5, జులై 2013, శుక్రవారం

ద్రౌపది కి ఎలా తెల్లవారింది.....?

తే|| ద్రుపదనందన పరిభవ దుఃఖమునకు
నుల్లమున దురపిల్లుచు నున్న సరసి
వేడినిట్టూర్పులోయన వెడలెఁ గ్రొత్త
తావి మూతులు విచ్చు నెత్తమ్మివిరుల


ఇది కవిత్రయ మహాభారతములోని తిక్కన రచించిన విరాటపర్వము ద్వితీయాశ్వాసములోని ప్రభాత కాల వర్ణనములోని మొదటి పద్యము.  పద్యము మొదటి సారి చదివితే సగం మాత్రమే అర్థమయింది. స్థూలంగా పద్య భావం కూడా అర్థంకాలేదు.  అ, ఆ లు మాత్రమే తెలిసిన నాలాంటి వాడికి  పద్యము అందులోని అంతరార్థం మొదటిసారి చదివినప్పుడు అర్థం కాకపోవడంలో వింతేమీలేదు. కానీ మళ్ళీ మళ్ళీ చదివితే చదివిన ప్రతిసారీ ఏదో క్రొత్త అర్థం స్ఫురిస్తుంటుంది. అందునా మహాకవుల గంటంనుంచి పద్యం తాళపత్రమెక్కిందంటే అందులో అంతరార్థాలు లేకపోతే ఆశ్చర్యపోవాలి.

పై పద్య సందర్భమేమిటంటే  పాండవుల అజ్ఞాతవాస సందర్భంగా ద్రౌపది మారుపేరుతో సైరంధ్రిగా విరాటుని కొలువులో విరాటుని భార్యయైన సుదేష్ణ దగ్గర పరిచారికగా కాలాన్ని వెళ్ళతీస్తూ వుంటుంది. ఒకరోజు మత్సదేశానికి సర్వసైన్యాధ్యక్షుడు, విరాట రాజునకు బావమరిది ఐనటువంటి కీచకుడు సైరంధ్రి అందచందాలకు ముగ్ధుడై  సైరంధ్రి పొందు కోరుకుంటాడు. వినని సైరంధ్రిని సైన్యాధ్యక్షుడనన్న అహంకారంతో వెంటపడి తరుముకుంటూ  రాజసభలో క్రిందపడదోసి తన్నడం వలన ఆమెకు నోటి నుంచి రక్తం కారుతుంది.

ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. అదే రాజసభలో వేరు వేరు నామాలతో ధర్మరాజు, భీమసేనుడు కూడా వుంటారు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. కనీసము నోరెత్తి ఇది తప్పు అనికూడా అనలేదు. తన భార్యను నిండుసభలో తనముందే  అవమానిస్తుంటే అన్నీ మూసుకు కూర్చోవలసిన దౌర్భాగ్య పరిస్థితిలో వున్నారంటే వాళ్ళ మానసిక వేదన ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించండి? ఇక ద్రౌపది పరిస్థితి చెప్పాలా? అటువంటి భర్తలు వుంటే ఏమి లేకుంటేనేమి?

ఇదిగో ఆ సందర్భంలో ఆరోజు రాత్రి  రహస్యంగా కలుసుకొంటుంది. నిజానికి ద్రౌపదికి ఆపద వచ్చినప్పుడల్లా కాపాడిన వాడు భీముడే. బహుశా అందుకే తన వ్యధను అర్థంచేసుకొని తనకు న్యాయం చేయగల్లవాడు భీముడేనన్న తలంపుతో భీముని కలిసిందే లేక వేరే ఏదైనా వుద్దేశ్యమో కానీ మొత్తానికి ఇద్దరూ కలిసి కీచకుని చంపడానికి స్కెచ్ గీస్తారు. అద్దో అప్పుడు రాత్రి గడిచి తెల్లవారే సందర్భంలో వ్రాసిన పద్యమిది

పద్యానికి స్థూలంగా అర్థాన్ని చెప్పాలంటే, ద్రుపదుని కూతురైన ద్రౌపదికి భర్తలు ఎదురుగా వుండి కూడా అనాదరణకు లోనైనందువల్ల ఆ సరోవరము  దుఃఖముతో పరితపిస్తుంటుంది. ఆ పరితాపము వల్ల సరస్సులోపల అప్పుడే క్రొత్తగా వికసిస్తున్న తామరపూల పరిమళం వేడి నిట్టూర్పుల వలే వుందట.

