3, ఏప్రిల్ 2009, శుక్రవారం

శ్రీ సీతా రామ కల్యాణము - 3





ముందుగా శ్రీరామ నవమి సందర్భంగా బ్లాగ్బాంధవులందరికీ ఆ సీతా రాముడు ప్రశాంత జీవనాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ...


రామో రామో రామఇతి ప్రజానామభవన్ కథా !
రామభుతం జగదభూత్ రామోరాజ్యం ప్రశాసతి !!

జగత్తంతా రామ మయం. ఎక్కడ విన్నా రామ కథలే. ఈ ప్రకృతి ( పర్వతాలు, నదులు ) వున్నంత కాలం రామకథ ప్రచారంలో వుంటుంది.

కథ లోకి వెళితే

శివధనుస్సు చూడడానికి రామలక్ష్మణులు వచ్చారని విశ్వామిత్రుని ద్వారా జనకునికి తెలుస్తుంది. జనకుడు తనకు ఆ శివధనుస్సు ఎలా వచ్చింది [ ఇక్కడ ఆనాటి తర తరాల సంపద గురించి అది ఎంత పాతదైనా దానికుండే విలువలు అర్థమవుతాయి ] , అలాగే సీత తనకు ఎలా దక్కింది , స్వయంవర పేరుతో రాజులను అవమానిస్తున్నావని జరిగిన దండయాత్రలు అన్నీ చెప్తాడు.

ఇక్కడ ఒక చిన్న వ్యావహారిక సూత్రం...పెద్దల మాట ఎలావుందో చూడండి.

కన్యా వరయతే రూపం మాతా విత్తం - పితా శ్రుతమ్ !
బాంధవాః కులమిచ్చన్తి - మృష్టాన్న మితరే జనాః ||

ఎంత సుందరమైన శ్లోకం.

వధువు, తనుచేసుకోబోయేవాడు అందగాడా కాదా అని మాత్రమే అలోచిస్తుందట.

తల్లి, ఆస్తిపాస్తులు వున్నవాడా కాదా అని ఆలోచిస్తుందట. [ మరి ఇంట్లో ఏమున్నా లేకున్నా "అమ్మా ఆకలి" అన్న బిడ్డ జాలి చూపులు చూసేది తల్లే కదా ? ఈ అనుభవం ఆమెకు ధనము ఎంత అవసరమో నేర్పిస్తుంది ]

తండ్రి, తనకు కాబోయే అల్లుడు చదువూ సాంప్రదాయాలున్నవాడా కాదా అని చూస్తాడంట. [ అవును మరి , కుటుంబానికి కావలసిన ఆర్థిక పరిపుష్టి సమకూర్చడం యజమాని బాధ్యత. ఈయన తనకున్న అనుభవంతో బయట నాలుగు రాళ్ళు సంపాయించాలంటే చదువు సాంప్రదాయాల ఆవశ్యకత అప్పటికే గుర్తించి వుంటాడు. చదువున్నా, నోరు మంచిది కాకపోతే పని ఎవడు ఇస్తాడు ? ]

బంధువులు, చెడ్డపేరు లేని వంశమునుంచి వచ్చినవాడేనా అని అలోచిస్తారట [ మరి నలుగురిలో అవమానము లేకుండా వుండాలి కదా ]

మిగతా జనం , విందు భోజనం బాగుంటే చాలు అనుకుంటా రట,

వరుని ఎంపిక గురించి ఇంతకంటే బాగా ఏ కావ్యం వ్రాయగలదు ? ఏ మతం చెప్పగలదు ?

మళ్ళీ కథలోకి వెల్దాం...

విశ్వామిత్ర ఆఙ్ఙానుసారం శ్రీరాముడు ముందుగా ధనుస్సును ఒకసారి చూసి ఎక్కుపెట్ట గలనా లేదా అని చూసుకొని నమ్మకం కలిగాక విల్లు ఎక్కుపెట్టడానికి సిద్ధపడతాడు. పెట్టెలో నున్న వింటిని బయటికి తీసి నారిని బిగించి బాణాన్ని సంధించి లాగాడు. విల్లు ఫెళ్ళున విరిగింది.

తే||
కురిసె పూల వాన మిథిలా పురియు నంత
మంగళ రవము లింపుగ సాక్ష మిచ్చె
మెరెసె సీత కన్నులు మిరుమిట్లు మెరియ
మోద మందిరి పురమున ఙ్ఞాత లెల్ల.




రాముడే నా అల్లుడని అంత సభలోనూ జనకుడు ప్రకటించాడు.ఈ వార్త దూతల ద్వారా నాల్గవ రోజుకు ఆయోధ్యా నగరం చేరుతుంది.

మిధిలానగరానికి పెళ్ళికళ వచ్చేసింది. రాజధాని అంతా కళ్ళాపు నీళ్ళతో తెల్లని ముగ్గులతో కళ కళ లాడుతూ నాయనారవిందంగా వుంది. మామిడి తోరణాలు నగరమంతా స్వాగతం పలుకుతున్నాయి. విచ్చేస్తున్న అతిధిలందరికి , ముందే వచ్చిన రాజులు స్వాగతిస్తున్నారు. పాత మిత్రులు చాలా కాలానికి కలిసిన సందర్భంగా కౌగిలింతలు, ఆత్మీయవాక్యాలు,పరాచకాలు,బాల్యవృత్తాంతాలను చెప్పుకుంటూ చూచు వారలకు చూడ ముచ్చటాగా వుంది వాతావరణమంతా!!!

రాజులు వాహనాలగా విచ్చేసిన గుఱ్ఱాలు, ఏనుగులు చూసి ప్రజలు అనందిస్తుంటారు. వినడమే తప్ప జీవితంలో చూడలేమోమో అనుకున్న రాజులను సీతమ్మ వారి పెళ్ళి పుణ్యాన ప్రజలు చూసి తరించారు.

