ వున్నారు. పైన పేర్కొన్న చమక్కులు ఆయన వ్రాసిన ఒడిసెల రాళ్ళు పుస్తకం నుంచి

మాలకొండారెడ్డి వ్రాసిన మిగిలిన గ్రంధాలెలావున్నా హైస్కూలు,కాలేజీ విద్యార్థిగా వీరు వ్రాసిన నేతాజీ, వివేకానందుడు పద్య గ్రంధాలను వీలైతే తప్పక చదువ వలసిన పుస్తకాలు. వాటిపై విమర్శవ్రాసే స్థాయి నాకు లేదు కానీ యుక్తవయస్కునిగా వున్నప్పుడు వ్యక్తి యొక్క  తెలివి తారాస్థాయిలో వుంటుంది కాబట్టి ఈ పద్య కావ్యాలలోనూ వారి ప్రతిభ ధారాశుద్ధి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.


వీరు వ్రాసిందే మరొక్కటి..జీవిత సత్యాన్ని ఆవిష్కరిస్తుంది.

రాళ్ళుతిని ఆరగించుకొనే నాడు తినడానికి రాళ్ళు లేవు
పళ్ళెంనిండా రాళ్ళున్ననాడు తినడానికి పళ్ళు లేవు.

15, అక్టోబర్ 2012, సోమవారం

నిండు జాబిలి ....కారుచీకటి

నిండు జాబిలి తూర్పుకొండలపై వికసింప
పొంగు కెరటాలతో నింగికెగసదవేల
కోలుపోయిన సుధాకోశ మనుకుంటివా?
ఎంత యెగసిన కుప్పిగంతులేకద నీవి
అందుకో లేవులే అమృతాంశ బింబమును

అమావాస్య పౌర్ణమికి
ఎగరడం నీనైజం
ఎగిసి పడటం ప్రకృతిధర్మం.



************************


పిండి ఆరబోసినట్లు పండు వెన్నెల విరిసిన వేళ
మల్లెలు పరిచాను త్రోవ పొడవునా....
కాలు క్రిందపూవు లీలగా తగిలిందోలేదో
రాలు రప్పలీ కాలిబాట యని
వెళ్ళిపోయింది వెనుదిరిగి చూడకనే

కాటుక పులిమినట్లు కారుచీకటి ముసిరినవేళ
పల్లేరు ముళ్ళు పరచాను దారిలో
గ్రుచ్చుకున్న ముండ్లను విచ్చిన పూచెండ్లుగా భావించి
చేరవచ్చింది తిన్నగా !!!

9, అక్టోబర్ 2012, మంగళవారం

పిల్లలతో జంతుప్రదర్శనశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్త !!


ఓ సారి ఈ చిన్నారి జీవితాన్ని ఊహించండి? పెద్దలగా మనం కాసేపు ఏమరపాటుగా వున్నందుకు ఆ బాబుకు జీవిత శిక్ష. ఇలాంటి వార్త చదవడమిదే మొదటిసారి.




8, అక్టోబర్ 2012, సోమవారం

అనంతపురపు బురదను చూసిన శ్రీ చంద్రబాబుగారు

ఈ రోజు వార్తాపత్రికలోని ఈ ఫోటో నాకు చాలా బాగా నచ్చింది. ఎండనక వాననక మాజీముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు అనంతపురం జిల్లాలో  పాదయాత్రను చేస్తూ ఆ సందర్భంగా బూటుకాలుతో బురదను పరిశీలించి బురదలోనడవడంలోకల కష్టాలను తెలుసుకొని ఆ రకంగా ముందుకుపోతున్నారు.


1940 లో ఒక గ్రామం - సాంఘిక అసమానతలపై ఓ బ్రహ్మాస్త్రం

సాంఘిక అసమానతలపై ఓ బ్రహ్మాస్త్రం ఈ సినిమా. చాలా మందికి ఈ సినిమా నచ్చకపోవచ్చు కానీ మనసులోని అహంభావాన్ని ప్రక్కనపెట్టి ఓ క్షణంపాటు ఆలోచిస్తే నిజమనిపిస్తుంది. అహంభావి దీక్షితులు పాశ్చాత్తాప పడడం నిజజీవితంలో సాధ్యమో కాదో కానీ సినిమాలో బాగా పండింది.

సినిమాలో మాటలు చాలా సాగతీతగా అనిపించినా ఈ సినిమా లక్ష్యమే అది కావడంతో ఓపికగా వినాల్సి వస్తుంది.

సాంఘికజీవనంలోని కట్టుబాట్లు ఎంతతీవ్రంగా వుంటాయో, వాటికి ఎదురీదాలంటే ఎంతటి మనోస్థైర్యంకావాలో ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఆత్మశుద్ధి, ఆచరణశుద్ధి జీవితానికి ఎంత ముఖ్యమో చక్కగా చూపిన సినిమా. చదివిన వేదవిజ్ఞానికి, వల్లించే నీతివాక్యాలకు,చేసేపనులకు ఏమాత్రమూ పొసగని నేటి సమాజమంతా తప్పక చూడవలసిన సినిమా.

సుశీల, సూరిల ప్రేమసామ్రాజ్యం ఈ సినిమా. ఓ 60, 70 సంవత్సరాలనాటి సాంఘిక కావ్యం ఈ సినిమా. వెరసి ఓ మంచి నీతికావ్యం ఈ సినిమా. నాటి పరిస్థితులకూ, నేటి పరిస్థితులకూ నిజంగా ఎంత తేడానో. భారతదేశం అభివృద్ధి చెందిందా లేదా?


