8, అక్టోబర్ 2011, శనివారం

పొగరాజు/ రాణి జబ్బలకు కాస్త చురుకెక్కువ....నపుంసకుడు/ నపుంసకరాలి గా మారేదాకా





ఆనందమొచ్చినా సిగిరెట్, విషాదమొచ్చినా సిగిరెట్, పనెక్కువైనా సిగిరెట్, తుదకు బోర్ కొట్టినా సిగిరెట్.

అప్పుడప్పుడే స్మోక్ చేయడం మెదలు పెట్టిన పొగరాయుళ్ళను ఎందుకు తాగుతున్నారో అడగండి? ఎక్కడనుండి ఎక్కడదాకా లిస్టు లాగుతారో. దె ఫీల్ దట్ దె ఆర్ యునీక్ ఇన్ ది క్రౌడ్. అలా వాళ్ళకు వాళ్ళు జబ్బలు చరుచుకోవడంతో ఆగుతారా? హబ్బే..ఇంకా ఏమంటారో చిత్తగించండి

"ఎప్పుడైనా సిటీలో బతికావా?"
పై మాటనడంలో వారి ఉద్దేశ్యం వాహనాలనుండి వెలువడే కాలుష్యం పీల్చడంకంటే ఈ సిగిరెట్ పొగ ఏమంత ప్రమాదకరం కాదని

"ఏ అలవాటు లేకుండా బ్రతికి ఏంచేద్దామని"
ఆహా.. పొగత్రాగడం వల్ల జీవితంలో ఎంతో సాధించారు వీళ్ళు :-)

................

అదే కవిత్వమొచ్చిన వారైతే ఇకనేమీ, ఇలాంటి సందర్భాల్లో అస్సలు కుంచెకూడా అవసరం లేకుండా ఆశువుగా కవిత్వం తన్నుకొస్తుంది. చూడండి

కందపద్యము :
భుగభుగమని పొగలెగయగ
నగణితముగ నాజ్యధార లాహుతి కాగా
నిగమాది మంత్రయుతముగ
పొగత్రాగని వాడు దున్నపోతై పుట్టున్

అయ్యా అదండి సంగతి. అంటే యజ్ఞం చేస్తున్నట్టు వేదమంత్రాలతో భుగభుగమని పొగలు లేచేటట్టు పొగ త్రాగని వాడు దున్నపోతై పుడతాడట.

అంతేనా..మరొకటి చిత్తగించండి

ఖగపతి అమృతము తేగా
భుగభుగమని చుక్కయొకటి భూమిని వ్రాలెన్
పొగ చెట్టయి జన్మించెను
పొగత్రాగని వాడు దున్నపోతై పుట్టున్


పొగత్రాగడం మీద అసలు సిసలైన మరొక్క పద్యం చెప్పుకొనే ముందు ఇది చూడండి

కూపోదకం వటచ్ఛాయ
తాంబూలం తరుణీకుచం
శీతకాల భవే దుష్ణం
ఉష్ణకాలే తు శీతలమ్!!

బావినీరు,మఱ్ఱిచెట్టు నీడ, తాంబూలము, స్త్రీ చన్నులు శీతాకాలంలో వేడిగానూ, వేసవికాలంలో చల్లగానూ ఉంటాయట. కానీ సిగిరెట్ త్రాగేవాడికి సర్వకాల సర్వావస్థలందు శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పైన చెప్పినవి ఎప్పుడు ముట్టుకున్నా చల్లగానే ఉంటాయి మరి :-)

సరదా సరదా సిగిరెట్టు అలా అలా కొన్ని సంవత్సరాలు మనల్ని రంగుల లోకాల్లో విహరింపచేస్తుంది. వయసు కొద్దిగా ముదురుతుంది. సిగిరెట్టు ను ఆప్యాయంగా తడిమి చూసుకొనే రోజులు దాటి అది మన దైనందిన జీవితంలో ఒక భాగమై పోయాక

పదపడి ధూమపానమున ప్రాప్తము తా పదమూడు చేటులున్
మొదలు ధనంబువోవుట, నపుంసకుడౌట,విదాహమౌటయున్
వదకుచు జాతిహీనులను వేడుట, తిక్కట చొక్కుటల్,రుచుల్
వదలుట,కంపుకొట్టుట,కళల్ తొలగించుట,రిమ్మ పట్టుటల్
పెదవులు నల్లనై చెడుట,పెద్దకు లొంగుట, బట్టకాలుటల్

ఈ పద్యానికర్థం తెలియకపోతే చెప్పండి వచ్చే టపాలో వ్రాస్తాను.


