4, ఏప్రిల్ 2009, శనివారం

శ్రీ సీతారామ కళ్యాణము - 4ఈ రోజు కూడా మనందరకు ఆ సీతా రాములు ప్రశాంత జీవనాన్ని ప్రసాదించాలని, కోరుకుంటూ...నాల్గవ భాగానికి స్వాగతం.

సీతా చేయి రాముని చేతిలో ఉంచి జనకుడు గద్గద స్వరంతో

ఇయం సీతా మమ సుతా
సహధర్మ చరీ తవ |
ప్రతీచ్చ చైనాం భద్రం తే
పాణీం గృహ్ణీష్వ పాణినా ||

ఈ ఒక్క శ్లోకం చాలు, కన్యా దాన సమయాన తండ్రి అనుభవించే ఆనందము తో కూడిన బాధను తెలుసుకోవడానికి .

ఒక ప్రక్క తన అనురాగాల పట్టి కళ్యణ వేడుక. మరో ప్రక్క రేపటి నుండి నా చిట్టి తల్లి ఈ యింట కనపడదన్న దిగులు.

ఒక ప్రక్క తన బిడ్డ ఒక యింటి వెలుగౌతున్న ఆనందం. మరో ప్రక్క అత్తవారింట అన్నీ సౌఖ్యమేనా అన్న అనుమానం.

ఒక ప్రక్క బంగారు తల్లి కి మంచి సంబంధం చూశానన్న ఆనందం . మరో ప్రక్క అల్లుడు నా బిడ్డని సరిగా చూసుకుంటాడా లేదా అన్న దిగులు.

ఒక ప్రక్క తన సాంఘిక బాధ్యత తీరినదన్న సంతోషం . మరో ప్రక్క నా తోడు లేకుండా ఈమె ఈ సంఘంలో ఎలా నెట్టుకొస్తుందో నన్న దిగులు.

ఇది...ఏ సమాజంలో నైనా, ఏ మతంలో నైనా ప్రేమ మూర్తులైన తల్లి దండ్రుల ఆనంద ఆవేదన. ఆనందం, దిగులు సర్వజనీనం. మతాని కతీతం. కొన్ని వేల ( లక్షల ? ) సంవత్సరాల అనుభవ సారం హిందూ మత పురాణ కావ్యాలు. ప్రపంచం లో ఏమతానికుంది ఇంతటి ఉజ్వల చరిత్ర ?ఓ రఘోత్తమా నుడివెద నే పుడమిన
గురువు లెల్ల చెప్పు గురువు మాట
సతిని కావు మయ్య సతతము దయన ధ
ర్మార్థ కామ మోక్ష కార్య మందు.


దీనికి వధూ వరులు కట్టుబడి వుంటే ఈ జగతిన అనాధ బాలలే వుండరేమో !!!

కథలోకి వెళ్తే...జనక మహారాజు ఇప్పటిదాక జానకి గా పెరిగిన తన పుత్రిక ను కన్యాదానం చేస్తాడు.సీతమ్మ మెడన శ్రీరాముడు మంగళ సూత్రము కడతాడు. దేవదుందుభుల నినాదం మిన్ను చేరింది. తన పుత్రిక కళ్యాణం నిరాఘాటంగా జరిగినందుకు పుడమి పులకించింది. చెట్లు భూమి సిగన పూలవాన కురిపించాయి.

ఈ విధంగా రామునకు సీతను, లక్ష్మణునకు ఊర్మిళను, భరతునికి మాండవిని, శత్రుఘ్నునకు శ్రుతకీర్తిని యిచ్చి వివాహము జరిపించారు.

౫ వ రోజు అయోధ్య ప్రయాణం : పెళ్ళివేడుకలు వివాహ లాంఛనాలు పూర్తి అయ్యాయి. రధాలు సిద్ధమయ్యాయి. వచ్చిన బంధు జనమంతా తిరుగు ప్రయాణమయ్యారు.అయోధ్యకు బయలుదేరిన రధాలు వేగంగా వెడుతున్నాయి.ఆకాశం మేఘావృత్త మయ్యింది . చీకటి పడుతుంది . మెరుపులు తళుక్కుమని మెరుస్తున్నాయి. ఆ మెరుపులో ఎదురుగా ఒక బలశాలి త్రిపురాసుర సంహారానికి వెళ్ళే రుద్రునిలా వున్నాడు. భుజం మీద చీకటి లో కూడా వెలుగులు విరజిమ్మే గండ్రగొడ్డలి. దశరధునికి, వసిష్ట మునీంద్రులకు ఎదురుగా వున్నది ఎవరో క్షణంలో అర్థం అయ్యింది. ఎదురుగా శత్రువు. వెనుక నూతన వధూవరులు. విషయం గ్రహించిన వసిష్టుడు పరశురామునికి అర్ఘ్యపాద్యాదులనిచ్చారు.

పరశురాముడు రాముని వైపు చూసి ఇదిగో ఈ విల్లు నా తండ్రి జమదగ్నిది. దీన్ని ఎక్కుపెట్టి నాతో ద్వంద్వ యుద్ధానికి రా ! దశరథుడు శాంతి చేయ ప్రయత్నిస్తాడు. తండ్రి చెంత నుండగా ఏ కొడుకైనా పరాక్రమాన్ని ప్రదర్శించాలని చూడడు. అలాగే రాముడూ నూ. ఎంతకీ పరిష్కారం కనిపించక విల్లునెత్తి బాణమెక్కుపెట్టి పరశురాముని చంపకుండా వదిలేస్తాడు.

నలుగురు పుత్రులూ తమతమ అర్థాంగులతో అయోధ్య చేరారు.

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే |
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

రేపు ఉపసంహారం.అందాకా సెలవు.

జై శ్రీరామ

4 వ్యాఖ్యలు:

 1. శ్రీ రాముడి కుటుంబం,మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకొంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. చదువుతుంటే నాక్కూడా రెండు పరస్పర విరుద్ధ భావాలు.. ఎంత చక్కగా రాశారో అనీ.. ఇంత చక్కని వ్యాఖ్యానం రేపటితో పూర్తైపోతుంది కదా అనీను.. చాలా బాగుందండి.. అభినందనలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అదిలక్ష్మి గారూ [ అమ్మఒడి ని గారు అనాలంటే వింతగా వుంది ] , మీ అభిమానానికి ధన్యుడను.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మురళి గారూ ఏదైనా ఆ సీతారాముని లో లీనమవ్వాల్సిందే !

  ప్రత్యుత్తరంతొలగించు

Comment Form