24, డిసెంబర్ 2020, గురువారం

నాకూ ఒక టి.వి.యస్ కావాలి.... .. ఓ మూడుకోట్లు వెనకేసుకోవాలి :)

 స్కూటీలో పోలవరం స్టీల్‌...!!

స్టీల్, ఇసుక లాంటి భారీ మెటీరియల్‌ తరలించాలంటే ఎక్కడైనా డీసీఎం, లారీ లాంటి పెద్ద వాహనాలు తప్పనిసరి. ఓ ఇల్లు కట్టాలన్నా నిర్మాణానికి వాడే బరువైన ఇనుము, ఇతర మెటీరియల్‌ను పెద్ద వాహనంలోనే తరలిస్తారు. పోనీ కనీసం ట్రాక్టరైనా వాడతారు. కానీ పోలవరం లాంటి అతి పెద్ద ప్రాజెక్టు నిర్మాణంలో మాత్రం ద్విచక్ర వాహనాలపై టన్నుల కొద్దీ ఉక్కు తరలించారంటే నమ్మాలి మరి! ఇవే కాదు.. విచిత్రంగా ఇక్కడ ఆటోలు, కార్లలో వందల టన్నుల స్టీల్‌ తరలించినట్లు చూపించారు! సిమెంట్, ఇసుక, స్టీల్‌ తరలించడంలో రాయపాటి స్టైలే వేరు మరి..!! అసలు కొనుగోలే చేయని సరుకును అధిక ధరలకు కొన్నట్లు చూపించి ఏకంగా రూ.907.10 కోట్లను లూటీ చేయడం రాయపాటికి మాత్రమే సాధ్యమైంది. సీబీఐ ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో విస్తుపోయే ఈ అక్రమాల బాగోతం బట్టబయలైంది. 

ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో...
పోలవరం ప్రాజెక్టు, జాతీయ రహదారుల కాంట్రాక్టు పనుల పేరుతో 14 జాతీయ బ్యాంకుల నుంచి రూ.7,153.62 కోట్ల రుణం తీసుకున్న రాయపాటి తన సంస్థ ‘ట్రాన్స్‌ట్రాయ్‌’లో పనిచేస్తున్న వారి పేర్లతో ఏకంగా తొమ్మిది కంపెనీలను ఏర్పాటు చేసి నకిలీ కొనుగోళ్లతో రూ.6,202.82 కోట్లను మింగేశారు. ఇందులో రూ.350.49 కోట్లను రాయపాటి తన భార్య  లీలాకుమారి, సమీప బంధువు చెరుకూరి శ్రీధర్‌ వ్యక్తిగత ఖాతాల్లోకి నేరుగా మళ్లించి స్వాహా చేయడం ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో బహిర్గతమైందని సీబీఐ తేల్చింది. ట్రాన్స్‌ట్రాయ్‌ తరఫున రాయపాటి సాంబశివరావు, చెరుకూరి శ్రీధర్, అక్కినేని సతీష్, లీలాకుమారి రుణం తీసుకుని చెల్లించకుండా మోసగించడంపై కెనరా బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌ టి.వీరభద్రారెడ్డి ఈనెల 15న ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది. గుంటూరు, హైదరాబాద్‌లోని రాయపాటి, చెరుకూరి శ్రీధర్, అక్కినేని సతీష్‌ ఇళ్లు, కార్యాలయాలపై  ఈనెల 18న సోదాలు నిర్వహించింది. ఎఫ్‌ఐఆర్‌లో రాయపాటి అక్రమాలను సీబీఐ బట్టబయలు చేసింది. 

సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ప్రధానాంశాలు ఇవీ..
ప్రణాళికతో బ్యాంకుల దోపిడీ..
రాయపాటి 2001లో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా లిమిటెడ్‌(టీఐఎల్‌) జాతీయ రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం లాంటి కాంట్రాక్టు పనులను చేపడుతోంది. 2013లో పోలవరం హెడ్‌ వర్క్స్‌ నిర్మాణాన్ని ట్రాన్స్‌ట్రాయ్‌ దక్కించుకుంది. కెనరా బ్యాంకు నేతృత్వంలోని 14 బ్యాంకుల కన్సార్షియం ట్రాన్స్‌ట్రాయ్‌కు రూ.9394.28 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. ఇందులో రూ.7153.62 కోట్ల రుణాన్ని రాయపాటి తీసుకున్నారు. రాయపాటి తన సంస్థలో పనిచేసే వారి పేర్లతో తొమ్మిది నకిలీ కంపెనీలను ఏర్పాటు చేసి వాటి నుంచి ఇనుము, సిమెంటు, కంకర, యంత్రాలు, వాహనాలు, పరికరాలు కొనుగోలు చేయకుండానే కొన్నట్లు చూపించి రూ.7153.62 కోట్లను బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం నుంచి చెల్లించేశారు. ఆ తర్వాత ఆ తొమ్మిది సంస్థల నుంచి రూ.6,202.82 కోట్లను ట్రాన్స్‌ట్రాయ్‌ ఖాతాలోకి మళ్లించి స్వాహా చేశారు. 

నకిలీ కొనుగోళ్లు..
ట్రాన్స్‌ట్రాయ్‌లో పనిచేసే సుధాకర్‌బాబు పేరుతో పద్మావతి ఎంటర్‌ప్రైజెస్, మాజీ డైరెక్టర్‌ సాంబశివరావు మలినేని పేరుతో యూనిక్‌ ఇంజనీర్స్, వేములపల్లి హరీష్‌బాబు పేరుతో బాలాజీ ఎంటర్‌ప్రైజస్, కొరివి శివకుమార్‌ పేరుతో రుత్విక్‌ అసోసియేట్స్‌ను ఏర్పాటు చేయించిన రాయపాటి ఆ సంస్థల ఖాతాల్లోకి రూ.686.55 కోట్లను కనీసం జమ  చేయకుండానే అంతే విలువైన వస్తువులను ఆ సంస్థల నుంచి కొనుగోలు చేసినట్లు చూపి మింగేశారు.

ఇదిగో ఆ చిట్టా..
► పద్మావతి ఎంటర్‌ప్రైజెస్‌ నుంచి రూ.2,172.75 కోట్ల విలువైన వస్తువులు కొనుగోలు చేసినట్లు రాయపాటి చూపించారు. కానీ పద్మావతి ఎంటర్‌ప్రైజెస్‌ టిన్‌ నెంబర్‌ 36200282035 పరిశీలిస్తే ఆ టిన్‌ నెంబర్‌తో ఎలాంటి సంస్థ ఏర్పాటు కాలేదని ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో వెల్లడైంది.
► బాలాజీ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ రూ.1,865.47 కోట్ల వస్తువులను ట్రాన్స్‌ట్రాయ్‌ కొనుగోలు చేసినట్లు చూపింది. కానీ పద్మావతి ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ టిన్‌ నెంబర్‌తో ఈ కొనుగోళ్లు జరిపినట్లు ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో స్పష్టమైంది.
► రుత్విక్‌ అసోసియేట్స్‌ నుంచి రూ.1925.86 కోట్ల విలువైన వస్తువులను కొనుగోలు చేసినట్లు చూపారు. కానీ అలాంటి లావాదేవీలు జరగలేదని ట్రాన్స్‌ట్రాయ్‌ రికార్డుల్లో వెల్లడైంది. దీన్ని బట్టి అవన్నీ బోగస్‌ లావాదేవీలన్నది స్పష్టమవుతోంది.
► యూనిక్‌ ఇంజనీర్స్‌ నుంచి సంస్థ యజమాని ఎం.సాంబశివరావు పాన్‌ నెంబర్‌ ఏఎఫ్‌కేపీఎం1706ఎల్‌నే టిన్‌ నెంబర్‌గా చూపించి రూ.672.12 కోట్ల విలువైన వస్తువులు కొన్నట్లు చూపారు. ఈ సంస్థ నుంచి కొనుగోలు చేసిన సరుకును తరలించడానికి వినియోగించిన వాహనాల నెంబర్లను పరిశీలిస్తే అందులో అధిక శాతం ద్విచక్ర వాహనాలుగా తేలింది.

సబ్‌ కాంట్రాక్టర్ల ముసుగులో రూ.1,527.10 కోట్లు స్వాహా..
బోగస్‌ సంస్థల నుంచి కొనుగోలు చేయకుండానే చేసినట్లు చూపిన ఇనుము, సిమెంటు, కంకర, వాహనాలు లాంటి వాటిలో రూ.1,753.82 కోట్ల విలువైన సరుకు నిల్వ ఉన్నట్లు ట్రాన్స్‌ట్రాయ్‌ చూపించింది. ఇందులో ఒక్క పోలవరం ప్రాజెక్టు వద్దే రూ.1,527.10 కోట్ల విలువైన సామగ్రి నిల్వ చేసినట్లు చూపారు. ఇంత భారీ ఎత్తున ఒక ప్రాజెక్టు వద్ద సరుకును ఎలా నిల్వ చేస్తారని సీబీఐ అధికారులు ఆశ్చర్యపోయారు. పోలవరంలో పనులు  సబ్‌ కాంట్రాక్టర్లే చేశారు. ట్రాన్స్‌ట్రాయ్‌ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. అలాంటి ట్రాన్స్‌ట్రాయ్‌ రూ.1,527.10 కోట్ల విలువైన సామగ్రిని పోలవరం పనుల కోసం కొనుగోలు చేసి నిల్వ ఉంచినట్లు చూపడమంటే ఆమేరకు దోపిడీ చేసినట్లు స్పష్టమవుతోంది.

దొంగ లెక్కలతో రూ.907.10 కోట్లు లూటీ..
ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ ఆదాయ, వ్యయాలపై బ్యాలెన్స్‌ షీట్‌ను దొంగ లెక్కలతో భారీగా పెంచేసింది. వస్తువులు కొనకుండానే అధిక ధరలకు కొనుగోలు చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి రూ.907.10 కోట్లను రాయపాటి లూటీ చేసినట్లు ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో వెల్లడైంది. ట్రాన్స్‌ట్రాయ్‌ 24 ఎక్సవేటర్‌లను రూ.34.06 కోట్లకు కొన్నట్లు చూపింది. కానీ 8 ఎక్సవేటర్‌లను వోల్వో ఇండియా నుంచి కొనుగోలు చేసింది. మిగతా 16 కొనుగోలు చేయకుండానే కొన్నట్లు చూపించి నిధులు మింగేసింది. మరో 8 ఎక్సవేటర్లను రూ.14.67 కోట్లకు కొనుగోలు చేసినట్లు చూపింది. ఇందులో ఒకటి టాటా హిటాచీ, మూడు ఎల్‌అండ్‌టీ నుంచి కొనుగోలు చేసినట్లు చూపింది. మిగతా నాలుగు కొనుగోలు చేయకుండానే కొన్నట్లు చూపించి నిధులు కాజేసింది. పది టిప్పర్లను టాటా సంస్థ నుంచి కొనుగోలు చేసినట్లు ట్రాన్స్‌ట్రాయ్‌ చూపింది. నిజానికి ఐదు వాహనాలను మాత్రమే కొనుగోలు చేసి మిగిలిన ఐదు వాహనాలకు ఇవే ఛాసిస్‌ (లారీ బాడీ నెంబర్‌) నంబర్లు చూపించి నిధులను మింగేసింది. వాటికి రిజిస్ట్రేషన్‌ కూడా చేయించకపోవడం గమనార్హం.  

నకిలీ వాహనాలు రయ్‌.. రయ్‌!
► యూనిక్‌ ఇంజనీర్స్‌ అనే సంస్థ నుంచి 25.50 టన్నుల 10 ఎంఎం ఇనుప కడ్డీలను కొనుగోలు చేసి ఏపీ 12వీ 5408 నెంబరు బజాజ్‌ ఆటోలో పోలవరం పనులకు తరలించినట్లు చూపించారు. 
► పద్మావతి ఎంటర్‌ప్రైజెస్‌ నుంచి 16.60 మెట్రిక్‌ టన్నుల 10 ఎంఎ ఇనుప కడ్డీలను కొనుగోలు చేసి కేఏ 03 6894 నంబర్‌ కలిగిన టీవీఎస్‌ స్కూటీలో     తరలించినట్లు చూపారు. ఇంత ఇనుము ఓ చిన్న స్కూటీపై తరలించగలగడం ఎవరికైనా అసాధ్యమే కానీ ఘనాపాటి రాయపాటికి మాత్రం కాదు.  ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా రూ.450 కోట్ల షేర్లు ఎవరైనా కొనగలరా? ట్రాన్స్‌ట్రాయ్‌లో రాయపాటి భార్య లీలాకుమారి, సమీప బంధువు చెరుకూరి శ్రీధర్‌లు రూపాయి పెట్టుబడి పెట్టకుండానే 2012 – 2014 మధ్య రూ.450 కోట్ల విలువైన షేర్లు కొన్నట్లు రికార్డుల్లో చూపించారు.  

ద్విచక్రవాహనాలపై అనేక మెట్రిక్‌ టన్నుల స్టీల్‌ తరలించినట్లు చూపిన నకిలీ బిల్లులు



9, డిసెంబర్ 2020, బుధవారం

త్రాగునీరు - అమెరికా వర్సెస్ భారతదేశం.

 

ఏలూరులో జరిగిన ఘటన దరిదాపుగా త్రాగునీరు కలుషితమవడం వలన జరిగివుండవచ్చని ప్రాధమికంగా ఒక నిర్థారణకు వచ్చినట్లే వుంది. కచ్చితమైన సమాచారం కావాలంటే మరో నాలుగైదురోజులు పట్టవచ్చేమో... కానీ ఈ దుర్ఘటన చదివిన తరువాత నాకు అమెరికా కుళాయి నీళ్ళ ని భారతదేశపు కొళాయినీళ్ళతో పోల్చాలనిపించింది. దీనికి ఒక కారణం కూడా వుంది. సాధారణంగా చాలామంది అమెరికాలో కొళాయి నీళ్ళే త్రాగుతారు. బాటిల్డ్ వాటర్ త్రాగరా అంటే త్రాగుతారు కానీ సగటు అమెరికన్ ఇంటి కొళాయిలో వచ్చే నీళ్ళే ప్రతిదానికీ వాడుతాడు. ఇంతకీ ఈ వివరణ ఎందుకంటే ఈ సంవత్సరం జూలై నెలలో మాయింటికి మున్సిపల్ వాళ్ళ దగ్గరనుంచి ఒక లెటర్ వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే గత వారంనుంచి మీరుత్రాగే నీళ్ళలో క్లోరైడ్ శాతం మేము పోయిన సంవత్సరం పంపిన రిపోర్ట్ కంటే కొంచెం ఎక్కువగా వున్నదనీ, కానీ ఈ నీళ్ళు త్రాగడం వల్ల ఎటువంటి హానీ జరగదనీ, క్లోరైడ్ శాతాన్ని రిపోర్ట్ లో చెప్పిన గణాంకాలకు అనుగుణంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామనీ ఒక ఉత్తరం పంపారు. మేము ఎందుకొచ్చిన గొడవలెమ్మని ఓ నెలపాటు అనగా మళ్ళీ వారు ఉత్తరం పంపేవరకూ ప్యూరిఫైడ్ బాటిల్ వాటర్ కొనుక్కుని త్రాగాము. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక నివేదిక ఇంటికి పంపుతారు. అందులో నీళ్ళలో ఏమైనా బాక్టీరియా వున్నాయా, హెవీ మెటల్స్ ఎంతశాతం వున్నాయి మొదలైన సమాచారమంతా పంపుతారు. 


