30, అక్టోబర్ 2011, ఆదివారం
మాఊర్లో శిశిరమొచ్చింది. ఇక నాలుగునెల్లు కుంపట్లే గతి..........
''మార్గశిర పుప్యౌ హిమ: మాఘఫాల్గుణౌ శిశిర:
చైత్ర వైశాఖౌ వసంత: జ్యేష్ఠాషాడౌ గ్రీష్మ
శ్రావణ భాద్ర వర్షా ఆశ్వీజ కార్తీకా శరత్''
అలా మనపెద్దలు ఋతువులకు మాసాలకు లంకెపెట్టారు కదా!!! మనకు భారతదేశంలో వాతావరణ సమతుల్యత గల రోజుల్లో బహుశా స్పష్టంగా ఆరు ఋతువులు బాగా కంటికి కనిపిస్తూ స్పర్శ జ్ఞానముద్వారా తెలుస్తుండేవేమో. నా చిన్నప్పుడు నేను చదువుకొన్నప్రాతంలో అడవులు బాగా ఉండేవి. అప్పుడు కూడా కొద్దో గొప్పో ఏ ఋతువులో వున్నామో కేలండర్ చూడకుండా స్పర్శ జ్ఞానం ద్వారా చెప్పగలిగేవాళ్ళు. ఇప్పుడక్కడకూడా అంత దృశ్యంలేదులేండి. ఓ మూడేళ్ళక్రితం చదువుకున్న పాఠశాల చూద్దామని ఆ ఊరెళ్ళి అక్కడున్న పరిశరప్రాతాలతోటి భైరవకోన కూడా వెళ్ళాము. ప్చ్....అనుకుంటే గుండె తరుక్కొని పోతుంది.దట్టమైన అడవి కనపడకపోతే పోయింది. కనీసము ఆ ఛాయలుకూడా కనిపించలేదు :(. ఈ విషయంలో అమెరికాను నిజంగా మెచ్చుకోవాలి. ఇక్కడ ఇప్పటికీ వీరికున్న నాలుగు ఋతువులు ఖచ్చితంగా మనకు కనిపిస్తాయి.
నాకీ శ్లోకం ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చిందంటారా? ఏమీ లేదండి మొన్నటిదాకా ప్రకృతి ఎంతరమణీయమో కదా అని చెట్లకున్న రంగురంగులాకులను చూస్తూ మైమరచి తన్మయానంద డోలికల ఊగుతూ కారునడుపుకుంటూ ఆఫీసుకు వెళ్ళి వస్తుండేవాడిని. నా ఆనందాన్ని చిదిమేస్తూ నిన్న పడిన ఓ వర్షానికి ఆ తరుణీలతల పత్రాలన్నీ కాలధర్మం చేస్తున్నట్టు భూమాతను కలిసిపోయాయి. అది జరిగి ఒక్కరోజైనా కాకుండానే ఈ వేళ శిశిరాగమనమా అన్నట్లు మా ఊర్లో ఈ సంవత్సరానికి గానూ తొలిసారిగా మంచు పడుతుంది. ఇక్కడ మంచుపడడం సర్వ సాధారణమే ఐనా, అక్టోబరు లోనే ఇలా జరగడం కొంచెం భయాన్ని కూడా కలిగిస్తుంది. ఎందుకంటారా? కుమార సంభవములోని ఈ పద్యాన్ని తిలకించండి.
శార్దూలము.
శీతాత్యంతనిపీడనం బడి జగజ్జీవాళు లత్యార్తులై
పాతాళంబులు సొచ్చు నట్టిరవులొప్పన్ భూగృహావాసులై
భీతిన్ వెల్వడకుండ వహ్ని మెయి కంపింపం బ్రచండార్చికిన్
జేతుల్ గ్రొవ్వెరవోవుచుండ శిశిరోచ్ఛేదంబు పర్వెన్ మహిన్
ఇప్పుడు ఈ పద్యానికి మా తెలుగు నిఘంటువులో అర్థాలను వెతకండి :-). అర్థాలు వెతకటానికి అనుగుణంగా సంధిపరిఛ్ఛేదము కూడా చేయడం జరిగింది.
