22, నవంబర్ 2017, బుధవారం

జగన్ పద్నాలుగవ రోజు పాదయాత్ర డైరీ - నాపద్యం.

పాదయాత్ర డైరీ లోనుంచి కొంత భాగం. ఆ తరువాత నా పద్యం

"ఈ నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీరు లేదు. సాగునీరూ లేదు! అనేక చెరువులున్నా గొంతుకు గుక్క నీరు, చేనుకు చుక్క నీరు లేదంటే ప్రభుత్వ చేయూత ఏమాత్రం ఉందో తెలుస్తోంది. ఇక్కడి నాపరాళ్ల పరిశ్రమ పైన కూడా నారా వారి దయలేక వేలమంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ ప్రాంతం పాలిషింగ్‌ యూనిట్లకు ప్రసిద్ధి.. వేలాది కుటుంబాలు ఈ యూనిట్ల మీదే ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత, నిర్దయాపూరిత చర్యల కారణంగా ఈ పాలిషింగ్‌ యూనిట్లు ఇబ్బందుల్లో పడ్డాయి. చెల్లించాల్సిన రాయల్టీలు, విద్యుత్‌ చార్జీలు విపరీతంగా పెరిగిపోవడంతో కొన్ని మూతపడ్డాయి, మరికొన్ని మూతపడే స్థితిలో ఉన్నాయి. 

కర్నూలు జిల్లా మొత్తంమీద ఒక్క ఎకరాకు కూడా నీటిపారుదల సౌకర్యంలేని నియోజకవర్గం ఇదొక్కటే. తాగునీటికి కూడా ఇక్కడ కటకటగా ఉంది. జీవనాధారమైన పాలిషింగ్‌ యూనిట్లు, వ్యవసాయం.. రెండూ లేకపోవడంతో వేలాది పేద కుటుంబాలు పొట్ట చేత పట్టుకుని వేరే ప్రాంతాలకు వలసపోతున్నాయి. పుట్టిపెరిగిన చోటే బతికి బట్టకట్టలేకపోవడం ఎంత దారుణమైన పరిస్థితి! మనిషి జీవించే హక్కునే కాలరాసేలా.. కనీస వసతులు, ఉపాధి కల్పించలేని ప్రభుత్వమూ ఒక ప్రభుత్వమేనా? ఈ పరిస్థితిని మార్చాలి. మైనింగ్‌కు పుష్కలంగా వనరులు ఉన్న ఈ ప్రాంతంలో పరిశ్రమలను తిరిగి బతికించాలి.. వలసలను ఆపాలి. "


సీ|| గొంతు తడుపుకొన గుక్కెడు నీరు లేదిక పంట పండించ దిక్కు లేదు
నాపరాళ్ళ పరిశ్రమ పతనమయ్యె బాబు దయలేక బ్రతుకు బుగ్గిపాలె
పోవుచుంటిమి చేత పొట్టపట్టుకొని యా పట్టణ వాసపు బానిసలుగ
జన్మస్థలమునందు చచ్చు భాగ్యంబు నోచుకొనమే పాపము చుట్టు కొనియొ

గీ|| మనిషి జీవించు హక్కును మసిని జేసి
పెద్ద పెద్ద మాటలు జెప్పు పద్ధతేల
కూడు గూడు గుడ్డలుకోరి కోరి ఓటు
వేసి మోసపోయితిమిపు డేడ్చి ఫలమె?

సూచన: తేటగీతి చివరి పాదంలో  "వేసి" లో "సి" కి "ఏడ్చిన" లో "చి" కి  ప్రాసయతి చెల్లుతుందనుకుంటాను. అలా కుదరదనుకుంటే ఆ పాదాన్ని యిలా చదువుకోండి


వేసి మోసపోయితిమిరో వెక్కి ఫలమె?

3 కామెంట్‌లు:

  1. మీ సీస-తేటగీతి జంట చదవ కనుల పంట :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లలిత గారూ, కనుల పంటే నంటారా? :)
      వీనుల విందుగా వ్రాయటానికి ప్రయత్నిస్తాను :)
      నృత్యం కనుల పంటయితే ఆ నృత్యానికి సార్థకత.అలాగే పద్యం వీనులవిందయితేనే దానికి సార్థకత :)
      మీ భావన అర్థమయిందండి. నచ్చినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి


    2. వీనుల విందయితేనే
      చానా బాగుండునమ్మ ఛందము సీసం !
      ఈ నా యత్నము కొనసా
      గేనిక మీకెల్లరికి జిగేలు జిగేలై !

      జిలేబి

      తొలగించండి

Comment Form