జానపదుల పెరటి గుమ్మంముందు గుభాళించే మల్లెల సువాసనలకు ఓ ఉదాహరణ మాత్రమే యిది. ప్రాచీన సంస్కృత కవుల వర్ణనలకు ఏమాత్రమూ తీసిపోని పల్లెటూరి వాడి విరహవేదన.
మంచి వెన్నెల సమయం. మల్లెపూల పందిరి. పరిశరప్రాంతమంతా మల్లెల సువాసన. ఆ ఆహ్లాదకర వాతావరణంలో ప్రియుడు వెండికట్ల వీణ చేతపట్టి ప్రియురాలిని పిలుస్తున్నాడు. ఒకవేళ ప్రియురాలు వచ్చినా గలగలా నవ్వుల సరసములతోనే తెల్లవారి పోతుందట. విరహవేదనలో తన ప్రియురాలి పెదవులను కొండగోగులు, కొండనిమ్మలతో పోలుస్తున్నాడు. గూగుపూలు లేత పసుపు, నిమ్మకాయల రంగు లేత పసుపు. ఈ కొండగోగులు పూయడం వల్లనో , లేత నిమ్మ కాయడం వలనో నీ పెదవులు దొండపండు రంగులో వుంటాయి. ఓ వయ్యారీ నువ్వు రానట్లైతే నా మనసును ఎవరి పాలు చెయ్యాలి?
మల్లెలు ఆహ్లాదానికి, మథురమైన ఆలోచనలు కలగడానికి ఉత్ప్రేరకాలుగా వుపయోగపడుతాయి. మల్లెలు తెలుపు. తెలుపు స్వచ్ఛతకు గుర్తు. అలాగే ముట్టుకుంటే కందిపోయే గుణం, సున్నితత్త్వం కూడా దీని సొంతం . ఇంతటి విశిష్ట గుణాలున్న మల్లెలతో ప్రియురాలిని పోలుస్తున్నాడు.
నాయిక మాటలాడుతుంటే మల్లెలంత మధురంగా వుందట. మనసు మల్లెపూవు వంటిదట. అంటే అంత స్వచ్ఛమూ సున్నితమూనూ! ఇంతటి అందమైన గుణగణాలున్న నా ప్రేయసి రాకపోతే ఈ మల్లెపందిరినుండి రాలే మల్లెలెవరికివ్వాలి నేను?
మనకు ఈ కాలువల సౌకర్యం తక్కువగా వున్నప్పుడు ప్రజలు సాధారణంగా మెట్ట పైరులే వేసేవాళ్ళు. మెట్టప్రాంతాల్లో మినుములు, కందులు ప్రధానం. ఈ రెండూ కూడా వేసవికాలపు పంటలు.అంటే మార్చి నుండి జూన్ వరకూ పండించే పంటలు. ఈ కాలంలో పశువులకు పచ్చిక దొరకదు. పచ్చిక బదులు పశువులు ఈ కందిపైరు కొసలు మేస్తాయి. ఇప్పుడు నాయకుడేమంటున్నాడంటే నందీ పూసింది, కందీ కాసిందీ ఆ కంది కొసలను ఎద్దు కూడా తినడం అయింది అంటున్నాడు. అంటే ఎండాకాలమైపోయి వర్షాకాలం మొదలైంది. ఈ కాలంలో కూడా నా శరీరం విరహతాపంతో చల్లబడటంలేదు. కాబట్టి కొంచెం గంధమైనా పంపమని వేడుకుంటున్నాడు. ఇక్కడ మరో విశేషము కూడా వుంది. ఎంతమంది ఎద్దులు నడిచేటప్పుడు చూసి వుంటారో లేదో గానీ, మంచి బలమైన ఒంగోలు జాతి ఎద్దులు నడుస్తుంటే స్పష్టమైన ఠీవి కనిపిస్తుంది. అలాంటి ఠీవిగల మంచి నడకతో రావా ప్రియురాలా అని వేడుకుంటూ, రాలేని పక్షంలో గంధమైన పంపమని అభ్యర్థిస్తున్నాడు. గంధము శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.
చూశారు కదా! అలంకారాన్ని నెమరువేస్తూ వ్రాసే కావ్యాలు ఈ చిన్న పాట పొలిమేరలచెంతకైనా రాగలవా? ఇప్పుడు ఆ పాట చదవండి
వేళజూడ వెన్నెలాయె వెండికట్ల కిన్నెరాయె
మల్లెపూల పందిరాయె, వయ్యారీ రావే - నవ్వులోనె తెల్లవారును
కొండగోగులు పూసెనేమొ కొండనిమ్మలు కాసెనేమొ
దొండ పండులాంటి పెదిమె, వయ్యారీ రావే - మనసు ఎవరిపాలు చేతును
మల్లెపూలు పూసినట్లు మళ్ళి మళ్ళి మాటలాడు
మల్లెపూలవంటి మనసు, వయ్యారీ రావే - పూవులెవరి పాలు జేతును
నందిపూసె కందిగాసె కందికొనలు నందిమేసె
అందమైన మేలినడల వయ్యారీ రావే - గంధమైన పంపబోతివి