ఇక్కడ ఇంటికి వచ్చే నీళ్ళు కలుషితం కావడం చాలా అరుదు. మన భారతదేశంలో లాగా పొలాల్లో / చేపల చెరువుల్లో పెస్టిసైడ్స్ నీళ్ళను త్రాగునీటి కాలువలు,నదుల్లోకి వదలరు. ప్రజానీకం కూడా బాధ్యత గుర్తెరిగి మసలు కుంటే మంచిది. ప్రభుత్వాలు కూడా మంచిణీటి చెరువులు కాలువల్లోకి ఇలా కలుషిత నీటిని వదిలే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.


మా టౌన్ షిప్/ మున్సిపాలిటీ లో ౨౦౨౦ లో ప్రచురించిన నీటిలో అవశేషాల గణాంకాలు...





8, నవంబర్ 2020, ఆదివారం

1, నవంబర్ 2020, ఆదివారం

మీ స్నేహితులతో వారాంతం పార్టీలు చేసుకొనేటప్పుడు ఈ డ్రింక్ అందులో భాగంగా తప్పనిసరిగా వుండేట్టు చూసుకోండి

 

ఈ సారి మీ స్నేహితులతో వారాంతం పార్టీలు చేసుకొనేటప్పుడు ఈ డ్రింక్ అందులో భాగంగా తప్పనిసరిగా వుండేట్టు చూసుకోండి.ఒకసారి రుచి చూసినవారు దీనికోసం మరీ మరీ మళ్ళీ మళ్ళీ వేడుకుంటారు. అలాగని పోసేయకండి..ఒకటి లేదా రెండు డ్రింక్స్ తో సరిపెట్టండి. ఈ డ్రింక్ మీరు న్యూయార్క్ లాంటి నగరాల్లో తాగాలంటే కనీసం $18-25 డాలర్లవుతుంది. అదే మీరు ఇంట్లో చేసుకుంటే కనీసం యాభై డ్రింక్ లు వంద/నూటాఇరవైడాలర్లలోపు చేసుకోవచ్చు.

ఇది తయారుచేయడానికయ్యే ఖర్చు


1) 100% blue agave tequila - around $55-60

2) Orange liquor (Cointreau) - around $25

3) agave nectar -around $5

4) lemon/ice/salt - around $3

5) Cocktail Shaker Bar Tools Set - around $25


అంటే మీరు సుమారుగా $120 ఖర్చుపెడితే దరిదాపు యాభై డ్రింక్స్ తయారవుతాయి.అంటే ప్రతి వీకెండ్ తాగినా సంవత్సరం రోజులు ఢోకావుండదన్నమాట :)


mixing reatio :

2 oz 100% blue agave tequila 

3/4 oz Orange liquor (Cointreau)

3/4 oz *fresh* squeezed lime juice

Splash agave nectar/syrup (to taste)






3, అక్టోబర్ 2020, శనివారం

2012 ప్రపంచ తెలుగు మహాసభలు -చూపు తిప్పనివ్వని పైంటింగ్స్

 ఈ వీడియో నేను 2012 వ సంవత్సరంలో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైనప్పటిది. చాలా స్టాల్స్ పెట్టారు.అందులో నుంచి పైంటింగ్స్ ను సెలెక్ట్ చేసుకొని ఈ రోజు వీడియో గా రూపొందించి మీ ముందుకొచ్చాను. సౌందర్యారాధకులకు, పల్లెజీవనము ఇష్టపడేవారికి, బొమ్మలు ఎలా వెయ్యాలో నేర్చుకొనేవారికి, అలాగే మన ఇండ్లలో ఎలాంటి ఆయిల్ పైటింగ్స్ వుంటే బాగుంటుందోనని ఒక నిర్ణయానికి రాలేక పోయినవారికి ...ఈ వీడియో తప్పక నచ్చుతుంది. మిగిలిన వీడియో భాగంలో నా వాయిస్ ఓవర్ లేకుండా ఆడియో వున్నది వున్నట్లు పెడుతున్నాను. మహా సభలంటేనే ఎవరిగోల వారిది.ఈ వీడియోలో కూడా ఆడియో అలాగే వుంటుంది. మీకీ ఆడియో ఇబ్బందికరంగా వుంటే క్రింద వ్యాఖ్య రూపంలో నాకు తెలిజేయండి. ఆడియో తీసేసి ఎదో ఒక మ్యూజిక్ క్లిప్ పెడతాను. ఇక ఆలస్యమెందుకు... చూసేయండి.




పుచ్చకాయను ఈ సారి ఇలా సులభంగా కోయడానికి ప్రయత్నించండి.

 


పైన్ యాపిల్ గానీ, పుచ్చకాయ గానీ తెచ్చినప్పుడు సాధారణంగా ఇంట్లో వాటిని కోసేపని మగవారిమీద పడుతుంది. అలా మగవారిబాధను అర్థంచేసుకున్న నేను మీకు పుచ్చకాయను సులభంగా ఓ పదిహేను నిమిషాల్లో చిన్న చిన్న క్యూబ్స్ లాగా ఎలా కోసుకోవచ్చో చెప్పి కాస్త పుణ్యం కట్టుకుందామని ఈ వీడియో :)



30, సెప్టెంబర్ 2020, బుధవారం

ఒంటిమిట్ట కోదండ రామాలయము - మూల విరాట్ తో పాటి ఆనాటి శాసనాలూ ...

 While watching presidential debate I uploaded this Video.No comments on the debate, but dont miss to watch this video :)

Youtube is still processing my 4K Video.If you want to see 4K quality video check back after 5 to 6 hrs.


ఈ రోజు మరొక స్పెషల్ వీడియో తో మీ ముందుకొచ్చానండి. ఇప్పుడు అక్కడ వీడియో తీయడం నిషేదించారో లేదో తెలియదు కానీ 2012 లో కొంత శ్రమకోర్చి ఈ వీడియో తీశాను. 2012  నాటికి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లో అంతర్భాగం కాబట్టి అలాగే భద్రాచలం ఆంధ్రప్రదేశ్ లో వుండబట్టి ఈ గుడికి అంతగా ఆదరణ లభించలేదు. తెలంగాణా విడిపడ్డాక అక్కడక్కడ వార్తలు చదివాను. ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఘనంగా చేస్తున్నారని. ఇప్పుడు మీకు అర్థమైంది కదా! అదే ఈ రోజు మన వీడియో ఒంటిమిట్టలో వెలసిన కోదండ రామస్వామి మీద. ఆ ఆలయ విశాషాల గురించి. వీడియో పూర్తిగా చూడండి. మీకు మూల విగ్రహం తో పాటి ఆనాటి శాసనాలూ కనిపిస్తాయి.




28, సెప్టెంబర్ 2020, సోమవారం

భైరవకోన యాత్రా విశేషాలు

 2006 వ సంవత్సరంలో మా భైరవకోన యాత్రా విశేషాలు. అప్పటికి నాదగ్గరున్న సోనీ వీడియో కెమెరా తో తీసినది. ఈ వీడియో చూస్తే టెక్నాలజీలో అప్పటికి,ఇప్పటికి వీడియో క్వాలిటీలో ఎంతమార్పు వచ్చిందో స్పష్టంగా తెలుస్తుంది.




3, సెప్టెంబర్ 2020, గురువారం

తప్పించుకోలేని పని... కానీ ఇది బుఱ్ఱ గోకుడు పని 🙂


ఏమీ పనిలేక బుఱ్ఱ గోక్కుంటూ మీ వెంట్రుకలు మీరే లెక్కపెట్టుకుంటున్నారా? ఐతే రండి మీలాగే ఈ రోజు నేను నా నెత్తి గీరుకుంటూ ఒక వీడియో చేశాను. వచ్చి ఓ అరగంట పల్లీలు తింటూ చూసేయండి.
గత వారం రోజులుగా మా ఇంటికి అమర్చిన Generac generator, green bulb తో పాటు Orange bulb కూడా వెలుగుతుంది. మెయింటెనెన్స్ వాడికి కాల్ చేస్తే వచ్చి చూసినందుకు నూటా ఇరవై డాలర్లడిగాడు.ఇదేమీ పెద్ద సమస్య కాదు కాబట్టి మనమే చేతికి గ్రీజు రాసుకుంటే పోలేదా అని చిన్న ప్రయత్నం. ఎలాగూ పని చేస్తున్నాను కాబట్టి ఓ సారి వీడియో తీసిపెట్టుకుంటే ఎలా వుంటుందని చిన్న ప్రయత్నం.యూట్యూబ్ లో జనాల వ్లాగ్స్ చూసి చూసి ఇలా తయారయ్యానన్నమాట 🙂. Voice over చెయ్యలేదు. పనిచేసేటప్పుడు ఏదనిపిస్తే అదే నాకు నేను చెప్పుకుంటూ మాట్లాడుకున్నాను 🙂. మధ్యలో బేటరీ కోసం ఒక షాపుకు కూడా వెళ్ళొచ్చాను. దాన్ని కూడా రికార్డ్ చెసిపెట్టుకున్నా 🙂
ఆలస్యమెందుకు..మీరూ నావీడియో చూసేసి ఓసోస్ యూట్యూబ్ వ్లాగర్ అంటే ఇంతేనా అని ఒక వీడియోతో జనాల్ని కొట్టండి 🙂.మన దెబ్బకు యూట్యూబ్ ఘనాపాటి లాంటి వ్లాగర్స్ అందరూ తలుపులు మూసుకోవాల్సిందే 🙂



11, ఆగస్టు 2020, మంగళవారం

మాతోట పూల సందడి....

మా ఇంటి తోట మళ్ళీ పూల సందడి చేస్తుంది. ఈ మధ్యనే మా తోట కొద్దిగా బెండకాయలను బహూకరించింది.ఆ బెండకాయలతో చేసిన సాంబారు అద్భుతంగా వుంది.ఎట్లైనా మనం మన తోటలో పండించుకున్న కూరగూయల రుచే వేరు. ఆ తృప్తి మరిదేనితోనూ రాదు. గోగాకు తాజా ఆకులతో నోరూరిస్తుంది. వచ్చే వారం దాన్ని కోసి ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు వేసుకొని రోటి పచ్చడి చేసుకొని తినాలి.

దోసకాయ, గుమ్మడి,సొరకాయ చెట్లనిండా పూతతో కనులకు విందు చేస్తుంది.కానీ సెప్టంబరు నాటికన్నా వాటి ఫలాలు వస్తాయో రావో అనుమానంగా వుంది. సెప్టెంబరు కు రాకపోతే అక్టోబరు లో చలిమొదలై చెట్లు చచ్చిపోతాయి.

పూలవనం మాత్రం రెండో సారి సందడి చెయ్యడం మొదలుపెట్టింది. మొదటి విడతగా తులిప్, గులాబీ పూలు పలకరించాయి. ఈ సారి గులాబీలతో పాటు జినీయ పూలూ సందడి చేస్తున్నాయి. గులాబీ చెట్లకు మధ్యలో తెగులు వచ్చింది. చచ్చిపోతాయామోనని అనుకున్నాను.కానీ మళ్ళీ తిరుక్కొని పూలు పూస్తున్నాయి. ముద్దబంతి, కారం బంతి పూలు ఏపుగా పెరగనైతే పెరిగాయి కానీ ఒక్క మొగ్గకూడా పెట్టలేదు ఇంతవరకూ :(









గోంగూర, దోసకాయలు ఈరోజుకి పక్వానికొచ్చాయి. దోసకాయాలైతే గుత్తులు గుత్తులు కాస్తున్నాయి. ఈ రెండూ మాకిక్కడ దొరుకుతాయికానీ కాస్త ధర ఎక్కువ. ఇంట్లో మందులు లేకుండా సహజసిద్ధంగా పండిన కూరగాయలతో బయటకొన్నవి సరికాదు కదా :) ఇక రేపు మరిన్ని వెల్లుల్లి వేసి వీటిని పచ్చడి చేసుకోవాలి :)



8, ఆగస్టు 2020, శనివారం

లలితా సహస్రనామ వ్యాఖ్యానం పుర్తై పోవడంతో ఏదో కోల్పోయిన భావన

 నాకు ఎ.బి.యన్ ఛానల్ లో ఏమి నచ్చినా నచ్చకపోయినా గరికిపాటి నరసింహారావు చేసిన నవజీవనవేదం చాలా ఇష్టమైన ప్రోగ్రామ్. దీనిని నేను ఆయన భగవద్గీత చెప్తున్నప్పటినుంచి చూస్తున్నాను. సామాజిక వ్యాఖ్యానం కాబట్టి అన్ని విషయాలనూ ప్రస్తావిస్తూ నవజీవనవేదం రెండువేల భాగాలను పూర్తిచేశారు. ఎప్పుడో తప్పించి రాత్రి తొమ్మిదిగంటలకొచ్చే నవజీవనవేదం సాధ్యమైన ప్రతిరోజూ చూసేవాడిని.నిన్నటితో లలితాసహస్రనామ వ్యాఖ్యానంతోపాటి నవజీవనవేదం కూడా పూర్తైపోయింది.మనసు అల్లకల్లోలంగా వున్నప్పుడు గరికిపాటివారివ్యాఖ్యానం మనసుకు స్వాంతననిచ్చేది. గుడ్డినమ్మకాలను తూర్పారపట్టడంతో పాటి జ్ఞానమార్గానికి పెద్దపీట వేసి  భగవత్భక్తి నిన్ను నువ్వు మంచిమనిషిగా మార్చుకోవడానికి వుపయోగపడాలని కుండబద్దలు కొట్టేవారు. మొదట్లో ఆయన శ్రావ్యంగా పాడే పద్యాలకు ఆకర్షితుడనయ్యాను. క్రమంగా ఆయన వ్యాఖ్యానానికి వ్యసన పరుడనయ్యాను. నిజానినికి నేను దేవుని గుడులకు వెళ్ళటం బహు తక్కువ. ఇక్కడ సంవత్స్రరంలో ఒక్కసారి గుడిని దర్శించుకోవడం కూడా అరుదే! కానీ దైవభక్తిలేదా అంటే లేదని చెప్పలేను. నాకు దేవుని పూజలతో కొలవడంకంటే దేవునిమీద చెప్పిన సాహిత్యం చదవడం ఇష్టం.అదిపాటైనా లేద పద్యమైనా లేద శ్లోకమైనా. సాహిత్యంలో ఏమి చెప్తున్నారో తెలుసుకోవడంలో మక్కువ. ఆ నా ఆసక్తికి గరికిపాటివారి వ్యాఖ్యానాలు ఇతోధికంగా సహాయపడ్డాయి.అలాంటిది ఈ రోజునుంచి ఈ ధారావాహికలైపోయాయంటే ఏదో వెలితి.



1, ఆగస్టు 2020, శనివారం

అమరావతీ, అమరావతీ, అమరావతీ...