పెళ్ళి ౫ రోజులు చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఆడపెళ్ళి వారి తరపున శతనందుడు , మగపెళ్ళి వారి వైపు వసిష్టుడూ పెద్దలయ్యారు. ఒక్కోరోజు గురించి ఒక్క వాక్యంలో చెప్పుకుందాం. నచ్చితే మళ్ళీ రామాయణం చదువుకుందాం.

మొదటి రోజు : ఇరు వైపు వంశ వృత్తాంతాలని ఒకరికొకరు తెలియచేసుకుంటారు [ దీని వల్ల పెళ్ళి అయిన తరువాత అమ్మాయి తరపు / అబ్బాయి తరపు వాళ్ళు ఎవరికి ఎవరు ఏమౌతారో తెలిసి ఈ రోజుల్లో లాగా మావైపు/మీవైపు అనేవి వుండవేమో ]

రెండవరోజు : నిశ్చితార్థం [ తాంబూలాలు తీసుకోవడం ] , ఇరు వైపుల వంశ వృత్తాంతం విన్న తరువాత అంగీకారం తెలపడం.

మూడవరోజు : గోదానం [ ఈ దాన వివరాలు మూలం లో చాలా చాలా నే వ్రాశారంట. ఆనాటి సామాన్య ప్రజల సాంఘిక ఆచారలకు పనికి వచ్చే ఘట్టం ]

నాల్గవరోజున వధూవరులను మంటపానికి తీసుకొచ్చేరోజు. శా॒స్త్రోక్తంగా వివాహానికి మొదలు ఇది. అమ్మవారిని చెలికత్తెలు తయారు చేయ నారంభించారు.



సీ ||
ఒక గడుసరి చక్కగా కట్టె కురులెల్ల
నల్లనీ రాముడే నా మొగుడని నుడికించి

నొక సుందరాంగి తా నొయ్యారియై నడ
యాడి లలాట తిలకము దిద్దె

నొక చెలి కనులు మూయక సీతయని ఇంపు
గా దిద్దె కనులార కాటుకంత

నొక ప్రాణసఖి సిగ్గుమొగ్గలే నివి యని
బుగ్గచిదిమి దిష్టి చుక్క బెట్టె

గీ||
సిగ్గు మోమున ధరణిజా సీత నడిచె
బంగరు మణి మాణిక్య భంజికములె
సింజితారాగ నాదములై, శీఘ్రమే చితి
చిహ్న నాదమై రావణు జేరె నపుడు.



అసలు ఈ వివాహ ముఖ్యోద్దేశ్యము అదే!!!

సీతమ్మ వారితో పాటు మిగిలిన మువ్వురు కన్యలూ దేదీప్యమానంగా వెలుగు ప్రమిదలలా కనిపిస్తున్నారు. జనక మహారాజు రాముణ్ణి సాదరంగా తోడుకొని వచ్చి అగ్నిహోత్ర వేదమంత్రాల మధ్య సీతమ్మ చేతిని రాముని కందించి ఈ విధంగా చెప్పాడు.

ఇయం సీతా మమ సుతా
సహధర్మ చరీ తవ |
ప్రతీచ్చ చైనాం భద్రం తే
పాణీం గృహ్ణీష్వ పాణినా ||


ఈ శ్లోకం చుట్టూ సృష్టి లో ప్రతి వివాహ వ్యవస్థ తిరుగుతుంటుంది. సీతమ్మ చేయి రాముడు పట్టుకొన్నాడు కాబట్టి వారిని రేపటిదాకా కొంచెం ఏకాంతంగా వుండనిద్దాం.

పై శ్లోకం పెళ్ళి ఘట్టంలో చాలా ముఖ్యమైంది కాబట్టి రేపు దీని గురించి కొద్దిసేపు ముచ్చటించు కుందాం ||

6 కామెంట్‌లు:

  1. నిజంగా కళ్ళకి కట్టినట్టు రాస్తున్నారు.. కాకపొతే ఉన్నట్టుండి ఆపేశారన్న భావన కలిగింది.. కల్యాణం చేయించిన ఫలం మాత్రం మీకు దక్కుతుంది.. మీ పుణ్యమా అని చూసే భాగ్యం మాకు దక్కుతోంది..

    రిప్లయితొలగించండి
  2. అప్పటి మిధిలా నగరంలో జరిగిన కళ్యాణశోభని కళ్ళముందు ఆవిష్కరించారు. ఎంతో బాగుంది.

    రిప్లయితొలగించండి
  3. భాస్కర్ గారూ..
    ఎంతో మధురంగా ఉంది మీ సీతాకళ్యాణం వర్ణన.
    శతకోటి ధన్యవాదాలు.
    జై శ్రీరామ..!!

    రిప్లయితొలగించండి
  4. మురళి గారు,
    కల్యాణం ఫలం చదివే పాఠకులది కూడానండి.
    నిన్న post publish చేసే ముందు నాకు కూడా అలాగే అనిపించింది కానీ టపా నిడివి మరీ ఎక్కువై చదవరేమోనని అంతటితో ఆపేశాను.ఈ రోజు దానిని కొనసాగిస్తాను.వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. లక్ష్మీ వివాహము ఆదిలక్ష్మి గారికి నచ్చినందుకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  6. మధురవాణి గారు, ఈ(ఇ) కల్యాణం మీకు మధురంగా అనిపించినందుకు ధన్యవాదాలు. మీ వాణి దయ ఇంకొంచెం వుంటే ఇంకా బాగుండేదేమో.

    రిప్లయితొలగించండి

Comment Form