31, మార్చి 2012, శనివారం

భారతదేశ కాలమానాలు


మన భారతదేశంలో ఆంగ్లేయుల పాలనకు ముందు కాలమానాన్ని లెక్కించటానికి "శకము" లను వాడేవారు. ఇప్పటికీ మన కేలండర్లలో క్రీస్తు శకముతో పాటి   శాలివాహన శకమూ కనిపిస్తుంది. కానీ వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరు కాలమానముండేది. మరీ పూర్వకాలమైతే యుగాలుగా వర్ణించారు. పరిశోధకులు ఈ యుగ పరిమితిలను ఈ రకంగా లెక్కవేసారట


కలియుగము = 4,32,000 సంవత్సరాలు
ద్వాపరయుగము = 8,64,000 సంవత్సరాలు
త్రేతాయుగము = 12,96,000 సంవత్సరాలు
కృతయుగము : 17,28,000 సంవత్సరాలు


ఇప్పుడు నడుస్తున్నది కలియుగమని ఈ యుగప్రారంభము క్రీ.పూ 3,102 వ సంవత్సరము ప్రాంతంలో ప్రారంభమైనట్లు చరిత్ర పరిశోధకులు నిర్ణయించారు. ఇదే లెక్క ఆర్యభట్టు, వరాహమిహురుడు కూడా పాటించారట.


సప్తర్షి కాల నిర్ణయమని మరొకటి వుంది. ఈ సప్తర్షిమండలము 100 సంవత్సరములకు ఒకసారి 27 నక్షత్ర మండలములలో ఒక్కొక్కనక్షత్ర కూటమికి మార్పుచెందుతుంది. భారత యుద్ధానంతరము ధర్మరాజు పట్టాభిషిక్తుడైనప్పుడు సప్తర్షి మండలము "మఖ" నక్షత్రమందు 75 సంవత్సరాలుగా వుండెను. ఈ విషయము కల్హణుడు రాజతరంగిణిలో వ్రాసాడట.


మరోకాలమానము బార్హస్పత్యమానము . ఇది చాలా పురాతనమైనదని వారన్ అనే ఆంగ్లేయుడు పరిశోధన చేసి చెప్పాడు. బృహస్పతి గ్రహము, మన సౌరవ్యవస్థలో వున్న గ్రహాలన్నింటికంటే  పెద్దది. ఇది తనచుట్టూ తాను సంవత్సరమునకు ఐదు సార్లు తిరుగుతుంది. సూర్యునిచుట్టూ తిరగడానికి 11.86 సంవత్సరాలు పడుతుంది. సుమారుగా 12 సంవత్సరాల లెక్క తీసుకుంటే ఇది సూర్యునిచుట్టూ ఒక్కసారి రిరిగేటప్పటికి తనచుట్టూ తాను 60 సార్లు తిరుగుతుంది. ఒక్కొక్కసారికి ఒక సంవత్సరనామమిచ్చి ఈ 60 సంవత్సరాలను ఒక శకముగా మనవారు భావించారు. ఇవే ప్రభవ,విభవ అనే సంవత్సరాలు. ఈ మానము టిబెట్టు, చైనాలలో కూడా వాడుకలో వున్నది.


అంటే మన ఒక్క సంవత్సరానికి బార్హస్పత్యమానపు లెక్క ప్రకారము 5 సంవత్సరాలు కదా ! ఇలాంటి కాల పరిమాణాలేమైనా త్రేతాయుగ కాలంలో వుండేవేమో. అలాంటి కాల మానంలో ప్రజలు వేల సంవత్సరాలు బ్రతికేవారేమో. బార్హస్పతమాన లెక్కప్రకారం మన 100 సంవత్సరాలు బ్రతికే వ్యక్తి 500 సంవత్సరాలు బ్రతికినట్టే కదా !


ఇక గౌతమబుద్ధిని, జైన దేవుని  నిర్యాణము తరువాత ఆయామతస్థులు దానిని ప్రాతిపదికగా చేసుకొని లెక్కించటం పాటించారు.


ఉజ్జయిని నేలిన విక్రమాదిత్య  మహారాజు  తాను శకులను యుద్ధమున ఓడించి, భారత దేశమునుండి పారదోలిన సమయమే శక ప్రారంభముగా స్వీకరించారు. ఇది క్రీపూ 57. దీనినే విక్రమ శకముగా చారిత్రకులు పరిగణిస్తున్నారు. 


ఇక కేరళ రాష్ట్రంలో పరశురామ కాలమానమని ఒకటుంది.


శాలివాహన నిర్యాణంతరము ప్రారంభమైనది శాలివాహన శకము. ఇది క్రీ.శ 78 వ సంవత్సరము. దీనినే సరిదిద్ది స్వాతంత్యం వచ్చిన తరువాత మన భారతదేశంలో శాసన పూర్వకంగా స్వీకరించాము.


ఏమైనా, ఆంగ్లేయ పాలన వల్ల, వారి సౌకర్యార్థము చేసికొన్నా, ప్రపంచ దేశాల్లో  చాలా వరకు ఒక ఉమ్మడి భాష, ఉమ్మడి కాలమానము లభించాయి. వివిధ దేశాల  పౌరుల మధ్య భాషా సమస్య తీరినట్టే ఈ కాల మానానికి ఒక స్టాండర్డైజేషన్ వచ్చింది.


రిఫరెన్సు : విజ్ఞానదీపిక పుస్తకం.