దింపుడు కళ్ళంలో అమరావతీ, అమరావతీ, అమరావతీ అని మూడుసార్లు పిలిచి ఆశ చావక ఒక సారి గిచ్చి కూడా చూశాడు చంద్రబాబు. ప్రక్కనున్న జ్యోతీ, ఈనాడు బంధుగణం ఇక లేదులే చంద్రబాబూ అని బాధాతప్త హృదయంతో జీరబోయిన గొంతుతో కళ్ళలో నీళ్ళు కుక్కుకుని చెప్పారు. చంద్రబాబు మాత్రం ఏమవలేదు నేను యమధర్మరాజ కోర్టులో అప్పీల్ చేస్తాను. భూలోకంలో అన్యాయంగా అమరావతీని చంపితే మీరెలా తీసుకెళతారని యుద్ధంచేస్తానని చితికి నిప్పుపెట్టకుండా ఎటో నడిచి వెళ్ళిపోతున్నాడు.అదిచూసిన యమధర్మరాజు బాబూ ఓసారిలా రమ్మని పిలిచి స్వర్గానికి, నరకానికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పగలు ప్రతీకారాలుంటే మీరు గ్రాఫిక్స్ లో స్వర్గానికన్నా మిన్నగా చూపిన రాజధాని దొరికితే అప్పనంగా వదిలెయ్యడామికి నేనేమన్నా పిచ్చిపుల్లయ్య లాగా కనిపిస్తున్నానా అని చక్కా అమరావతిని దున్నపోతుమీద ఎక్కించుకొని ఈలలేసుకుంటూ వెళ్ళిపోయాడు. చంద్రబాబు మాత్రం పోయిన ప్రాణానికి కొన ఊపిరి ఎక్కడోచోట దొరక్కపోద్దా అన్న పట్టుదలతో బజార్లమ్మటి ఏగొందిలో దాగుందోనని వెతుకులాటలో పడ్డాడు...మీ ఇంటికొచ్చి వాకబు చేసి మీరు మాదగ్గరలేదన్నా ఏదీ నన్ను చూడనీ అని ఇంట్లో మూలమూలలు వెతికేదాకా వెళతాడని నాకైతే నమ్మకంలేదు :)

26, జులై 2020, ఆదివారం

నలభీమపాకం తిరగబడింది - సికినీ , పొరాటా తో నా పోరాటం.

నలభీమపాకం తిరగబడింది - సికినీ , పొరాటా తో నా పోరాటం.

ఎదురు చూస్తున్న వారాతం రానేవచ్చింది. ఈమధ్యన ఆదివారం వస్తే ముక్క లేనిది ముద్ద దిగడం లేదు. కాస్ట్కో నుంచి చికెన్ తెచ్చిన రోజు ఇంటావిడ దాన్ని శుభ్రం చేసి మేరినేట్ చేసి డీప్ ఫ్రిజ్ లో పెడుతుంది కాబట్టి ఏరోజు చికెన్ తినాలనిపిస్తే ఆరోజు దాన్ని బైటకు తీసి ఓ రెండుగంటలు గది ఉష్ణోగ్రత దగ్గర వుంచి వండుకోవడమే.

హడావుడిగా పొద్దున లేచి అల్పాహారం చేసి తన బాక్స్ తీసుకొని మా ఆవిడ పనికెళ్ళిపోయింది.కవితకు ఆదివారం పూర్తిగా పనిదినం. ప్రొద్దున పోతే మళ్ళీ పునర్దర్శనం సాయంకాలమే. మామూలప్పుడు వంటగదిలేకి నాకు ప్రవేశంలేదు. ప్రవేశంలేదనే దానికంటే నేను వంటచేస్తే వంటగదిని మళ్ళీ శుభ్రం చేసుకోవడానికి రెండింతల పనిబడుతుందని నన్నావైపు రానివ్వదు. ఆటలో ఆటవిడుపులాగా ఈరోజు కూరచెయ్యడానికి సమయంలేక వెళ్ళి పోయింది కాబట్టి వంటగది నాదే. యాహూ అనుకొని ఒక ఈల వేసి ఏంచెయ్యాలా అనుకొంటూ టీవీ లో యూట్యూబ్ వంటల ఛానళ్ళ వైపు నా దూరదృష్టిని మళ్ళించాను.

అమ్మచేతివంట యూట్యూబ్ ఛానల్ (https://www.youtube.com/watch?v=k1R8Mb3f83Q) లో పొరాటా చెయ్యడం చూశాను. పొరాటా చేసుకొని, చికెన్ గ్రేవీ కర్రీ చేసుకొని ఆ గ్రేవీని పొరాటాపై పోసుకొని నానిన తరువాత తినాలని ప్లాన్ చేసుకొన్నా. పూర్వాశ్రమంలో విశాఖపట్టణం నుంచి మా ఊరు వెళ్ళేటప్పుడు వినుకొండలో ఆగి మిలటరీ హోటల్ లో ఈ రకంగా తినేవాడిని. ఆ టేస్టు గుర్తుకొచ్చి ఆ యూట్యూబ్ ఛానల్ చూసి ముందుగా పొరాటా చెయ్యడం మొదలు పెట్టాను :)

   అక్కడ చెప్పినట్లుగానే ముందుగా మైదా పిండి, అందులోకి కావలసిన మిగిలినవి అన్ని కలిపాను. కానీ కొలతల తేడాతో అమ్మచేతివంట భార్గవి కి పిండి ముద్దలాగా వస్తే నాకు చారు లాగా వచ్చింది :).



ఓ అరగంట మూతపెట్టి ప్రక్కన పెడితే అదే గట్టి పడుతుందిలెమ్మని అనుకుని ఓ అరగంట తరువాత పిండిని ఎనిమిది సమభాగాలుగా విభజించాలని చూస్తే తీగలాగా సాగుతుంది కానీ విడిపడదే :). ఇలా కాదులెమ్మని ఒక్క పొరాటాకు కావలసిన పిండిని ఆ పెద్ద చారులాంటి ముద్దనుంచి తీసుకొని ఒకదాని తరువాత ఒకటి చేద్దామనుకొని మొదలుపెట్టాను. పిండి చపాతీలు చేసే చెక్కమీద వేసి చపాతీకర్రతో రుద్దపోతే అది కర్రకు చుట్టుకొని పోతుంది కానీ గుండ్రంగా పలుచగా రావడంలేదాయె :) . అప్పుడు చూశాను వీడియో లో అలా పలుచగా వత్తేటప్పుడు పొడి పిండి కొద్దిగా ఆ ముద్దపై చల్లి ఆ తరువాత కర్రతో రుద్దడం. ఆహా ఇది కదా ట్రిక్ అనుకొని మొత్తానికి నాకు మించిన వంటగాడు ఈ ప్రపంచంలో వుండబోడని అన్నింటిని వీడియో లో చెప్పినట్టు చేస్తున్నానన్న ఉద్దేశ్యంతో మొదటి పొరాటో పెనంమీద వేసి రెండో దాని ప్రిపరేషన్ లో పడ్డాను. అంటే ఇంకొద్దిగా పిండి ముద్ద తీసుకొని చపాతీ కర్రతో రుద్దడం చేస్తున్నాను.

కొద్దిసేపటికి ఏందబ్బా ఈ వాసన అనుకుంటూ, నాముక్కులకు వాసన బాగానే తెలుస్తుంది అంటే నాకు కరోనా లేనట్టే నని నిర్థారించుకొని పెనం వైపు వెళితే గుప్పున మాడు వాసన :-). హతవిధీ అనుకుంటూ దాన్ని మరోవైపుకు త్రిప్పి కాల్చి ..అహా --పొరాటా రెడీ అనుకొని వీడియో లో చూపినట్టు రెండు చేతులతో దాని అంచులను వత్తబోతే ఎంతకీ పొరలు రావే..అసలు పొరలు రావడానికి అది వంగితే కదా, కడ్డీలాగా గట్టిగా వుంటేను. :)

మొదట పెనం మీద చేసిన పదార్థాన్ని కాస్త ఆసక్తి గా పరిశీలిస్తే అది నాకు "నాన్" లాగా అనిపించింది. మిగిలినవి చేసి చూద్దామని అన్నింటిని ఈ సారి మాడకుండా వళ్ళు దగ్గరపెట్టుకొని చేస్తే పొరాటాల బదులు నాన్ లు తయారయ్యాయి :)



చికెన్ కర్రీ ఇంతకు ముందు చేసిన అనుభవం వుంది కాబట్టి దాన్ని చెడగొట్టకుండా కొంచెం బాగానే చేశాను. మొత్తానికి ఈ రోజు పొరాటాను గ్రేవీ లో నాన పెట్టుకొని తిందామనుకున్న నాకు నాన్ ను నాన పెట్టుకోవలసి వచ్చింది :)




21, జులై 2020, మంగళవారం

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమస్యలు...


ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం పరిశీలన మొదలైంది. ప్రతిపార్లమెంట్ నియోజక వర్గాన్ని జిల్లాగా చేస్తానని ఎన్నికల ప్రచార సందర్భంగా జగన్ వాగ్దానం చేసి వున్నాడు.ప్రతి పార్లమెంట్ నియోజక వర్గం జిల్లా కేంద్రంగా చెయ్యడానికి ఎవరికీ అభ్యంతరాలుండవు కానీ అలా క్రొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రంలో ఏఏ ఊర్లు చేర్చాలో ఆలోచించి సమగ్రనివేదికల తరువాత మాత్రమే జిల్లాల సరిహద్దులను నిర్ణయించడం మంచిది. ఉదాహరణగా మా ఊరు వినుకొండకు దగ్గర్లోని నూజెండ్ల మండలంలో వున్న గాంధీనగరం గ్రామం. మాది గుంటూరు జిల్లా. అసెంబ్లీ నియోజకవర్గం వినుకొండ. కానీ పార్లమెంట్ నియోజకవర్గానికొచ్చేటప్పటికి ప్రకాశం జిల్లాలోని బాపట్ల. ఇప్పుడు బాపట్ల కేంద్రంగా జిల్లా ఏర్పడి మా ఊరు లాంటి ఊర్లు ఎక్కడో దూరంగా వున్న బాపట్ల లో కలపడం అర్థంలేని పని. లోక్ సభ పరిధిలోని ఆ యా మండలాలను గ్రామాలను ఉన్నవి ఉన్నట్లుగా చేరిస్తే వచ్చే రాజకీయ ప్రయోజనమేమిటో నాకు తెలియదు. ఇలా చేయడంవల్ల మా ఊరు దగ్గరలోని నరసరావుపేట జిల్లాకు కాకుండా బాపట్లలో చేరడంతో ప్రజలకు చాలా అసౌకర్యంగా వుంటుంది.

 ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణం మీద ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు వస్తున్నాయి.అది వైసీపీ కి వ్యతిరేక పత్రికైనా ఆ కథనాల్లో నిజంలేకపోలేదు. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చే వార్తలు ఏవి స్వప్రయోజనంకోసం వ్రాసే వార్తలో, ఏవి ప్రభుత్వానికి లేనివి వున్నట్లుగా ఆపాదించే ఏడుపుగొట్టు వార్తలో,ఏవి క్షేత్రస్థాయి ఇబ్బందులతో కూడిన వార్తలో ఇట్టే చెప్పేయవచ్చు :)

ఇలాంటి సద్విమర్శలను అనుకూల వార్తలగా తీసుకొని నిర్ణయం తీసుకుంటే పార్టీకి ప్రభుత్వానికి మంచిపేరొస్తుంది. జగన్ పునరాలోచిస్తాడని కోరుకుంటున్నాను..

ఇలాంటి బ్లాగులో వ్రాసుకున్న వార్తలను ఒక రాష్ట్రముఖ్యమంత్రి పట్టించుకుంటాడా అన్న అనుమానాలు అక్కరలేదు. ఇది చేరవలసిన వారికి చేరి జిల్లాల ఏర్పాట్లలో సానుకూల మార్పులుంటాయని విశ్వాసంతో...

సెలవు.

18, జులై 2020, శనివారం

పూర్వకాలంలో బలిజె వారి ఇళ్ళు ఎలా వుండేవి?

బలిజవాళ్ళ ఇళ్ళ గురించి కొంత సమాచారం మనకు అసలు పద్యాలు హంసవింశతి పుస్తకంలో ఐదవ ఆశ్వాసములో 97,98 పద్యాల్లో కనిపిస్తుంది. నేను వర్ణన రత్నాకరము డౌన్లోడ్ చేసుకొని అందులో పద్యాలను ఇక్కడ ఫోటో గా జతచేస్తున్నాను.

ముందుగా పద్యాలు:

తగణము లానుకంట్లములు తండిగముల్ సలకల్ దడెల్ కుతూ
గణములు చెక్కుగుంపు లడిగంబులు పంబులు త్రాడుగట్లు మం
కెణములు గోతముల్ నగలు గెంటెపు బోరెము లాతనింటిలో
గణన కశక్యమై వెలయుఁగంజసమాన విశాలలోచనా!

గూటపుఁదిరుగుళ్ళు కొలికి దామెన త్రాళ్ళు
కందళి కెముకలి కదురుకోల
మఱగజమును మోడి మెఱుఁగుగాఁ
పిల్ల చుట్టులు నల్లుబిళ్ళ లొల్లె
త్రాళ్ళును బురికొసల్ దబ్బనములు నుసి
గంతలు నట్టెన కట్టె లసిమి
బలుపొన్ను లలరారు బగిస గూటంబులు
పెలుజోగి పట్టెళ్ళు పిల్లపట్టె

డలును బూవుల కోరగిన్నెలు విభూతి
పండ్లు గంగాళమును గుసిగెండ్లి పాల
మడ్డి బరణియు రుద్రాక్ష మాలికా స
మూహములు గల్గియుండుఁ దద్గేహమునను.


కొన్ని పదాలకు నాకు తోచిన,నిఘంటువులో చూచిన,నాకు అన్వయానికి సరిపడ్డ అర్థాలు ఇక్కడ యిస్తున్నాను.
తణగము=ఎద్దుమీఁదనుంచి నీళ్లు తెచ్చెడి తోలుసంచి. వక్కాలి
ఆనుకంట్లము=ఒక విధమగు సంచి
తండిగము=ఒకవిధమైన గోనెసంచి
సలక=చిన్నగోనె
దడి=వెదురు మున్నగువానితో నేర్పఱచిన తడిక
కుతూ గణము=సిద్దె,బుంగవలె తోలుతోకుట్టిన పాత్రల సముదాయము

అడిగము=ఒకవిధమైన గంప, ఎడ్లమీదవేసే కంట్లాలలో భేదం
పంబు=ఎద్దుమీఁద వేసెడు పెద్దసిద్దె
మంకెణము=ఎద్దులు మున్నగువాని మీఁద కొనిపోవు జలతైలాది పాత్రములు కుదురుగా నుండుటకై క్రింద సమర్పఁబడు బెత్తపుబుట్ట
గోతము;=గోనె సంచి
నగ=ఎద్దుమీఁది బరువు
గెంటెపుబోరెములు=జమిలినేఁత వస్త్రముతోఁ జేసిన దూది మొదలగునవి మూటకట్టుట కుపయోగించు సంచి
గణనకు=లెక్కించుటకు
అశక్యమై= సాధ్యము కానివై
వెలయు=ప్రకాశించు,ఒప్పు
కంజెసమాన విశాలలోచనా=తామర, పద్మములంత విశాలమైన నేత్రములు కలదానా.