1940-lo-oka-gramam-telugu-movie-online

7, అక్టోబర్ 2012, ఆదివారం

ప్రకాశం జిల్లా పప్పుచారు, మామిడికాయ ఊరగాయ




ఈ రోజు మా ఇంట్లో జిల్లెళ్ళపాటి వంకాయ వేపుడు, ముద్దపప్పు, ప్రకాశం జిల్లా పప్పుచారూ, మామిడికాయ ఊరగాయ, ప్రక్కనే నెయ్యి, మజ్జిగ పులుసు అంతా అయ్యాక రసగుల్లా స్వీటు, బాదంపిస్తా ఐస్క్రీమ్...

ఇన్ని తిన్నాక  తృప్తిగా కాసేపు అలా సోఫాలో కూర్చుంటే ఎదురుగా కంప్యూటర్ మీద శశాంక విజయం పుస్తకం రా..రామ్మని పిలిచింది. ఇంకనేం పుస్తకాన్ని తెరిచి ఓ పేజీ తిరగేయగానే ఈ పద్యం....

అంతే నాలో కళాకారుడు రెక్కలు విచ్చుకొన్నాడు :-). నా బాధ పడలేక ఇంట్లో వాళ్ళు చెవులు మూసుకొని  పారిపోతున్నా వినిపించుకోకుండా తిన్నది అరిగేదాకా పొట్టకూ, కంఠానికి ఏదో ఇలా వ్యాయామం :))


మరో మాట మొత్తానికి కుస్తీ పట్టీ పట్టీ..పట్టీ.... ఈ రోజు ఆడియో ఫైల్స్ ను బ్లాగర్లోకి ఎలా అప్లోడ్ చెయ్యాలో నేర్చుకున్నాను :-)
 




ఏలా లతా జాల డోలా సమాలోల బాలామణీ గాన భాసురములు
థీ రానిల వ్రాత ధారా చల చ్చూత దూరాపతద్ర జోధూసరములు
మోదావ హానంగ  వేదాభ రవ భృంగ ఖేదావహ జ్జాతి కేసరములు
నాళీక దృక్కాంత పాళీన వైకాంత కేళీపరన్యూత కేసరములు

కనదగె నకుంఠ కలకంఠ కంఠ నాద
పటు భ టాహ్వాన కుపిత బిభ్య త్ప్రపంచ
పంచ సాయక మద హస్తి పైసరములు
మీసరమ్ములు, మధుమాస వాసరములు.

3, అక్టోబర్ 2012, బుధవారం

కాకతీయులు, రెడ్డి రాజుల కాలంలో ప్రభుత్యోద్యోగాలు - వారి అధికారాలు - పట్టిక



కాలంతో పాటు మనిషి జీవనం, జీవించడానికి చేయవలసిన వృత్తులూ మారుతూ వస్తుంటాయి. ఈరోజు మనం చేసే ఉద్యోగాలకు రేపు ప్రాధాన్యత వుండకపోవచ్చు. అలాగే ఆనాడు వాళ్ళు చేపట్టిన ఉద్యోగాలకూ ఈరోజు పెద్దగా ప్రాముఖ్యత లేదు.  రాచరికమైనా, ప్రజాస్వామ్యమైనా తగిన పరివారం మందీ మార్బలం లేకుంటే ఆరాజ్యం విచ్ఛిన్నం కాక తప్పదు. పరిపాలన సజావుగా సాగాలంటే మంత్రాంగం, దానికి తగ్గ యంత్రాంగం తప్పనిసరి.

 కాకతీయులు,రెడ్లు,విజయనగర రాజులకాలంలో అధికారాలు,అధికారులు ఏఏపేర్లతో పిలువబడ్డారో ఆరోజులలో వెలువరించిన శాశనాలద్వారా, సాహిత్యము ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా కాకతీయుల కాలంలో అధికారులను 72 విధాలైన వైవిధ్యాలతో కూడిన వారుగా విభజించారు. బహుశా ఇప్పటిలాగా ఆరోజుల్లో UPSC లేకున్నా అంతకంటే మేలైన తరహాలో ఈ పదవుల అధికారులను ఎన్నుకొనేవారనుకుంటాను. కారణం వీళ్ళు ఆయా వృత్తిబాధ్యతలను నిర్వర్తించండంలో నిష్ణాతులైతే తప్ప రాజ్యం పటిష్టంగా వుండే అవకాశం లేదు. ఈ 72 విధాలైన అధికారులపై ఓ పెద్దాయన వుండేవాడు.అతనిని బాహత్తర నియోగాధిపతిగా వ్యవహరించేవారు.

72 నియోగాలనూ, వారి వారి అధికారాలనూ ఈ క్రింద పేర్కొనబడడం జరిగింది. నియోగము అంటే ఆజ్ఞ లేదా ఆజ్ఞాపించిన పని, పరిజనము మొదలైన అర్థాలున్నాయి.  నియోగి అనగా నియోగించెడి అధికారము కలవాడు - ఒక తెగ బ్రాహ్మణుడు. ఈ నియోగి పదాన్ని చూస్తే అప్పటికి మనదేశంలో  వర్ణ వ్యవస్థ వుండేదేమో కానీ కుల వ్యవస్థ వున్నట్లు కనిపించదు. కుల వ్యవస్థ ఇప్పటిలా కాక వృత్తిపరమైనదని తెలుస్తుంది. అప్పట్లో ఈ పనులను చేసే వారిని లేదా వారిపై అధికారిని నియోగి అనిపిలిచేవారనుకుంటాను. వీళ్ళే తదనంతరకాలంలో రకరకాలుగా విడిపడి కులాలుగా మార్పు చెంది వుండవచ్చు.


మూలం : రాయలసీమ తెలుగుశాశనాలు - సాంస్కృతిక అధ్యయనం ( డా. యం. ఆదినారాయణ శాస్త్రి )