"నాసా"  జుపీటర్ వివరాలను ఇలా చెప్తుంది. కానీ ఈ బృహస్పతి Rotation period లెక్కించడం మిగిలిన గ్రహాలతో పోలిస్తే గణించడం కష్టమైనపని. మిగిలిన లోపలి సౌరమండల గ్రహాల ( inner terrestrial planets) మాదిరికాక ఈ బృహస్పతి గ్రహానికి  దీని గమన వేగాన్ని ట్రాక్ చెయ్యడానికి ఉపరితలమంటూ ఏదీలేదు. ఇది ఒక పేద్దద్దద్ద...................................... హైడ్రోజన్ బంతి


Mass (kg) 1.90 x 1027
Diameter (km) 142,800
Mean density (kg/m3) 1314
Escape velocity (m/s) 59500
Average distance from Sun 5.203 AU (778,412,020 km)
Rotation period (length of day in Earth days) 0.41 (9.8 Earth hours)
Revolution period (length of year in Earth years) 11.86
Obliquity (tilt of axis degrees) 3.08
Orbit inclination (degrees) 1.3
Orbit eccentricity (deviation from circular) 0.048
Mean surface temperature (K) 120 (cloud tops)
Visual geometric albedo (reflectivity) 0.44
Atmospheric components 90% hydrogen,
10% helium,
.07% methane
Rings Faint ring.
Infrared spectra imply dark rock fragments.


29, మార్చి 2012, గురువారం

అమావాస్య రాత్రుల్లో మా పెరటి కబుర్లు.


చిన్నప్పుడు అమావాస్య రాత్రులు పెరట్లో పడుకొని ఆకాశం వైపు ఎప్పుడైనా చూశారా? అదీ మీ ఊరు విద్యుద్దీపాల వెలుగుకు దూరమైతే !! రేడియో పక్కన పెట్టుకొని అందులో రాత్రి 9 గంటల తరువాత వచ్చే సంగీత కార్యక్రమాలు వింటూ, ఆకాశంలో నక్షత్రాల వైపు చూస్తూ, మనసులో శూన్యాన్ని అనుభవిస్తూ..ఒహ్ ఆ తృప్తి అనుభవించి ఎన్నాళ్ళయిందో. అలా అలా సప్తర్షి మండలాన్ని, శుక్ర గ్రహాన్ని, మిగిలిన గ్రహాలనూ చూస్తూ ...... అలా అలా పాలపుంత దారుల్లో పరుగులు పెడుతూ విశ్వానికి ఆవలి అంచులు చూసొచ్చారా? శృష్టిలోని అందాలను తనివితీరా ఆస్వాదించే మానవ జన్మనెత్తినందుకు ఎంత అదృష్టవంతులమో మనం


నిజమేకదా ! అందాన్ని ఆస్వాదించడానికి చీకటి వెలుగులేమిటి. ఒక్కోదానిది ఒక్కో ప్రత్యేకత. చీకటి రాత్రులు ఈ విశ్వప్రాంగణంలో మనమెంత చిన్నవారమో తెలియచేస్తే పున్నమి రాత్రులు సుదూర తీరాల నుంచి దూసుకు వచ్చే వెలుగును చూసి ఆనందిస్తాం. లెక్కలతో పని లేదు. సైన్స్ తో పనిలేదు. కావలసినదల్లా ఆ సౌందర్యాన్ని గుర్తించగలిగే కళ్ళు, ఆస్వాదించి స్పందించగలిగే హృదయం.


మనకు తెలిసిన సౌర కుటుంబం ఇసుమంత. తెలియని, కనిపించని కుటుంబం కొండంత. ఆ కొండ ఎంత? ఎవరు చూశారు. మనకు ఇప్పటికి తెలిసినదానికి మనం పెట్టుకున్నపేరు Milky way. అందులో మనది అతి చిన్న సౌర కుటుంబం. ఆ చిన్న కుటుంబంలో భూమి ఒక్క నలుసు. ఆ నలుసు లో మనందరం రాజులం, రాణులం, మంత్రులం, ధనవంతులం, కూలివాళ్ళం, కీర్తికాంక్షాపరులం. పీఠం కోసం, దర్పంకోసం, ఇగోల కోసం అనునిత్యం కొట్లాడుకొనే పరమాణు సమూహాలం. 


ఈ మిల్కీవే లో మనలాంటి సౌరకుటుంబాలెన్నో. ఓ అంచనా ప్రకారం భూమిమీదున్న మనుషులకు కనీసం 40 రెట్ల నక్షత్రాలున్నాయట. మనము అంచనా వేయగలిగిన గెలాక్సీ ఎంత సుందరమో చూడండి. దీని ఆకారం డిస్క్ షేప్. వ్యాసము చూస్తే 90,000 light years. మందము చూస్తే 10,000 light years, వెడల్పు చూస్తే 13,000 light years. ఇందులో కనీసం 40 బిలియన్ల నక్షత్రాలు/గ్రహాలు/ సౌరకుటుంబాలు. 






మనం ఒక ఊరినుంచి ఇంకోఊరికి పోవడానికి ఆ ఊరిమధ్య దూరాలు కొలిచి పటాలను తయారు చేసుకున్నట్టే ఈ నక్షత్రాల మధ్య కూడా దూరాలను కొలిచి "ఆకాశ పటాలను ( sky maps )"  తయారు చేసారు. ప్రతి పల్లెటూరూకి మనపటాల్లో ఎలా స్థానం లేదో అలాగే ఇక్కడా ముఖ్యమైన నక్షత్రాల మధ్య దూరాలకు మాత్రమే ఆకాశ పటాలున్నాయి. కాకపోతే మన ఊర్లమధ్య దూరాన్ని కి.మీ/ మైళ్ళ ద్వారా కొలిచినట్టు కాకుండా ఇక్కడ నక్షత్రాల మధ్య దూరాన్ని డిగ్రీలలో సూచిస్తారు. 




ఒక కొండ గుర్తు ఏంటంటే మన చేతివేళ్ళన్ని ముడిచి, చేయిని పూర్తిగా ముందుకు చాచి చిటికిన వేలు మాత్రమే తెరిచి చూస్తే ఆ వేలు మనకు ఎంత వెడల్పు కనిపిస్తుందో దాన్ని 1 డిగ్రీ అనొచ్చు. ఈ క్రింది బొమ్మలో లాగా.  ఇది మగవారికి ,ఆడవారికి, పిల్లలకు కూడా కచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది. కారణం చిన్న పిల్లల చేతుల పొడవు తక్కువగా వుంటుందికదా.