గూటపుఁదిరుగుళ్ళు=గుంజలకు బొక్కలు పెట్టే సాధనము,స్క్రూ డ్రైవర్
కొలికి దామెన త్రాడు=కొక్కెములకు వేలాడదీసిన పెక్కు పలుపులు గల పెద్ద త్రాడు; త్రాడు
కందళి= టెక్కెము,ధ్వజము

మఱ=తిరుగుడు చీల, కీలు.
గజము మోడి= మూఁడడుగుల పరిమాణము. ముప్పది యాఱంగుళములు విడివిడిగ లేక గొలుసువలె ఒకటితో నొకటి పెనగొన్న వ్రాఁత

అల్లబిళ్ళ వల్లెత్రాడు=చిక్కు పడిపోయిన పసులఁగట్టెడి త్రాళ్ళు
పురికొసల్=పురికొసలు
దబ్బనములు=దబ్బనములు ( గోనె సంచులు కొట్టటానికి వాడుతారు)
నుసిగంతలు=కట్టెలు కాల్చటం ద్వారా వచ్చే నుసికి అడ్డు గంతలు (?)
అట్టెన కట్టె లసిమి= అటకపై కట్టెలు మూటగట్టుకొనే గోనెసంచులు
పలు-పొన్ను=రోకలి మున్నగువాని కొన నమర్చెడు లోహవలయములు
బగిసె గూటము=బగిసె చెట్టు గుంజలు
పట్టె=ద్వారబంధువు నిలువుకమ్మీ,ఇంటికప్పుకు వాడు పొడుగైన కఱ్ఱ
పాలమడ్డి =ధూపద్రవ్య విశేషము, (ఇది సాంబ్రాణి వంటిది)


పూర్వకాలంలో బలిజె వారి వృత్తి ప్రధానంగా వ్యవసాయ సరంజామా,ఇళ్ళ కు అవసరమైన సామాగ్రి మొదలైనవి సమకూర్చే పనిగా కనిపిస్తుంది.అలాగే కవిలెలు తోలడం, ఇల్లు కట్టడం, రైతుల పంటలను దాచుకోవడానికి,అమ్ముకోవడానికి కావాలసిన గోనె సంచులను,వేరే అవసరాలకు కావలసిన రకరకాల సంచులను సమకూర్చే పనికూడా వీరే చేసేవారనుకుంటాను.ఇప్పుడు మనము అన్నింటిని కలిపి సంచి అంటున్నాము కానీ నాడు చూశారుకదా ఎన్ని రకాల సంచులు వాడేవారో. బలిజె కులస్థులకు పైన చెప్పిన సంచులు, త్రాళ్ళు,పనిముట్ల వివరాలు తెలుసుండవచ్చేమోకానీ నేను చాలా పదాలు విని వుండలేదు. పూర్వం చాలా వరకూ పూరిల్లే కాబట్టి ఆ ఇంటికి గుంజలు,ఇంటికప్పుకు వాడే పట్టెలు, దూలాల లాంటివి వీరే సమకూర్చేవారని తెలుస్తుంది.అలాగే ఎద్దుల పోషణ కూడా అవసరార్తం చాలా ఎక్కువగా చేసేవారనుకుంటాను. పైన పద్యాలలో మొదటి పద్యం మొత్తము ఎద్దులపైన వాడే సరంజామా గురించే వర్ణించారు.

వీరికి దైవభక్తికూడా మెండనే విషయం పైన చివరి పద్యంద్వారా మనకు తెలుస్తుంది. ప్రధానంగా శివునికొలిచేవారనుకుంటాను. కారణం బ్రాహ్మణులలో తప్పించి సాధారణ ప్రజాళిలో దక్షిణభారతంలో నాడు శైవమంత ఉడ్రుతిగా వైష్ణవం లేదని చరిత్రద్వారా మనకు తెలుస్తుంది. కోరగిన్నెలు,గుసిగెండ్లి అనగా నేమిటో తెలియదు. విభూతి పండ్లు,గంగాళాలు,భరిణెలు,సాంబ్రాణీ,రుద్రాక్షలు,మాలికలు ప్రధానంగా పూజా విశేషాల్లో కనిపిస్తున్నాయి.

పూర్వకాలంలో రెడ్ల ఇళ్ళు ఎలా వుండేవి?

ఈ మధ్య ఆఫీసుపని వత్తిడితో పుస్తకాలు చదవడం పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడప్పుడూ చేతికి దొరికిన ఏదో పుస్తకంలో పేజీలు అలా ఇలా త్రిప్పడం తప్పించి మనసుపెట్టి ఒక్క పేజీకూడా చదవలేదు. ఓ వారం క్రితం అంతర్జాలంలో వర్ణన రత్నాకరము అనే పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఆ పుస్తకంలో  ఆసక్తికరమైన వర్ణన పద్యాలు చాలా పుస్తకాలనుంచి ఏరికూర్చారు. అలా వున్న వర్ణనల్లో గృహ వర్ణనలు ఒక భాగం. అందులో బ్రాహ్మణ,వైశ్య,శూద్ర,రెడ్డి,బలిజ,తిలఘాతక,వేశ్య,సూతిక,స్త్రీ శూన్య,వంటపూటి,చాకలి,పద్మశాలి వారి గృహవర్ణనలు వున్నాయి.మా వారి ఇళ్ళు అప్పుడెలా వుండేవో అన్నఆసక్తి కొద్దీ తెలుసుకుందామని ఈ క్రింది పద్యాన్ని చదివి అన్వయించుకొని సంబరపడ్డాను. వీలున్నప్పుడల్లా ఒక్కొక్కరి గృహవర్ణన పద్యాలతో ఓ పోస్టు వ్రాస్తాను. ఈ పద్యం శుకసప్తతి పుస్తకంలో రెండవ ఆశ్వాసంలో ౪౦౮ వ పద్యం. నాకర్థమైనంతలో ఇది వ్రాస్తున్నాను.పెద్దలెవరైనా మరింతలోతుగా విశ్లేషణ చెయ్యగలిగితే సంతోషం.



సీ|| అచ్చమై వాకిట రచ్చఱాయిమెఱుంగు 
పంచతిన్నెలు, గొప్ప పారిగోడ
           కంప తెట్టులును, రాకట్టు ముంగిలి,మల్లె
సాలె, దేవర యిఱ చవికె యొకటి,
           కోళ్ళగూండ్లను,గొఱ్ఱు, కుఱుగాడి,యేడికో
లలు కాడి పలుపులు గలుగు నటుక,
           దూడలు, పెనుమూవకోడెలు కుఱు కాడి
గిత్తలీనిన మేటి గిడ్లదొడ్డి

  తే.గీ||   ఇఱుకు మ్రాను, పెరంటిలో నెక్కుబావి,
           మునుగలును, చొప్ప, పెనువామి, జనుము, రుబ్బు
           రోలు, పిడికెలకుచ్చెల, దాలిగుంత
దనరవగతంబు వెలయు నాతని గృహంబు.

ఈ పద్యం చదవగానే మా ఊరు గుర్తుకొచ్చింది. మరచిపోయి మనసుపొరల్లో అట్టడుగున మిణుకు మిణుకు మంటూ గుర్తుండీ గుర్తుండని చాలా పదాలు ఒక్కసారిగా స్ఫురణకు వచ్చాయి. ముందుగా కొన్ని పదాలకు అర్థాలు ( దరిదాపు ప్రతిపదార్థము) వ్రాసి ఆ తరువాత నా వివరణ వ్రాస్తాను.

తిన్నె=అరఁగు
మెఱుంగు=polished stone
తెట్టు=బయట ౘుట్టు నేర్పఱచిన కంప
రాకట్టు=చట్టము
ఇర= కల్లు
చవికె=మండపము
దేవర=ప్రభువు
ఏడికోల=నాఁగటికొయ్య
పలుపులు=పసువుల మెడకు కట్టెడు త్రాడు, తలుగు
పెను= పెద్దది, గొప్పది
మూఁపు=ఏద్దులకు వీపు పైన వుండే భుజశిరస్సు
కుఱు=వృత్తియందు ' కుఱుచ ' శబ్దము యొక్క అంత్య వర్ణము లోపింపఁగా మిగిలిన రూపము. అచ్చులు పరమగునపు ' ఱ ' వర్ణమునకు ' ద్విరుక్తటకారము ' ఆదేశమగును. ఉదా: కుఱుమొల్ల కుట్టుసురు, మొ.) పొట్టి
కుఱు గాఁడిగిత్తలు = కౌమారపు గిత్తలు
గిడ్డిదొడ్డి=పసులకొట్టము
అటుక=వస్తువు లుంచుట కింటిలోపల గోడలమీద అడ్డముగా కొయ్యలు లోనగువానిచే నేర్పఱచిన మంచె.
ఇరుకుమ్రాను=పంగల గుంజ
ఎక్కుబావి=ఎక్కుటకు మెట్లుగల బావి, నడబావి,దిగుడుబావి
మునగ=శిగ్రువు, ఒకానొక చెట్టు
పిడికెలకుచ్చెల=పిడకలు చొప్ప మొదలగువాని ప్రోఁగు, రాశి
దాలిగుంట=నిప్పులేని పొయ్యి
తనరు=పెరుఁగు, వర్ధిల్లు
అవగతము=తెలియఁబడినది, జ్ఞాతము

పై పద్యంలో వర్ణించినట్టు మాఊర్లో రైతుల ఇళ్ళు దరిదాపు పైవిధంగానే వుండేది. కాకపోతే కల్లు/సారాయి అలవాటు ఊరి రైతులకు లేకపోవటంతో ఆ గది మాత్రముండేది కాదు. పూర్వకాలంలో ఇల్లు సాధారణంగా రైలుపెట్టెలమాదిరి గదులు ఒకదానితరువాత ఒకటి వుండేవి. అంటే ముందు పంచ, ఆ తరువాత శయనాగారము, ఆ తరువాత వంట ఇల్లు. రహదారి వైపున ఇంటికి ముందు పందిరి, ఇంటిగోడల నానుకొని నల్లరాయి అరుగు.

మరోవైపు ఇంటిని ఆనుకొని పశువుల కొట్టము,పశువులు బైటికి రాకుండా చుట్టూరా రాళ్ళు లేదా కంపతో ప్రహరీ, ప్రహరీ కి ద్వారంగా పంగల గుంజ.పశువులకొట్టానికి కొద్దిదూరంలో రుబ్బురోలు, ఇంటిగోడకు వారగా గాడిపొయ్యి. కొద్ది దూరంలో దిబ్బ, కల్లము,దానినానుకొని వామిదొడ్డి, ఈమధ్యలో రుబ్బురోలు, దిబ్బ కు కళ్ళానికి మధ్యలో మునగ,బాదం చెట్లు. వ్యవసాయ సామాగ్రి అంతా దాచుకోవడానికి పశువులకొట్టంలో అటక. విశాలమైన ప్రాంగణంలో తిరిగే కోళ్ళు రాత్రులు కోళ్ళగూట్లోనో లేద గంపల క్రిందనో నిద్రపోయేవి. మంచాలకు కావలసిన నులక జనపనారను నానబెట్టి దానిని వడికి మంచానికి అల్లేవాళ్ళు.ఎండాకాలమొస్తే పిల్లలమైన మాకు జనపనార వడికే పనే!

ఇలా వుండేవి నా చిన్నప్పుడు మా ఊర్లో ఇళ్ళు.

గొఱ్ఱు


ఇక పద్య తాత్పర్యానికి వస్తే అప్పటి రెడ్ల ఇల్లు ఎలా వుండేవంటే  పంచలో మెరుగుపెట్టిన రాళ్ళతో అరుగులు, కంపతో వేసిన ప్రహరో గోడ, చట్టాలను చేసే ముంగిలి. మొన్నమొన్నటి వరకూ ఊర్లలో ఊరిపెద్దగా రెడ్లే వుండేవారు. ఊరి జనాలకు ఏమైనా తగాదాలైతే సహజంగా రెండు వర్గాలు వీరి దగ్గరకు వస్తారు. వాళ్ళకు సంధిచేసో లేక ఎవరికి చెప్పవలసింది వారికి చెప్పి రెండు వర్గాలను సంతృప్తి పరచో పంపేవారు.

ఆ తరువాత నిద్రించే గది, కల్లు త్రాగడానికి ఒక గది, కోళ్ళగూళ్ళు,కాడెద్దులు,గొఱ్ఱు,నాగలి( వ్యవసాయ పనిముట్లు ) చిక్కెము, పలుపులు మొదలైనవి పెట్టుకోవడానికి అటక, దూడలు, , చెంగుచెంగున ఎగురుతూ ఆహ్లాదాన్ని కలిగించే గిత్తలను ఈనే పశువుల కొట్టము,పెరట్లో దిగిడుబావి, మునగ చెట్లు,జనుము,రుబ్బురోలు,పిడకలు, గాడిపొయ్యి ఇలాంటి వాటితో రెడ్ల ఇల్లు వర్థిల్లుతున్నది.

12, జులై 2020, ఆదివారం

మళ్ళీ బ్లాగుల్లోకి.....

గత కొన్ని సంవత్సరాలుగా ఫేస్ బుక్ వాడుతున్నా గానీ నాకెందుకో బ్లాగంత సౌలభ్యంగా వుండటంలేదు.ఏదైనా వ్యాసం బొమ్మలతో వివరించాలంటే ఆ బొమ్మలొక చోట వ్యాసం మరోచోట వుండటంతో ఏబొమ్మ ఏవాక్యానికి లింకో సరిగ్గా తెలియడంలేదు.కాకపోతే అక్కడ మన సెలెక్టెడ్ లిస్టులో వాళ్ళకు మాత్రమే కనిపించేటట్టు పోస్టు వ్రాసే సౌలభ్యముంది.బ్లాగర్ పబ్లిక్ డొమైన్ కాబట్టి ఈ సదుపాయం దొరకదు.ఫేస్ బుక్ ఒకటి రెండు వాక్యాలు వ్రాసుకోవడానికి, బొమ్మలు ప్రచురించు కోవడానికి సౌలభ్యంగా వుంటుంది.కాబట్టి ఇక నుంచి పబ్లిక్ గా ఏమైనా పంచుకొనదలిస్తే బ్లాగులోనూ అలా కుదరని వాటిని ఫేస్ బుక్ లోనూ వ్రాద్దామనుకుంటుంన్నాను. వ్యాసాల నిర్వహణ,అరేంజ్మెంట్ లకు నాకు ఫేస్ బుక్ అస్సలు నచ్చలేదు. ఇక్కడైతే చక్కగా మనకు కావలసిన దానిని ఇట్టే పట్టుకొని అవసరమనుకున్నప్పుడు లింక్ లు కూడా ఇచ్చుకోవచ్చు.
 
అన్నట్లు ఇప్పుడు రోజువారీ తెలుగు బ్లాగర్లెందరుండవచ్చు? మాలిక,శోధిని బ్లాగు ఏగ్రిగేటర్ల నిర్వాహకులు ఏమైనా గణాంకాలు పంచుకొనగలరా? పరిస్థితి మరీ అధ్వాన్నంగా వుంటే ఇక్కడ పోస్టువ్రాసి ఫేస్ బుక్ లో లింకు ఇచ్చుకుంటే చదివే వారి సంఖ్య పెరగవచ్చు.

