13, మార్చి 2012, మంగళవారం

తెలుగులో పంచ మహాకావ్యాలు.

మానవ సమాజంలో జరిగిన, జరుగుతున్న ప్రతి చర్యకూ కవి ఓ సాక్షి. సామాన్యుని జీవిత చరిత్ర వద్దనుంచి వైభోగాలు అనుభవించే మహారాజుల చరిత్ర వరకూ రచయిత తన ఊహలను కలిపి అక్షర గుచ్ఛాలను రచిస్తాడు. సాహిత్యం తరతరాల సామాజిక శాస్త్రం. ఆయా జాతుల గమన సంకేతం.

అలాంటప్పుడు "కావ్యాలాపాంశ్చవర్జయేత్" అని ఎందుకు చెప్పినట్టు. అదీ ప్రాచీన కాలంలోనే. అంటే కావ్యాలన్నీ అందమైన అబద్ధాలనీ,కాబట్టి వాటిని చదువరాదని. కారణాలు లేకపోలేదు. పదహారవ శతాబ్ది వరకూ కూడా మన కావ్యాలు చాలా వరకూ రాజుల మెప్పు కొరకు వ్రాసినవే. అలాంటప్పుడు కావ్యం నిష్పక్షపాతమనుకోవడం అత్యాశే అవుతుంది కానీ, ఆ కావ్య కథాగమనంలో నిక్షిప్తమయ్యే సామాన్య ప్రజానీక వర్ణనలు మాత్రం ఆనాటి సమాజానికి ప్రతీకలే. రచయిత సమాజ వర్ణనలు చాలా వరకూ తను నివశిస్తున్న సమాజంలోనుంచే పుట్టుకొస్తాయి. కవులు భావాంబరములో విహరించేవారైనా, సంఘంలో వారూ సభ్యులే. అలౌకిక శాస్త్రం రచనచేసినా, లౌకిక ప్రపంచాన్ని ఆవిష్కరించక తప్పదు.

ఇలాంటి రచనలు మనకు తెలుగులో అక్కడక్కడ కనిపిస్తాయి. చరిత్ర అంటే రాజుల యుద్ధాలు మాత్రమే కాదు. ఆ రాజ్యంలో నివశించే అతి సామాన్యుని జీవితం కూడా. పాల్కురికి సోమనాధుని రచనలు,హంసవిశంతి,సింహాసన ద్వాత్రింశిక, షోడశ కుమార చరిత్ర, రాయల కాలము నాటి ప్రబంధాలు మొదలైనవి ఆనాటి సమాజ స్థితి గతులకు నిలువెత్తు సాక్షాలు.

తెలియజెప్పు చరిత తేదీలు మాత్రమే
చెప్పలేదు గుండెవిప్పి చూపి
పెద్దపెద్ద నిలువుటద్దాల మేడయై
వాఙ్మయమ్మే చరిత ప్రతిఫలించు.

మనకు సంస్కృతంలో రఘువంశం, కుమారసంభవం, మేఘసందేశం,కిరాతార్జునీయం, శిశుపాలవధ పంచ మహాకావ్యాలని ప్రతీతి. ఇంతకీ ప్రబంధ కావ్యానికి ఉండవలసిన లక్షణాలేమిటి? కావ్యంలో ఇవి మాత్రమే వుంటే అది ప్రబంధమౌతుందా? ఇది ఓ సూచి మాత్రమే.

౧) అనువాద రచనై ఉండకూడదు
౨) కథ కల్పితము కాకుండా ఏదో ఒక పురాణములో అంతర్గతంగా వుండాలి
౩) కథానాయకునికి ధీరోదాత్త లక్షణాలుండాలి
౪) అష్ఠాదశ వర్ణనలుండాలి. అంటే వనవిహారం, జలక్రీడ, సూర్యోదయం, చంద్రోదయం,పుత్రోదయం,మంత్రాలోచనం,ప్రయాణం,రథోత్సవం, రాజవర్ణన, యుద్ధం, సముద్రం, ఋతువులు, మధుపానం, పురం, వివాహం, పర్వతం, విరహం,దూత్యం
౫) నవరసాలలో శ్రృంగారం ప్రధానంగా వుండాలి
౬) వస్తైక్యం వుండాలి
౭) కావ్యం శ్రీ తో ప్రారంభించబడి శ్రీ తో ముగియాలి
౮) ఇష్టదేవతాస్తుతి, సుకవిస్తుతి,కుకవినింద,గురుస్తుతి,కృతిపతి,వంశవర్ణన,షష్ఠ్యంతాలు వరుసగా చెప్పిన తర్వాత కథ ప్రారంభం కావాలి.

15 వశతాబ్దికి ముందు కావ్యాల్లో ఇలాంటివి కనిపించవు కానీ, 16 వశతాబ్దిలో వచ్చిన కావ్యాలన్నింటిలో ఎక్కువ తక్కువలుగా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. మన తెలుగు పంచమహాకావ్యాలేవి అన్నదానికి అందరూ ఆమోదించిన గ్రంధాలైతే లేవు కానీ ఈ క్రింది వాటిలో ఎవరి చిత్తమునకు తోచినట్టు వారు అంగీకరించవచ్చు.

౧) మను చరిత్ర
౨) ఆముక్తమాల్యద
౩) వసు చరిత్ర
౪) రాఘవపాండవీయం
౫) శ్రృంగార నైషధము
౬) ప్రభావతీ ప్రద్యుమ్నం
౭) పాండురంగ మహాత్మ్యం
౮) కళాపూర్ణోదయం

ఈ పంచమహాకావ్యాల వాత సంస్కృత లక్షణాలను బట్టి నిర్ణయించినవి కాబట్టి వీటినే పండితులు ఆమోదింతురు గాక. కానీ తెలుగులో ఇలాంటివి కోకొల్లలుగా వచ్చాయి. నిజానికి పూర్వకాలంలో ప్రజానీకానికున్న నిరక్షరాశ్యత వల్ల ఏకొద్దిమందికో పట్టుబడిన అక్షరజ్ఞానంతో వ్రాసిన కొద్ది సంస్కృత కావ్యాలను చదివి తృప్తిపడే సమాజాన్ని పదహారవ శతాబ్ది సమాజంతో పోల్చి పంచమహాకావ్యాలివే అని చెప్పడం నిజంగా హాస్యాస్పదమే అవుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comment Form