25, నవంబర్ 2017, శనివారం

రక్త సంబంధ బాంధవ్యాలు....అంత తేలికగా పోయేవి కావు



నవంబరు పద్దెనిమిదిన ఉదయం ఆరుగంటలు. మంచి నిద్రలో వున్నాను.మంచం ప్రక్కనే వున్న ఫోన్ ట్రింగ్ గ్.... ట్రింగ్ గ్ ... అంటూ మోగడం మొదలైంది.ఇంత పొద్దునే ఎవరబ్బా అని చూస్తే ప్రైవేట్ నంబరు అని చూపిస్తుంది. సరే నని ఫోన్ ఎత్తాను. అవతలి నుంచి తెలుగులో అపరిచిత కంఠము. నేను ఫలానా అని పరిచయము చేసుకొని "మీ మేనత్త కొడుకు నిన్నొకసారి ఫోను చెయ్యమన్నాడని" చెప్పాడు. 
"సరే ఈ వారంలో చేస్తాను" అన్నాను. వెంటనే వారమంటే ఆలశ్యమవుతుందేమో అని అసలు విషయం చెప్పాడు. పనిచేసే దగ్గర తననెవరో కొట్టారని కాలికి ఫ్రాక్చర్స్ అయ్యాయని ఇంటెన్సివ్ కేర్ లో వున్నాడని హాస్పిటల్ ఖర్చు రెండున్నర లక్షలవుతుందని చెప్పాడు. ఆ ఫోను చేసినబ్బాయితో కొంచెంసేపు క్షేమ సమాచారాలు మాట్లాడి ఫోను పెట్టేశాను. ఫోను పెట్టేస్తూ మా అత్తకొడుకు ఫోను నంబరు కూడా తీసుకొన్నాను.

మా అత్తకొడుకుకు నాకు వయస్సులో తొమ్మిదినెలల తేడా. అంటే నేను తొమ్మిదినెలల పెద్ద. మా ఊర్లో వున్నప్పుడు మా యింటి వెనకాలే మా మేనత్త వాళ్ళిల్లు. మాకూ వాళ్ళకూ ఏవో తోటలకు  సంబంధించిన చిన్న చిన్న గొడవలుండేవి కాబట్టి వాళ్ళింటికి మేము మా యింటికి వాళ్ళు పెద్దగా వచ్చేవాళ్ళు కాదు కానీ పిల్లలం పొలానికెళ్ళినప్పుడు, తోటలకెళ్ళినప్పుడు కలిసి ఆడుకొనేవాళ్ళం. నా ఐదవతరగతి దాకా విద్యాభ్యాసం మా చిన్నాయన వాళ్ళ దగ్గర వేరే ఊళ్ళో జరిగింది కాబట్టి మా మేనత్త కొడుక్కి నాకు పెద్ద స్నేహం వుండేది కాదు. అన్నట్టు మా మేనత్తకొడుకు పేరు కూడా రామిరెడ్డే. అయితే ఊర్లో అందరం రామయ్య అని పిలిచేవారు.

మా కుటుంబం వేరు పడటంతో నా ఆరవతరగతినుంచి పదవతరగతి దాకా మా ఊరికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో వున్న  వెలిగండ్ల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో చదవాల్సి వచ్చింది. అప్పుడు పిల్లలమందరమూ కలిసి స్కూలుకు వెళుతూ సరదాగా ఆడుకుంటూ మధ్యలో వాగులో మునుగుతూ అప్పుడప్పుడూ చదువుకుంటూ పదవతరగతి పూర్తిచేశాము. రామయ్య నాకంటే ఒక తర్గతి చిన్న. నేను ఇంటర్మీడియెట్ లో వుండగా తను పదవతరగతి తప్పడమూ అప్పడికే మా ఊరి జనాలు ఇక్కడపొలాలనమ్మివేసుకొని బ్రతుకు దెరువు కోసం వలసలు పోవడం వుధృతంగా జరుగుతున్న రోజులు. వీళ్ళు కూడా మా ఊరొదిలి గుంటూరు జిల్లా వినుకొండ తాలూకాకు వలస వెళ్ళారు. ఆ ఊరికి వలసవెళ్ళగానే మా కుటుంబాల మధ్య వున్న పొలం తగాదాలు కూడా సమసి పొయ్యాయి.

మేము కూడా నా ఇంజనీరింగ్ మూడవసంవత్సరంలో మా ఊరొదిలి ఆ ఊరికి వలసవెళ్ళాము. రామయ్య చదువు వలసతోటి ఆగిపోయింది. అక్కడ పొలం పనులు చేసుకుంటూ ఒక అక్కకు ఇద్దరు చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు చేశారు. రామయ్య పొలం పనులతోపాటు బేల్దారి పని కూడా బాగా నేర్చుకొని ఊర్లో ఇల్లుకట్టే పనులకు వెళ్ళి సంపాదిచేవాడు. నేను సెలవులకు ఇంటికొచ్చినప్పుడు ఇద్దరం కలిసి అలా నాగార్జున సాగర్ కాలువపై నడుచుకుంటూ రవ్వారం, తిమ్మాపురం,నూజెండ్ల మొదలైన ఊర్లు చుట్టి వచ్చేవాళ్ళం. మంచి ఎండాకాలమైతే తిమ్మాపురం పుచ్చకాయ తోటలోకి వెళ్ళి కడుపు పట్టిన కాడికి పుచ్చకాయలు తిని వచ్చేవాళ్ళం.