11, జులై 2020, శనివారం

తెలుగు నిఘంటువు (http://telugunighantuvu.org) - డాటా మైనింగ్ ద్వారా మరింత శక్తిమంతం.

తెలుగు నిఘంటువు - డాటా మైనింగ్ ద్వారా మరింత శక్తిమంతం.

దరిదాపు దశాబ్దం క్రిందట  తెలుగు బ్లాగులు దేదీప్యమానంగా వెలుగుతున్న రోజుల్లో నాకొక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను సాటి బ్లాగర్లతో పంచుకొని (http://chiruspandana.blogspot.com/2010/10/blog-post_5784.html ) అంతర్జాలంలో ఒక తెలుగునిఘంటువు వుంటే బాగుంటుందని ఒక సమూహంగా ఏర్పడి పని మొదలు పెట్టాము. కష్టనష్టాలకోర్చి శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువును, సూర్యరాయాంధ్ర నిఘంటు శేషమైన శ్రీహరి నిఘంటువును సమూహ సభ్యుల సహాయసహకారాలతో చాలావరకూ ఓ ఐదు సంవత్సరాలక్రితం పూర్తిచేశాము. ఈ ఐదు సంవత్సరాలలో శ్రీహరి నిఘంటువును కూడా చేర్చాము. ఈ పనిలో ఎవరెవరు సహాయంచేశారు, ఎవరెవరు ఎన్ని పేజీలను టైపు చేశారు మొదలైన సమాచారం ఇక్కడ చూడవచ్చు. (http://telugunighantuvu.org/About.aspx)

ఇంతకీ ఈ వ్యాసం ఇప్పుడెందుకంటే తెలుగునిఘంటువులో(http://telugunighantuvu.org) మనకు ప్రస్తుతం లభ్యమౌతున్న కొన్ని సదుపాయాలను వివరించదలచుకొన్నాను.

సాధారణ శోధన ( General search ) గురించి చివరి వ్యాసంలో వ్రాస్తాను.ప్రస్తుతం తెలుగు నిఘంటువులో లభ్యమౌతున్న బహుళశోధన గురించి వివరిస్తాను. మీరు http://telugunighantuvu.org కు వెళ్ళి బహుళశోధనము అనే లింకు పైన నొక్కినట్లైతే ఈ క్రింది పేజి కనిపిస్తుంది. పేజి మొదటగా లోడ్ ఐనప్పుడు బహుళశోధన controls అన్ని minimize చేయబడి వుంటాయి. దీనికి కారణము మనము సెర్చ్ చేసినప్పుడు వచ్చే పదాలకు చోటు పెద్దదిగా కనిపించాలని అలా చేశాను. ఆ పేజిలోనికి వెళ్ళి "బహుళ శోధన కంట్రోల్స్ కనిపించుటకొఱకు ఇక్కడ నొక్కండి " అన్నదానిపైన క్లిక్ చేస్తే ఈ క్రింది ఎంపికలు కనిపిస్తాయి. ఆ ఎంపికలలో మీకు కావలసిన దానిని నేరుగా తెలుగులో టైపు చేసి పొందవచ్చు. తెలుగు లో ఎలా టైపు చేయ్యాలో తెలియకపోతే ఈ పేజిని చూడండి. (http://telugunighantuvu.org/FontHelp.html). అంటే మీరు "ఓనమాలు" అని టైపు చెయ్యాలంటే "Onamaalu" అని ఇంగ్లీషులో టైపు చేస్తే అది తెలుగులో కనిపిస్తుంది.

ఇప్పుడు ఒక్కొక్క ఎంపిక ఏమి చేస్తుందో చూద్దాము.

౧) అర్థమున్న పదములు చూపుము : మనము ఏదైనా పద్యమో,కవితో లేక వ్యాసమో వ్రాసేటప్పుడు ఏమి వ్రాయాలో తెలుసు కానీ దానికి సరైన పదములు స్ఫురించకపోతే ఈ ఫీచర్ చాలా వుపయోగపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పద్యానికి కానీ కవితకు కానీ సరిపోయే గణాల పదాలు చప్పున పట్టేయవచ్చు. ఇందులో మళ్ళీ రెండు ఎంపికలున్నాయి ౧) కచ్చితమైన పూర్తి అర్థముతో కూడిన పదాలు ౨) పదము అర్థంలో ఎక్కడో చోట మనకు కావాలసిన పదమున్నదేమో చూచుకొనుటకు



మొదటగా బహుళశోధనలో కచ్చితమైన పూర్తి అర్థముతో కూడిన పదాలు ఎలా పొందాలో ఒక ఉదాహరణ ద్వారా చూద్దాము. మీరు "ధ్వని" అనే పదము కు సరిసమానమైన పదాలు ఏమేమి వున్నాయో చూడాలనుకుంటే ఈ క్రింద చూపిన విధంగా టైపు చేసి దానికి ఎదురుగా వున్న శోధన అనే బటన్ నొక్కండి.




చూశారుగదా "ధ్వని" కి సమానార్థాలు ఎన్ని వున్నాయో.... మొత్తం 69 పదాలు "ధ్వని" అనే అర్థాన్ని ఉదాహరణ సహితంగా సూచిస్తున్నాయి. ఇంకే ముంది మీకు నచ్చిన పదాన్ని చూసి వాడుకోవడమే. అన్నట్లు ఎడమప్రక్కన ఆపదాలను ఎవరు టైపు చేశారో కూడా చూడవచ్చు. వారి కష్టం ఊరికే పోలేదు :)

మరో రోజు మరొక ఎంపిక గూర్చి చూద్దాము.


9, మే 2020, శనివారం

నూతన గృహ ప్రాప్తిరస్తు....

2000 సంవత్సరం మొదలుకొని 2005 వరకూ బిజినెస్ వీసా మీద ఐదుసార్లు అమెరికా ప్రయాణాలు చేసినా  2005 వరకూ H1 మీద రావడానికి ధైర్యం సరిపోలేదు. కారణం 2000 వ సంవత్సరం మొదటి సారి లాస్ ఏంజలస్ కు బిజినెస్ వీసా మీద వచ్చినప్పుడు కొంతమంది H1 స్నేహితుల కష్టాలు దగ్గరిగా ఓ ఆరునెలలు చూశాను. అప్పటికే  నాకు పెళ్ళై వుండటం, మొదటి పాప పుట్టి రెండేళ్ళు కూడా పూర్తవని కారణంగా భారతదేశంలో వున్న స్థిరమైన ఉద్యోగాన్ని ఒదులుకొని ఇక్కడికి వచ్చి ఇన్ని కష్టాలు పెళ్ళాం బిడ్డలతో అనుభవించడం అవసరమా అని అనిపించింది. దానితో 2001 లో మా బావమరిది ద్వారా వచ్చిన H1 ని కూడా వదులుకొని ఇండియాలోనే ఉద్యోగం చేసుకుంటు కాలం గడిపాను. కానీ 2005 వచ్చేసరికి నా దృక్పధం కొంతమారింది. ఆ సమయంలో దరిదాపు ఓ సంవత్సరం పాటు రెండు విడతలగా అమెరికా లో బిజినెస్ వీసా మీద గడిపాను. అమెరికా విద్యా విధానం, పిల్లల సంపూర్ణ వ్యక్తిత్వ వికాశం, విశాల దృక్పధాలను అలవరచుకోవడానికి కావలసిన వాతావరణం మొదలైన అంశాలు నన్ను ఆకర్షించినవి. అప్పటికి రెండవ పాప కూడా పుట్టి ఇద్దరూ ప్రాధమిక విద్యాభ్యాస స్థాయిలో వున్నారు. అవును మరి ఇండియాలో మూడేళ్ళు నిండగనే స్కూల్ లో వేస్తాము కదా! వారికి మంచి భవిష్యత్తును అందించాలనే తలంపుతో నాకు తెలిసిన స్నేహితుని ద్వారా ఓ H1 కు అప్లై చేశాను. ఆ తరువాత 2005 నవంబరు నాటికి తిరిగి హైదరాబాదు వెళ్ళిపోయాను. అప్పటికి H1 lottery system లేదు. నాకు తెలిసి first come first serve వుండేది. కానీ వాళ్ళు సమయంలోపు అప్లై చేయకపోవడంతో ఆ సంవత్సరం రాలేదు. తిరిగి 2006 లో అప్లై చేశారు.

అనుకున్నట్లుగానే 2006 చివరిలో నాకు H1 approve ఐనట్టు మైల్ వచ్చింది. H1 papers అన్నీ నాచేతికి రావడానికి 2007 జనవరి మాసమైంది.ఈ మధ్యలో ఓ పెద్ద ప్రహసనం. ఆ సమయంలో నా ఉద్యోగం చెన్నై లో వుండేది. కానీ నా క్లైంట్ అమెరికా లో వుండటంతో నేను సంవత్సరంలో ఓ మూడు నాలుగు సార్లు చెన్నై వెళ్ళి అందరికీ హాయ్ చెప్పి వచ్చి హైదరాబాదు లో ఇంటి నుంచే పని చేస్తుండేవాడిని. అలా చెన్నైకి వెళ్ళి పని ముగించుకొని తిరిగి జనవరి 8 2006 లో చెన్నై నుంచి కాచిగూడ ఎక్స్ ప్రెస్ కు హైదరాబాదు వస్తున్నాను. పగలంతా బాగా పని చేసి వుండటం వల్ల ఆదమరచి నిద్ర పోయాను. కాచిగూడ వస్తుందనగా లేచి చూసుకుంటే నా సర్టిఫికేట్లు/పాస్పోర్ట్లు వున్న బ్రీఫ్ కేసు కనిపించలేదు. హత విధీ !!! :(. ఇలా రైలులో వస్తువులు పోగొట్టుకోవడం ఇది రెండవసారి. మొదటి సారి బూట్లతోనే ఆగిపోయింది. కానీ ఈ సారి నా జీవితానికి అతిముఖ్యమైన డాక్యుమెంట్లు పోయాయి.ఆ తరువాత వాటిని తిరిగి ఎలా సంపాదించుకొన్నానో అదొక పెద్ద చరిత్ర. మరొక సారి ఎప్పుడైనా వ్రాస్తాను.

అలా వచ్చిన H1 ని సద్వినియోగ పరచుకొందామని ఫిబ్రవరి 2007 లో చన్నై కౌన్సిలేట్ లో అపాయింట్మెంట్ తీసుకొన్నాను. మేము ఒకటే నిర్ణయించుకొన్నాము. కుటుంబమంతా కలిసి కౌన్సిలేట్ కు వెళదాము. వీసా ఇస్తే అందరికీ ఒకేసారి ఇస్తాడు. అలా కాకుండా మనలో ఏఒక్కరికి రిజెక్ట్ ఐనా H1 కు మంగళం పాడుదామని అనుకొన్నాము. అనుకున్న విధంగానే అందరమూ ఒకేసారి వీసా కు వెళ్ళడం అందరికీ వీసా ఇవ్వడం జరిగిపోయింది. ఆ రోజు, మరసరోజు అందరికీ చెన్నై, మహాబలిపురం చూపించి తిరుగు ప్రయాణంలో మా గ్రామం గాంధీ నగర్ కు వెళ్ళి హైదరాబాదు వచ్చాము. అలా ఏప్రిల్ నాల్గవ తేదీ 2007 వ సంవత్సరం అమెరికాలో దిగి ఏప్రిల్ రెండవ వారంలో H1 మీద ఉద్యోగం ప్రారంభించాను. ఏప్రిల్ లోనే కుటుంబాన్ని తీసుకురావడానికి వీలుగా ఒక సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ తీసుకొన్నాను. 2007 మే రెండవవారంలో ఫ్యామిలీ వచ్చినాతో చేరింది.

ఇక అక్కడినుంచి అమెరికా స్థిరనివాస ప్రయాణం మొదలు. అలా 2007 వ సంవత్సరం నుంచి 2019 మే నెల వరకూ అద్దె ఇళ్ళలో జీవనం కొనసాగింది. ఆ పన్నెండు సంవత్సరాలలో ఎన్నో ఇళ్ళు మారాము అనుకొనేరు. దశాబ్దకాలం పైగా మేము మారింది రెండే రెండు ఇళ్ళు. మొదటి ఇల్లు అద్దె పెంచాడని కోపంతో మారాము. నాకోపానికి కారణం మేము అప్పటికే అక్కడ నివాసం ఏర్పరచుకొని సంవత్సరకాలంగా వున్నా వాడు క్రొత్తగా అద్దెకు వచ్చే వారికి మాకన్నా తక్కువ అద్దెకు ఇచ్చి మాకేమో అద్దె పెంచాడు. ఓ ఇంతలేసి ఇల్లు ఎక్కడా దొరకదా అని కోపంగా ఇల్లు మారాము. ఇల్లు మారిన తరువాతి ఇంటిలో దశాబ్ద కాలంగా వున్నాము. I still miss the second house.

ఈ పన్నేండళ్ళలో చాలామంది మమ్మల్ని ఇల్లు ఎప్పుడు కొంటారు? నూతన గృహ ప్రాప్తిరస్తు! అని ప్రశ్నించడమూ దీవించడమూ జరిగింది. ఈ మధ్య వచ్చే H1 వాళ్ళైతే ఉద్యోగం రావడమే ఆలస్యం ఇల్లు కొనేస్తున్నారు. వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఏమైనా అంటే అది ఇన్వెస్ట్మెంట్ అంటారు. కానీ నేను H1 మీద, గ్రీన్ కార్డ్ మీద ఆ రిస్క్ చెయ్యదలచుకోలేదు.కారణం ఇక్కడ వుంటామో లేదో తెలియదు.అలాగే పిల్లల స్కూల్స్ కూడా మార్చడం ఇష్టంలేక పోయింది. H1 మీదైతే ఇల్లు కొనడం మరీ రిస్క్ అనిపిస్తుంది నాకు. నా కెందుకో నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా (H1) అనేది తుమ్మితే ఊడే ముక్కెర లా అనిపిస్తుంది. అది నా అభిప్రాయమే కావచ్చు కానీ H1 మీద ఇల్లు కొంటే మానసిక ఒత్తిడి తట్టుకోవడం కష్టమనిపిస్తుంది నాకు. అలా పన్నెండేళ్ళు గడిపిన తరువాత పోయిన సంవత్సరం మే 9 వ తేదీ అమెరికాలో ఒక ఇంటివాడినయ్యాను.