ఈ డిగ్రీల లెక్క చూడాలంటే మరి ఆరుబయట మంచమేసుకొని ఆకాశంలో Big dipper (అదేనండీ మన సప్త ఋషి మండలం) ను చూడాల్సిందే. ఇదిగో ఈ క్రింది పటంలో చూపినట్టు నక్షత్రానికి నక్షత్రానికి సుమారుగా 5 Degrees దూరమనుకోండి. అప్పుడు వాటి మధ్య దూరం మీ చేతికున్న మధ్య మూడు వేళ్ళదూరమన్నమాట. అంటే ఆ రెండునక్షత్రాల మధ్య అప్పుడు ఏమీ ఖాళీ ప్రదేశం మీకు కనిపించకూడదు.




ఆ రెండు నక్షత్రాల మధ్య దూరం మీ చేతి మూడు వేళ్ళ దూరమే అని మరీ వెటకారంగా చెప్పానా? :))

ఊహూ, కాదు. ఇప్పుడు మీకొక ప్రశ్న. ఈ మూడు వేళ్ళనాధారంగా చేసుకొని అసలు దూరాన్ని ఎలా కనిపెడతారు? ఓ సారి పైథాగరుడ్ని, త్రికోణమితిని తల్చేసుకోండి.



26, మార్చి 2012, సోమవారం

మన పూర్వీకులు మహా రసికులండోయ్....



ఈరోజు ఒక పుస్తకం చదువుతుంటే అందులో వివిధజాతుల వారి మధ్య జన్మించిన వారికి పూర్వకాలంలో ఏ ఏ పేర్లు పెట్టారో కనిపించింది. ఇది మనుధర్మశాస్త్రం లోనిది. ఉత్తమ జాతి వారి మధ్య పుట్టినవారికి సహజంగానే మంచి మంచి అర్థము వచ్చే పేర్లు పెట్టారు. ఇందులో తప్పు పట్టవలసింది ఏమీ లేదు. మనం పురాణాలు వ్రాసిన మన కిష్టమైనదే వ్రాస్తాం కాబట్టి ఆ ప్రస్థాపన ఇక్కడ అప్రస్తుతం. కానీ ఇక్కడ గమనించదగినది ఆనాటి వర్ణవ్యవస్థలో ఒక కావ్యంలో ఇవి చోటు చేసుకున్నాయంటే చాలా ఎక్కువ మొత్తంలోనే ఇలాంటి వివాహాలు లేదా ఇలాంటి సంసారాలు లేదా ఎవరెవరి కోరిక మీర సంభోగ కార్యం జరిగాక ఎవరిదారిన వారు పోయాకనైనా ఇలాపుట్టిన సంతానం గణనీయంగానే వుందనే చెప్పాలి. మన మహాభారతమంతా ఇదే తంతు కదా!

ఇక విషయానికొస్తే

౧) బ్రాహ్మణుడు+ వైశ్య స్త్రీ వల్ల పుట్టిన సంతానాన్ని అంబష్ఠులు అన్నారు

౨) బ్రాహ్మణుడు + శూద్ర స్త్రీ వల్ల నైతే నిషాదులు, పారశవులు

౩) క్షత్రియుడు + శూద్రస్త్రీ = ఉగ్రులు

౪) క్షత్రియుడు+బ్రాహ్మణ స్త్రీ = సూతులు

౫) వైశ్యుడు+ బ్రాహ్మణ స్త్రీ = వైదేహులు

౬) వైశ్యుడు+క్షత్రియ స్త్రీ= మాగధులు

౭) శూద్రుడు+బ్రాహ్మణ స్త్రీ= చండాలుడు

౮) శూద్రుడు+ క్షత్రియ స్త్రీ = క్షత్తలు

౯) శూద్రుడు+ వైశ్యస్త్రీ = అయోగవులు

౧౦) బ్రాహ్మణుడు+ ఉగ్రకన్య= ఆవృతులు

౧౧) బ్రాహ్మణుడు + అంబష్ఠకన్య = అభీరులు

౧౨)బ్రాహ్మణుడు+అయోగవకన్య=ధిగ్వణులు

౧౩) నిషాదుడు+ శూద్రస్త్రీ = వుల్కనులు

౧౪) శూద్రుడు + నిషాదకన్య = కుక్కటకులు

౧౫) క్షత్త+ ఉగ్రకన్య= శ్వపాకులు

౧౬) వైదేహుడు+ అంబష్ఠకన్య= వేణులు

౧౭) ఉపనయనం లేని బ్రాహ్మణుడు+ సవర్ణజాతి కన్య = భూర్జకంటకుడు, అవంతుడు,అవాటుడు,ధానుడు, వుష్ఫదుడు, శైఖుడు

౧౮) ఉపనయనం లేని క్షత్రియుడు+ సవర్ణజాతి స్త్రీ = ఝల్లుడు, మల్లుడు, నిచ్ఛివుడు,నటుడు,కరణుడు,ఖనుడు,ద్రవిడుడు

౧౯) ఉపనయనం లేని వైశ్యుడు + సవర్ణజాతి స్త్రీ = సుధన్వాచార్యుడు, కారుషుడు, విజన్ముడు, మైత్రుడు, సాత్వతుడు.


అవండి ఆనాడు కొత్తగా లోకంలోకి ప్రవేశించే బిడ్డల పరిస్థితి విశేషాలు.ఇప్పటికీ పెద్ద తేడా ఏమిలేదు కానీ ఆ వివక్ష చాలా వరకూ తగ్గిందనే చెప్పాలి.

మొత్తానికి మన పూర్వులు మంచి రసికులే. పై పేర్లని దృష్టిలో వుంచుకొని మహాభారతాన్ని చదువుతుంటే బోలెడు విశేషాలు అవగతమవుతాయి. ముఖ్యంగా భారతంలో వచ్చే పాత్రల పేర్ల వంశ చరిత్ర ఇట్టే తెలిసిపోతుంది. మగధ, వైదేహ దేశాల పేర్ల చరిత్ర కూడా తెలుస్తుంది. అంతే కాకుండా కొన్ని వృత్తుల పేర్లు కూడా.

