
కాలుతున్నయ్ చేతులు
దివిటీ దూదిలా
కరుగుతుంది జీవితం
కరిగే కొవ్వొత్తిలా.
కారుచీకట్లు కమ్మిన మనసుకు
కనిపించని ఉషోదయ కిరణం
ఉక్కిరిబిక్కిరి ఔతున్న మదిలో
ఊహకైనా అందని ప్రశ్నలు
ప్రశ్న ప్రశ్నకూ పడిలేస్తూ వెతుకుతున్నాను
కనిపించని సాంకేతిక సమాధానం కోసం
ఆదమరచి పగలూ రాత్రీ నిద్రిస్తే
ఆలోచనల చెలమ ఎండిపోదా
సృష్టించిన అందమైన ఆవిష్కరణలే
ఉన్మాదంగా వెక్కిరిస్తుంటే
దిక్కుతోచని మదినిండా
దిక్కులేని ఆలోచలనలతో
ఆశల రహదారులవెంట
రాళ్ళగుట్టల నడుమ
ముళ్ళకంపల మధ్య
పడిలేస్తూ పరితపిస్తూ పరిగెడుతున్నాను.
కోకిల గానాలు శృతి తప్పినట్టున్నాయ్
వెన్నెల వెలుగులు గడ్డకడుతున్నాయ్
చల్లని గాలులు స్వేదం స్రవిస్తున్నాయ్
రంగుల పూలు రాలి పోతున్నాయ్
జీవితం వితండవాదియై వెక్కిరిస్తుంటే
ఎంతకూ తరగని ఆలోచనలతో
క్షణ క్షణానికీ కరిగే కాలం నడుమ
విడువని ప్రశ్నల సాధనకై
ఆటుపోట్ల కాలంతో సమరం సాగించ ఉద్యమిస్తున్నా
నన్ను నేను పునఃసృష్టించుకొంటున్నా
మరోసృష్టి చేయ మదిని మధిస్తున్నా
హలము పట్టిన చేయి
హాలాహలానికి వెరసేనా
కాళరాత్రి చూసిన కళ్ళు
వేళాయనని యత్నం మానేనా?
అందుకే..
మొగ్గగా మళ్ళీ చిగురించ దలచా
కొమ్మల చిగుర్లు పెట్టి
రెమ్మల పూలు పూసి
కొమ్మ కొమ్మకూ
గుబురు గుబుర్లుగా
ఫలసాయం అందించదలచా
అనంతమైన ఆనందంకోసం
పట్టపగలు నక్కల ఊళలు భరించి
గుడ్లగూబల చూపులు దాటి
మండే గుండెల నడుమ
విత్తు నాటుతున్నా
త్వరలోనే....
పూల రెమ్మనై సుగంధానిస్తా
ఫలశోభితమై ఫలములిస్తా
వటవృక్షాన్నై నీడనిస్తా
నన్ను నేను సృష్టించుకొంటా.