అంటే మా తెలుగు నిఘంటువులో అర్థాలున్న ప్రతిచోటా ఆ పదానికి hyperlink ఇచ్చానన్నమాట. దాని మీద click చేస్తే మీకా పదానికి అర్థము తెలుస్తుంది.
శీత + అత్యంత నిపీడనన్ పడి జగత్తు + జీవ + ఆళులు అతి + ఆర్తులు +ఐ
పాతాళంబులు సొచ్చు అట్టు+ఇరువులు+ఒప్పన్ భూ+ గృహ+ ఆవాసులు+ఐ
భీతిన్ వెల్వడక+ఉండన్ వహ్ని మెయి కంపింపన్ + ప్రచండ+ఆర్చికిన్
చేతుల్ క్రొవ్వెర+పోవుచున్+ఉండన్ శిశిర +ఉచ్ఛేదంబు పర్వెన్ మహిన్
శీత + అత్యంత నిపీడనన్ పడి జగత్+జీవ+ఆళులు అతి+ఆర్తులు+ఐ
పాతాళంబులు సొచ్చు+అట్టు+ఇరువులు+ఒప్పన్ భూ+గృహ+ఆవాసులు+ఐ
భీతిన్ వెల్వడక+ఉండన్ వహ్ని మెయి కంపింపన్ ప్రచండ+ఆర్చికిన్
చేతుల్ క్రొవ్వెర+పోవుచున్+ఉండన్ శిశిర+ఉచ్ఛేదంబు పర్వెన్ మహిన్
తెలుగునిఘంటువింకా పూర్తిగా టైపు కాలేదు కనుక, ఇప్పుడు సూర్యరాయాంధ్ర తెలుగు నిఘంటువు ఆన్ లైన్ వెర్షన్ లో దొరకని పదాలకు అర్థాలు చూద్దాము. అన్నింటికి ప్రతిపదార్థము వ్రాయవచ్చు కానీ ఏదో ఆలింకుల ద్వారా మా తెలుగునిఘంటువుకు కాస్త ట్రాఫిక్ నిద్దామని :))
ఆళులు = సమూహాలు
ఆర్తులు+ఐ = దుఃఖముకలవారై
పాతాళంబులు = పాతాళములు
భీతిన్= భయముతో
వెల్వడక+ఉండన్ = వెలుపలికి రాకుండా
వహ్ని= అగ్ని
ప్రచండ = తీవ్రమైన
ఆర్చికిన్ = కిరణాలు
ప్రచండ+ఆర్చికిన్ = సూర్యునికి
క్రొవ్వెర+పోవుచున్+ఉండన్ = కొంకర్లు పోతుండగా
ఉచ్ఛేదంబు= బాధ
పర్వెన్= వ్యాప్తమయ్యెను
పద్యం మొత్తానికి భావము : భూమిపై చలి ఎక్కువగా వ్యాపించింది. ఆ చలివలన కలిగిన బాధను భరించలేక సృష్టిలోని ప్రాణులు అమిత దుఃఖముతో పాతాళలోకాలకు పోయినట్లు భూగర్భంలో ఉన్న ఇళ్ళలోనికి పోయి అక్కడనుండి బయటకు రాకున్నారు. అగ్నికే శరీరం కంపిస్తునట్టు, సూర్యునికే చేతులు కొంకర్లు పోతున్నట్లు చలి విజృంభించింది.
సరి సరి, ఈ దేవుని సృష్టిలో ప్రతిఒక్కదానికి ఒక ప్రయోజనమంటూ ఉందికదా? మరి ఈ చలి వలన ప్రయోజనమేమిటా అంటే రామరాజభూషణుఁడు కావ్యాలంకార సంగ్రహము లో ఈ విధంగా ఈ శిశిర ఋతువు గూర్చి చెప్పారు.