24, మార్చి 2012, శనివారం

జగన్ శక్తి......ఉపయెన్నిక ఫలితాలు.

కోవూరు ఉప ఎన్నికలలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విజయం సాధించడం జగన్ కు ఏనుగంత బలాన్నిచ్చి ఉండాలి. నిజానికి ఇది వై.యస్. ఆర్. కాంగ్రెస్ పార్టీకి పరీక్షే. ఇది ఓ రకంగా నెల్లూరు జిల్లా ప్రజానాడి అని నా నమ్మకం.గెలిచింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అయినా, ఇక్కడ ఘోరంగా వోడిపోయింది మాత్రం కాంగ్రెస్ -ఐ. కారణం రాజశేఖరరెడ్డి గతించిన తరువాత కాంగ్రెస్ - ఐ కి అందరూ సోనియాగాంధీ తెచ్చిపెట్టిన కీలుబొమ్మలే. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా మరెవరున్నా ఈ ఫలితం ఇలాగే వుండేది. ఇది కిరణ్ వైఫల్యమనడం కంటే కాంగ్రెస్ చేజేతులా జగన్ ను దూరం చేసుకున్న ఫలితమనవచ్చు. ఈ విషయం కిరణ్ కుమార్ రెడ్డికి మనందరికంటే బాగానే తెలుసు. ఇది పూర్తిగా సోనియాగాంధీ వైఫల్యమేనని. దానికి తోడు సి.బి.ఐ యెన్క్వైరీ పేరిట "టార్గెట్ జగన్" ఆపరేషన్, దానికి ప్రతిపక్షాల అండదండలు, పచ్చ పత్రికల వికటాట్టహాస వింత వార్తలు మరింత ఆజ్యాన్ని పోసాయి.

రెండేళ్ళ క్రితం "ఓదార్పు యాత్ర" తన తండ్రి చనిపోయిన తర్వాత బాధపడ్డ కుటుంబాలను ఓదార్చడానికి మొదలైన యాత్ర క్రమేణా నిజమైన "ఓదార్పు యాత్ర" గా మారింది. నిజమే. నిజమైన ఓదార్పు యాత్రే! కారణం ఈనాడు ప్రజల సమస్య లమీద పోరాడుతున్న పార్టీ, నాయకుడూ ఎవరైనా వున్నారంటే అది YSR party మరియు జగన్ మాత్రమే.

అవినీతికి విలువెంత? ఎక్కడ ఏదేశంలో అవినీతి లేదు? అది ఈరోజు మనం పారద్రోలగలమా? ఎవరు అవినీతికి పాల్పడరు? అసలు అవినీతి లేని వాడు రాజకీయాల్లో ఉండగలడా? ఈ ప్రశ్నలకు బ్లాగుల్లో,పేపర్లో టపాలు వ్రాయడం చాలా సులభమే. ప్రొద్దున లేస్తే సార్ పిల్లోడికి ఇస్కూల్ లో చేర్చడానికి S.C/S.T certificate కావాలని అభ్యర్థింవే ఛోటా మోటా నాయకుడి వద్దనుంచి టెండర్ల పైరవీలు చూసే M.P లు, వారికి అధినాయకుడైన ముఖ్యమంత్రులూ ఎవ్వరూ దీనికి అతీతులు కాదు. మన ఒక్క చంద్రబాబు తప్ప. ఎందుకంటే వారు నీతిమంతులైన నాయకులు. ఈ విషయం ప్రతి పౌరునికీ తెలుసు. కానీ ప్రతి వ్యక్తీ తన ముడ్డి తెలుపే అనుకొని వాదులాడుతుంటాడు. నిజానికి ఈ అవినీతిని తుడిచి పెట్టడం సాధ్యమయ్యే పని కాదు కానీ దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు మాత్రము ఖచ్చితంగా వుండాల్సిందే. కోర్టులు ప్రత్యామ్నాయమా? హబ్బే ఆ రోజులు ఎప్పుడో దాటేసాము మనం. చూస్తుంటే తెలియటంలా? మరి ఎలా? ఓటరే దానికి ప్రత్యామ్నాయం. ఓటరు కు కావలసినదేమిటో వాడికి మనకంటే బాగా తెలుసు. వీడు కాకపోతే వచ్చేవాడు, మనకేమీ ప్రయోజనం చేకూర్చకుండా పూర్తిగా వాడే దోచేసుకుంటాడనీ తెలుసూ. దాని ఫలితమే కోవూరు ఉప యెన్నిక ఫలితం.

ఎలక్షన్ లో గెలవాలంటే సగం మందికన్నా ఎక్కువ మంది ఓటెయ్యాలి. అంటే రెండు గ్రూపులు తప్పనిసరి కాబట్టి గెలిపించిన తన గ్రూపుకు మేలు చెయ్యనివాడు మళ్ళీ వచ్చే ఎలక్షన్లో తప్పనిసరిగా ఓడిపోతాడు. It is such a simple fact.

అన్నట్టు జగన్ ఇక ప్రజానాడితోపాటు వాళ్ళ సమస్యలనూ చదవాలి. ఉన్న సమస్యలలో ఏవి ఎక్కువ ప్రజానీకాన్ని బాధిస్తున్నాయో గుర్తించగలగాలి. మండల వారీ క్యాడర్ల మీద దృష్టి పెట్టాలి. లాభ నష్టాల బేరీజు వేసుకోకుండా రాజశేఖర రెడ్డి లాగా స్నేహితులను, స్నేహితులుగానే చూడాలి.

అవండీ కోవూరు ఉపఎన్నికల ఫలితాల తర్వాత నేను చెప్పాలనుకున్న నాలుగు మాటలు.

