10, డిసెంబర్ 2017, ఆదివారం

మహాభారతం ఆదిపర్వము - ప్రధమాశ్వాసము - నా కల్పనలు - 2

మొదటిభాగం -  https://chiruspandana.blogspot.com/2017/12/1.html

కుండలాలు తెచ్చిచ్చిన ఉదంకుని గురుదక్షిణ పూర్తయిందని చెప్పి పైలుడు ఉదంకుని తో " ఇక నీ చదువు పూర్తయింది నీకిష్టమైన చోటికెళ్ళి సుఖంగా జీవించమని" దీవించి పంపించి వేశాడు. ఉదంకుడు కూడా చాలాకాలం తపస్సు చేసి తనను కష్టపెట్టిన తక్షకుని పై ప్రతీకారం తీర్చుకోవడానికి జనమేజయ మహారాజు వద్దకెళ్తాడు. తపస్సు తపస్సే కోపతాపాలు కోపతాపాలే మరి :)

రాజు కాబట్టి జనమేజయుని కాసేపు పొగిడి తక్షకుడనేవాడు నా అంతటి మునికి కష్టం తెచ్చిపెట్టాడు కాబట్టి నువ్వెలాగైనా వాడి పని పట్టాలంటాడు. అంతే కాదు అసలు నీ తండ్రి పరీక్షుత్తు మరణానికి కారణమెవరనుకుంటున్నావు? ఈ తక్షకుడే !! అని ఇంకాస్త ఎక్కదోసి దానికి ప్రతీకారంగా సర్పయాగం చెయ్యమని పురికొల్పుతాడు. సర్పయాగం చేస్తే పాములన్నీ వచ్చి అగ్నిలో పడి చచ్చిపోతాయి. కులంలో ఒక్కడు చెడ్డవాడుంటే ఆకులమంతా చెడుతుంది గాబట్టి పాములన్నింటిని చంపెయ్యమని పుల్లపెడతాడు :)

ఈ కథ ఉగ్రశ్రవనుడు చెప్తుంటే వింటున్న  మునులకు ఒక డౌటొచ్చింది. అసలు ఈ పాములన్నీ అగ్నికాహుతవ్వడానికి కారణమేంటి అని ఉగ్రశ్రవనుని అడుగుతారు. మళ్ళీ ఇంకొక పిట్టకథ మొదలు.

పూర్వం పాముల తల్లయిన కద్రువ శాపమియ్యడం వలన పాములన్నీ అట్లాఅగ్నిలో పడ్డాయి ఆ కథ ఇప్పుడు చెప్తానని ఇట్లా చెప్పాడు.

పూర్వం భృగువు అనే బ్రాహ్మణుడుండేవాడు. ఆయన భార్య పులోమ. ఆమె కడుపోతో వున్నది. ఒకరోజు యాగం చేస్తూ ఏటికి స్నానానికని వెళ్తూ భార్యని అగ్నికార్యాన్ని చూడమని చెప్పి వెళ్తాడు. అప్పుడు పులోముడనే రాక్షసుడొచ్చి ఆమె అందానికి గులామై అగ్ని ని ఈమె ఎవరిభార్యని అడుగుతాడు. అగ్ని నిజం చెప్తే భృగువు శాపమిస్తాడని తెలిసినా "ఈమె భృగువు భార్య" అని చెప్తాడు. అప్పుడారాక్షసుడు ఈమె పూర్వం నాకోసం ఎన్నబడిన భార్య. తరువాత భృగువు పెండ్లి చేసుకొన్నాడని పందిరూపంతో పులోమని ఎత్తుకొని పరుగులంకించుకొన్నాడు. అలా పరిగెత్తుతుంటే పులోమ పొట్టలో వున్న బిడ్డకు కోపమొచ్చి పొట్టలోనుంచి జారిపడి పులోముడిని భస్మం చేస్తాడు. గర్భంనుంచి జారి పడ్డాడుకనక ఆ బిడ్డ చ్యవనుడయ్యాడు. పులోమ చ్యవనునెత్తుకొని తిరిగి భృగువు దగ్గరకి వస్తుంది.

ఇక్కడ నాకనిపించేది యేమిటంటే పులోముడు, భృగువు భార్యను అపహరించుకోని పోతుంటే బిడ్డపుట్టాడు.వాడికి చ్యవనుడని పేరుపెట్టారు. కొంత కాలానికి వాడు చచ్చినాక పులోమ మళ్ళీ భృగువు దగ్గరకొస్తుంది. పులోమ ముందు పులోమని భార్యగా వుండి తరువాత భృగువుని పెండ్లి చేసికొని కూడా వుండవచ్చు.బహుశా ఆ కాలంలో అందంగా వుంటే ఒకరి భార్యను మరొకరు పరాక్రమము చేత పెళ్ళి చేసుకోవడం పెద్దనేరము కాదేమో!