ఉద్యోగరీత్యా నేను ఊరిలో వుండటం తక్కువ. కాలచక్రం ఎవరికోసం ఆగదుకదా. ఆ పయనంలో మేము ఆ ఊర్లో ఇల్లమ్మేసి హైదరాబాదుకు వెళ్ళిపోవటం రామయ్య ఊర్లో పంట మీద వచ్చేఆదాయం సరిపోక పిల్లల చదువుకోసం గుంటూరులో బేల్దారి పనులు చేసుకుంటూ ఇంటిదగ్గరున్న తనభార్యకు డబ్బులు పంపడం చేస్తుండేవాడు. నేను సంవత్సరమున్నర క్రితం మా ఊరు వెళ్ళినప్పుడు పరిస్థితి అది. ఆ తరువాత మా మధ్య ఫోను సంభాషణలు కానీ ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ లేవు.

ఇదిగో మళ్ళీ ఈ రోజు ప్రొద్దున నేను రామయ్యకు ఫోను చేసే వరకు. నేను మొదటి సారి ఫోను చేసినప్పుడు ఫోను ఎత్తలేదు. ఒక అరగంటాగి ఫోను చేస్తే రామయ్య కొడుకు ఫోను యెత్తి వాళ్ళనాన్నకిచ్చాడు. ఐ.సి.యు లో వున్నానని ఇక్కడ నాకెవరితో చెప్పుకోవాలో తెలియక రాత్రి నీకు ఫోను చెయ్యమన్నానని చిన్న చిన్న విషయాలకు మీదాకా రాము కానీ ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించమని చెబ్తుండగా నర్సో,డాక్టరో మాట్లాడొద్దని చెప్పారేమో ఫోను మళ్ళీ వాళ్ళకొడుక్కి ఇచ్చాడు. కొడుకు బి.బి.యె చేశాడు కానీ ఉద్యోగం లేదనుకుంటా. ఆ అబ్బాయిని నేను నాకు ఫోను చేసిన అబ్బాయి ఫోను నంబరు ఇవ్వమని అడిగితే వాడికేమి అర్థమయిందో కానీ మా అక్క కొడుకు ఫోను నెంబరు ఇచ్చాడు.

విషయం మా అక్కకొడుక్కి కూడా తెలిసి వుంటుందేమో నని వాడికి మెసేజ్ పెట్టాను. మాట్లాడుతుండగా ఫోను కట్ అయింది.ఈ లోగా మరో రోజు గడిచింది. మళ్ళీ రామయ్యకు ఫోను చేస్తే ఈ సారి క్షుణ్ణంగా మాట్లాడడానికి వీలు పడింది. 

ఇప్పుడు తాను కామారెడ్డి దగ్గర పనులు చేస్తున్నట్లు ఆపనుల్లో భాగంగా ఒక అపార్ట్మెంట్ కన్ష్ట్రక్షన్ విషయంలో వీళ్ళకు వేరే గ్రూపు కు మధ్య పోటీ ఏర్పడి వీళ్ళా అపార్ట్మెంట్ కడుతున్నారనే దుగ్ధతో నమ్మించి ఒక్కడిని మాట్లాడదాము రమ్మని ఊరు బయటకు తీసుకెళ్ళి పెద్దబండరాయి తీసుకొని కాళ్ళపై ఎత్తెత్తి వేశారని చెప్పాడు. అలాగే ఇప్పటిదాకా ఆపరేషన్ కోసం లక్ష ఇరవైవేలదాకా వేరే వాళ్ళ దగ్గర సేకరించానని చెప్పాడు.సరే నాకు చేతనైన సహాయం నేను చేస్తానని ఫోను పెట్టేసి మా అక్కకొడుక్కి ఫోను చేశాను. ఇంతకు ముందే వాళ్ళు మా అక్కదగ్గరకెళ్ళి మందులు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం డబ్బులు అడిగారట. కానీ మా బావ అయ్యప్పమాల వేసుకొని కేరళ కు వెళ్ళి వుండటంతో డబ్బులు లేవని  చెప్పారట. 

విషయ తీవ్రత అర్థమై నేను మా అక్కకు ఫోను చేశాను. "అబ్బయ్యా డబ్బులు ఇవ్వొచ్చు కానీ వాళ్ళదగ్గరకెళ్తే ఇంక తిరిగిరావని" చెప్పింది. నేనందుకు అక్కా పాపం బాధల్లో వున్నాడు మన్మిచ్చేడబ్బులు తిరిగొస్తాయని కాదు కానీ సాటి మనిషికి సాయం అనుకొని ఇద్దామని ఒప్పించి మా చేతనైన సహాయం చేశాము. అప్పుడనిపించింది ఎంతైనా రక్త సంబధం రక్తసంబంధమేనని. మా మేనత్తలేదు, మా అమ్మ నాన్న లేరు కాని వాళ్ళ రక్తసంబంధం ఇంకా బ్రతికే వుంది.

ఇప్పుడు రామయ్య ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ ఐ కోలుకుంటున్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comment Form