23, మార్చి 2012, శుక్రవారం

ఉగాది శుభాకాంక్షలతో - సరాగ నందనందనం


ఉగాది శుభాకాంక్షలతో - సరాగ నందనందనం

ఈ సంచికలో...

గోన గన్నారెడ్డి చారిత్రాత్మక నవల - పీటలమీద పెండ్లి (ప్రథమగాథ)
అడవి బాపిరాజు

కాటమరాజు కథ
తెలుగు ఉపవాచకము - 8వతరగతి (1985)

ఉగాది కవితలు
బ్లాగర్లు

జానపదుల పాటలు
భాస్కర రామిరెడ్డి

కంట్రీ విమెన్ కూతురు
వనజ

జాలారిగూడెం - 1
భాస్కర రామిరెడ్డి

కృషీవలుడు - 1
దువ్వూరి రామిరెడ్డి

బాల బాలరసాల మిది పిక పాలిపాలిటియమరసాలము
వసు చరిత్ర - రామరాజభూషణుడు

ఈ ఎడారిలో వసంతం విరబూసేనా?
రాచూరి సాయి గోపాల్

21, మార్చి 2012, బుధవారం

ఎవరికోసమే ఓ మోహశీల కదిలి వచ్చితివీ నిశీధి దారులలోన

 
ఎవరికోసమే ఓ మోహశీల కదిలి వచ్చితివీ నిశీధి దారులలోన
కాలి యందెలు ఘల్లు ఘల్లుమన నిశ్శబ్ద హృదయ గేహమ్ములోనికి


నిలిచి నిలిచి ఆలకించవె ప్రతిధ్వనుల సవ్వడిన్
తెల్లవారులు తెలియరాని హృదయ తంత్రుల యలికిడిన్


గూడు కట్టిన ఊహలేవో మంచు తెమ్మరలై కురిసినవి
కాలి యడుగులు కందకుండ పుడమిపైన నీ దారుల


నీవు నడచెడి బాటలెల్ల మనసు విడిచిన పుష్ప పరాగమ్ములె
మదిన తలచిన కమ్ముకొను వాడిపోని స్నేహ సుగంధమ్ములె
 
సందె వేళల పూలరేకులు వేడిగాలికి రాలుతుండగ
కష్టపడ్డ మనసుకెల్ల వసంత గానమె నెమ్మలము

చాలు చాలు యా గులాబి ముళ్ళ కానుకలెల్ల
పూలదండలు కట్టి కట్టుము నోరులేని శిలకును
 
 

19, మార్చి 2012, సోమవారం

ఉపరిచర వసుమహారజ అంతరంగం - కథ



"మిత్రమా! విలాసార్థం వేటకై వచ్చి అప్పుడే పదిరోజులు గడిచి పోయింది కదా!"

"అవును మహారాజా!"

"అంతః పురంలో ఏమి జరుగుతుండవచ్చు?"

"మీరీ విహారయాత్ర కోరికను బయటపెట్టగానే రాజ్య విశేషాలు ఎప్పటికప్పుడు మనకు చేరే ఏర్పాటు చేసి వచ్చాను. నిన్నరాత్రి యమునా తీరంలో మీరు "అద్రిక" తో సరస సల్లాప సంభోగ క్రియా నిమిత్తులై వుండగా మహాసేనాని నుంచి వార్త వచ్చింది"

******

దేవదారు చెట్లపై పెట్టిన తేనెతుట్టెను వాడి బాణాలతో కొట్టాడొక విలుకాడు. చెల్లా చెదరైన తేనటీగలు కుట్టకుండా ప్రక్కనున్న పొదల చాటుకు పారిపోయారు. ఇద్దరు సైనికులు ఎత్తైన ఆ చెట్టునెక్కి రెండు పెద్ద దొన్నెల నిండా తేనె పట్టారు.

ధనుర్బాణాలతో తేనటీగలను తరిమిన సైనికుని సైగతో సగం తేనెనారగించి మహారాజు విడిది చేసిన శుక్తిమతీ నదీతీరానికి బయలు దేరారు.

******

అద్రిక పేరు చెవిన పడగానే జ్ఞాపకాల తుట్టె ఒక్కసారిగా కదిలింది. ఎంత అందమైన రూపు లావణ్యాలు గలది? ఇప్పటికి సరిగ్గా రెండు దశాబ్దాల ముందు మాటకదా? రెండు దశాబ్దాలేనా? కాలము ఎంత విచిత్రమో కదా? నూనూగు మీసాల యౌవన ప్రాయమంతా రాజ్యకాంక్షతోనే సరిపోయింది. బృహద్రధ, మణివాహన,సౌబల,యదు,మావేల్ల ను స్వతంత్ర దేశాలకు రాజులను చేసాను. గిరిక ను భార్యగా చేసుకొనిన తరువాత కదా ప్రణయ సామ్రాజ్యపుటంచులు చూడగలిగాను. అగ్నివలె కాల్చుతున్న ఆ విరహాన్ని తట్టుకొనలేకనే కదా అద్రిక కు చేరువైంది.

గిరిక భార్యగా రాకమునుపు జీవితము మీద విరక్తితో సన్యసించడానికి ఆశ్రమ వాసినై ఎన్ని మాసములు గడుపలేదు? అప్పుడే కదా చిన్ననాటి స్నేహితుడు ఇంద్రుడు తనవద్దకు వచ్చి ఓ రథాన్ని, వెదరు కోలను, వైజయంతి ఇంద్ర మాలను ఇచ్చి వెళ్ళాడు.

మహేంద్రునికి నా పట్ల ఎంత ప్రేమానురాగాలు! ఆ స్నేహమే మేరు పర్వత రాజులకు మాత్రమే తెలిసిన ఆ మర్మ విద్యలు నాకు నేర్పించిందేమో?
ఆ రథ నిర్మాణము తెలియబట్టే కదా దేశదేశాలకు వాయు వేగంతో వెళ్ళగలిగాను. ఆ సారధ్య నైపుణ్యమే వసువును ఉపరిచరవసువు చేసింది.