 ..... కానీ ఇప్పుడు ప్రతి పదార్థములను వ్రాసి సందర్భాన్ని బట్టి అర్థం ఎలా మారుతుందో చూద్దాము. ఇక్కడ ఒక్క విషయం మీరు గమనించాలి. పద్యానికి ఎన్నిరకాల అర్థాలైనా చెప్పుకోవచ్చు. చదివేకొద్దీ, ఆలోచించే క్రొద్దీ రకరకాల భావాలు గోచరిస్తుంటాయి.

ద్రుపదనందన పరిభవ దుఃఖమునకు
నుల్లమున దురపిల్లుచు నున్న సరసి
వేడినిట్టూర్పులోయన వెడలెఁ గ్రొత్త
తావి మూతులు విచ్చు నెత్తమ్మివిరుల


ప్రతి పదార్థము : ద్రుపద నందన = ద్రుపదుని కూతురు
పరిభవము = అనాదారము, తిరస్కారము, ఓటమి
ఉల్లము = హృదయము
దురపిల్లు = శోకించు; పరితపించు
సరసి = స్త్రీ, సరస్సు
తావి= సువాసన, పరిమళము ; పండ్లపాచి
నెత్తమ్మి = నెఱ+తమ్మి = విరిసిన తామర
విరి= వికసించినది.


పదాలకు వున్న అర్థాలను దృష్టిలో నుంచుకొని చూస్తే : సరసి అంటే రెండర్థాలు ఒకటి స్త్రీ, రెండవది సరోవరము అని. అలాగే దురపిల్లు అంటే శోకించడము ఒక అర్థము. మరొకటి పరితాపము. ఇక్కడ తాపము అంటే వేడి, పరితాపము అంటే అత్యుష్ణత లేదా మిక్కిలి వేడి అని అర్థంగా చెప్పుకోవచ్చు.

ఇక్కడ క్షోభను అనుభవించింది ద్రౌపది కాబట్టి ద్రౌపది క్షోభను సరస్సు నకు అన్వయించి ఒక అర్థం చెప్పుకోవచ్చు. లేదా కథా వస్తువు ద్రౌపది కాబట్టి ద్రౌపదికి ఎలా తెల్లవారిందో కూడా చెప్పుకోవచ్చు.  ద్రౌపది సుందరి కాబట్టి అలంకారికంగా స్త్రీ పెదవులను తామర పూ రేకులతో పోల్చి కూడా చూడవచ్చు. అంటే తామర పూరేకుల వంటి మెత్తని ఎర్రని పెదవులు గలదని అర్థం. ఈ రకంగా చూస్తే

ఆ రాత్రి మంతనాలయ్యాక ద్రుపదనందన వెళ్ళి పడుకొంది కానీ అంతమంది ముందు అంతటి అవమానం జరిగిన తరువాత నిద్ర ఎలా పడుతుంది? అందునా స్త్రీ.   కాబట్టి ఆ రాత్రంతా సైరంధ్రి, ద్రుపదనందనకు జరిగిన అవమానానికి  హృదయంలో ఏడుస్తూనే వున్నది. హృదయంలో ఏడవడమంటే తనబాధను ఎవరికీ చెప్పుకోలేక లోలోపల కుమిలి కుమిలి ఏడవడం. ఇప్పుడు ద్రౌపది పరిస్థితి అంతే మరి. ఈ రకంగా రాత్రంతా ఏడ్చి ఏడ్చి  తెల్లవారుతుందనగా లేస్తుంది. రాత్రంతా నిద్రలేక కోపంతో రగిలిపోతూ తన నిస్సహాయతకు దుఃఖిస్తూ వుంటే లేచిన తరువాత శరీర ఉష్ణోగ్రత పెరగటం వల్ల సహజంగానే వేడి నిట్టూర్పులు వస్తాయి కదా.
ఆ వేడి నిట్టూర్పుల వల్ల తామర పూలవంటి పెదవులు కలిగిన సైరంధ్రి విచ్చిన పెదవులనుంచి ఓ రకమైన వాసన వ్యాప్తిచెందింది అని చెప్పుకోవచ్చు.

