11, మార్చి 2013, సోమవారం

ఋతు లక్షణాలు ....వర్షాకాలం...సేదదీరే సమయం




పూర్వమంటే దేశంలో ఇప్పటి కాంక్రీట్ జనారణ్యాల స్థానంలో వనములు విరివిగా  వుండేవేమో.  ఆనాటి కవులకు అడవిలో చెట్లు, జంతువులు ఏఏ  మాసాలలో ఏఏ ఋతువులు వచ్చేవి, ఏ ఋతువులో లోకం ఏరకంగా వుంటుంది అన్నవి పరీశీలించి ఆలాంటి వర్ణనలు కావ్యాల్లో చేసేవారు. కానీ ఈ రోజుల్లో ఏఏనెలలు ఏ ఋతువుకు సంబంధించినవో తెలియవు. ఒకవేళ తెలిసినా ఆ ఋతువుయొక్క గుణగణాలు కనిపించవు.  అందుకేనేమో ఈ నాటి రచనల్లో ఋతువుతో అనుసంధానించి వ్రాసిన పాటలు కానీ, పద్యాలు కానీ కనిపించడంలేదు.  ఈ గొడవేదీ లేకుండా గాలి,పూలు, మనసు ఇలాంటి వాటిని పట్టేసుకుంటే సరి. ఏ కాలంతో పెద్దగా పని వుండదు.

ఎప్పుడైనా ఒక రిఫరెన్సు క్రిందన్నా పనికొస్తుందేమోనని కావ్యాలంకార సంగ్రహం ( రామరాజ భూషణుడు ) పుస్తకం నుంచి ఈ క్రింది వ్యాసం.


౧) వర్షర్తువు

శ్రావణ భాద్రపద మాసములు వర్ష ఋతువు. ఈ ఋతువున అందుగు, వరి, పుట్టగొడుగు, అడవి మొల్లలు, తఱిగొఱ్ఱ, గిరిమల్లిక, కడిమి, మద్ది, ఏఱుమద్ది, మొగలి మొదలగు చెట్లు పుష్పించును. ఆర్ట్రపురుగులు, వెన్నెల పులుగులు, చాతకములు, లేళ్ళు, గోదురుకప్పలు, నెమిళ్ళు, నీరుకాకులు, గ్రద్దలు మొదలైనవాటికి క్రొవ్వుపట్టి బలుస్తాయి. బలాకా పక్షులు ( బెగ్గురు పిట్టలు ) గర్భమును ధరించును. రజస్సు ( ధూళి ) శమించును. రాజులు యాత్రలనుండి నివర్తిల్లుదురు. వనభూములు శ్యామలమై వుండును. జలాసారములవలన పర్వతములు కడగబడినట్లుగా రమ్యముగా నుండును.నదులు వొడ్డులొరసి ప్రవహించుచు నొక్కక్కచోట గట్లు తెగి లోకోపద్రవము కలిగించును.యతులును, చారులును తిరిగి వత్తురు. ప్రోషిత భర్తృకలు భర్తలకై దారులు చూచుచుందురు. పాంథులు గృహములకు మఱలుదురు. మేఘబృందముచే ఆకాశము చీకట్లు క్రమ్మును. దిఙ్మఖముల మెఱుగు తీగలు పరుగిడుచుండును. మేఘ గర్జనలచే వైడూర్యభూములందు రత్నాంకురములు పొటమరించును. కామినీ కాముకులుద్యానయాత్రను చేయుదురు. సౌధోపరి భాగముల శయ్యలు కల్పింతురు. కస్తూరీ మిశ్రమగు చతుస్సమ విలేపనమును ( చందన, కుంకుమ, కర్పూర, అగరు మిశ్రితమగు మైపూత ) పూసికొందురు. కృక్షీవల కుటుంబినీ బృందములు రాసక్రీడలాడుదురు. కడిమి పూల వాసనగల పడమటి గాలి గానీ తూరుపు గాలి గానీ వీచును.


ఇప్పుడు ఆ పైన పేరా వ్రాసిన తరువాత బోలెడు సందేహాలు. ఇందులో నాకెన్ని తెలుసునని?

" ఈ ఋతువున అందుగు, వరి, పుట్టగొడుగు, అడవి మొల్లలు, తఱిగొఱ్ఱ, గిరిమల్లిక, కడిమి, మద్ది, ఏఱుమద్ది, మొగలి మొదలగు చెట్లు పుష్పించును"

ఇందులో వరి, పుట్టగొడుగు, మద్ది, ఏఱుమద్ది, మొగలి చెట్లు చూసినాను. అందుగు పూలు కూడా చూసిన గుర్తు. కానీ మద్ది కి ఏఱుమద్దికి తేడా ఏమిటో తెలియదు.


ఇకపోతే వరి వర్షాధార పంటగా ఇప్పుడు ఎవరూ పండిచటం లేదనుకుంటాను. కాలువ నీటిద్వారా ఈ పంటను సంవత్సరానికి రెండుగార్లు పండిస్తున్నారు.

"ఆర్ట్రపురుగులు, వెన్నెల పులుగులు, చాతకములు, లేళ్ళు, గోదురుకప్పలు, నెమిళ్ళు, నీరుకాకులు, గ్రద్దలు మొదలైనవాటికి క్రొవ్వుపట్టి బలుస్తాయి"

పైవాటిలో చాతకము( వానకోయిల ), లేళ్ళు, గోదురుకప్పలు, నెమలి, నీరుకాకి, గ్రద్దలను చూసినాను. ఆర్ట్రపురుగులు, వెన్నెల పులుగులు తెలియవు. అన్నట్లు ఈ మధ్య ఊరికి వెళ్ళినా కప్పల బెకబెకలు వినపడటం లేదు ఎందుకనో?