ఇంద్రమాలలు మాత్రము ఒకటా రెండా? శత్రువుల బాణ పరంపరలనుండి కాపాడే వైజయంతీ కమలమాలికలే మా సైనికుల ప్రాణనష్టం తగ్గించగలిగాయి. వెదరుకోల సరేసరి. చేది దేశపు వెదరు వింటి నిర్మాణానికి పెట్టింది పేరు. ఇంద్రుడు మాత్రము ఊరికే విద్యను నేర్పాడా ఏమిటి? పది పెద్ద పెద్ద ఎడ్ల బండ్ల నిండా వెదరును నింపుకొని వెళ్ళాడు కదా!

ఈ కథ పూర్తిగా ఈ శుక్రవారము రాబోవు సరాగ ఉగాది పత్రికలో చదవండి...

రిఫరెన్స్ :
౧)మహాభారతం ఆదిపర్వము
౨) వసు చరిత్ర

14, మార్చి 2012, బుధవారం

దిగుడు బాయికాడ వయ్యారి శంద్రి

 
నీ లేడి కన్నులోలె శంద్రి
నీ లేతనవ్వులోలె శంద్రి
ఆతీగె సొగసులోలె శంద్రి
ఆ పళ్ళగుత్తులోలె శంద్రి
ఆ నడక జోరులేమె శంద్రి
నీ నడుము సన్నమోలె శంద్రి


రంగు పింగులు సూత్తె రంబలాగున్నావు
రంగం వెడదామే శంద్రి



నే కైకాల సిన్నదాన్ని
నన్ను కంకులుబెట్టకు రో
నాకమ్మబాబులేరు
నన్ను ఆరళ్ళు బెట్టకు రో
నా మేనత్త సాకుతుంది

నాకు మేనరికమున్నది రో సిన్నోడ
ఇరుగు పొరుగు సూత్తె ఏమనుకుంటారొ
ఎంట రాకురోరి సిన్నోడ


దిగుడు బాయికాడ శంద్రి
నువ్వు కడవ నెత్తిబెట్టి శంద్రి
సందుగొందులు దాటి శంద్రి
నువ్వు సిందులు దొక్కంగ శంద్రి
నా కోరికలు రేగాయి శంద్రి
నీ కాళ్ళ కడియాలోలె శంద్రి
గణ గణ మోగేయి శంద్రి
గిలుకు మెట్టెలతోనె శంద్రి
నువ్వు గిర్రున తిరిగేవు శంద్రి


సూపులో సూపెడితే సుక్కలాగున్నావు
లక్కరై కలిస్తా శంద్రి
 
నీలంపు బావినీలు శంద్రి
నేనిక్కంగ తెచ్చిస్త శంద్రి
తీగె పట్టెడోలె శంద్రి
నే తిన్నంగ శేయిత్త శంద్రి
నడుము వడ్డాణమూ శంద్రి
నే నాణెంగ శేయిత్త శంద్రి


నీ సిట్టిముక్కు సూత్తె సిల్కలాగున్నావు
సీరెలిత్తానోలె శంద్రి

నే మరులు గొన్నానోలె శంద్రి
నువ్వు మాయదారివోలె శంద్రి
మత్తు మందు జల్లేవె శంద్రి
నావి ఉత్తమాటలుగావె శంద్రి
నాకెర్రెత్తి పోతుందె శంద్రి
నువ్వు ఎంతపాపివోలె శంద్రి

సేతిలో సెయ్యేసి సందిటిలోకొత్తేను
సొర్గము సూత్తావె శంద్రి

13, మార్చి 2012, మంగళవారం

తెలుగులో పంచ మహాకావ్యాలు.

మానవ సమాజంలో జరిగిన, జరుగుతున్న ప్రతి చర్యకూ కవి ఓ సాక్షి. సామాన్యుని జీవిత చరిత్ర వద్దనుంచి వైభోగాలు అనుభవించే మహారాజుల చరిత్ర వరకూ రచయిత తన ఊహలను కలిపి అక్షర గుచ్ఛాలను రచిస్తాడు. సాహిత్యం తరతరాల సామాజిక శాస్త్రం. ఆయా జాతుల గమన సంకేతం.

అలాంటప్పుడు "కావ్యాలాపాంశ్చవర్జయేత్" అని ఎందుకు చెప్పినట్టు. అదీ ప్రాచీన కాలంలోనే. అంటే కావ్యాలన్నీ అందమైన అబద్ధాలనీ,కాబట్టి వాటిని చదువరాదని. కారణాలు లేకపోలేదు. పదహారవ శతాబ్ది వరకూ కూడా మన కావ్యాలు చాలా వరకూ రాజుల మెప్పు కొరకు వ్రాసినవే. అలాంటప్పుడు కావ్యం నిష్పక్షపాతమనుకోవడం అత్యాశే అవుతుంది కానీ, ఆ కావ్య కథాగమనంలో నిక్షిప్తమయ్యే సామాన్య ప్రజానీక వర్ణనలు మాత్రం ఆనాటి సమాజానికి ప్రతీకలే. రచయిత సమాజ వర్ణనలు చాలా వరకూ తను నివశిస్తున్న సమాజంలోనుంచే పుట్టుకొస్తాయి. కవులు భావాంబరములో విహరించేవారైనా, సంఘంలో వారూ సభ్యులే. అలౌకిక శాస్త్రం రచనచేసినా, లౌకిక ప్రపంచాన్ని ఆవిష్కరించక తప్పదు.

ఇలాంటి రచనలు మనకు తెలుగులో అక్కడక్కడ కనిపిస్తాయి. చరిత్ర అంటే రాజుల యుద్ధాలు మాత్రమే కాదు. ఆ రాజ్యంలో నివశించే అతి సామాన్యుని జీవితం కూడా. పాల్కురికి సోమనాధుని రచనలు,హంసవిశంతి,సింహాసన ద్వాత్రింశిక, షోడశ కుమార చరిత్ర, రాయల కాలము నాటి ప్రబంధాలు మొదలైనవి ఆనాటి సమాజ స్థితి గతులకు నిలువెత్తు సాక్షాలు.