ఎవరి సొంత గృహం వాళ్ళకు అపురూపం. చిన్నదైనా, ఓ మోస్తరుదైనా, పెద్దదైనా,రాజభవనమైనా ఎవరి శక్తికొలది వారు కొనుక్కుంటారు. అది ఎంత చిన్న గృహమైనా ఎవరి ఇల్లు వారికి అపురూపం. అలాగే నా ఇల్లు నాకు అపురూపం :-)





3, మే 2020, ఆదివారం

జీవిత సోపానాలు - 4

ఏంటి ఇక్కడ కూర్చున్నావు.ఇది రిజర్వేషన్ బోగీ.ఇక్కడ కూర్చోకూడదు.ప్రక్క స్టేషన్ లో దిగి జనరల్ బోగీలోకి వెళ్ళమన్నాడు. నేను నా టికెట్ చూపించి ఎక్కడైనా బెర్త్ ఖాళీగా వుంటే ఇవ్వమని అడిగాను. బెర్త్ లు ఖాళీ వుంటే స్టేషన్ లోనే నీకు రిజర్వేషన్ దొరికేదిగా? చూద్దాంలే అని ముందుకెళ్ళిపోయాడు. "హమ్మయ్య ఇక ఇక్కడ కూర్చోడానికి ఇబ్బందిలేదని" అనుకుంటూ మళ్ళీ సూట్కేసు ఆసనంగా చేసుకున్నాను.

అరగంట గడిచింది. టికెట్ కలెక్టర్ మళ్ళీ కనబడ్డాడు. ఇప్పుడు ఇతన్ని వదిలితే నా సంగతి మర్చిపోయి వేరే ఎవరికైనా బెర్త్ ఇచ్చేస్తాడేమోనని భయం. మళ్ళీ కదిలించాను. ఇక్కడే వుండు నేను మళ్ళీ వస్తానని ముందుకు వెళ్ళాడు.నేను ఆత్రుతగా ఎదురుచూస్తుండగానే వచ్చి డెభ్భైఐదు రూపాయిలిమ్మన్నాడు.సార్ అంతలేదని బ్రతిమాలుకుంటే తుదకు అరవై రూపాయలకు బేరం కుదిరింది. ముప్పై రూపాయలు బెర్త్ ఛార్జ్, ముప్పై రూపాయలు ఆమ్యామ్యా. ఇంతకు ముందు రైలు ప్రయాణాల అనుభవంతో ముప్పైరూపాయల దక్షిణ సర్వసాధారణమైన విషయమౌడంతో పెద్దగా బాధనిపించలేదు.

మొత్తానికి బెర్త్ దొరికింది. వెళ్ళి సూట్కేస్ ను సీటుక్రిందపెట్టి చైన్ తో తాళం వేశాను.ఇలా సూట్కేసు కు చైన్ తో సీటుకు కట్టి తాళం వెయ్యడం విశాఖపట్టణంలో బి.టెక్ చేస్తున్న రోజులనుంచి అలవాటు. విశాఖపట్టణంలో ఇంజనీరింగ్ సీటు వచ్చిన తరువాత చేర్పించడానికి మానాన్న కూడా నాతో వచ్చాడు.ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం వర్క్ షాప్ ప్రాక్టికల్స్ కు బూట్లు తప్పని సరి అని సీనియర్స్ చెప్పడంతో మొదటిసారిగా వేక్షన్ బూట్లు జగదాంబ సెంటర్ కు మా నాన్న తో కలిసి వెళ్ళి కొన్నాను. ఆ బూట్లు కొన్నన్ని రోజుల ముచ్చట తీరకుండానే పోయాయి. రేగింగ్ పూర్తైన తరువాత మొదటి సంవత్సర విద్యార్ధులమందరము ఎవరిళ్ళకు వాళ్ళు బయలు దేరాము. అప్పుడు మేము ప్రకాశం జిల్లా వెలిగండ్ల లో వుండే వారిమి.అందుకని నేను బొకారో లో ఒంగోలు కు వస్తున్నాను. బొకారో వైజాగ్ లో సరైన సమయానికొస్తే సాయంత్రం నాలుగు/ఐదు గంటలకు బయలుదేరి ఒంగోలు తెల్లవారి ఝామున చేరుతుంది. అప్పట్లో ఆంధ్రాయూనివర్సిటీ లో చదివే విద్యార్ధులకు సెలవులకు ఇళ్ళకు వెళ్ళటానికి యూనివర్సిటీ వాళ్ళు రైల్వేపాసులు ఇచ్చేవారు. ఆ పాసు తీసుకొని రైల్వేష్టేషను కు వచ్చి రిజర్వేషన్ చేపించుకుంటే చార్జీలో  యాభై శాతం తగ్గించేవారు.ఈ ప్రయాణం ముందుగానే నిర్ణయించినదైనడవటంతో స్నేహితులందరము మా డిపార్ట్మెంట్ కు వెళ్ళి పాస్ తీసుకొని ముందుగానే ఎవరి రైలు కు వాళ్ళం రిజర్వేషన్ చేపించుకున్నాము. ఇంజనీరు గా ఊరికి మొదటి సారి ప్రయాణం.అదో రకమైన ఆత్మస్థైర్యంతో కూడిన ధైర్యం. బూట్లు వేసుకొని ఊర్లో చూపించాలన్న బలమైన కోరిక. ఇలా సాగుతున్న నా ఆలోచనలకు ఆ ప్రయాణంలోనే పెద్ద గండి పడింది. రైలెక్కి కూర్చొని ప్రక్కన వాళ్ళతో కబుర్లలో పడి సూట్కేసుకు తాళం వేసి కాలికున్న బూట్లు విప్పి పై బెర్త్ కావడంతో రాజమండ్రి దాటిన తరువాత నిద్రపోయాను. ఒంగోలు వస్తుందనగా మేల్కొని బాత్రూమ్ కు వెళదామని చూస్తే బూట్లు లేవు.గుండెల్లో రాయి పడింది.వేరే జత చెప్పులు కూడా లేవు.ఒక్కసారిగా ఆ దొంగ మీద ఎక్కడిలేని కోపం. దరిద్రుడా మట్టికొట్టుకు పోతావురా అని తిట్టుకున్నాను. ఆతిట్టు ఆ దొంగ వినుంటే "నేను క్రొత్తగా మట్టికొట్టుకు పోవడానికేముందిలే.బ్రతకడానికి వేరే మార్గంలేక ఈ వృత్తినెంచుకున్నానని ఓ నవ్వు నవ్వుకొనేవాడు." ఒంగూలు లో రైల్ దిగిన తరువాత చెప్పులు లేకుండానే బస్టాండు కు రిక్షాలో వచ్చాను. సమయం తెల్లవారు ఝామున నాలుగై వుంటుందేమో. వస్తూ ఆశ చావక దారిలో ఎక్కడైనా చెప్పులు షాపులుంటాయేమోనని చూశాను.ప్చ్! ఆ సమయంలో షాపులు ఎవరు తీస్తారు? నేను ఒంగోలు నుంచి కనిగిరి వెళ్ళి అక్కడ వేరే బస్సు మారి వెలిగండ్ల వెళ్ళాలి. ఈ లోపు చెప్పుల షాపులు కనిగిరిలోనైనా తెరవకపోతారానన్న ఆశ. ఐదున్నరకు ఒంగోలు లో బస్సెక్కి కనిగిరికి ఎనిమిదిన్నరకు చేరాను.దిగిన వెంటనే మా ఊరికి బస్సు నిలబడి వున్నది.మరో ఆలోచన లేకుండా ఆబస్సెక్కి ఊరికి చేరాను. ఇలా బూట్లు వేసుకొని షో చేద్దామన్న నాకు అసలు కాలికి చెప్పులే లేకుండా ఇల్లు చేరాల్సిన పరిస్థితి వచ్చింది :) అలా బూట్లు పోయిన తరువాత మళ్ళీ సాఫ్ట్ వేర్ లోకి వచ్చేతంతవరకూ వాటవసరం పడలేదు. ఆరోజుల నుంచే నాకు సూట్కేసుకు చైన్ తో తాళం వెయ్యడం అలవాటు.

ఉదయం ఆరుగంటలే కావడంతో కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో జనాలందరూ నిద్రిస్తున్నారు. నా బెర్త్ పైన కావడంతో పైకెక్కి నిద్రపోయి పదకొండు గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకొని వచ్చి కూర్చున్నాను. ఎదురుగా ఒక తెలుగు కుటుంబం. భార్యాభర్తలు వాళ్ళమ్మాయితో కలిసి ప్రయాణిస్తున్నారు.అమ్మాయి M.Sc Chemistry చదువుతుందట. రాజమండ్రి వాళ్ళు.పూనా లో ఉద్యోగం కావడంతో అక్కడే స్థిరపడ్డారు.మరో సమయంలో ఐతే అమ్మాయిమీద మనసు పారేసుకునేవాడినే కానీ అప్పటికే మరొకర్ని చేసుకుందామన్న నిర్ణయం మనసులో వుండటంతో గుండె లయ తప్పకుండా దాని స్థానంలో అది పదిలంగా వున్నది :).

సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్యలో వారి ఆతిధ్యాన్ని స్వీకరిస్తూ గడుపుతున్నాను. ఎందుకో ఆ అమ్మాయి పాదాలవైపు చూశాను. తెల్లగా ఎక్కడా ఒక్క మట్టిమరకైనా లేకుండా మెరుస్తున్నాయి. నా పాదాలవైపు చూసుకున్నాను.ఒక్కసారిగా ఆత్మన్యూనత ఆవహించింది. అప్పటికి నాలుగునెలలపైన ఊర్లో ఉండటంతో, చేలల్లో వరికి దమ్ముచేసే ప్రయత్నాల్లో ఆ బురదలో తిరిగి నా పాదాలపై అక్కడక్కడ మచ్చలు ఏర్పడ్డాయి. నేను వేసుకున్న చెప్పులు వాటిని ఏమాత్రం దాచలేక మధ్యాహ్నపు వెలుగులో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.పూణె కు వెళ్ళగానే ఈ మచ్చలులేకుండా చేసుకోవాలని దృఢసంకల్పం చేసు కున్నాను :)

అందరమూ కొద్ది సేపు అంత్యాక్షరి ఆడుకున్నాము. ఆ రోజుల్లో అంత్యాక్షరి ఒక ట్రెండ్ సెట్టర్. కాలేజీల్లో వీటికి పోటీలు కూడా నిర్వహిస్తుండేవారు. మా టీం ఈ పోటీలో, డమ్ షరాడ్స్ లో ఎప్పుడూ మొదటి బహుమతిని గెలుచుకునేది. దాని వల్ల చాలా పాటలు నాలుకపై ఆడుతుండేవి. గాత్రం కూడా వినటానికి అభ్యంతరం లేకుండా వుండేది. నా పాటలు వారికి నచ్చాయో ఏమో ఒక పాట పాడమని అడిగారు.
అప్పట్లో నాకిష్టమైన పాట, అప్పటికే చాలా సార్లు పాడిన పాట ఎంచుకున్నాను.అల్లుడుగారు సినిమా లోది.

ముద్దబంతి నవ్వులో మూగబాసలు
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలూ
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
చదువుకునే మనసుంటే ఓ కోయిలా
చదువుకునే మనసుంటే ఓ కోయిలా
మధుమాసమే అవుతుంది అన్నివేళలా
ముద్దబంతి నవ్వులో మూగబాసలు...

అందరూ బాగుందని మెచ్చుకున్నారు. ఆ మెప్పుదల మనసుకు సంతృప్తినిచ్చింది.

పులిహోర,పెరుగన్నం తింటూ గడిపాము.పూనా దరిదాపులకు రాగానే నేను దాచుకున్న అడ్రస్ ను చూపించి రైల్వేస్టేషన్ నుంచి ఎలా వెళ్ళాలి అని ఆ తెలుగు కుటుంబాన్ని అడిగాను. నువ్వేమీ ఇబ్బంది పడకు మేము ఆటో ను మాట్లాడి పంపిస్తామని చెప్పి, మేము కూడా నీవుండే హాష్టల్ కు దగ్గరలోనే వుంటామని వీలు చూసుకుని రమ్మని అడ్రస్ ఇచ్చారు.

పూణె రైల్వే స్టేషన్ లో దిగిన తరువాత వారి సహాయంతో ఆటో లో కోథపేట్ కు నా స్నేహితులిచ్చిన అడ్రసు కు చేరుకున్నాను....

2, మే 2020, శనివారం

జీవిత సోపానాలు - 3

ముఖ్యమైన పుస్తకాలు, వేసుకునే బట్టలు కలిపి ఒక మధ్యస్త వి.ఐ.పి సూట్కేసు నిండుకుంది. ఆరోజుల్లో ఇప్పటిలా అలమరాలనిండా బట్టలు నింపుకొనే సంస్కృతి మా ఇంట్లో లేదు. సంస్కృతి లేదు అనడం కంటే కొనే స్థోమత లేదు అనడం సబబుగా వుంటుంది.మన ఆర్ధిక స్థోమతలను బట్టి సంస్కృతి,సంప్రదాయాలు కూడా మారిపోతుంటాయి.నా బట్టలన్నీ కలుపుకుంటే ఓ ఆరేడు జతలుండేవేమో! ఊర్లోకి బస్సు లేదు కాబట్టి ఓ రెండు కిలోమీటర్ల దూరంలో నున్న రోడ్డు మీదకు వెళ్ళి బస్సు ఎక్కాల్సిందే. ప్రతి రెండు గంటలకు దర్శి నుంచి వినుకొండ పోయే బస్సులుంటాయి.బస్సు వచ్చే ఓ పదినిమిషాల ముందు టిక్కీ వ్యాన్ లు వస్తుంటాయి. బస్సుకోసం వేచి చూస్తున్న జనాలంతా ఈ బస్సెప్పుడొస్తుందోలే అనుకుంటూ ఆ చిన్న వ్యాన్ లో క్రిక్కిరిసి పైన,క్రింద కూర్చొని ప్రయాణిస్తుంటారు.

పుస్తకాలు పెట్టడంతో సూట్కేసు బరువుగా వుంది. మా నాన్న సైకిల్ మీద లగేజీ తీసుకొని నేనూ రోడ్డు దాకా వస్తాననడంతో మా అమ్మను శకునం కోసం ఎదురు రమ్మని, మాఅమ్మకు వీడ్కోలు పలికి నేనూ మా నాన్న సైకిల్ ని నడిపించుకుంటూ, దానితో మేమూ నడుస్తూ మాట్లాడుకుంటూ ఓ అరగంటలో రోడ్డుకు చేరాము. ముందుగా టిక్కీ వచ్చింది.ఎప్పటిలాగే జనాలు క్రిందా మీదా క్రిక్కిరిసి వున్నారు.అందులోనే కాస్త సర్దుకోండమ్మా అంటూ మరో నలుగురు ఎక్కారు. నా దగ్గర లగేజీ వుండటంతో బస్సులో ఎక్కుదామని అందులో ఎక్కే ప్రయత్నం చెయ్యలేదు.

ఓ పదిహేను నిమిషాల నిరీక్షణ తరువాత బస్సు ఖాళీ గా వచ్చింది. మా నాన్నకు వస్తానని చెప్పాను. చేరిన వెంటనే ఉత్తరం వ్రాయమన్నాడు. సరేనని బస్సు ఎక్కి కూర్చున్నాను. కండక్టర్ టికెట్ టికెట్ అని అరవడం కూడా దండగనుకున్నాడో ఏమో వచ్చి సీటు ప్రక్కన నిలబడ్డాడు. వినుకొండ కు ఒక టికెట్ తీసుకుందామని తలెత్తి చూస్తే కండక్టర్ మా హైస్కూల్ లో నాకు రెండేళ్ళ సీనియర్. కాసేపు కబుర్లయ్యాక ఎక్కడికెళుతున్నావు సూట్కేస్ తో అని అడిగాడు. ఉద్యోగ ప్రయత్నానికై పూనా వెళుతున్నానని విషయం వివరించాను. అతని కళ్ళలో ఓ విజయగర్వం. ప్రభుత్వ ఉద్యోగమిచ్చిన సంతృప్తి ఆ కళ్ళలో కనిపించింది. ఓ క్షణం నేను ఇంజనీరింగ్ చేయకుండా ఇలా ఇంటర్మీడియట్ తో చదువును ఆపి ఉద్యోగాలకు ప్రయత్నిస్తే జీవితం వేరే విధంగా వుండేదేమోననిపించింది. అది ఆనాటి నా మనఃస్థితి.