మరో విశేషం : తామరపూలనుంచి ఎప్పుడూ సువాసనే వస్తుంది. అలాగే సుందరాంగి ఐనటువంటి ద్రౌపది తామరపూ రేకులవంటి పెదవులనుంచి ఎప్పుడూ పరిమళమే వచ్చుగాక....కానీ....ఇక్కడ పరిమళము రాదు..రాకూడదు. కారణం జరిగిన జరగబోయే సన్నివేశం ఏమాత్రమూ మంగళకరమైనది కాదు కాబట్టి. ఈ భావం నాకు స్ఫురించింది మాత్రమే... కవి తిక్కన వుద్దేశ్యము ఇది ఐ వుండవ్వచు లేదా కాకపోయీ వుండవచ్చు. అలాగే ఈ పద్యాన్ని చదివిన వారుకూడా ఈ భావంతో ఏకీభవించకపోనూ వచ్చు.


ఇక సహజమైన పద్య అర్థం పైన చెప్పుకున్నట్లే.... ద్రౌపదికి జరిగిన పరాభవం వల్ల దు:ఖముతో సరోవరము లో అప్పుడే క్రొత్తగా విచ్చుకుంటున్న తామర పూల పరిమళం  వేడి నిట్టూర్పుల వలే వుందని అర్థం.

4 కామెంట్‌లు:

  1. కొత్త తావి వెలువడడం అంటే అది చూపరుల దృష్టిని ఆకర్షించే౦తగా కనిపించదు. ఆమె విషయం, మనస్తత్త్వం తెలిసిన భీమాదులకే తెలుస్తుంది అని గూఢార్త ప్రతిపాదికం. వయసులో ఉన్నది కోపంగా ఉన్నా అందంగా ఉంటుందని సామాన్యార్థం. మూతులు విచ్చు అన్నపదంలో ఆమె నిరసన వ్యక్తం చేయడం కోసం వాడిన పదం. గౌరవ వాచకం అయితే నోరు అనివాడాలి కదా. దుఃఖానికి బలాన్నిచ్చే పదం. సరసి పదం ఆమె బాధకు మరో ప్రతీక.
    మీ ఆలోచన బాగుంది. మొత్తం మీద ద్రౌపదిలాంటి స్త్రీలను సమర్థించడం కత్తిమీద సామే. పాపం ఆమె స్థితి అలాంటిది. ఇప్పటికీ అలాంటి వారు ఉన్నా బయట పడకుండా ఉండడం గమనించదగింది.

    రిప్లయితొలగించండి

  2. రాసేటప్పుడు తిక్కన గారు కూడా ఇంత గా ఆలోచించి ఉండరేమో సుమీ !! జేకే !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. సీతాపతి రావు గారూ, క్రొత్త తావి, మూతులు విచ్చు అన్నపదాలకు మీ అన్వయం బాగుంది. మీ వ్యాఖ్యానానికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. జిలేబి గారూ అజ్ఞాత వాసం పూర్తయిందా బయటికి వచ్చారు? అవునండీ తిక్కన గారు నాలో ఆలోచిస్తే ఒక్క పర్వము కూడా వ్రాయలేరు. అలా అని మీలా ఆలోచించివున్నట్లయితే సంస్కృతాంధ్రము బదులు మనకు మహాభారతము సంకర భాష లో లభ్యమయ్యేదేమో :-)

    రిప్లయితొలగించండి

Comment Form