సంక్రాంతి కి విడుదల కాబోతున్న
హారం పత్రికా ప్రతికై రచయితలకాహ్వానం. ఇరవై వేల పైన బహుమతులు
సాహితీవేత్తలకు,పరిశోధనా ప్రియులకు,సాహిత్యాభిలాషులకు,హారం పాఠకులకు ముందుగా నమస్కారములు. ఈ చిన్న వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యము అంతర్జాలంలో హారం ద్వారా తెలుగులో ఒక పత్రికను తీసుకువస్తే బాగుంటుందన్న ఆలోచనే. ఇది ఒక్కపత్రికే కావచ్చు లేదా ఆ సంచికకు వచ్చే ఆదరణను బట్టి తెలుగువారికి ముఖ్యమైన పండగలప్పుడు ఓ సంచికనో తీసుకు వచ్చే ఆలోచన. కాబట్టి ఇది పండగలకు మాత్రమే వచ్చే పత్రికే. అంటే వార,పక్ష,మాస,త్రైమాసిక పత్రికల విభాగంలోకి రాదు.
హారం ఆవిర్భావం 2009 సంక్రాంతి రోజు. ఈ పుణ్యకాలాన్ని పురష్కరించుకొనే ఈ పత్రికా ప్రతిని కూడా ఈ సంక్రాంతి పర్వదినాలలోనే వెలువరించాలని కోరిక. అప్పుడప్పుడు మాత్రమే వచ్చే పత్రిక కాబట్టి ఇందులో దరిదాపు పదిహేను విభాగాలాకు పోటీలు బహుమతులను ఇవ్వాలనుకుంటున్నాను. గొప్ప గొప్ప బహుమతులు లేకున్నా ప్రధమ,ద్వితీయ బహుమతులుగా మంచి మంచి పుస్తకములను కానీ డబ్బురూపంగా కానీ ఇవ్వడం జరుగుతుంది.
అన్ని రచనలు డిసెంబరు 31 2011 లోగా పంపాలి.
కొన్ని సూచనలు
-------------
౧) ఆయా ప్రశ్నల కిచ్చిన నిడివిని బట్టి మీ పేజీలు A4 సైజులో ,తెలుగు ఫాంటు 12 పరిమాణముతో యూనికోడ్ లో వుండాలి.
౨) రచయిత భావాలు స్వతంత్రమైనవై, పరిశీలించిన గ్రంధములను, వాటి రచయితలను తప్పని సరిగా పేర్కొనాలి.
౩) రచయిత పంపే వ్యాసపు ప్రచురణ హక్కులు హారానికి ఇవ్వాలి. అంటే హారంలో ప్రచురించడానికి మంచివాటిని ఆంగ్లానువాదము చేసి ప్రచురించడానికీ సర్వ హక్కులను హారముకు ఇవ్వవలసి వుంటుంది.
౪) ఇవి ఇంతకు మునుపు ఎక్కడా ప్రచురించనివై వుండాలి.
ఇక అంశాలు
-----------
1) ఆంధ్ర మహాభారత,భాగవతముల నాధారంగా చేసుకొని ఇతివృత్తపు కాలము నాటి సామాజిక, సాంఘిక, కుటుంబ అంశములను విస్తృతంగ పరిశోధనా వ్యాసంగా వ్రాయాలి. ఈ వ్యాసం వ్రాసేటప్పుడు ఈ క్రింది నియమాలు తప్పక దృష్టిలో వుంచుకోవాలి.
ఈ పరిశోధనా వ్యాసంలో సాధ్యమైనంత వరకూ భారతములోని అన్ని పర్వాలనూ, భాగవతములోని అన్ని స్కందములను స్పృశిస్తూ సాగాలి. సాంఘిక,సామాజిక,కుటుంబ వ్యవస్థను ప్రతిబింబించని పర్వములను కానీ, స్కందములను గానీ వదిలివేయవచ్చు.
అవసరమైనచోట మూల పద్యములనుదహరిస్తూ,వానికి తాత్పర్యములను చెప్తూ, ఆ పద్యములను ఆధారంగా రచయిత ఆనాటి పరిస్థితులను విస్తృతంగా పదవతరగతి విద్యార్థికి అర్థమగు వచనములో వివరించగలగాలి. వ్యాసము తప్పని సరిగా తెలుగులోనే వుండాలి.
2) బాధ్యత గల పౌరులుగా తీర్చి దిద్దడంలో భారతదేశములోని మతముల పాత్ర పదిపేజీలకు మించకుండా వ్రాయాలి.
3) పదవ శతాబ్దానికి ముందు పల్లెజీవనాన్ని ప్రతిబింబిస్తూ మనుషుల ఆత్మీయానురాగాలతో పాటు ద్వేషభావాన్ని అంతర్లీనంగా చూపిస్తూ,ఆనాటి పల్లె భాషను ఊహించి, ఓ పదిపేజీల ( సుమారుగా ) చక్కని కథానిక వ్రాయాలి.
4) మారుతున్న సమాజములో పిల్లల మనస్తత్వాలలో వస్తున్న మార్పులు, వారిని పెంచడములో తల్లి తండ్రుల పాత్ర పై వ్యాసాన్ని వ్రాయాలి. మీ వ్యాసంలో 8 నుంచి 18 సంవత్సరాల పిల్లల మనస్తత్వాలను విశదీకరిస్తూ వారిపై చుట్టూవున్న సమాజం, కుటుంబము ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయో ఉదాహరణలతో వివరిస్తూ వారి పెంపకములో వచ్చే సమస్యలను సామరస్యంగా ఎలా పరిష్కరించాలో వ్రాయాలి. ఎన్ని పేజీలుండాలన్నది రచయిత ఇష్టము.
