13, నవంబర్ 2009, శుక్రవారం

మండేగుండెల్లో నన్ను నేను సృష్టించుకొంటున్నా







కాలుతున్నయ్ చేతులు
దివిటీ దూదిలా
కరుగుతుంది జీవితం
కరిగే కొవ్వొత్తిలా.

కారుచీకట్లు కమ్మిన మనసుకు
కనిపించని ఉషోదయ కిరణం
ఉక్కిరిబిక్కిరి ఔతున్న మదిలో
ఊహకైనా అందని ప్రశ్నలు

ప్రశ్న ప్రశ్నకూ పడిలేస్తూ వెతుకుతున్నాను
కనిపించని సాంకేతిక సమాధానం కోసం
ఆదమరచి పగలూ రాత్రీ నిద్రిస్తే
ఆలోచనల చెలమ ఎండిపోదా

సృష్టించిన అందమైన ఆవిష్కరణలే
ఉన్మాదంగా వెక్కిరిస్తుంటే
దిక్కుతోచని మదినిండా
దిక్కులేని ఆలోచలనలతో
ఆశల రహదారులవెంట
రాళ్ళగుట్టల నడుమ
ముళ్ళకంపల మధ్య
పడిలేస్తూ పరితపిస్తూ పరిగెడుతున్నాను.

కోకిల గానాలు శృతి తప్పినట్టున్నాయ్
వెన్నెల వెలుగులు గడ్డకడుతున్నాయ్
చల్లని గాలులు స్వేదం స్రవిస్తున్నాయ్
రంగుల పూలు రాలి పోతున్నాయ్

జీవితం వితండవాదియై వెక్కిరిస్తుంటే
ఎంతకూ తరగని ఆలోచనలతో
క్షణ క్షణానికీ కరిగే కాలం నడుమ
విడువని ప్రశ్నల సాధనకై
ఆటుపోట్ల కాలంతో సమరం సాగించ ఉద్యమిస్తున్నా

నన్ను నేను పునఃసృష్టించుకొంటున్నా
మరోసృష్టి చేయ మదిని మధిస్తున్నా

హలము పట్టిన చేయి
హాలాహలానికి వెరసేనా
కాళరాత్రి చూసిన కళ్ళు
వేళాయనని యత్నం మానేనా?

అందుకే..
మొగ్గగా మళ్ళీ చిగురించ దలచా
కొమ్మల చిగుర్లు పెట్టి
రెమ్మల పూలు పూసి
కొమ్మ కొమ్మకూ
గుబురు గుబుర్లుగా
ఫలసాయం అందించదలచా
అనంతమైన ఆనందంకోసం

పట్టపగలు నక్కల ఊళలు భరించి
గుడ్లగూబల చూపులు దాటి
మండే గుండెల నడుమ
విత్తు నాటుతున్నా

త్వరలోనే....

పూల రెమ్మనై సుగంధానిస్తా
ఫలశోభితమై ఫలములిస్తా
వటవృక్షాన్నై నీడనిస్తా
నన్ను నేను సృష్టించుకొంటా.

12 కామెంట్‌లు:

  1. భావగర్భితం భాస్కరుని కవిత్వం
    ప్రతి వాక్యం కాంతి పూజితం

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. "సృష్టించిన అందమైన ఆవిష్కరణలే
    ఉన్మాదంగా వెక్కిరిస్తుంటే
    దిక్కుతోచని మదినిండా
    దిక్కులేని ఆలోచలనలతో
    ఆశల రహదారులవెంట
    రాళ్ళగుట్టల నడుమ
    ముళ్ళకంపల మధ్య
    పడిలేస్తూ పరితపిస్తూ పరిగెడుతున్నాను."

    అవును

    ఓ మానవుడా...

    పరితపిస్తున్నావు అంతులేని ఆశల సాధ్యం కోసం.
    పరిగెడుతున్నావు అంతం లేని భూమి చివరన గమ్యం కోసం.

    అడ్డుకట్ట వేయకుంటే ప్రవాహం ఆగదు,
    తీరమెరుగని ప్రయాణం గమ్యానికి చేరదు.

    రిప్లయితొలగించండి
  4. భాస్కర్ గారూ ఏమీ అనుకోనంటే ఓ మనవి. మీ కవిత లో చిన్న మార్పు చేస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది.

    కాలుతున్నాయ్ చేతులు
    మండే సిగిరెట్ కొనల్లా
    కరుగుతుంది జీవితం
    కరిగే క్యాండిల్లా

    అనే బదులు,

    కాలుతున్నయ్ చేతులు
    మండే కాగడాల కొనల్లా
    కరుగుతుంది జీవితం
    కరిగే కొవ్వొత్తిలా.

    అంటే బాగుంటుందేమో..
    నా ఉద్దేశ్యం ఏంటంటే ఇంతటి అందమయిన 'తెలుగు' కవితలో ఆంగ్ల భాషా జోక్యాన్ని నిరోదిద్దామని..