బస్సు నూజెండ్లలో ఆగింది.కొద్ది మంది జనాలు ఎక్కారు.కండక్టర్ వారికి టికెట్స్ ఇవ్వడానికి వెళ్ళిపోయాడు. సీట్లో ఒంటరిగా వున్న నాకు ఒక్కసారి నిస్సత్తువ ఆవరించింది తల్లిదండ్రులను, చుట్టాలను, ఊరి జనాలను వదిలి దూరంగా వెళుతున్నందుకు.కానీ నాకు ఉద్యోగాలు వుండేది దూరప్రాంతాలలోనే కదా అని సర్దిచెప్పుకున్నాను.ఎన్ని కష్టాలెదురైనా ఈ సారి ఉద్యోగం దొరకనది ఇంటికి వెళ్ళకూడదనుకున్నాను.ఆలోచనలు కలగా పులగంగా మారిపోతున్నాయి.ఓ క్షణం గట్టినిర్ణయం తీసుకున్నట్లే వుంటుంది. మరోక్షణం తెలియని భవిష్యత్తు పై అనిశ్చితి. ఈ ఆలోచనల మధ్య బస్సు వినుకొండను చేరింది.

సాధారణంగా ఈ పల్లె బస్సులు అప్పట్లో ప్రతి ట్రిప్ కు బస్ డిపో కు వెళ్ళేవి కావు.బస్ డిపోకు వెళ్ళకపోతే విజయవాడ వెళ్ళటానికి బస్సులో సీటు దొరుకుతుందో లేదోనన్న సందిగ్ధం. నాలుగైదు గంటలు నిలబడి విజయవాడ వెళ్ళడం కంటే ఓ ఇరవైనిమిషాలు కష్టపడితే డిపోకు చేరుకోవచ్చని కాలికి పని చెప్పాను. వినుకొండ నుంచి విజయవాడకు బస్సుల ఫ్రీక్వెన్సీ బాగానే వుండేది. అటు పడమటి నుంచి విజయవాడకు వెళ్ళే బస్సులన్నీ వినుకొండ ద్వారానే వెళ్ళేవి. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో విజయవాడ బస్సు ఎక్కి కూర్చున్నాను. టికెట్ తీసుకొన్న తరువాత అలసిపోయున్నానేమో బాగా నిద్రపట్టింది. మెలుకువ వచ్చాక చూస్తే చుట్టూ చీకటి.బస్సు ఎక్కడుందో అర్థంకాలేదు.ప్రక్కన సీటులో కూర్చొన్నతను కూడా నిద్రలో జోగుతున్నాడు. కాసేపటికి ఏదో ఊరు వచ్చింది. అపట్లో షాపుల ముందు సైన్ బోర్డులు ఇప్పటిలా షాపు పేరు మాత్రమే వ్రాసే అలవాటులేదు. షాపు ముందు బోర్డు వుందంటే ఆ షాపు పేరు, ప్రక్కన ప్రొప్రైటర్ పేరు, క్రింద ఊరి పేరు వ్రాసే అలవాటు. అలా ఓ శాఖాహార హోటల్ సైన్ బోర్డు చూసి మంగళగిరి వచ్చిందని తెలుసుకున్నాను. మరోగంట లోపు బస్సు విజయవాడ చేరింది.

బస్ డిపో నుంచి రైల్వేస్టేషన్ కు ఓ రిక్షా ఐదురూపాయలకు మాట్లాడుకొని విజయవాడ రైల్వేస్టేషన్ చేరాను. కోణార్క్ ఎక్స్ ప్రెస్ కు ఇంకా చాలా సమయం వుంది. అర్థరాత్రి దాటిన తరువాత కానీ రాదది. సమయం పదకొండు దాటింది. మరో నాలుగు గంటలు రైల్వే స్టేషన్ లోనే గడపాలి. టికెట్ కౌంటర్ కు వెళ్ళాను. ఎప్పటిలానే రిజర్వేషన్ దొరకలేదు.ఐనా సరే టికెట్ కలెక్టర్ ను మేనేజ్ చెయ్యగలనని మొండి ధైర్యం. సూట్కేస్ తో ప్లాట్ ఫాం మీదకు చేరుకొని చుట్టూరూ కలయచూశాను. అప్పటిదాకా జనసందోహ కోలాహలంతో మర్మోగిపోయిన ప్లాట్ ఫాం జనాలు కుర్చీలమీద, కుర్చీలు దొరకని వారు అక్కడే క్రొంద పడుకొని నిద్రకు ఉపక్రమిస్తున్నారు.

నేను బస్సులో ఓ కునుకు తీయడం వల్ల నిద్రాదేవి ఇప్పటిలో నా చెంత చేరేటట్టు కనిపించడంలేదు. విజయా డైరీ పార్లర్ కు వెళ్ళి రెండు మజ్జిగ పేకెట్లు కొనుక్కొని త్రాగాను.ఒక్కొక్కటి రెండు రూపాయలు. నాకు విజయా డైరీలో అమ్మే మజ్జిగ చాలా ఇష్టం. చిక్కగా కారం కారంగా అదో అద్భుతమైన రుచి. భోజనానికి సమయం కాకపోవటంతో ప్లాట్ ఫాం మీద అమ్మే బ్రెడ్/ఆమ్లేట్ ఐదురూపాయలకు తిన్నాను.ఆత్మారాముడు శాంతించాడు. అప్పట్లో రైలు ప్రయాణం చేస్తుంటే వారపత్రికలు కొని చదవటం అలవాటు. ఆ అలవాటు ప్రకారంగా ఆంధ్రభూమి,స్వాతి వార పత్రికలను కొని పేజీలన్నింటిని ఓ సారి ముందునుంచి వెనక్కు త్రిప్పి కథలు రైలెక్కాక చదవొచ్చులెమ్మని అట్టిపెట్టుకున్నాను.

అర్థరాత్రెప్పుడో మాగున్నుగా నిద్రపట్టింది. రైలు తప్పిపోతుందన్న భయమో ఎమో కానీ మధ్య మధ్యలో రైల్వే అనౌన్స్మెంట్స్  స్పష్టంగా వినిపిస్తున్నాయి. అలా జోగుతూ సమయం గడుస్తుండగానే కోణార్క్ రైలు వచ్చి ఆగింది. ధైర్యంచేసి రిజర్వేషన్ బోగీలో ఎక్కి సూట్కేసు ను క్రింద పెట్టి దానిమీద నేను కూర్చున్నాను. తెలతెలవారుతుండగా టికెట్ కలెక్టర్ వచ్చాడు.......

20, ఏప్రిల్ 2020, సోమవారం

జీవిత సోపానాలు -- 2

పెళ్ళి సంబంధాలు చూస్తున్నారంటే గుండె లయతప్పడం తప్పని సరి. అది అమ్మాయైనా అబ్బాయైనా!ఆ రోజుల్లో ఇప్పట్లా ఫోను సౌకర్యాలు అరచేతిలో వుండేవి కావు. ఫోను చెయ్యాలంటే ఏ ఫోను బూతు కో వెళ్ళి చెయ్యాలి.అవికూడా ఓ మోస్తరు పట్టణాలలో మాత్రమే వుండేవి.ఫోను చార్జీలు మోత మోగేవి. ఇక ఇంటర్నెట్ సంగతి సరేసరి. అదంటూ ఒకటి భవిష్యత్తును మార్చేస్తుందని ఊహకు కూడా అందని రోజులు. ఇ-మైల్ అన్న పదమొకటి ఉత్తర ప్రత్యుత్తరాలను అంతమొందిస్తుందని ఊహించలేని రోజులు.ఇక వాట్సప్, ఫేస్బుక్,ట్విట్టర్ మొదలైనవి సోదిలో కూడా లేని రోజులు. దానా దీనా చెప్పొచ్చేదేమిటంటే ఇంత సమాచార విప్లవం లేకపోవడంతో ఆరోజుల్లో అమ్మాయిలతో మాట్లాడాలంటేనే ఓ రకమైన భయం. అందుచేత మనసుల్లో అమ్మాయిలకు అబ్బాయిలపట్ల, అలాగే అబ్బాయిలకు అమ్మాయిలపట్ల చెప్పలేని అనుభూతులను గుండె గూటిలో భద్రపరచుకొనే రోజులు.

ఇంతకీ మా ఇంటికి పెళ్ళి సంబధమై వచ్చినాయనకు ఏమి చెప్పాలో అనే సందిగ్ధం లో పడ్డాము. వస్తామని చెప్పాలా లేక రామని చెప్పాలా? ఆ యనను నిరాశ పరచడం ఇష్టం లేక సరే చూద్దాంలే అని చెప్పాము. సాయంకాలంగా ఆయన నరసరావుపేటకు తిరుగు ప్రయాణమై వెళ్ళాడు.

ఇంటిలో కొద్ది రోజులు సంతోషంగా గడచిపోయాయి.హరిహర్ ఉద్యోగం వస్తుందా లేదా అన్న మీమాంశ రోజులు  గడిచే కొద్ది ఎక్కువైంది. ఉద్యోగంలేకుండా ఇంటి పట్టునే ఎన్నాళ్ళుండాలి? ఈ ఆలోచనలతో నా సహాధ్యాయి రంగనాధ్ కు ఒక ఉత్తరం వ్రాశాను. రంగనాధ్ వాళ్ళది తూర్పుగోదావరి జిల్లా చింతలపల్లి.ఈ గ్రామం పాలకొల్లు కి ఓ ఇరవై ఇరవైఐదు కిలోమీటర్ల దూరంలో వుంటుంది.మేము M.Tech చేసేటప్పుడు తూర్పుగోదావరి అందాలు చూడాలన్న కోరికతో రంగనాధ్ పిలుపు మేరకు ఖరగ్ పూర్ నుంచి ఇంటికి వస్తూ వాళ్ళూరుకి వెళ్ళాము. నేను, సుధాకర రెడ్డి, రంగనాధ్ ముగ్గురము రాజమండ్రిలో దిగి ఓ కారు తీసుకొని చింతలపల్లి చేరాము.అదే నేను మొదటసారి తూర్పుగోదావరి వారి ఆతిధ్యాన్ని, కోనసీమ ప్రకృతి అందాలను చూడడం. అద్బుతమైన ఙ్నాపకాలు. పచ్చని పంటపొలాలు, ఎటువైపు చూసినా ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్లు. మధ్య మధ్యలో అరటి తోటలు, కల్మషం లేని మనసులు, ప్రత్యేకమైన యాస భాషలతో ఆకట్టుకొనే ప్రజానీకం.అక్కడ వున్న మూడురోజులూ మూడు నిమిషాలగా గడిచిపోయింది.రంగనాధ్ కుటుంబ సభ్యులు కూడా బాగా పరిచయమయ్యారు.

ఉత్తరం వ్రాసిన తరువాత ప్రత్యుత్తరానికై ఎదురుచూస్తున్నాను. ఓ మూడు వారాల తరువాత రంగనాధ్ నుంచి ఉత్తరం వచ్చింది. నేను వ్రాసిన ఉత్తరం వాళ్ళనాన్నకు చేరిందని, దానిని ఆయన పూనా లో వున్న రంగనాధ్ కు పంపాడని విషయం అర్థమైంది. ఉత్తరం చదవడం పూరైన తరువాత మరికొన్ని విషయాలు గ్రహించాను. సుధాకర రెడ్డి, రంగనాధ్ ఇద్దరూ పూనా లో ఓ షుగర్ కన్సల్టెన్సీ లో ఉద్యోగాలుచేస్తున్నారు. అప్పటికి అక్కడకు వెళ్ళి నెలనాళ్ళ పైనే ఐంది. మొదట సుధాకర రెడ్డి పూనా కు వెళ్ళి అక్కడ ఉద్యోగం సంపాదించిన పిమ్మట రంగనాధ్ ను రిఫర్ చేశాడు. అలా వాళ్ళిద్దరూ ఏప్రిల్ మాసంలో పూనాకు వెళ్ళారు. ఇద్దరూ కంపెనీ కి దగ్గరలో కొత్తపేట్ లో ఓ హాష్టల్ లో వుంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. రంగనాధ్ వారుండే అడ్రస్ ఇస్తూ పూనాకు రమ్మని, ఇక్కడికి వస్తే ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుందని ఉత్తరాన్ని ముగించాడు.

 ఉత్తరాన్ని చదివిన తరువాత ఇక ఇంటివద్ద  ఉండలేకపోయాను. పూనా వెళ్ళడానికి సిద్ధమైనాను. నాన్న దగ్గర కొంత డబ్బు తీసుకొని , బట్టలు, పుస్తకాలు సర్దుకొని, ఉత్తరంలో వున్న చిరునామా ని భధ్రంగా దాచుకొని ఓ శుభముహూర్తాన ఊరినుంచి పూనా కు పయనమయ్యాను.

19, ఏప్రిల్ 2020, ఆదివారం

కరోనా టైమ్స్ సమయ పాలన ....జీవిత సోపానాలు -- ౧

జీవిత సోపానాలు -- ౧

కరోనా సమయంతో చేతిలో కావలసినంత సమయం.దీనిని ఏదో ఒకరకంగా సద్వినియోగం చేసుకుందామని ఈ సీరీస్ మొదలు పెట్టాను.

జీవితం ఒడ్డించిన విస్తరి కాదు.అనుక్షణం ఈ ప్రపంచంలో జీవించడానికి పోరాడవలసిందే. 1995 లో M.Tech చేసేటప్పుడు మా కెమికల్ లేబరేటరీకి న్యూఢిల్లీ నుంచి ఇష్.కె.ఘాకర్ అనే ఒక చిన్నపాటి ఇండస్ట్రయలిస్ట్ వచ్చాడు. లేబొరెటరీ లో అతనికి నేను సహాయపడుతూ ఏదైనా ఉద్యోగమొచ్చే మార్గముంటే చూడమని అభ్యర్థించాను. మాదురదృష్టం కొద్దీ ఆ సంవత్సరం మా కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట మెంట్ లో M.Tech చేస్తున్న పదిహేను మందికి గానూ ముగ్గురికే క్యాంపస్ ఇంటర్వూలలో ఉద్యోగాలొచ్చాయి. అలాగే బొంబాయి బార్క్ లో ఉద్యోగ ప్రకటన కు అప్లికేషన్ పెట్టుకొని వుండటంతో రిటన్ టెస్టు కు కాల్ వచ్చింది. బొంబాయి వెళ్ళి పరీక్ష రాస్తే రిటన్ టెస్టు పాసయ్యా కానీ ఇంటర్వూ లో పోయింది. ఇన్ని సమస్యల మధ్య ఉద్యోగాన్ని సాధించాలంటే ఎవరిదో ఒకరి రెకమండేషన్ తప్పని సరేమో అన్న అభిప్రాయం నాలో బలంగా వేళ్ళూనుకుంది. అందుకనే ఇష్.కె.ఘాకర్ గారిని అభ్యర్థించాను. ఆయన తన విజిటింగ్ కార్డు ఇచ్చి తన స్నేహితులు గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లో వున్నారని మాస్టర్స్ పూర్తైన తరువాత తనకొకసారి తెలియచెయ్యమని చెప్పాడు. ఇంకేముంది ఉద్యోగమొచ్చినట్టే అన్న విశ్వాసంతో డిగ్రీ పూర్తిచేసుకొని ఇంటి దారి పట్టాను.