మీరు స్మోకింగ్ మానాలనుకుంటున్నారా? మరి ముందుగా ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి

మీరు మీ అత్మీయులతో ఒక అడుగుదూరంలో నిల్చొని మాట్లాడి ఎంతకాలమైంది?

అప్పుడే గుప్పుగుప్పుమని నాలుగు దమ్ములు లాగొచ్చారు? ఎదురుగుండా మీ కలలరాణి.అప్పుడేంచేస్తారు?

ఏదో అత్యవసరపని ఉన్నట్టు, ఇంట్లో ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకొని పారిపోయిన సందర్భాలెన్నో గుర్తున్నాయా?

సిగిరెట్ తాగడం కోసం, కేవలం సిగిరెట్ తాగడం కోసం ఇంట్లో అందరిని త్వరగా పడుకొమ్మని ఉచిత సలహాలిచ్చి మనం మాత్రం అందరూ నిద్రపోయాక గుప్పు గుప్పుమని గుండెనిండా గాలిపీల్చినరోజులెన్నో లెక్కకట్టారా?

మీకు చిరపరిచితమైన బస్టాండ్ . ఆ స్టాప్ లో ప్రతిరోజూ సిగిరెట్ తాగే అలవాటు. కానీ ఆరోజు ఏదో కారణంవల్ల కొంచెం ఆలస్యంగా బస్ స్టాడ్ వద్దకు వస్తున్నారు. కళ్ళెదురుగా బస్. కానీ తాపీగా ఈ బస్ పోతే బాగుండు, ఓ దమ్ములాగి తరువాతి బస్ కు పోవచ్చు అని అనుకున్న సందర్భాలెన్నో గుర్తున్నాయా?


మీరు స్మోక్ చేస్తున్న విషయం ఇంట్లో తెలిసినా ఎప్పటికప్పుడు చెయ్యలేదనే బుకాయిస్తుంటారు. ఆవిషయం మీకూ తెలుసూ ఇంట్లోనూ తెలుసు. కానీ మీరు ఆఫీసునుంచో లేదా బజారునుంచో అప్పుడే ఇంటిగుమ్మంలో అడుగుపెట్టారు. మీముద్దుల చిన్నారి పరిగెత్తుకుంటూ మీ వద్దకు వస్తుంది. మనసులో ఎత్తుకొని ముద్దాడాలనివుంటుంది. కానీ ఎత్తుకొని ముద్దాడితే పాప మీ విషయం కనిపెట్టేస్తుంది.అసలే చిన్నపిల్ల. ఇంకేమి వెంటనే ఇల్లంతా డాడి సిగిరెట్ డ్రింక్ చేసి వచ్చాడని టాంటాం చేస్తుంది. ఇంకేముంది సీన్ సితారే... మీకళ్ళముందు ఈ సంఘటన కనిపించిందా? అదీ మరి...

MOST OF THE TIME SMOKERS FEEL THAT THEY KNOW THE CONSEQUENCES, BUT THEY DON'T..................

ఇలాంటి సంఘటనలే కాదు మరీ దయనీయమైన సంఘటనలూ స్మోక్ చేసే వాళ్ళ వద్ద ఉంటాయి. పైన చెప్పిన సందర్భాలు క్రానిక్ స్మోకర్స్ కాని వారికి సంబంధించినవి. కారణం క్రానిక్ స్మోకర్స్ ఈ దశ దాటి ఇంట్లో వాళ్ళకు తెలిసేట్టుగానే త్రాగడం మొదలు పెడతారు. వారి విషయం తరువాత ముచ్చటించుకుందాం.

9 కామెంట్‌లు:

  1. భా రా రే గారు మీరు అనుభవజ్నులు

    రిప్లయితొలగించండి
  2. అప్పారావు గారూ..నా అనుభవం ఎంతవరకో రాబోయే టపాల్లో చెపుతా కనీ..మీ అనుభవం ఎక్కడిదాకా వచ్చింది :-)

    రిప్లయితొలగించండి
  3. కుక్క దాలి గుంట
    ఏ రోజు కి ఆరోజు
    రోజుకి ఒక్కటి ఏమి అవదులే అని అనుకుంటూ ....కొనసాగిస్తున్నాను
    సిగేరెట్టు తాగితే కాన్సర్ అని చెపితే లైట్ తీసుకుంటారు
    కానీ కుటుంబ సభ్యుల విషయం లో మీరు చెప్పేది కరెక్ట్

    రిప్లయితొలగించండి
  4. నపుంసకత్వం అనేది ఏ రకంగానూ ఇన్ఫీరియారిటీ కాదు. ఆడవాళ్ళతో కాకుండా, మగవాళ్ళతో కాకుండా కేవలం నపుంసకులతో సెక్స్ చేసేవాళ్ళు ఉన్నారు. కనుక నపుంసకత్వం పేరు చెపితే పొగరాయుళ్ళు భయపడరు.