5) మహాత్మాగాంధీ హత్యానంతర భారతదేశములో వచ్చిన అన్ని రకముల మార్పులను ( మంచినీ, చెడునూ ) సోదాహరణంగా ఇరవై, ఇరవైదు పేజీలకు మించకుండా వ్రాయాలి. ఈ ప్రశ్నకు inspiration, India after gandhi By Ramachandra guha చదవడము ద్వారా వచ్చింది.
6) కులవృత్తులు కార్పొరేట్ వృత్తులుగా మారుతున్న ఈ తరుణంలో కులవృత్తులపై కథానిక లేదా చిన్న నవల. నిడివి రచయిత ఇష్టం.
7) భారతరాజ్య వ్యవస్థలో బఫూన్ల పాత్ర. హాస్య / వ్యంగ్య ప్రధానమైన రచన. ఈ రచనలో అందరూ భాగస్వాములే. అంటే మీ రచనల్లో ఛీఫ్ పౌరుని దగ్గరనుండి, చీపురు పౌరుని దాకా ఒక్కొక్కరిగానైనా లేదా మూకుమ్మడిగా నైనా భారతదేశాన్ని నడపవచ్చు!!! రచనల్లో దూషణకు చోటులేదు.
8) ఆంధ్రా అమ్మాయి, తెలంగాణా అబ్బాయిల అమెరికా జీవితం పై ఓ మంచి కథ. మధ్యమధ్యల్లో కవిత/పద్యము కూడా, ఓపికకొద్ది అప్పుడప్పుడు అగచాట్లూ,చీవాట్లూ వేసుకోవచ్చు :))
9) శైవ/వైష్ణవ మతఘర్షణల తీవ్రతను, దానినుంచి దైవమొక్కడే అన్నదిశగా ప్రయాణించిన మన సమాజ చరిత్రకు కుంచెద్వారా రంగులద్దండి. ఈ చిత్రలేఖనానికి భావం ప్రధానం. వాటర్/ఆయిల్/పెన్సిల్ ఏ పద్ధతినైనా ఉపయోగించవచ్చు.
10) రాబోయే రెండు దశాబ్దాలలో ప్రపంచపటంపై భారతదేశం. ఈ అంశపై పద్య / గేయ కవిత.
11) సంక్రాంతి ప్రాశస్త్యాన్ని, దాని చరిత్రను, పల్లె ప్రాంత పండుగ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు ఓ రచన.
ఇది పద్యగద్యమైనా కావచ్చు లేదా పాట యైనా కావచ్చు. హరికథ, బుఱ్ఱకథ, లేక రూపకమైనా కావచ్చు. రచనా ప్రక్రియ యేదైనా సరే పైన చెప్పిన విషయము రస ప్రధానమై సంతోష వాతావరణములో సాగాలి. వేరే గ్రంధములనుండి పద్యములనుదహరించినప్పుడు అవి తప్పక తాత్పర్యసహితమై వుండాలి. సినిమాలనుండి పాటలను తీసుకొన్నా ఆ పాటలోను ముఖ్యమైన సొగసులన్నీ చెప్పాలి. నిడివి కనీసం ఐదు పేజీలైనా వుండాలి.
12) శృంగారము, ఉత్కంఠత మేళవిస్తూ శ్రీకృష్ణదేవరాయలకాలపు RAW and PIA :-) వ్యవహారములపై ఓ నాటిక/నవల.
13) "Life starts from the dark and ends in dark" ( a quotation from BLACK movie) . దీన్ని ఆధారంగా తీసుకొని భారతీయ తత్వశాస్త్రాన్ని మేళవించి ఓ పది నిమిషాల వీడియో సినిమా.
14) మీకు నచ్చిన రచన ఏదైనా పంపవచ్చు. రచన మీ స్వంత రచనయైవుండాలి. మాకు నచ్చిన రచనకు బహుమతి
15) ఇది కొద్దిగా మా భుజాలను మేమే చరుచుకోవడానికి ఎన్నుకొన్న ప్రశ్న. అదీ సంగీత ప్రధానమైనది. ప్రశ్న ఏమిటంటే హారం,హారం పత్రిక పై ఓ పాటను రచించి స్వరపరచి గానం చేసి ఆడియో పంపాలన్న మాట :))
. ఏఏ అంశానికి ఎంత బహుమతో ఈ క్రింద చూడవచ్చు.ఇది రచనల ప్రోత్సాహానికి మాత్రమే అని గమనించగలరు.మీరచనలకు ఈ చిన్నచిన్న బహుమతులు ఏమాత్రమూ కొలమానము కాదు. ఇక దీనిపై ఏవైనా విరాళాలు వచ్చినా ఆ విరాళాన్ని మొత్తాన్నీ పైనున్న బహుమతుల కు కలుపుతాను. అంటే మీరిచ్చే విరాళాలు ఏ అంశానికివ్వ దలచుకున్నారో కూడా చెప్తే ఆ అంశానికి ప్రధమ, ద్వితీయ బహుమతులలో కలుపుతాను.