తెలియజెప్పు చరిత తేదీలు మాత్రమే
చెప్పలేదు గుండెవిప్పి చూపి
పెద్దపెద్ద నిలువుటద్దాల మేడయై
వాఙ్మయమ్మే చరిత ప్రతిఫలించు.

మనకు సంస్కృతంలో రఘువంశం, కుమారసంభవం, మేఘసందేశం,కిరాతార్జునీయం, శిశుపాలవధ పంచ మహాకావ్యాలని ప్రతీతి. ఇంతకీ ప్రబంధ కావ్యానికి ఉండవలసిన లక్షణాలేమిటి? కావ్యంలో ఇవి మాత్రమే వుంటే అది ప్రబంధమౌతుందా? ఇది ఓ సూచి మాత్రమే.

౧) అనువాద రచనై ఉండకూడదు
౨) కథ కల్పితము కాకుండా ఏదో ఒక పురాణములో అంతర్గతంగా వుండాలి
౩) కథానాయకునికి ధీరోదాత్త లక్షణాలుండాలి
౪) అష్ఠాదశ వర్ణనలుండాలి. అంటే వనవిహారం, జలక్రీడ, సూర్యోదయం, చంద్రోదయం,పుత్రోదయం,మంత్రాలోచనం,ప్రయాణం,రథోత్సవం, రాజవర్ణన, యుద్ధం, సముద్రం, ఋతువులు, మధుపానం, పురం, వివాహం, పర్వతం, విరహం,దూత్యం
౫) నవరసాలలో శ్రృంగారం ప్రధానంగా వుండాలి
౬) వస్తైక్యం వుండాలి
౭) కావ్యం శ్రీ తో ప్రారంభించబడి శ్రీ తో ముగియాలి
౮) ఇష్టదేవతాస్తుతి, సుకవిస్తుతి,కుకవినింద,గురుస్తుతి,కృతిపతి,వంశవర్ణన,షష్ఠ్యంతాలు వరుసగా చెప్పిన తర్వాత కథ ప్రారంభం కావాలి.

15 వశతాబ్దికి ముందు కావ్యాల్లో ఇలాంటివి కనిపించవు కానీ, 16 వశతాబ్దిలో వచ్చిన కావ్యాలన్నింటిలో ఎక్కువ తక్కువలుగా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. మన తెలుగు పంచమహాకావ్యాలేవి అన్నదానికి అందరూ ఆమోదించిన గ్రంధాలైతే లేవు కానీ ఈ క్రింది వాటిలో ఎవరి చిత్తమునకు తోచినట్టు వారు అంగీకరించవచ్చు.

౧) మను చరిత్ర
౨) ఆముక్తమాల్యద
౩) వసు చరిత్ర
౪) రాఘవపాండవీయం
౫) శ్రృంగార నైషధము
౬) ప్రభావతీ ప్రద్యుమ్నం
౭) పాండురంగ మహాత్మ్యం
౮) కళాపూర్ణోదయం

ఈ పంచమహాకావ్యాల వాత సంస్కృత లక్షణాలను బట్టి నిర్ణయించినవి కాబట్టి వీటినే పండితులు ఆమోదింతురు గాక. కానీ తెలుగులో ఇలాంటివి కోకొల్లలుగా వచ్చాయి. నిజానికి పూర్వకాలంలో ప్రజానీకానికున్న నిరక్షరాశ్యత వల్ల ఏకొద్దిమందికో పట్టుబడిన అక్షరజ్ఞానంతో వ్రాసిన కొద్ది సంస్కృత కావ్యాలను చదివి తృప్తిపడే సమాజాన్ని పదహారవ శతాబ్ది సమాజంతో పోల్చి పంచమహాకావ్యాలివే అని చెప్పడం నిజంగా హాస్యాస్పదమే అవుతుంది.

9, మార్చి 2012, శుక్రవారం

అంతర్జాలంలో తెలుగు నిఘంటువు. గత సంవత్సరమున్నర చరిత్ర




అంతర్జాలంలో శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువుతో పాటు ఆచార్య జి.యన్.రెడ్డి పర్యాయపద నిఘంటువును కూడా యూనీకోడ్ లోకి మార్చి http://telugunighantuvu.com ద్వారా పదములను, వాని అర్థములను తెలుగు పాఠకలోకానికి అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం ఇప్పటికే సహబ్లాగర్లకు తెలిసిన విషయమే.

ఈ సందర్భంగా కొన్ని వివరాలు.

ముందుగా విరాళాల ద్వారా వచ్చిన పైకం సుమారుగా మొత్తం : Rs 27,500 మరియు $1382

ఇందులో వెబ్ హోష్టింగ్ కు, డొమైన్ రిజిష్ట్రేషన్ కు ఇప్పటి వరకూ $ 282, నిఘంటువు యూనీకోడ్ లో టైపు చేసినందుకు ఇప్పటివరకూ Rs 59,900 ఖర్చయింది.

ఎవరెవరు ఎన్ని పేజీలు టైపు చేసారు, ఎంతెంత విరాళాలు ఇచ్చారు అన్న వివరాలు ఇక్కడ చూడవచ్చు

http://telugunighantuvu.com లో శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువునుంచి ఈ క్రింది సంపుటాలు సెర్చ్ కు సిద్ధంగా వున్నాయి.