పులోమనెత్తుకొని పులోముడు పరిగెత్తినప్పుడు ఆమె భయంతో ఏడిస్తే ఆ కన్నీటితో ఆ ఆశ్రమం దగ్గర ఒక నది యేర్పడితే బ్రహ్మ దానికి  "వధూసర" అని పేరు పెట్టాడు. స్నానం చేసి వచ్చిన భృగువు కొడుకునెత్తుకొని వున్న పులోమను చూసి "ఆ రాక్షసుడు నిన్నెలా తెలిసికొన్నాడు? నీజాడ ఎవరు చెప్పారని " అడిగితే ఇదిగో ఈ అగ్ని నన్నుగూర్చి చెప్పాడని చెప్పింది. అంతే భృగువుకు కోపమొచ్చి అగ్నికి శాపమిస్తాడు. నువ్వు సర్వభక్షకుడవు కమ్మని. ఇక్కడ మళ్ళీ అగ్నికి భృగువుకి కొంత సత్యం గురించి, బ్రాహ్మణుల గొప్పతనం గురించి అగ్నిచేత వ్యాసుడు కొంత చెప్పిస్తాడు. అగ్ని తనకిచ్చిన శాపానికి ప్రతిగా తన కాంతిమయమైన రూపాన్ని లేకుండా చేసేస్తాడు. ఇది చూచి యజ్ఞ యాగాదులు, పితృ కర్మలు చేసే మానవులు అవిచేయలేక మునులదగ్గరకు వెళ్ళారు.మునులు దేవతలదగ్గరకి వెళ్ళారు.మునులూ దేవతలూ కలసి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకొంటే బ్రహ్మ అగ్ని ని పిలిచి  ఆ ముని వాక్యం వ్యర్థం కాదు కానీ నీవు అన్నీ తినేవాడవయినప్పటికి మొదటపూజనీయమైన వాడవవుతావని శాంతింప చేస్తారు.

బహుశా ఆ కాలంలో అగ్ని ప్రతిదాన్ని దహించివేయడం చూసి ఈ శాపాన్ని ఒక కారణంగా చూపి సంతృప్తి పడివుండేవారేమో! అలాగే ప్రతివొక్కరు బహుశా అగ్ని కార్యాలు చేసే వారేమో. ఆరోజుల్లో ఇప్పటిలాగా అగ్గి తయారు చేయడం కుదరక అవసరమైనప్పుడు అగ్ని అందుబాటులో వుండడానికి ఇదొక ప్రక్రియగా మొదలైందేమో. మునుల వాక్కులకు తిరుగులేదనే వ్యవస్థను సూత్రీకరించే కథల్లో ఇదొక కథయి వుండవచ్చు.

అలా అగ్ని శాంతించినపిదప భృగువు కొడుకు చ్యవనునికి సుకన్య కు ప్రమతి అనేవాడు పుడుతాడు. ప్రమతికి ఘృతాచి అనే అప్సరసకూ రురుడు జన్మిస్తాడు. రురుడు ప్రమద్వర అనే ముని కన్యకను ప్రేమిస్తాడు. ప్రమద్వర విశ్వావసుడనే గంధర్వ రాజుకు, మేనకలకు పుట్టి స్థూలకేశుడనే ముని ఆశ్రమంలో పెరుగుతుంటుంది. ఒకరోజు ప్రమద్వర స్నేహితురాళ్ళతో ఆడుకుంటుంటే పాము కరిచి చచ్చిపోతుంది. అప్పుడు ప్రమద్వరను చూడటానికి గౌతముడు, కణ్వుడు, కుత్సుడు, కౌశికుడు ( విశ్వామిత్రుడు), శంఖుడు, మేఖలుడు,భరద్వాజుడు,వాలఖిల్యుడు,ఉద్ధాలకుడు,శ్వేతకేతుడు,మైత్రేయుడు మొదలైన ఋషులతోటి ప్రమతి, రురువుడు కూడా స్థూలకేశునాశ్రమానికి వస్తారు. రురుడు అక్కడ వుండలేక అడవికి వెళ్ళి దేవతలను ప్రమద్వరను బ్రతికించమని ప్రార్ధిస్తాడు. ఇక్కడ ప్రార్థించడంలో ఒక విశేషముంది మంత్రము తో కానీ, విషతత్త్వాన్ని తెలిసిన వ్యక్తుల చేతకానీ బ్రతికించమని వేడుకుంటాడు. బహుశా పాముకాటు అప్పట్లో సర్వసాధారణం కాబట్టి ఋషులకు పాము విషాన్ని హరించే వైద్యం తెలిసుండాలి.

