ఈ రోజు 1920 వ సంవత్సరంలో వ్యవసాయం ఏరకంగా చేసేవారో తెలుసుకుందామని ప్రెస్ అకాడమీ లో లభించిన ఒకే ఒక పత్రిక ( అగ్రికల్చర్ మీద ఒక్కపత్రికే కనిపిస్తుంది. మరొకటి అగ్రికల్చర్ ఆర్ట్ మీద వుంది) తిరగవేస్తుంటే ప్రతిపేజీకి అడుగుభాగంలో కొన్ని సామెతల లాంటివి కనిపించాయి. ఈ సామెతలు వ్యవసాయం చేసేవారికి పెద్దగా గొప్పగా అనిపించకపోవచ్చు. ఇప్పటికీ వ్యవసాయదారులు చాలానే వాడుతుంటారు, కానీ ఈ తరం యువతకు తెలియని విషయాలు కొన్ని తెలుస్తాయని పిస్తుంది.
కొద్ది దశాబ్దాల తరువాత వ్యవసాయం అనేది ఎవ్వరికీ తెలియలేదనుకోండి. అప్పుడు ఈ సామెతలు చదివేవారికి మూఢనమ్మకాలుగా అనిపించినా ఆశ్చర్యపడనవసరంలేదు. నిజానికి మన హిందూమతంలో ఉన్న లోపమో లేదా పెద్దవారిని ప్రశ్నించే స్వభావ లేమి లోపమో కానీ చాలా నమ్మకాలుగా చలామణి అవుతున్న వాటికి వివరణలుండవు. నాన్నలను, జేజి నాయనలనడిగినా కానీ "అదంతే బోడిముండ", అధిక ప్రసంగమూ నువ్వూనూ అనే సమాధానము తప్పించి సంతృప్తికరమైన వివరణలుండవు.
అలాగే కొన్ని కొన్ని ఆనాటి కాలానికి సరిపోయేవి. మరికొన్ని సనాతనములు. బహుశా ఈ కాలానికి సరిపడని నమ్మకాలు మూఢనమ్మకాలుగా మార్పుచెందినాయేమో !!! హిందూమతానికున్న గొప్పలక్షణం కూడా తనంతట తాను సమాజానికనుకూలంగా మార్పుచెందడమే కదా.
సరే ఇక నా ప్రసంగాన్నాపి ఆ మాసపత్రికలో ఇచ్చిన కొన్ని సామెతలను చూడండి. ఎంత చక్కనైనవో. వాటి ప్రక్కనే కొన్నింటికి నాకు తోచిన వివరణ కూడా ఇస్తున్నాను
౧) సేద్యానికి పద్దులు పనికిరావు ( నిజంగా పద్దులు వ్రాసేవాళ్ళు సేద్యం చెయ్యలేరు. లెక్కా జమా కట్టుకుంటే సేద్యగాడికి కన్నీరే మిగులుతుంది )
౨) శివరాత్రికి చలి శివశివాయని పోతుంది ( ఇది చాలా మందికి తెలిసినదే. అంటే ఎండాకాలాగమనమన్నమాట )
౩) దుక్కికొద్దీ పంట, బుద్ధికొద్దీ సుఖము ( దుక్కి అంటే భూమిని దున్నడము. భూమి బాగా దున్నితే, అడుగునున్న సారవంతమైన భూమి పైకొచ్చి పంట ఎక్కువ వస్తుంది )
౪) పాటిమీద వ్యవసాయం కూటికైనా రాదు ( హ హా ఇది మాత్రం సూపర్...ఎప్పుడైనా పాటిగడ్డమీద వ్యవాసయం చేస్తే బాగా అనుభవానికొస్తుంది)
౫) ---- యెడల కందైనా కాయదు ( ఇక్కడ ఆ ఖాళీ పదము సరిగా కనిపించడం లేదు)
ఇక్కడనుంచి ఈ క్రిందివాటిలో ఏవైనా అర్థంకాకపోతే అడగండోచ్..
౬) చేలో పొత్తు కళ్ళంతో సరి ( అర్థంకాకపోతే అడగండోచ్..చెప్తాను :))
౭) చేనుకు గట్టు ఊరికి కట్టు వుండవలెను
౮) శివరాత్రికి జీడిపిందెలంతేసి ( ఇదేమిటో నాకు తెలియదు )
౯) ఉలవకాని చేలు ఊసరక్షేత్రాలు ( ఇది కూడా సూపరే :))
౧౦) పూచినపూలన్నీ కాయలైతే భూమిలో దాచుటకే చోటుండదు
౧౧) వంటికి తిండిపుష్టి, వరికి దుక్కి పుష్టి
౧౨) నూవు చేలో ఏడు వరిగింజలైనా పండవు
౧౩) మొక్కజొన్న కందెకు మొదలు, పొగాకు కాడ చివర మంచివి
౧౪) నల్లనేలకు నూవులు, గట్టినేలకు కందులు
౧౫) పశువులు నల్లనైతే పాలు నల్లనౌనా
౧౬) అన్నిపైరులకు ఆషాఢము
౧౭) విత్తుటకు శుక్రవారము, కోయుటకు గురువారము ( ఇది ఎందుకో మరి? )
౧౮) కలుపు తీయువానికి కసవే మిగులును
౧౯) కలుపుతీసిన చేను కన్నుల పండువుగనుండును
౨౦) నీడనున్న నీరు, నిలకడ పనికిరాదు
౨౧) ఎరువు చేయునుపకారము బంధువులుకూడా చేయరు ( ఎరువు అంటే పేడ లాంటివండోయ్.. ఇప్పటి యూరియా మందు కాదు )
౨౨) ఎరువు సిద్ధము చేసికొని దున్నవలె
౨౩) ఎరువులేని పొలము, లేగలేని ఆవు ఒక్కటే
౨౪) పల్లమున కేడుదుక్కులు ( ఏడు దుక్కులు ) మెరకకు నాలుగు దుక్కులు
౨౫) పదును పోకుండా దున్నవలెను ( పదును అంటే వర్షం పడిన తరువాత భూమి మెత్తగా వుండి దుక్కి దున్నడానికి అనుకూలంగా వుంటుంది )
౨౬) లోతు దుక్కికి ఎక్కువ పంట
౨౭) వర్షము చూచికొని నాగలి కట్టవలెను ( నాగలి అంటే మనసినిమాల్లో బలరాముడు ఆయుధంగా చూపిస్తారు చూడండి అది :)..కొద్దిగా ఎక్కువైందా? పర్లేదు అడ్జెస్ట్ అయిపోవాలి మరి :)))
౨౮) మూలవర్షము నవధాన్యాలకు చెరుపు ( ఇక్కడ మూలవర్షమంటే మూలకార్తెలో కురిసే వర్షము)
౨౯) విశాఖ వర్షము చీడలకు వృద్ధి