    రిప్లయితొలగించండి
  5. పూల రెమ్మల సుఘందాల్ని ఆఘ్రానించడానికి నేనొస్తాను
    శోభితమైన ఫలాలను భుజించడానికి నేనుంటాను .
    వట వృక్ష నీడలో ఊయ్యలలు కట్టి ఆడు కుంటాం.....-:)

    రిప్లయితొలగించండి
  6. వెన్నెలా జీవిత సత్యాన్ని నాలుగు లైన్లలో చెప్పారు.

    "పరితపిస్తున్నావు అంతులేని ఆశల సాధ్యం కోసం.
    పరిగెడుతున్నావు అంతం లేని భూమి చివరన గమ్యం కోసం.

    అడ్డుకట్ట వేయకుంటే ప్రవాహం ఆగదు,
    తీరమెరుగని ప్రయాణం గమ్యానికి చేరదు."

    ఎంత అందమైన భావన.జీవితాన్ని కాచి వడపోసినట్లున్నారు

    ఇక మీ సూచనకు ధన్యవాదాలు. మార్చాను చూడండి.

    రిప్లయితొలగించండి
  7. చిన్నీ , రమ్మాన్నారు తిమ్మన్న బంతికి. కష్టం మాది ఫలితం మీదా? ఎంత ఆశ అండి :)
    అయినా లోకం అంతే కదా మరి. మగవారు పొద్దస్తమానం పడి పడి చేసి వస్తే మీరేమో ఇంట్లో కూర్చొని పండ్లు ఫలాలు భుజిస్తూవుంటారు కదా :-D

    రిప్లయితొలగించండి
  8. హమ్మ ఎంత మాట ! మొత్తం స్త్రీ జాతికే అవమానం ...పొద్దస్తమానం కష్టపడితే ఇంట్లో కూర్చుని తినడమా అంటారా ...ఇంట్లో వండి పెడితే ఆఫీసు లో ఏదో కష్టపడ్డట్టు (డబ్బా ముందు ఆడుకుని )బిల్డప్పు ఇచ్చి మెక్కుతారు...మా శ్రమ దోచుకోవడం కాకుండా పైగా ఇంతటి వివక్ష ...లాభం లేదు మహిళా సంఘాలకి ఫిర్యాదు చేయవలసిందే :(

    రిప్లయితొలగించండి
  9. పునః సృష్టి కై ఎదురుచూస్తుంటా.. మాటలు మూగైన నిమిషం హలమైనా హాలా హలమైనా పూరెక్కైనా పలకరింపుల చిరునవ్వైన
    వోపలేని బరువై భరించలేని వేదనై కృంగిన క్షణం నుంచి
    కొమ్మ కొమ్మల రెమ్మ రెమ్మల ఫల సాయాల మురిపాల కోసం మనసంతా కళ్ళుగా
    గుండె నీరవ్వ గా ఎదురు చూస్తున్నా.

    రిప్లయితొలగించండి
  10. హా చిన్నీ !, మా పని మీకు ఆటలాగా అనిపిస్తుందా? కంప్యూటర్ డబ్బా నా? హతవిధీ ఏమి కలికాలపు ఆడువారి మాటలు ;). వివక్షలు,ప్రతిపక్షాలు,శ్రమదోపిడీలూ,మహిళా సంఘాలూ... రోజూ వింటూనే వున్నాంకదా :).
    మీరు మహిళా సంఘాలకు చెప్పండి, నేనేమో గంగా భవానీకి, నన్నపునేని రాజకుమారికి, రోజా కి ఇంకొకామె ఎవరో వుంది, సమయానికి గుర్తు రావడంలేదు. వీళ్ళందరికీ ఫిర్యాదు చేస్తా. చూసుకుందాం ఎవరు గెలుస్తారో.

    రిప్లయితొలగించండి
  11. భావనా గుండెనీరవ్వగా ఎదురుచూస్తున్నావా? మనిషికి ఒక్కోసారి ప్రేమతో కూడిన పలకరింపైనా, చిరునవ్వుతో కూడిన పిలుపైనా తను స్వాగతించే స్థితిలోలేనప్పుడు గుదిబండలాగా అనిపిస్తాయి కదా! కానీ చిత్రమేమిటంటే కొమ్మ కొమ్మల రెమ్మ రెమ్మల ఫల సాయాలందించాక అందర్నీ దూరం చేసుకున్నాక స్వీకరించడానికి ఎవరూ లేకపోతే ప్రయోజనం ఏమిటి? ఏమిటో అంతా గందరగోళంగా వుంది కదా? అవును నాకూ అలాగే వుంది.

    రిప్లయితొలగించండి
  12. ఆలోచన ఆచరణ రెండూ జోడించాక ఇక ఆశయసాధన ఆపతరమా.

    >> నన్ను నేను సృష్టించుకొంటా

    అనునిత్యం ఆ నవ్య సృష్టి మీలో వినూత్న శక్తి నింపాలని ఆ పరమాత్ముని ప్రార్థిస్తూ.. మీ నేస్తం

    రిప్లయితొలగించండి

Comment Form