ఆ ప్రార్థన విన్న ఒక దేవదూత నీ ఆయుష్షులో సగం ప్రమద్వరకిస్తే ఆ అమ్మాయి బ్రతుకుతుందని చెప్తే రురుడు అలాగే ననటంతో ఆమె బ్రతుకుతుంది.ఇక అప్పటినుంచి తన భార్యకు అపకారాన్ని చేసిన పాములపై కక్షగట్టి రురుడు ఒక పెద్ద దుడ్డుకర్ర తీసుకొని అడవుల్లో తిరుగుతూ కనిపించిన పామునల్లా చావబాదుతుంటాడు. ఒకరోజు విషంలేనటువంటి డుండుభమనే పామును అలాగే కొట్టడానికి కర్రెత్తితే అది బ్రాహ్మణులకుండవలసిన లక్షణాలు గురించి చెప్పి యింత క్రోధానికి కారణమేమిటని అడుగుతుంది. రురుడు విషయం చెప్పి పామును చంపడానికి కర్రెత్తగానే ఆ పాము ముని రూపంలో ప్రత్యక్షమౌతాడు. అదిచూసి రురుడు నీవెవ్వరవు పామవతారంలో ఎందుకున్నావని అడిగితే ఆ ముని ఇలా చెప్తాడు.

నేను సహస్రపాదుడనే మునిని. నా సహపాఠి ఖగముడు. వాడొకరోజు అగ్ని గృహంలో వుండగా తమాషాకు గడ్డితో చేసిన పామును వాడిపై వేశాను. వాడు భయపడి కోపంతే నువ్వు విషంలేని పాముగ అవ్వమని శపించాడు. దానికి నేను తమాషాకోసం చేశానని శాపవిముక్తి కలిగించమని వేడుకోగా రురుని చూసిన తరువాత శాపవిముక్తుడవవుతావన్నాడు కాబట్టి నేను శాపవుముక్తడయ్యానని బ్రాహ్మణులకుండవలసి లక్షణాలను రురువుకి చెప్పి పాములపై కోపాన్ని పోగొడతాడు. 

పై కథంతా ఎవరు ఎవరికి చెప్తున్నారు?ఉగ్రశ్రవణుడు మునులకు చెప్తున్నాడు కదా! ఇప్పుడు మునులు మరో క్వొశ్చెన్ వేశారు.

ఉగ్రశ్రవణా "తల్లి బిడ్డలను ప్రేమతో లాలించి చూస్తుంది కాదా? అలాంటి తల్లే పాములకు శాపమెలా యిచ్చిందని" అడుగుతారు.

ఈ ప్రశ్నతో ప్రధమాశ్వాస కథ  పూర్తవుతుంది. 

4 కామెంట్‌లు:

  1. ---కథంతా ఎవరు ఎవరికి చెప్తున్నారు?

    పర్లేదండి ! మెమొరీ బాగుంది. కతలోపల కతలోపల కతలోపల .... కెళ్ళాక కూడా మొదట ఎక్కడ ఎవరు మొదలెట్టారో గుర్తు పెట్టుకుని వున్నారు :).


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ అవునండీ, కత లోపల కత లైనా చదవడానికి ఇష్టం గా వుంది.

      తొలగించండి
  2. మీరు కూడా తెలుగు మీడియా వాళ్ళలా కక్ష్య కట్టిస్తే ఎలా అండీ... మా మీద ఇంత కక్ష దేనికి. :)

    జిలేబీ... మొదట ఎక్కడ ఎవరు మొదలెట్టారో... భారత కర్త ఎక్కడికక్కడ చెబుతూనే ఉంటాడు.. ఆయన వెనుక వెళ్ళిపోతే చాలు. అంతోటి దానికి మెమొరీ అక్కరలేదు. (అలా అని భారారె గారి మెమొరీ మీద అనుమానాలేవీ లేవు లెండి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణీంద్ర గారూ, నా మెమొరీ మీద మీకు నమ్మకంగా వుందేమో కానీ మీ వ్యాఖ్య చూశాక నాకు నమ్మకం సన్నగిల్లింది :) ఈ పదము బుఱ్ఱలోనుంచి జారిపోయి దశాబ్దాలై ఆర్బిట్ అనే పదం నిండిపోయి రెంటికీ తేడా మీ వ్యాఖ్య చూసేంత వరకూ గుర్తించలేకపోవడమే :)

      తొలగించండి

Comment Form