    రిప్లయితొలగించండి
  5. అప్పారావు శీఘ్రమేవ ధూమరహిత శరీర ప్రాప్తిరస్తు :-)

    ప్రవీణ్, ఇక్కడ నేను చెప్పిన నపుంశకత్వము నువ్వనుకొనేది కదులే... దీనిమీద చాలానే రీసెర్చ్ చేసాను. వచ్చే టపాల్లో వివరిస్తాను.

    రిప్లయితొలగించండి
  6. ‘చాటుపద్య రత్నాకరము’ లోని పద్యాలు .....

    సన్నంబై, కుఱుమట్టమై, గరగరై, జాపత్రితో సాటియై,
    గన్నేరాకు వజై, పసందు గలదై, ఘాటున్నదై, లాహిరై,
    కన్నుందోయికిఁ జాల వేడ్క గొలుపంగాఁ దగ్గదై, నిగ్గుదై,
    వన్నెల్ గుల్కు పొగాకు ముచ్చట వినేవా? శేషశైలాధిపా!

    రావణ యుద్ధంబందున
    బావనుఁడగు లక్ష్మణుండు పడి మూర్ఛిలినన్
    ఆవలఁ బొగచెట్టుండినఁ
    బావని సంజీవి కేల పరిగెత్తు నయా?

    పొగ ద్రాగ నేర్చి భీముఁడు
    పగఱన్ బొగ రడఁచె నాజి బాహాశక్తిన్,
    బొగద్రాగని దుర్యోధనుఁ
    డిగిలించెను రణములోన నిహిహీ యనుచున్.

    రిప్లయితొలగించండి
  7. ధూమపానం అలవాటుగా కాక, ఎప్పుడో ఒకటి అలా అలవోకగా తాగితే తప్పేంటి అని నా క్వశ్చను. దాని వలన (అలవోకగా తాగినందువల్ల అని నొక్కి వక్కాణిస్తున్నాను) ఉపయోగాలు.
    1. తల్నెప్పి తగ్గుతుంది.
    2. టెన్షన్స్ తగ్గుతాయి.
    3. ఓ ఐదు నిముషాలు జీవితం తగ్గుతుంది. మంచిదేగా. ఇలా ఐదైదు నిముషాలు పోగయి ఓ యేడాది జీవితం పోతే, ఆ యేడాదిలో ఒకయెదవ (ఎందుకూ కొరగానోడు) తినే తిండి, చేసే కంపూ, వాడే బట్టలూ, కలపా, వగైరా అన్ని మిగిలిపోయి భూమి కాస్త సుఖపడుతుంది.

    రిప్లయితొలగించండి
  8. శంకరయ్యగారూ ధూమపానం మీద పద్యములను సంగ్రహించి వ్యాఖ్యగా పెట్టినందుకు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  9. రవీ :-) మీరు నొక్కి వక్కాణిస్తూ అలవోకగా గుప్పు గుప్పు మనిపిస్తే నేనమంటాను. కానీ ఈ అలవోకగా తాగే "ఒక్క" దమ్మే జీవితంలో మనం చేసే పెద్దపొరపాటు అవుతుందేమో చూసుకోండి :-)

    ఇక పోతే తలనొప్పి తగ్గడాలు, టెన్షన్ తగ్గడాలు ఇందులోని కెమికల్స్ మన నాడీవ్యవస్థలో కృత్రిమంగా కలిగించిన రసాయనిక చర్యలవల్లనే. అలాగే ఐదునిమిషాల ఆయుర్దాయం తగ్గడం గురించి చెప్పాలంటే..సిగిరెట్ తాగితే కాన్సర్ వస్తుందని చెప్పినట్టే వుంది. కానీ చాలా వరకు సిగిరెట్ త్రాగే వారు ఈ కాన్సర్ బారిన పడరు. కారణం కాన్సర్ కంటే ముందే రకరకాల రోగాలతో టపా కట్టేస్తారు.వీటిపై రాబోయే వ్యాసాల్లో వివరంగా....

    రిప్లయితొలగించండి

Comment Form