"బలాకా పక్షులు ( బెగ్గురు పిట్టలు ) గర్భమును ధరించును". ఇదేమిటో ఎప్పుడూ వినలేదు.

"రజస్సు ( ధూళి ) శమించును. రాజులు యాత్రలనుండి నివర్తిల్లుదురు. వనభూములు శ్యామలమై వుండును. జలాసారములవలన పర్వతములు కడగబడినట్లుగా రమ్యముగా నుండును.నదులు వొడ్డులొరసి ప్రవహించుచు నొక్కక్కచోట గట్లు తెగి లోకోపద్రవము కలిగించును.యతులును, చారులును తిరిగి వత్తురు."

పై వాక్యము అవగతమే కదా! వర్షము పడితే గాలిలో దుమ్ము పెద్దగా వుండదు. అదీ ఆకాలంలో మోటారు వాహనాలు లేవు కాబట్టి వాతావరణం నిర్మలంగా వుండేదేమో. ఇక రాజులకు ఎక్కడికక్కడ ఏర్లు పొంగి ప్రవహిస్తుంటే వాటిని దాటడం కష్టం కాబట్టి ఈ కాలంలో దండయాత్రలుండవు. దండయాత్రలుండనప్పుడు చారులకు పెద్ద పని వుండదేమో! లేకపోతే అప్పటికే సమాచారాన్ని సేకరించి రాజధానికి తిరిగి వస్తారేమో. సన్యాసులు ఎందుకు తిరిగివస్తారు? తిరిగిరావడానికి వీళ్ళకు ఇల్లెక్కడ? ఏమోలే అప్పట్లో చారులు, సన్యాసుల రూపంలో సంచరించేవాళ్ళేమో.

"ప్రోషిత భర్తృకలు భర్తలకై దారులు చూచుచుందురు"

సంసారాన్ని సాగదీయడానికి ఆరోజుల్లో వున్న ఊరు వదిలి దేశాటనము వెళ్ళినవాళ్ళ ఇల్లాండ్ల కు ఎదురుచూపులే కదా ! వర్షాకాలంలో ఆ రోజుల్లో పని వుండేది కాదేమో. అందుకే భార్యలు తమ భర్తలకోసం ఎదురు చూపులు. ప్చ్..ఆరోజుల్లో వాళ్ళకు కనీసం వర్షాకలం రెండునెలలన్నా సెలవులు. మరిప్పుడో? అసలు సాఫ్టీ లైతే ఎప్పుడింటికి వస్తారో తెలియదు కాబట్టి పెళ్ళైన రెండు మూడు నెలల్లోనే ఇంటావిడ అలవాటు పడిపోద్దనుకోండి :)

 "పాంథులు గృహములకు మఱలుదురు"

మరి బాటసారులకు కూడా వర్షం బెడదే కదా !! సో వాళ్ళకూ ఈ వర్షాకాలంలో కాస్త ఉపశమనం.

"మేఘబృందముచే ఆకాశము చీకట్లు క్రమ్మును. దిఙ్మఖముల మెఱుగు తీగలు పరుగిడుచుండును. "

This is self explanatory and we do see these even today.


"మేఘ గర్జనలచే వైడూర్యభూములందు రత్నాంకురములు పొటమరించును"

ఇది మాత్రం సూపరు. అసలు ఈ వైడూర్య భూములెక్కడ వుంటాయో.. ఈ రత్నాలెలా పొటమరిస్తాయో !!! లేకపోతే ఇదేమన్నా జొన్న చేల గురించా?

"కామినీ కాముకులుద్యానయాత్రను చేయుదురు. సౌధోపరి భాగముల శయ్యలు కల్పింతురు. కస్తూరీ మిశ్రమగు చతుస్సమ విలేపనమును ( చందన, కుంకుమ, కర్పూర, అగరు మిశ్రితమగు మైపూత ) పూసికొందురు. కృక్షీవల కుటుంబినీ బృందములు రాసక్రీడలాడుదురు."

ప్చ్..ఇప్పుడా అదృష్టమెక్కడ? ఉద్యాన వనానికెళ్ళడం వరకూ ఓకే. మరి ప్రక్కలెక్కడెయ్యాలి :)? దానికి తోడు చతుస్సమ విలేపనలా? మరీ అత్యాస కదా?
అసలు ఉద్యానవనానికి వెళ్ళాలంటేనే ఒకరు టీవీ, మరొకరు కంప్యూటర్ విహారంలో బిజీ. ఎవరి వెర్చువల్ ఉద్యానవనం వారిదే. గది దాటి బయటకు రావడమే పేద్ద పని కాబట్టి ఈ రోజుల్లో ఉద్యానవనాలు నిషేధం. ఇక చతుస్సమ విలేపనాల స్థానాన్న్ని సబ్బులు ఆక్రమించాయనుకుంటా. ఇక "కృక్షీవల" అంటే అర్థమేమిటో తెలియదు. "కృషీవల" పొరపాటుగా "కృక్షీవల" గా టైపయిందో లేక ఆ పదమే వుందో?

" కడిమి పూల వాసనగల పడమటి గాలి గానీ తూరుపు గాలి గానీ వీచును"

Yes, I experienced it. ఇప్పుడుకూడా మాగాణి ప్రాంతాల్లో కాకుండా మెట్టప్రాంతాల్లో మీరు రాత్రులు ఆరు బయట పడుకుంటే ఈ అనుభవాన్ని ఆస్వాదించవచ్చు.


మరో రోజు మరో ఋతువు...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comment Form