మాఘ,ఫాల్గుణాలలో శిశిరర్తువు. ఈ ఋతువు హేమంతము వలే నుంటుంది. విశేషించి ఏనుగులకు, లేళ్ళకు, పందులకు, దున్నలకు కొవ్వు పడుతుంది.కామినిలు విచిత్ర సురతోపభోగ యోగ్యులు గా వుందురు. అంటే ( సురత+ఉప+భోగ ) :-) . చందనమునకు రుచి కలుగును. నీటికి మిక్కిలి శైత్యము కలుగును. మరువకములును కుందములును పుష్పించును.
కేళాకూళులయందనాదర మేర్పడును. ఎల్లరును వెచ్చవెచ్చగా కుంపట్ల వద్ద కూర్చుండ నభిలషింతురు. ప్రచండ వాయువు వీచును. కుంకమ పూత పూసుకొని ఆ చలిని కామినులు సహింతురు.
మొత్తంగా చూస్తూ ఈ చలికాలం మొగవారికి మంచి ఋతువన్నమాట :-)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
వణుకు ఎక్కువై, కంపింపన్ రెండు సార్లు టైప్ చేశారా :-)
రిప్లయితొలగించండిమొత్తం మీద సిగరెట్ వాసన పోయి కుందములతో మీ బ్లాగు ఆహ్లాదకరంగా ఉంది.:-)
హ్హ హా మందాకిని గారూ... పరిస్థితి అలాగే వుందండి :-)
రిప్లయితొలగించండిమంచు పొగలు సిగరెట్టు పొగలని కప్పేసాయనమాట! బాగుందండీ! చలెక్కువయ్యింది కదా అని సిగరెట్టు వైపు మళ్ళీ మనసు మళ్ళదు కదా!
రిప్లయితొలగించండిరసజ్ఞ :-)
రిప్లయితొలగించండియాక్ థూ అసలు జనాలు ఈ సిగిరెట్ ఎట్టా తాగుతారబ్బా :))
లేదులెండి, ఆ ఆలోచన కూడా రావడం లేదు :-)
baagundi!appuDe mancchu paDutundaa?
రిప్లయితొలగించండిఅవును సునీతా.. ఈ రోజు ప్రొద్దుట్నించి ముందు కాసేపు స్లీట్.. ఆ తరువాత రాత్రి ౭ దాకా మంచు :((
రిప్లయితొలగించండికవులు వర్ణించిన రుతువులు ఆంధ్రదేశానికి ,అందులో ఈరోజుల్లో వర్తించవు.హిమాలయ ప్రాంతాల్లో ఇప్పటికీ వర్తిస్తాయి.నేను యూరప్ వేసవిలో వెళ్ళాను.అప్పుడు ఆహ్లాదకరంగానే ఉండింది.న్యూయార్క్ లో ఉన్న మా పెద్దబ్బాయి ఇంట్లోను ఆఫీసులోను తప్ప బయట ఎక్కడయినా చలి చంపేస్తోంది అంటున్నాడు. నేను వెళితే వేసవి లోనే వెళతాను.శీతాకాలం గురించి వ్రాసిన నా పద్యాన్ని కూడా చదవండి
రిప్లయితొలగించండినిలిచె హిమాంబువుల్ కుసుమ నేత్రము లందు,సరోజమాలికా
కలిత జలాశయంబులును,కళ్ళములందున ధాన్యరాశులున్,
దళితవిశీర్ణ పత్రముల దాకుచు వీచెడి శీతవాతమున్,
చలిచలి యంచు నిల్ వెడల జాలగ నోపని మానవాళియున్.
కమనీయం గారూ, నిజమేనండి.. ఇక్కడ ఈ కాలంలో జీవితమంటేనే విరక్తి వచ్చేటంత చలి. కానీ గమ్మతేమిటంటే ఏ సంవత్సరానికాసంవత్సరం పోయినేటి బాధలను మర్చిపోయి ఈ సంవత్సరం చలినెదుర్కోవడానికి సన్నుద్ధులమై పోతాము :))
రిప్లయితొలగించండిమీ పద్యం బ్రహ్మాండంగా వుందండి.