ఒకటవ సంపుటి ( 1 - 515 పుటలు )

రెండవ సంపుటి (పూర్తినిఘంటువు 'క' అక్షరము నుండి 'ఙ' అక్షరము వరకు)

మూడవ సంపుటి (పూర్తినిఘంటువు 'చ' అక్షరము నుండి 'తృ' గుణింతము వరకు)

నాల్గవ సంపుటి (పూర్తి నిఘంటువు 'తె' గుణింతము నుండి 'న' అక్షరము వరకు)

ఐదవ సంపుటి (పేజీలు 1-260;291-370;401-610)

ఆరవ సంపుటి (పూర్తి నిఘంటువు 'మ' అక్షరమునుండి 'ల' అక్షరము వరకు)

ఏడవ సంపుటి (పేజీలు 1-60)

ఎనిమిదవ సంపుటం ( పూర్తి నిఘంటువు 'శ' అక్షరమునుండి 'హ' అక్షరము వరకు)


ఆచార్య జి.యన్.రెడ్డి పర్యాయపద నిఘంటువు మూడొంతుల టైపు పూర్తయింది. కానీ ఈ నిఘంటువు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు.

అలాగే మహాభారత పూర్తి పద్యాన్ని కూడా అనుసంధానించే ప్రక్రియ కూడా పైన మిగిలివున్న పేజీల టైపు పూర్తి అయిన తరువాత మళ్ళీ మొదలవుతుంది. ఈ నిఘంటువుతో పాటు ఆచార్య జి.యన్.రెడ్డి పర్యాయపద నిఘంటువు పూర్తిగా అందుబాటులోకి రావడానికి మరో ఆరు నుంచి పండ్రెండు మాసాల సమయం పట్టవచ్చు.

ఈ బృహత్పథక పూర్వాపర వివరాలను ఇక్కడ చూడవచ్చు. ఓ రకంగా ఇది ఈ నిఘంటువు Online లోకి తీసుకు రావడానికి ఎవరెవరు ఏ రకంగా కృషిచేసారో అక్షరబద్ధం చేసిన చరిత్ర. ఒక్కొక్కటిగా జాగ్రత్తగా చదివితే చాలా విషయాలు బోధపడుతాయి.

తెలుగులో ప్రామాణిక నిఘంటువు... బ్లాగర్ల సహాయ సహకారాల కొఱకు పిలుపు.

తెలుగులో ప్రామాణిక నిఘంటువు... బ్లాగర్ల సహాయ సహకారాల కొఱకు పిలుపు - 2.

తెలుగు మహారాజపోషకులారా ఇది మీకోసమే

తెలుగు నిఘంటువులో చేరిన మరికొన్ని పదాలు - శోధన

తెలుగు నిఘంటువు - సరిక్రొత్త రూపురేఖలతో..... బహుళ శోధనతో

తెలుగు నిఘంటువు - మహాభారత గూగుల్ గుంపు - పూర్తి పద్యము ఐక్యతా సూచిక ( similarity Index)

మొదటి సంవత్సర మానస పుత్రిక :-)

వ్యవసాయ సంబంధమైన పదాలు.... వాటికి సరిపడ ఫొటోలు..

నిఘంటువు పనులు మళ్ళీ మొదలు.

5, మార్చి 2012, సోమవారం

పైశాచికానందం....

అప్పుడే పుట్టిన
అమాయక దేహాల
విందులు కుడిచే
    నక్కల్లారా
    పందుల్లారా


వొంకల వెంట
పెంటను తింటూ
విందనుకొనే
    నక్కల్లారా
    పందుల్లారా

నీతిని జాతిని
మనిషి నమ్మకాన్ని
పైశాచికానందం కోసం
అమ్ముకొని
డొంకల వెంట తిరిగే
    కుక్కల్లారా
    పురుగుల్లారా

పాపం పుణ్యం
మనిషీ మమతా
కనపడలేదా
కళ్ళున గుడ్లగూబల్లారా?

చచ్చాక శవాలపై
కాకులైనా వాలుతాయా?
అవికూడా ఉమ్మేసి
చక్కా వెళ్ళిపోతాయా?

3, మార్చి 2012, శనివారం

నిఘంటువు పనులు మళ్ళీ మొదలు.

ఈ మధ్య కొన్ని నెలలుగా అనుకోని అవాంతరాలతో నత్త నడక నడుస్తున్న నిఘంటువు పనులు మళ్ళీ త్వరలో మొదలు కాబోతున్నందుకు సంతోషం.

టైపు చేయవలసిన మూడు వాల్య్యూమ్స్ లో కొన్ని కొన్ని పేజీలు మిగిలి వున్నాయి. వాటిని కూడా చేర్చితే సూర్యరాయాంధ్ర నిఘంటువు పూర్తిగా సెర్చ్ కొరకు సిద్ధమైనట్టవుతుంది.

సామెత

నా చిన్నప్పుడు మా గుంటూరు దగ్గర ఊర్లలో చెప్పుకొనే సామెత

పనిలేని మంగలోడు పిల్లి --- గొరిగాడట

1, మార్చి 2012, గురువారం

అమ్మాయిలూ/ అబ్బాయిలూ బ్లాగుల్లో కొట్టుకోవడం వల్ల .............??

ఏమవుతుంది? ఏమీకాదు..................................... బ్లాగులనిండా చెత్త చెదారం చేరడం తప్ప ( నా అభిప్రాయమే సుమా )




కానీ ఈ క్రింది ప్రయోగము అప్పుడప్పుడు సఫలమవ్వ వచ్చు.

మీరందరూ మీకు కోపమున్న వ్యక్తులతో ముందుగా స్నేహాన్ని నటించండి.

ఆ తరువాత బాగా దగ్గరవ్వండి.

ఆ తరువాత వారినుంచి విషయసేకరణ చెయ్యండి.

అవసరాన్ని బట్టి మీ అసలైన మిత్రులకు విషయాలను చేరవేయండి.

ఆ విషయాలమీద ఓపికున్నంత వరకూ ఠపీ ఠపీ మని ఉత్తిత్తి పేర్లతో టపాలను వ్రాయండి.

చంద్రబాబును మించిన వెన్నుపోట్లు పొడవండి.

ఇంకా చాలా చాలా ....

ఇంతకీ నేను చెప్పొచ్చేదేంటంటే When your intentions are good, no one can touch you.

మీరు పడిన శ్రమకు ఉచితంగా ఓ వెంట్రుక బహుమానం.


Next time better luck....