ఇంటికి మార్చ్ చివరివారంలో వస్తే ఏప్రిల్ లో పెళ్ళి సంబంధాలు రావడం మొదలయ్యాయి. ఈ లోపు పనిలో పనిగా ఓ ఉత్తరాన్ని ఇష్.కె.ఘాకర్ గారికి వ్రాశాను. అక్కడినుంచి ఏ ప్రత్యుత్తరంలేదు. ఓ నెలనాళ్ళు ఆత్రంగా ఎదురుచూశాను. ఏప్రిల్ చివరిలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ హరిహర్ ( కర్ణాటక ) వారి వద్దనుంచి ఇంటర్వూకి రమ్మని పిలుపొచ్చింది. ఆరాత్రి వెన్నెలలో విహరించాను. జీవితమింక ఓ దారికొచ్చినట్లేనని కలలు కన్నాను. నేనూ నాకు కాబోయే భార్య( అప్పటికెవరో తెలియదు కానీ పెళ్ళైతే చేసుకోవాలన్న నిశ్చయానికొచ్చాను) హరిహర్ లో ఎలా గడపబోతున్నామో రంగులకల కళ్ళముందు ప్రత్యక్షమైంది. రాత్రికి రేడియో లో పాటలు వింటూ ఆనందడోలికల్లో విహరించాను.తరువాత ఓ వారం భారంగా గడిచింది. మరుసటి వారం ఇంటివద్దనుంచి హరిహర్ కు బయలు దేరాను.

ఎండాకాలం.సూర్యభగవానుడు ప్రొద్దున్నే తన ప్రతాపం చూపడం మొదలుపెట్టాడు.ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో బస్సు మార్గం. నడుచుకొని మధ్యాహ్నంగా వినుకొండకు బయలుదేరాను. సాయంకాలం కర్ణాటక కు వెళ్ళే బస్సు పట్టుకొని హరిహర్ ( కుమారపట్నం) వెళ్ళాలని ప్లాన్. పంట కోయడంతో చేలన్నీ బోసిపోయి వున్నాయి. మధ్యాహ్నం కావడంతో అక్కడక్కడ మాత్రమే చేలల్లో బఱ్ఱెలు, వాటికి కాపుగా బఱ్ఱెలకాపర్లు కనిపిస్తున్నారు. నీరు పారి పంటకోయడం పూర్తవ్వడంతో ఎండకు చేలన్నీ నెఱ్ఱెలు బారి కనిపిస్తున్నాయి. ఊర్లలో మఱ్ఱిచెట్ల దగ్గర నీడలో పులిజూదం ఆడుకుంటూ అక్కడక్కడ పల్లె జనాలు. పల్లె వాసుల సంపదైన పశువుల దాహార్తి తీర్చడానికి అడుగంటిన బోరింగుల దగ్గర జనులు. ఇంత ఎండలోనూ తనకేమీ పట్టదన్నట్టు సాగిపోతున్న ఎఱ్ఱబస్సు. బస్సు కిటికీల సందుల్లోనుంచి వస్తున్న వడగాల్పులు తట్టుకోవడం కష్టంగానే వున్నది. మధ్యాహ్నం మూడుగంటల సమయానికి వినుకొండ చేరుకున్నాను. సాయంకాలం ఐదున్నరకు ధావనగరె బస్సు.

మొత్తానికి ఒక రోజంతా ప్రయాణించి వినుకొండ నుంచి కర్నూలు,మంత్రాలయం, సింధనూరు  మీదుగా మరుసటి రోజు ఉదయం పదిగంటల ప్రాంతంలో  హరిహర్ చేరాను. ఓ లాడ్జీ లో రూమ్ తీసుకొని పడుకుంటే మరురోజు ఇంటర్వూ ఒత్తిడితో ఎంతకూ నిద్రరాలేదు. ఏ ఝాములో నిద్రపోయానో తెలియలేదు కానీ మరునాడు ప్రొద్దునే నిద్రలేచి స్నానంచేసి వున్నవాటిలో కాస్త మంచి దుస్తులు ధరించి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కు వెళ్ళాను.

ఇంటర్వూ రెండంటే రెండే నిమిషాలు జరిగింది. నీకు ఘాకర్ ఎలా తెలుసని, సాలరీ ఎంతకావాలని?  నాలుగువేల ఐదొందలు అని చెప్పాను. వాడు నువ్వు దానికి సరిపోతావా అని అడిగాడు. నేను వై నాట్ అని సమాధాన మిచ్చాను. అప్పట్లో నాకు నాలుగువేల ఐదొందలు ఎక్కువ మొత్తంగా కనిపించేది.మరి ఆ మొత్తం ఆ ఉద్యోగానికి తక్కువనుకున్నాడో లేదా ఎక్కువనుకున్నాడో తెలియదు కానీ నీకేవిషయం ఉత్తరం ద్వారా తెలియచేస్తామన్నాడు. కానీ నాకక్కడ అతని ముఖ కవళికలు చూస్తే అంతనమ్మశక్యంగా కనిపించలేదు. సరే ఏమి చేస్తాం? ఎక్కువేమైనా అడిగానా అన్న అనుమానం ఓ ప్రక్కనున్నా కనీసం నాలుగువేల ఐదొందలు లేని ఉద్యోగం ఉద్యోగమే కాదని అనిపించింది. లాడ్జ్ రూమ్ కు వచ్చి  కొంతసేపు విరామం తరువాత మంచి సఖీలా మళయాళ సినిమాకు వెళదామని వెళితే టికెట్లు దొరక్క రూమ్ కు వచ్చాను. రూమ్ లోకి వెళుతుంటే ఏదో దుర్వాసన! ఏదోలెమ్మని వెళ్ళి పడుకుంటే ఓ గంటకు విపరీతమైన దుర్వాసన. బయట ఏవో తెలియని భాషలో అరుపులు. బయటకొచ్చి చూద్దును కదా! ప్రక్కరూమ్ ముందు పోలీసులు. ఎవరో ప్రక్క రూమ్ లో లెటర్ వ్రాసి ఫ్యాన్ కు ఉరివేసికొని చనిపోయారు. నాకు అది చూసిన తరువాత ఒళ్ళంతా చెమటలు....

ఆ ఆత్మహత్యకు నాకూ ఏమైనా సంబంధం అంటగట్టి పోలీసు విచారణ అని వేధిస్తారేమోనన్న అనుమానం రావడంతో వెంటనే రూమ్ ఖాళీ చేయాలనుకున్నాను. కానీ అప్పటికప్పుడంటే బస్సులు లేవు. రాత్రికి కానీ హరిహర్ నుంచి ఆంధ్రాకు బయలుదేరే బస్సులు లేవు. ఏమి చేయాలా అన్న ఆలోచన లో పడ్డాను. ఏదైతే అది ఐనదని బస్ స్టాండ్ కు వెళ్ళాను.

 మాకు దూరపు చుట్టము, నాతోపాటు ఎమ్సెట్ కోచింగు కు వచ్చి ఒక నలభైరోజులు నెల్లూరు కోరాలో కోచింగ్ తీసుకున్న తిరుపతిరెడ్డి ధావణగరె లో మెడిసన్ లో పిల్లల వైద్యనిపుణత లో పి.జి. చేస్తున్నాడు. ఇప్పుడతను గుంటూర్ మెడికల్ కాలేజీ లో ప్రొఫెషర్ గా పని చేస్తున్నాడు. ధావణగరె హరిహర్ కు ఓ అరగంట ప్రయాణమని తెలుసుకున్నాను.వెంటనే బస్సు తీసుకొని ధావణగరె వెళ్ళి తిరుపతి రెడ్డి ఫోను చేసి నేను వచ్చి నట్టు, బస్ స్టాండ్ లో వున్నట్టు సమాచారమిచ్చాను. ఓ పదినిమిషాలకు ఓ బండిమీద వచ్చి నన్ను తన హాష్టల్ కు తీసుకొని వెళ్ళి దగ్గరలోని హోటల్ కు తీసుకొని వెళ్ళాడు. ఇద్దరము కబుర్లు చెప్పుకుంటూ సెట్ దోసె తిన్నాము. తరువాత డోల్బీ థియేటర్ అని చెప్పి ఏదో ఇంగ్లీష్ సినిమాకు తీసుకువెళ్ళాడు. సినిమా గుర్తుంచుకోవలసినంత గొప్పగా లేకపోవడంతో గుర్తులేదు. సరదాగా సాయంకాలం దాకా కబుర్లతో గడిపి సాయంత్రం బస్టాండ్ కు వచ్చి ధావణగరె - కనిగిరి బస్సు ఎక్కాను. తెల్లవారేటప్పటికి కనిగిరి చేరుకొని అక్కడనుంచి సాయంకాలానికి దర్శి మీదుగా మాఊరు గాంధీనగర్ చేరుకున్నాను.

ఉద్యోగము వచ్చే సూచనలు సన్నగిల్లాయి. ఈ లోపు పెళ్ళి సంబంధాలు వస్తున్నాయి. అమ్మాయిని చూడడానికి వెళ్ళానంటే వద్దు అని చెప్పకూడదనుకున్నాను. దానితో రెండు సంబంధాలను అసలు చూడడానికి కూడా వెళ్ళలేదు. కారణం ఒకమ్మాయిని నేను ఇంతకు ముందే చూసి వుండటం, మరో సంబంధం వచ్చేనాటికి మరో అమ్మాయిని చేసుకుందామని అనుకోవడం. మేనెలలో మాకు వెలిగండ్లలో హైస్కూల్ లో సైన్స్ పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుని కూతురిని చూడటానికి నేనూ మా అమ్మ వెళ్ళి వచ్చాము. మరుసటి వారం వాళ్ళు మాట్లాడటానికి వచ్చారు. నాకు ఉద్యోగం వచ్చే దాకా పెళ్ళి వద్దని చెప్పడంతో పెళ్ళి వచ్చే సంవత్సరం చేద్దామని పెద్దలు సూచనాప్రాయంగా తెలియజేసారు. ఆ మరుసటి రోజే నర్సరావు పేట నుంచి మరో సంబంధం వచ్చింది. పాపం ఆయన నూజెండ్లలో దిగి మూడుమైళ్ళు ఎండలో పడి నడుచుకుంటూ మా ఊరు వచ్చాడు. ఎండన పడి వచ్చినతనికి మా అమ్మ శక్తిమేరకు ఆతిధ్యం ఇచ్చింది. భోజనానంతరం విశ్రమించి తానొచ్చిన పనిని ఎంతకట్నమిస్తాడో చెప్పి అమ్మాయిని చూడటానికి రమ్మని ఆహ్వానించాడు.

తరువాత భాగం కోసం మళ్ళీ ఇక్కడకే రండి :)

29, ఫిబ్రవరి 2020, శనివారం

వసంతాగమన నిరీక్షణ...ముద్దబంతి,తామర,రోజా పూల సందడి

ఈ సారి న్యూజెర్శీ లో వసంతం కొంత ముందుగా వచ్చే సూచనలు కనిపిస్తుండటంతో మా తోటపని మొదలైంది. ఏమేమి పూలమొక్కలు వెయ్యాలా అని  తెగ ఆలోచించి మధ్యే మార్గంగా కొన్ని రకాలను ఎంచుకున్నాము. మొక్కలు కొని వెయ్యాలా లేకపోతే మనమే గింజలనుంచి మొలకెత్తించాలా అన్న సందిగ్ధంలో కొంతకాలం కొట్టుమిట్టాడి, గింజలనుంచే మొలకెత్తించాలని నిర్ణయం తీసుకున్నాము. ఫిబ్రవరి కి చివరిరోజు ఈ రోజు. గింజలనుంచి మొలకెత్తించాలంటే మార్చిలో జెర్మినేషన్ ( అంకురోత్పత్తి) మొదలెట్టాలి కాబట్టి అమెజాన్ లో రకరకాల ముద్దబంతిపూల గింజలు, మూడురకాల రోజాపూల గింజలు, తామరపూల గింజల తోపాటి వాటికి కావాలసిన కుండీలు మొదలైనవి పంపమని అమెజాన్ వాడికి విన్నపం చేసుకున్నాము. అనుకున్నట్టే రెండో రోజుకల్లా అన్నీ వచ్చాయి కానీ రోజాపూల గింజలు కనిపించలేదు.

ఇక వీటిని ఎలా మొలకెత్తించాలా అని యూట్యూబ్ లో వీడియోల మీద వీడియోలు చూసి మొదటి విడతగా గా తామరపూల గింజలను రెండురోజుల క్రితం రెండు గాజు సీసాల్లో వేసి పెట్టాను.అదేంటో వీడియోల్లో అందరికి రెండురూజులకల్లా మొలకలు కనిపిస్తే నాకేమో యింతవరకూ ఉలుకూ పలుకూ లేకుండా వేసినవి వేసినట్టే వున్నాయి. మరో మూడునాలుగు రోజులు చూడాలి.







వారాంత షాపింగ్ కోసమని నిన్న శుక్రవారం కాస్ట్కో షాపింగ్ కు వెళితే అక్కడ రకరకాల రోజా పూల మొక్కలు అమ్మకానికి పెట్టి వున్నాడు.మనకెలాగూ రోజా పూల విత్తనాలు అమెజాన్ వాడు పంపలేదు కదా అని ఒక జత రోజా పూల మొక్కలు కొన్నాము.



ఎలా నాటాలో అట్టల మీదున్న విధానం చెప్తుంది. దాని ప్రకారం ఈ రోజు గడ్డకట్టే చలిలో మా ఇంటి ముందు తోటలో సుమారు పద్దెనినిమిది అంగుళాల లోతు వెడల్పు తో ( వెడల్పు కొంచెం తక్కువగా వుండవచ్చు) చిన్న గుంత తీసాను. ఇంతకష్ట పడ్డందకు మా ఆవిడ నాకు వంద డాలర్లు బాకీ పడింది. అంటే అది వంద డాలర్ల గుంత :-).




తీసిన గుంతలో మట్టి వేసి (పాటింగ్ మిక్స్) ఒక మొక్కను నాటాను. రేపు బాక్యార్డ్ లో మరో మొక్కను నాటాలి.






ఇక చివరిగా బంతి పూలు. వీటికి ఇంకా ముహూర్తం కుదరలేదు. ఈ వారంలో వాటిని కూడా నాటి అవి మొలకెత్తుతాయో లేదో అని ఎదురు చూడడమే... వసంతం కోసం ఎదురు చూసినట్టు.