అలా అడుగులో అడుగు వేసుకుంటూ హెడ్మాష్టర్ వెంట గదిలోపలికి అడుగుపెట్టాను. లోపలంతా పాత రికార్డులు భధ్రపరిచే గదిలో ఎలాంటి వాసన వస్తుందో అలాంటి వాసన. ఈ స్కూలు పెట్టి ఎన్ని సంవత్సరాలైవుంటుందో ఇన్ని రికార్డులా అని నోరెళ్ళ పెట్టుకొని చూస్తున్నాను. ప్రక్కనే అమ్మాయి.
హెడ్మాష్టర్, టేబుల్ పై వృత్తాకారంలో వున్న చిన్న స్టీల్ బెల్ తలపై ఒక్కటిచ్చాడు. దాని దుంపదెగ అది ట్రింగ్...ట్రింగ్.....గ్....గ్...గ్ అని ఒకటే మోత. అది అలా మ్రోగు తుండగానే మరో అటెండర్ "పాచ్యో" వచ్చి సార్ అని ఎదురుగా నిలబడ్డాడు. ఒక "కాఫీ" అని ఆర్డర్ వేసి కుర్చీలో వెనక్కి వాలి సర్దుకొని కూర్చొన్నాడు.
ఈ పిల్లను నోడ్సు అడిగితేనే హెడ్మాష్టర్ తో ఇలా చెప్పాలా? బోడిది దీనికే గనక ఇంగ్లీషు వచ్చని తెగయిదైపోతుంది. ఈ సారి నా లెక్కల నోడ్సు అడిగితే అప్పుడుచెప్తా దీనిపని.
"మీ ఇద్దరూ మన స్కూలు పరువు నిలబెట్టారు రా !"
ఈనొకడు. ఏదో స్కూలు పరువు నావల్ల పోయినట్టు మాట్లాడుతుండడు. ఈన వల్ల పోదేమో !!! స్కూలుకు వచ్చేది మంగళవారం మధ్యాహ్నానికి. సరిగ్గా మూడురోజులుంటాడో లేదో శుక్రవారం మూడుగంటల బస్సుకు వెళ్ళిపోతాడు. ఈన ఊరికి పోగానే మా అయవార్లు భలే సంతోషంగా పండగచేసుకొంటారు కదా. వీళ్ళవల్ల పరువుపోదా?
హెడ్మాష్టర్ మాకు ఇంగ్లీషు క్లాసు తీసుకొనేవారు. వారానికి ఎన్ని ఇంగ్లీషు పీరియడ్లు వున్నాయో గుర్తులేదుకానీ మాకు క్లాసుకు మాత్రం ఒక్కరోజే వచ్చేవారు. వచ్చినరోజు గంటన్నర క్లాసు. హైస్కూల్ చరిత్రలో నాకు నచ్చని ఒక సబ్జెక్టు ఇంగ్లీషు. మరొకటి సోషల్. ఈరెండూ పోరంబోకు సబ్జెక్టులని నా అభిప్రాయం. పెద్దగా కారణాలంటూ ఏమీ లేవుకానీ, ఎంతచదివినా గుర్తుండి చావవు. ఎంత చదివినా అన్నానని ఇప్పటి కార్పొరేట్ స్కూల్స్ చదువుతో పోల్చకండి. ఊర్లో జనాలు అరుగుమీద చేరి ఓ ప్రక్క లోకాభిరామాయణం మాట్లాడుకుంటుండగా అతిచేరువులో ఓ పుస్తకాన్ని ముందేసుకొని ఏ ఒక్కమాటకూడా జారిపోకుండా ఓ చెవు అటువైపు వేసి చదివిన చదువులు మావి :)
"పాచ్యో" కాఫీ తీసుకొచ్చి హెడ్మాష్టర్ చేతికిచ్చి వెళ్ళిపోబోతుండగా " మరియమ్మ" ను పిలువు అని పాచ్యో కు మరోఆర్డర్.
హెడ్మాష్టర్ నా వైపు తిరిగి "రేపు మీ నాయన్ని తోడకరారా" అని చెప్పిండు.
ఇంకేముంది నాకు బడితపూజ ఖాయమనే నిర్ణయానికొచ్చేసాను. ఆ పిల్లతోనేమో నేను మీయింటికొచ్చి మీ నాయనతో మాట్లాడతానని చెప్పిండు.
హెడ్మాష్టర్ ఎదురుగాలేకపోతే ఆ పిల్లకు ఆరోజు చింతపండు పులుసు పడుండేది. నోడ్సు అడిగినందుకే ఇంత పని చేసినందుకు.
ఇంతలో మరియమ్మ వచ్చి సారూ అని నిలబడ్డది. "మరియమ్మా...పోయినేడాది రికార్డులు తీసకరా" అని మరో ఆర్డర్.
ఒరే మీరిద్దరూ పోయినేడాది వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు సంపాయించినందుకు గానూ గవర్నమెంట్ మీకు 100 రూపాయల బహుమానాన్ని ప్రకటించింది. మీ కెలాగూ ఆడబ్బుతో పెద్ద అవసరముండదు. రేపు మీ నాయనలతో మాట్లాడి మన స్కూల్లో వున్న పేద విద్యార్థులకు ఆ డబ్బులు ఇద్దామనుకుంటుంన్నాను అని ఏదో చెప్తూ పోతున్నాడు మా ప్రధానోపాధ్యాయులు శ్రీ గాలిరెడ్డి...... నాచెవులు ఇంకేమీ వినే స్థితిలో లేవు.
మరియమ్మ రిజష్టర్ తీసుకొని వచ్చింది. ఇక్కడ సంతకాలు పెట్టండ్రా అన్న పిలుపుతో చెరొకొ పెన్ను తీసుకొని మెలికలు తిరిగిపోతూ, సంతకాలు పెడుతూ ......
కనులు కనులు కలిసాయంటే ప్రేమ అని దానర్థం... :-)..... మళ్ళీ మామూలే. ఎన్నైనా ఈ పిల్ల మంచిపిల్ల. అలా హైస్కూలు జీవితం దాటింది :))
ఈ పోష్టు కు ప్రేరణ : పోయినవారమెప్పుడో టీచర్ల పోస్టుల భర్తీ అన్న ప్రకటన చూశాక నా స్కూలు టీచర్లు గుర్తుకువచ్చిన సందర్భంగా....
ఏమాటకామాటే ఈ టేబుల్ బెల్లు కొట్టంగానే అటెండర్ రావడం, స్కూల్ ప్రేయర్లో జరిగే తతంగం, అయవార్లు హెడ్మాష్టరంటే చూపే భయము ( గౌరవమా??? ), మధ్య మధ్యల్లో కాఫీలు, మంగళవారమొచ్చి శుక్రవారానికి వెళ్ళిపోవడం ఇవన్నీ చూసి పెద్దయ్యాక హైస్కూలు హెడ్మాష్టరు గా ఉద్యోగం చెయ్యాలని ఆరోజే అనుకున్నా :-). నాకోరిక ఇప్పటిదాకా తీరనేలేదు :(. అసలు తీరుద్దో లేదో.